
సుబ్రతారాయ్‌కు మళ్లీ నిరాశే
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బెయిల్ లేదా పెరోల్‌పై రాయ్‌ని విడుదల చేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా రెండు గ్రూప్ కంపెనీలు మదుపుదారుల నుంచి దాదాపు రూ.24 వేల కోట్లు వసూలు చేసిన కేసులో- గడచిన ఐదు నెలల నుంచీ రాయ్ తీహార్ జైలులో కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో బెయిల్ పొందాలంటే రూ.10 వేల కోట్లు చెల్లించాలని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే. రూ.10,000 కోట్లలో తొలుత కొంత మొత్తం చెల్లించి రెగ్యులర్ బెయిల్‌పై విడుదలై, అటు తర్వాత మిగిలిన మొత్తాలను చెల్లించే విధంగా వెసులుబాటు ఇవ్వాలని సుప్రీం కోర్టును సహారా కోరుతోంది. అయితే ఇందుకు న్యాయమూర్తులు అంగీకారం తెలపలేదు. పెరోల్‌కు సైతం తాజాగా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
వెసులుబాటు బాట..!
కాగా న్యూయార్క్, లండన్‌లలో ఉన్న లగ్జరీ హోటెల్స్‌సహా దేశంలోని తొమ్మిది ఆస్తులను విక్రయానికి మాత్రం సుప్రీం సరే అంది. అయి తే జైలు వెలుపల ఎక్కడైనా ఇందుకు సంబంధించి కొనుగోలుదారులతో లావాదేవీలను జరపడానికి వీలుగా ఉదయం 10 గంటల నుంచీ సాయంత్రం 4 గంటల వరకూ సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
షియోమి ఆర్డర్ల వెల్లువతో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ క్రాష్
ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ మంగళవారం మరోసారి క్రాష్ అయింది. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ ‘ఎంఐ3’ చౌక స్మార్ట్‌ఫోన్‌ల ఆన్‌లైన్ అమ్మకాలకు బుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా ఒకేసారి ఆర్డర్లు వెల్లువెత్తడంతో పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి మొరాయించినట్లు సమాచారం. చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కంపెనీ.. భారత్‌లో తాజాగా తమ ఎంఐ3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఆన్‌లైన్ విక్రయాలకోసం ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌తో ఈ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మే14న కూడా ‘మోటో ఇ’ మొబైల్ ఆన్‌లైన్ విక్రయాల ప్రారంభం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సైట్ ఇదేవిధంగా క్రాష్ కావడం తెలిసిందే. కాగా, క్రాష్ వార్తల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది వెబ్‌సైట్‌లో సమస్యలను కొద్దిసేపటితర్వాత చక్కదిద్దినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.