ప్లస్ 395 నుంచి మైనస్ 32కు
- ఆర్థిక ఫలితాల పట్ల నిరుత్సాహం
- ప్రతికూలంగా ప్రపంచ పరిణామాలు
- ఐదో రోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మార్కెట్ అప్‌డేట్
రోజంతా తీవ్రమైన ఊగిసలాటకు గురైన స్టాక్ మార్కెట్ చివరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా ఐదో రోజూ నష్టాల పాలయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండడం, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు గురువారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఒక దశలో 395 పాయింట్ల (29,278 పాయింట్లు స్థాయికి)లాభపడిన సెన్సెక్స్ చివరకు 32 పాయింట్ల నష్టంతో 28,851 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఇంట్రాడే ట్రేడింగ్‌లో వంద పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 8,712 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌కి రెండు వారాల కనిష్ట స్థాయి కాగా, నిఫ్టీకి జనవరి 20 తర్వాత ఇదే బలహీనమైన ముగింపు. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 831 పాయింట్లు(2.8 శాతం) నష్టపోయింది.
ఐటీ షేర్ల జోరు: విద్యుత్, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్తు, లోహ, చమురు, కొన్ని బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఐటీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ రంగంలో పలు షేర్ల ధరలు పెరిగాయి.
కమోడిటీ మార్కెట్లలో అక్రమాల చెక్‌కు మార్గదర్శకాలు
కమోడిటీ మార్కెట్లలో ఎటువంటి ఆర్థిక అక్రమాలు జరక్కుండా చెక్ పెట్టడానికి రెగ్యులేటర్ ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ (ఎఫ్‌ఎంసీ) గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్) చట్టం 2002కు అనుగుణంగా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు 35 పేజీల సర్క్యులర్‌ను విడుదల చేసింది. నిజానికి 2013 ఫిబ్రవరిలోనే కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లు, వాటి సభ్యులను పీఎంఎల్ యాక్ట్ పరిధిలోనికి ఎఫ్‌ఎంసీ తీసుకువచ్చింది. అయితే ఈ చట్ట పరిధిలో పాటించాల్సిన నియమ నిబంధనల మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది.