IOC shares
-
విదేశీ ఆసక్తి: చమురు షేర్లకు డిమాండ్
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో వాటా కొనుగోలుకి గ్లోబల్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్న వార్తలతో పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్ కంపెనీ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో బీపీసీఎల్ షేరు తొలుత 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 39 ఎగసి రూ. 433 ఎగువన ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. ఉదయం 11.40 కల్లా ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 1.6 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీలో భాగంకావడంతో బీపీసీఎల్ కౌంటర్.. తదుపరి సర్క్యూట్ నుంచి రిలీజ్అయ్యింది. ప్రస్తుతం 11 శాతం ఎగసి రూ. 437 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 442ను తాకింది. 2 రోజులుగా.. వాటా విక్రయ వార్తల నేపథ్యంలో గత రెండు రోజుల్లో బీపీసీఎల్ షేరు 14 శాతం దూసుకెళ్లడం గమనార్హం! ఈ బాటలో ప్రస్తుతం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) షేరు ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 224 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సైతం 3 శాతం లాభపడి రూ. 87 వద్ద కదులుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. సౌదీ అరామ్కో.. ఇంధన రంగ పీఎస్‌యూ.. బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఇటీవల ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఆసక్తి ఉన్న కంపెనీలకు ఆహ్వానం(ఈవోఐ) పలికింది. ఇందుకు ఈవోఐలను దాఖలు చేసేందుకు ఈ నెల(జులై) 31వరకూ గడువు ఇచ్చింది. బీపీసీఎల్ కొనుగోలుకి విదేశీ ఇంధన దిగ్గజాలు సౌదీ అరామ్కో, రాస్‌నెఫ్ట్, ఎగ్జాన్ మొబిల్, అబుధబీ నేషనల్ ఆయిల్ తదితరాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం బీపీసీఎల్‌లో ఉన్న 114.9 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. వెరసి 52.98 శాతం వాటా విక్రయం ద్వారా కొనుగోలుదారుకు యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనుంది. అయితే నుమాలిగఢ్ రిఫైనరీలో బీపీసీఎల్‌కున్న 61.65 శాతం వాటాను మరో ఆయిల్ పీఎస్యూకు ప్రభుత్వం బదిలీ చేయనుంది. -
ఐఓసీ షేర్ల బైబ్యాక్ @ రూ.4,435 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రూ.4,435 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. అంతేకాకుండా రూ.6,665 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించిందని ఐఓసీ గురువారం తెలిపింది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేర్‌ను రూ.149 ధరకు బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. ఈ బైబ్యాక్ ధర గురువారం ఐఓసీ షేర్ ముగింపు ధర (రూ.137) కంటే 9 శాతం అధికం. ఈ కంపెనీలో 54.06 శాతం వాటా ఉన్న కేంద్రం ఈ షేర్ల బైబ్యాక్‌లో పాల్గొని భారీగా నిధులు సమీకరిస్తుందని అంచనా. 67.5 శాతం మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేర్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.75(67.5 శాతం)మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి కూడా డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐఓసీ వెల్లడించింది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,566 కోట్లని(పన్నులు కాకుండా), ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,544 కోట్ల డివిడెండ్ చెల్లిస్తామని, దీనికి అదనంగా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి లభిస్తుందని పేర్కొంది. డివిడెండ్ చెల్లింపునకు సంబంధించి రికార్డ్ డేట్ ఈ నెల 25 అని, ఈనెల 31లోపు డివిడెండ్ మొత్తాన్ని వాటాదారులకు చెల్లిస్తామని వివరించింది. కోల్ ఇండియా, భెల్, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అరడజను ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు షేర్ల బైబ్యాక్ ప్రణాళికలను ప్రకటించాయి. ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, ఎన్ఎల్సీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, కేఐఓసీఎల్ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. -
ఐఓసీలో 10 శాతం వాటా ఓఎన్జీసీ, ఓఐఎల్ చేతికి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లో వాటాల విక్రయం లక్ష్యానికి గడువు దగ్గరపడుతుండటంతో కేంద్రం తన అస్త్రాలకు పదునుపెడుతోంది. ఈ ఏడాది(2013-14) డిజిన్వెస్ట్మెంట్లో తొలిసారిగా బ్లాక్ డీల్ రూపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ)లో వాటా విక్రయానికి ఓకే చెప్పింది. 10 శాతం వాటాను(24.27 కోట్ల షేర్లు) ఇతర పీఎస్‌యూ దిగ్గజాలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లకు విక్రయించే ప్రతిపాదనకు సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం ఆమోదముద్ర వేసింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4,800-5,000 కోట్లు రావచ్చని అంచనా. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలో జరిగిన ఈజీఓఎం భేటీలో ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు వెల్లడించారు. బ్లాక్ డీల్‌కు సంబంధించి విధివిధానాలను త్వరలోనే కొలిక్కి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ డెరైక్టర్ల బోర్డుల ఆమోదం అనంతరం వచ్చే వారంలో ఐఓసీ వాటా విక్రయ బ్లాక్ డీల్ ఉండొచ్చని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రాయ్ పేర్కొన్నారు. గతేడాది జూన్ 30 నాటికి ఐఓసీలో కేంద్రానికి 78.92 శాతం వాటా ఉంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర ఉండాల్సినదానికంటే చాలా తక్కువ స్థాయిలో ఉందని.. అందువల్ల ఇప్పుడు వాటా విక్రయం వల్ల అటు కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి నష్టమేనని పెట్రోలియం శాఖ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలం(ఆఫర్ ఫర్ సేల్) రూపంలో 10% వాటా అమ్మకాన్ని వాయిదా వేశారు. అయితే, రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యానికి మరో రెండున్నర నెలలే గడువు మిగిలింది. ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా రూ. 3,000 కోట్లే లభించాయి. దీంతో చివరకు ఐఓసీలో బ్లాక్ డీల్‌కు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు వివేక్ రాయ్ తెలిపారు. ఇప్పటికే తమకు ఐఓసీలో 8.77 శాతం వాటా ఉందని... ఇప్పుడు విక్రయించే 10% వాటాను ఓఐఎల్, తమ కంపెనీకి సమానంగా విభజించనున్నట్లు ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ చెప్పారు. గురువారం బీఎస్ఈలో ఐఓసీ షేరు ధర రూ.3.10(1.48%) లాభపడి రూ.212.05 వద్ద స్థిర పడింది. 52 వారాల గరిష్టస్థాయి రూ.375; కనిష్ట స్థాయి రూ. 186.20గా ఉంది.