సహారా కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: సహారా కేసుకు సంబంధించి రెండు అంశాల్లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసుకుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇద్దరు డెరైక్టర్ల నిర్భంధం రాజ్యాంగ విరుద్ధమని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్‌పై తీర్పు ఇందులో ఒకటి. మరొకటి రాయ్, ఇద్దరు డెరైక్టర్ల జైలు నుంచి విడుదలకు సంబంధించి రూ.10 వేల కోట్ల చెల్లింపులపై సహారా తాజా గా దాఖలు చేసిన ప్రతిపాదనపై తీర్పు మరొకటి.
తాజా ప్రతిపాదన ఇదీ...
బెయిల్‌పై రాయ్ విడుదలకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి సహారా న్యాయవాదులు తాజాగా ఒక ప్రతిపాదన చేశారు. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఈ తాజా ప్రతిపాదన సమర్పించారు. దీని ప్రకారం... రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో అంటే ఏప్రిల్ 25 నాటికి రూ.3,000 కోట్లను సంస్థ చెల్లిస్తుంది.
మరో రూ.2,000 కోట్లను మే 30లోపు చెల్లిస్తుంది
బ్యాంక్ గ్యారంటీ రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది.
దీనితోపాటు నిబంధనలకు వ్యతిరేకంగా మదుపరుల నుంచి డబ్బు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు గ్రూప్ కంపెనీలు- ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ బ్యాంక్ అకౌంట్ల ‘డీఫ్రీజ్’ను కూడా న్యాయవాది కోరారు.
విక్రయించదలచిన కొన్ని ఆస్తులపై ఉన్న ఆంక్షలను సైతం ఎత్తివేయాలని సహారా కోరింది.
దీనికితోడు మార్చి 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులను సైతం కోరుతున్నట్లు ధర్మాసనానికి సహారా న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రాయ్ విడుదలకు రూ.5,000 కోట్ల నేషనలైజ్డ్ బ్యాంక్ గ్యారంటీని సుప్రీంకోర్టు అప్పట్లో (మార్చి 26) నిర్దేశించింది. అయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గ్యారంటీగా దీనిని మార్చాలని విజ్ఞప్తి చేసింది.
ధిక్కరణపై ఇలా...:
మదుపరుల నుంచి రూ.20,000 కోట్లకు పైగా డబ్బు వసూళ్ల కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే రాయ్, ఇద్దరు డెరైక్టర్లను జైలుకెలా పంపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం ఆయన్ను విడుదల చేయాలని ఇంతక్రితం గ్రూప్ తన వాదనలను వినిపించింది. అయితే ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం అప్పట్లో వ్యాఖ్యానించింది. మార్చి 4 నుంచీ రాయ్ తీహార్ జైలులో ఉన్నారు.