బుల్ ధనా ధన్
సార్వత్రిక ఎన్నికలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంచనాలు, డాలరుతో రూపాయి పుంజుకోవడం, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు ఇన్వెస్టర్లలో జోష్‌ను పెంచుతున్నాయి. వెరసి ఉదయం నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 22,000 పాయింట్ల ఎగువన ముగిసింది. ఇది ఒక విశేషంకాగా, ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టం 22,074ను తాకింది. ఇక నిఫ్టీ కూడా తొలిసారి 6,591ను చేరడం మరో ప్రత్యేకత! ఇందుకు వచ్చే నెల మొదట్లో చేపట్టనున్న సమీక్షలో ఆర్‌బీఐ సరళ విధానాన్ని అనుసరిస్తుందన్న అంచనాలు కూడా తోడ్పడ్డాయని నిపుణులు చెప్పారు. గురువారం(27న) డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా మార్కెట్లలో లావాదేవీలు పుంజుకున్నట్లు తెలిపారు.
ఎఫ్‌ఐఐల జోరు...
ఇటీవల దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల దూకుడును చూపుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) సోమవారం ఒక్క రోజులో రూ. 1,466 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 770 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. కాగా, ఈ నెల 21 వరకూ ఎఫ్‌ఐఐలు రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం చెప్పుకోదగ్గ అంశం! బీఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంకింగ్, ఆయిల్ రంగాలు 2.5%పైగా జంప్ చేయగా, హెల్త్‌కేర్, ఐటీ ఇండెక్స్‌లు మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మాలతోపాటు, విప్రో, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ 1.4-0.4% మధ్య బలహీనపడ్డాయి. అయితే మరోవైపు ప్రభుత్వ రంగ ఈటీఎఫ్‌లో భాగమైన పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది.
ఇతర విశేషాలివీ...
బ్యాంకింగ్, ఆయిల్ ఇండెక్స్‌లలో అన్ని షేర్లూ లాభపడటం విశేషంకాగా, మధ్యంతర డివి డెండ్‌ను ప్రకటించనుందన్న వార్తలతో ఓఎన్‌జీసీ 4% పైగా ఎగసింది. ఈ బాటలో గెయిల్, ఐవోసీ, ఇంద్రప్రస్థ గ్యాస్ 5-3% మధ్య పురోగమించగా, ఆర్‌ఐఎల్ సైతం దాదాపు 2% బలపడింది.
బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ దాదాపు 4% జంప్‌చేయగా, యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్, కొటక్ మహీంద్రా, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ 5-2.5 మధ్య ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, కెనరా, బీవోబీ, ఎస్‌బీఐ సైతం 1.5% స్థాయిలో లాభపడ్డాయి.
తాజాగా పీఎస్‌యూ షేర్లకు డిమాండ్ కనిపించింది. బీఈఎంఎల్, ఇంజనీర్స్, ఎంవోఐఎల్, కంటెయినర్ కార్పొరేషన్, చెన్నై పెట్రో, మంగళూర్ రిఫైనరీ, ఐవోసీ, ఎన్‌ఎండీసీ, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ తదితరాలు 8-3% మధ్య దూసుకెళ్లాయి. వీటిలో అధిక శాతం ఈటీఎఫ్‌లో భాగమైన షేర్లుకావడం గమనార్హం!
బీఎస్‌ఈలో మొత్తం 155 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. ఈ జాబితాలో టీవీఎస్ మోటార్, వోల్టాస్, జెన్‌టెక్ వంటి మిడ్‌క్యాప్స్‌తోపాటు మారుతీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజాలున్నాయి.
సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 10న 21,935 వద్ద ముగియగా, 18న ఇంట్రాడేలో 22,040ను తాకింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలుకాగా, ప్రస్తుత బుల్ జోరుతో ఇవి చెదిరిపోయి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
వడ్డీ తగ్గింపు అంచనాలతో ఆటో రంగ షేర్లు సైతం ర్యాలీ చేశాయి. అశోక్ లేలాండ్, హీరో మోటో, బజాజ్ ఆటో, ఎంఅండ్‌ఎం, మారుతీ, టాటా మోటార్స్ 4-0.6% మధ్య లాభపడ్డాయి. టీవీఎస్ మోటార్ రూ. 101 వద్ద కొత్త గరిష్టాన్ని తాకినప్పటికీ చివర్లో 3% నష్టంతో రూ. 96 వద్ద ముగిసింది.
ఎఫ్‌ఎంసీజీ షేరు హవేల్స్ 4% జంప్ చే సి రూ. 900 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా, ఐటీసీ 1% బలపడింది.
మార్చి నెలలో చైనా తయారీ రంగం మందగించిన సంకేతాలు వెలువడినప్పటికీ, చైనాసహా తైవాన్, ఇండొనేసియా, జపాన్, దక్షిణ కొరియా తదితర ఆసియా స్టాక్ మార్కెట్లు 0.5-2% మధ్య లాభపడ్డాయి.
నిఫ్టీ... లాంగ్ రోలోవర్స్
దాదాపు 2 వారాలపాటు చిన్నశ్రేణికి పరిమితమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ హఠాత్ ర్యాలీకి కారణం ఈ నెల ఆప్షన్ కాంట్రాక్టుల్లో షార్ట్ కవరింగ్...వచ్చే నెలకు లాంగ్ రోలోవర్స్ జరగడమేనని తాజా డేటా సూచిస్తున్నది. షార్ట్ కవరింగ్ ఫలితంగా ఈ నెల 6,500 కాల్ ఆప్షన్ నుంచి 10.95 లక్షల షేర్లు, 6,600 కాల్ ఆప్షన్ నుంచి 8.15 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,500 పుట్ ఆప్షన్‌లో 8.49 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు మరో మూడు రోజుల్లో ముగియనున్నప్పటికీ, స్పాట్ నిఫ్టీతో పోలిస్తే మార్చి నిఫ్టీ ఫ్యూచర్ 15 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది.
ఏప్రిల్ నెలకు లాంగ్ రోలోవర్స్‌ను సూచిస్తూ ఆ నెల ప్రీమియం క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 66 పాయింట్ల నుంచి 73 పాయింట్లకు పెరిగింది. ఏప్రిల్ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో 23 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 62 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో క్షీణత సంభవిస్తే 6,500 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 6,600 స్థాయిని అధిగమించగలిగితే మరింత ర్యాలీ సాధ్యమని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఏప్రిల్ నెలలో మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా వున్నారని, వచ్చే నెలకు ట్రేడవుతున్న భారీ ప్రీమియం సూచిస్తున్నది.