నిఫ్టీకి మూడో రోజూ నష్టాలు
సెన్సెక్స్ 384 పాయింట్ల పతనం
ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.
అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.
సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి.
శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్‌లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్‌లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి.
Comments
Please login to add a commentAdd a comment