
సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ బెయిల్ పొందేందుకు వీలుగా మూడు విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకానికి రుణదాత బ్యాంక్ ఆఫ్ చైనాను ఆశ్రయించేందుకు సహారా గ్రూప్‌ను సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. బెయిల్ కోసం రూ.5 వేల కోట్ల నగదు డిపాజిట్, అంతే మొత్తానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాలన్న ఉత్తర్వులను సవరించాలంటూ రాయ్ చేసిన అభ్యర్థనపై కోర్టు తన ఆదేశాలను రిజర్వులో ఉంచింది. బెయిల్ కోసం రూ.3 వేల కోట్లను ఐదు రోజుల్లో, మరో రూ.2 వేల కోట్లను 30 రోజుల్లో డిపాజిట్ చేస్తామనీ, మిగిలిన రూ.5 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీని విదేశీ హోటళ్లలోని ఈక్విటీల అమ్మకం ద్వారా 60 రోజుల్లో సమర్పిస్తామనీ సహారా గ్రూప్ తాజాగా ప్రతిపాదించింది. లండన్‌లోని ఒక హోటల్, న్యూయార్క్‌లోని రెండు హోటళ్లలోని వాటాలను విక్రయిస్తామని తెలిపింది.
ఆ హోటళ్లలో వాటాల కొనుగోలుకు భారీగా నిధులు సమకూర్చిన బ్యాంక్ ఆఫ్ చైనాను సంప్రదించడానికి సహారా గ్రూప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ చైనాతో సంప్రదింపుల సారాంశాన్ని తెలుపుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ‘సహారా గ్రూప్ పేర్కొన్న 9 ఆస్తుల అమ్మకానికి అనుమతించడానికి మేం సుముఖంగా ఉన్నాం. నిధుల సమీకరణకు ఆంబీ వ్యాలీని తాకట్టు పెట్టడానికి కూడా ఆనుమతించడానికి సిద్ధం’ అని టి.ఎస్.ఠాకూర్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.