సహారా బ్యాంక్ ఖాతాల ‘డీఫ్రీజ్’కు సుముఖం
న్యూఢిల్లీ: మదుపరులకు డబ్బు పునఃచెల్లింపుల కేసులో సహారాకు సుప్రీంకోర్టు మరో అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించడానికి వీలుగా- అంతమొత్తాన్ని సమీకరించడానికి వెసులుబాటు కల్పించే రూలింగ్‌ను ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది.
దీని ప్రకారం- ఈ కేసులో ఇప్పటికే ‘ఫ్రీజ్’ చేసిన గ్రూప్ అకౌంట్లలో కొన్నింటిని ‘డీఫ్రీజ్’ చేయడానికి ధర్మాసనం సుముఖతను వ్యక్తం చేసింది. ఇందుకుగాను సంబంధిత అకౌంట్ల వివరాలను అప్లికేషన్ రూపంలో సమర్పించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లింపులకుగాను ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలనూ తెలియజేయాలని సహారా గ్రూప్ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్‌ను అడిగింది.
వాడివేడి వాదనలు..
ఖాతాల స్తంభనసహా రాయ్, డెరైక్టర్లు జైలులో ఉండగా భారీ మొత్తంలో నిధుల సమీకరణ ఎలా సాధ్యమంటూ... అంతక్రితం సహారా న్యాయవాది చేసినవాడివేడి వాదనకు జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ తీవ్రంగా స్పందించింది. ‘‘డీఫ్రీజ్ కోరుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్లు సమర్పించాలని మేము ఇప్పటికే సూచించాం. అయినా మీరు ఇప్పటికీ ఈ నంబర్లను సమర్పించలేదు. వాటిని సమర్పిస్తే... ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మేము భావిస్తున్నాం’’ అని పేర్కొంది.
సుదీర్ఘ సమయం వాదనల అనంతరం డీఫ్రీజ్ చేయాల్సిన అకౌంట్ల నంబర్లు, అలాగే ‘విక్రయించదలచిన’ ఆస్తుల వివరాలను సమర్పించడానికి సహారా న్యాయవాది అంగీకరించారు. కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా సహారా గ్రూప్ కంపెనీలు రెండు రూ.24,000 కోట్ల సమీకరణ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం వ్యవహారంలో... రాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు మార్చి 4 నుంచీ జ్యుడీషియల్ కస్టడీలో (తీహార్ జైలులో) ఉన్నారు.