
సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసిన సహారా గ్రూప్
న్యూఢిల్లీ : సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రూ.10వేల కోట్లు చెల్లించలేమని ఆ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. తక్షణమే రూ.2.500 కోట్లు మాత్రమే చెల్లించగలమని ఈ మేరకు తమ అశక్తతను అత్యున్నత న్యాయస్ధానానికి తెలియజేసింది. మూడు వారాల తర్వాత మరో రూ.2.500 కోట్లు చెల్లిస్తామని సహారా గ్రూప్ గురువారం విన్నవించింది.
మార్చి 4వ తేదీ నుంచీ సహారా గ్రూప్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల విడుదలకు రూ.5 వేల కోట్లు కోర్టుకు డిపాజిట్ చేయాలని, మరో రూ.5 వేల కోట్లకు సెబీ మార్చుకోదగిన విధంగా బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ద్విసభ్య ధర్మాసనం గతనెలలో ఆదేశించింది. దాంతో సుబ్రతారాయ్,రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు మరికొద్దిరోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.