ఫారెస్ట్ గెస్ట్ హౌసే.. పోలీస్ కస్టడీ
లక్నో: చట్టం డబ్బున్నోళ్లకు చుట్టం అన్నది నానుడి. మన దేశంలో అరెస్టయినా, పోలీస్ కస్టడీకి తరలించినా ధనవంతులయితే చాలు రాజభోగాలకు ఏమాత్రం లోటు ఉండదు. ఇంట్లో మాదిరే అక్కడా విలాస జీవితం గడపొచ్చు. సహారా చీఫ్ సుబ్రతా రాయ్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. సుప్రీం కోర్టు వారెంట్ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సుబ్రతా రాయ్ను నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన సొంత ఎస్టేట్లో ఉన్నారు. పోలీసులు రాయ్ను అరెస్ట్ అయితే చేశారు కానీ వెంటనే స్టేషన్కు తరలించలేదు. అరెస్ట్ అనంతరం ఆయన ఆరు గంటల పాటు ఎస్టేట్లోనే గడిపారు. అనంతరం అనుచరులు వెంటరాగా.. సొంత కాన్వాయ్లో అక్కడి నుంచి నేరుగా కోర్టుకు వెళ్లారు.
మార్చి 4 వరకు రాయ్ను పోలీస్ కస్టడీకి పంపారు. అయితేనేం.. సహారా చీఫ్కు వచ్చిన అసౌకర్యమేమీ లేదు. ఆదివారం రాత్రి లక్నోకు 9 కిలో మీటర్ల దూరంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో గడిపారు. రాయ్ను గడువు వరకు గృహ నిర్భంధంలో (హౌస్ అరెస్ట్) ఉంచాలంటూ ఆయన తరపు న్యాయవాది విన్నవించారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో రాయ్ను గెస్ట్ హౌస్లో ఉంచారు. రాయ్ నిబంధనలకు విరుద్ధంగా మదుపుదారుల నుంచి 25 కోట్ల మేర నిధులు సమకుర్చుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి.