ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్‌జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్‌మెంట్‌లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్‌యూ దిగ్గజాలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది.
తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్‌జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది.
వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్‌కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు.
గురువారం బీఎస్‌ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద
స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375;
కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది.