
లక్నో పోలీసుల అదుపులో సుబ్రత రాయ్
సహారా సంస్థల అధినేత సబ్రత రాయ్ లక్నో పోలీసులు అదుపులో ఉన్నారు.
సహారా సంస్థల అధినేత సబ్రత రాయ్ లక్నో పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం రాయ్ పోలీసు కస్టడీలోనే ఉన్నారని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీంకోర్టుకు తెలిపారు. అంతకుముందు సుబ్రత రాయ్ కథ చిత్ర విచిత్రమైన మలుపులు తిరగింది. తాను అరెస్టు కాకుండా పారిపోవట్లేదని, సుప్రీం కోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా.. బేషరతుగా వాటిని పాటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన శుక్రవారం ఉదయమే వెల్లడించారు. తొలుత అరెస్టు చేసేందుకు లక్నోలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లినా, రాయ్ అక్కడ లేకపోవడంతో ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే.. తాను ఎక్కడికీ పారిపోలేదని, వైద్యులకు చూపించుకోడానికి కొద్దిసేపు బయటకు వెళ్లానని ఆయన చెప్పారు.
పోలీసులు నిరభ్యంతరంగా తమ విధులను నిర్వర్తించుకోవచ్చని తాను ముందే వారికి చెప్పానన్నారు. తన తల్లికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, అందువల్ల మార్చి మూడో తేదీ వరకు ఆమెతో పాటే గృహనిర్బంధంలో ఉండేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఓ ప్రకటన ద్వారా ఆయన కోరారు. అయితే కోర్టు చెబితే మాత్రం ఈరోజైనా సరే ఢిల్లీ వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడంతో.. ఫిబ్రవరి 26వ తేదీన రాయ్ని అరెస్టు చేసి, మార్చి 4న కోర్టులో హాజరు పరచాలని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎట్టకేలకు లక్నో పోలీసులు సుబ్రత రాయ్ ని అదుపులోకి తీసుకున్నారు.