న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వ విధానాలపై దేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారని, అయితే ప్రభుత్వం అనుసరించే కొత్త విధానాల ప్రాతిపదికపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రణాళికా సంఘం పూర్తి సమయపు సభ్యుల సమావేశం అనంతరం మాంటెక్ విలేకరులతో మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) సగటు 8% వృద్ధి లక్ష్యాల సవరణ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, రాబోయో కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
గడచిన రెండు సంవత్సరాల కాలంలో వృద్ధి సానుకూలంగా లేని సంగతి తెలిసిందే. 2012-13లో ఈ రేటు 4.5%గా ఉంటే, 2013-14లో ఈ పరిమాణం 4.9%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5% దాటబోదని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 12వ ప్రణాళికలో 8 శాతం వృద్ధి కష్టమన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళికా సంఘం మదింపు జరుపుతోందని (ప్రణాళిక మధ్యంతర మదింపు- ఎంటీఏ), కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తాజా సంఘం ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళుతుందని మాంటెక్ వెల్లడించారు. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
కొత్త ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ వృద్ధి
Published Thu, May 1 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM
Advertisement