ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి.
సాఫ్ట్‌వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్‌లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్‌లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది.
మార్కెట్ల వెనకడుగు..
ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి.
ఇతర స్టాక్స్‌లోనే..
ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్‌ఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు.
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
Published Thu, Aug 31 2023 5:05 AM | Last Updated on Thu, Aug 31 2023 5:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment