
ఇప్పుడు కొంత.. 3 వారాల్లో కొంత
హైదరాబాద్: సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు గురువారం సహారా గ్రూప్ తాజా ప్రతిపాదన తెచ్చింది. తమ చీఫ్ సుబ్రతారాయ్, రెండు గ్రూప్ కంపెనీలకు చెందిన డెరైక్టర్లను జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదలకు రూ.10,000 కోట్లు చెల్లించడం తక్షణం కష్టమని పేర్కొంటూనే ఇందుకు బదులుగా మరో తాజా ప్రతిపాదన చేసింది. తక్షణం రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, మిగిలిన అంతే మొత్తాన్ని (మరో రూ.2,500 కోట్లు) 21 రోజుల్లో చెల్లిస్తామని పేర్కొంది. బ్యాంక్ గ్యారంటీగా మరో రూ.5,000 కోట్లు సమకూర్చుకోవడానికి 60-90 రోజుల సమయం ఇవ్వాలని కోరింది.
ఈ మేరకు ఇంతక్రితం మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని రాయ్ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రతిపాదనను పిటిషన్ రూపంలో దాఖలు చేయాలని, తదనంతరం దీనిని పరిశీలిస్తామని సహారా తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 9న జరగనుంది. రాయ్ న్యాయవాదుల సమాచారం ప్రకారం రూ. 2,500 కోట్లు చెల్లించిన అనంతరం, స్తంభింపజేసిన కొన్ని అకౌంట్లను తిరిగి డీఫ్రీజ్ చేయడానికి ఆమోదించడంతోపాటు, రాయ్‌ని జైలులో కాకుండా, గృహ నిర్బంధంలో ఉంచడానికీ అనుమతించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనివల్ల బ్యాలెన్స్ డబ్బు సమకూర్చుకోవడానికి వీలవుతుందని విన్నవించినట్లు వెల్లడించారు.
ఉత్తర్వులు పాటించేందుకే జైలు...: కాగా అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాయ్, అలాగే ఇరువురు డెరైక్టర్లను జైల్లో పెట్టడానికి కారణాన్ని ఈ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు రాధాకృష్ణన్, జగదీష్ సింగ్ కేహార్‌లు వివరించారు. మదుపరుల నుంచి మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన రూ.24,000 కోట్ల డబ్బు మొత్తం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలన్న తన ఆదేశాలను పాటించేలా చేయడమే తాజా నిర్బంధానికి కారణంగా ధర్మాసనం తెలిపింది. సెబీ ధిక్కార పిటిషన్లకు, ఈ నిర్బంధానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
సెబీ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లు విచారణ దశలోనే ఉన్నాయని పేర్కొంటూ, దీనిపై తీర్పు ఏమిటన్నది విచారణ ముగింపు(ధిక్కరణపై), డబ్బు తిరిగి చెల్లింపుల (మదుపరులకు) అనంతరం వెలువరిస్తామని సూచించింది. ‘2014 ఆగస్టు 31, ఆతర్వాత ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడటమే మార్చి 4న మేము జారీ చేసిన జ్యుడీషియల్ కస్టడీ ఉత్తర్వుల ఉద్దేశం. సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లపై శిక్షకాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.10,000 కోట్ల బెయిల్ బాండ్ విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ, వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తంలో ఇది కొంతేనన్న విషయాన్ని సహారా గుర్తెరగాలని బెంచ్ పేర్కొంది.