పెద్దదోర్నాల: ప్రశాంతగా ఉన్న నల్లమలపై మళ్లీ వేటగాళ్ల కన్ను పడింది. కొంతకాలంగా ఎటువంటి అలజడి లేకుండా ఉన్న అభయారణ్యంలో ఓ చిరుతను వేటాడి మరీ దాని చర్మాన్ని అమ్మేందుకు ప్రయత్నించి కొందరు వ్యక్తులు పట్టుబడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వన్యప్రాణులను వేటాడి వాటి చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో అటవీ శాఖాధికారులు నిర్వహించిన దాడులలో ఓ యువకుడు చిరుత చర్మంతో పట్టుబడ్డాడు. ఈ ఘటనలో కొందరు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావటంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణపై చేపట్టారు.
అటవీశాఖ సిబ్బంది హస్తంపై అనుమానాలు..
నల్లమలలో దొరికిన చిరుత చర్మం కేసులో అటవీశాఖ సిబ్బంది ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనలో పట్టబడిన నిందితుడు నాగరాజు సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు బయట పడ్డట్టు సమాచారం. అందులో పెద్దదోర్నాల రేంజి అధికారికి జీప్ డ్రైవర్‌కి సంబంధించిన పూర్తి కాల్ డేటా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు డ్రైవరును అదుపులోకి తీసుకుని పూర్తి స్దాయిలో విచారిస్తున్నారు. జీప్ డ్రైవరుతో పాటు అతనికి సోదరుడి వరుసైన మరో యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అటవీశాఖాదికారుల అదుపులో ప్రస్తుతం డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు వి«శ్వసనీయ సమాచారం.(చదవండి: చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు )
స్వార్థానికి మూగజీవాలు బలి..
అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణుల పాలిట కొందరు కాలయముళ్లుగా తయారయ్యారు. జాతీయతకు చిహ్నంగా నిలుస్తున్న పెద్దపులలను సైతం నిర్ధాక్షిణ్యంగా మట్టు పెడుతున్నారు. అమాయక ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని అంతరించి పోతున్నాయి. గతంలో మండల పరిధిలోని ఐనముక్కలలో రెండు పులుల చర్మాల దొరికిన సంఘటన మరువక ముందే మరలా చిరుత చర్మాని అమ్మేందుకు ప్రయత్నించి మరి కొందరు పట్టుబడటంతో స్మగ్లర్ల ధన దాహానికి అద్దం పడుతోంది.
నిఘా ఉన్నా ఆగని మరణ మృదంగం...
వన్య ప్రాణులు, అటవీ సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం 1972లో ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టింది. 1973 మార్చి 1న దానిని అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి శిక్షలను కఠినతరం చేస్తూ ప్రత్యేక చట్టాలు అనుసంధానిస్తూ వస్తున్నా, వన్యప్రాణుల మరణాలు మాత్రం ఆగడం లేదు. దీంతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి అరణ్యంలోకి ప్రవేశించడం, వన్యప్రాణుల ప్రశాంతతకు విఘాతం కలిగించినా సైతం కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తారు. 2002 జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ప్రకారం అరుదైన, సంరక్షక వృక్ష, జంతుజాలం సంచరించే ప్రాంతాల్లోకి అనుమతులు లేకుండా వెళ్లినా, వాటికి హాని కలిగించినా శిక్షలు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment