ఒడిశా : గజపతి జిల్లా అటవీ శాఖలో ఏసీఎఫ్‌గా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా మృతిచెందిన సౌమ్యరంజన్ మహాపాత్రొ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు పర్లాకిమిడి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీజేఎం) కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జూలై 11న తన క్వార్టర్స్‌లో కాలిన గాయాలతో ఏసీఎఫ్ మృతిచెందగా, ఆయన భార్య విద్యాభారతి పండా, ఇంటి వంటవాడు మన్మథ కుంభో, అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాం బెహరా నిందితులుగా ప్రాథమిక విచారణలో తేలింది.
అయితే దర్యాప్తు అనంతరం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం(ఎస్‌ఐటీ) వీరి ముగ్గురికీ క్లీన్‌చీట్ ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సౌమ్యరంజన్ తండ్రి అభిరాం బెహరా.. కేసును పునః విచారణ చేపట్టాల్సిందిగా పర్లాకిమిడి ఎస్‌డీజేఎం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దర్యాప్తులో ముందుగా పేర్కొన్న ప్రధాన నిందితులకు నోటీసులు జారీ చేసింది.
అయితే దీనిపై ముగ్గురూ స్పందించక పోవడంతో కోర్టులో విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేసింది. అయితే హాజరు సైతం లేకపోవడంతో పలుమార్లు హెచ్చరించిన అనంతరం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మరోవైపు సౌమ్యరంజన్ భార్య విద్యాభారతి పశువైద్య శాఖలో లైవ్‌స్టాక్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా, జూన్ 27నుంచి సెలవులో ఉన్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏసీఎఫ్ మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment