Rajeev Shukla
-
Asia Cup 2023: పాకిస్తాన్‌కు వెళ్లనున్న బీసీసీఐ పెద్దలు
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు దాయాది దేశానికి పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపినప్పటికీ.. అతను లాహోర్‌కు వెళ్లేందుకు అయిష్టత ప్రదర్శించాడు. దీంతో అక్టోబర్ 30న రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు మాత్రమే పాక్‌కు వెళ్లనున్నారు. కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నీకి పాక్ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్ జట్టు పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాక్ –నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. -
వరుసగా 2 మ్యాచ్‌లు కష్టమన్న హెచ్‌సీఏ.. షెడ్యూల్ మార్పు కుదరదన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్ మరో 45 రోజుల్లో మొదలవనుంది. ఈ దశలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వరుస రోజుల్లో రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల నిర్వహణ కష్టమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మార్పు కోరింది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ మార్పు కుదరదని స్పష్టం చేశారు. నిజానికి మెగా ఈవెంట్ షెడ్యూల్ చాలా ముందుగా విడుదల చేస్తారు. కానీ ఈసారి కేవలం నాలుగు నెలల ముందే జూన్‌లో ప్రకటించారు. ఇటీవలే షెడ్యూల్లో మార్పులు చేశారు. మళ్లీ మార్పులంటే కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మరో నాలుగు రోజుల్లోనే (ఈ నెల 25న) టికెట్ల విక్రయం కూడా జరగబోతుంది. లాజిస్టిక్ సమస్యలే కాదు... ఇతరత్రా సర్దుబాట్లకు అవకాశాల్లేవని బోర్డు వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందువల్లే ఇకపై షెడ్యూల్లో మార్పలుండబోవని స్పష్టం చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. అసలేం జరిగింది? తొలుత ఐసీసీ–బీసీసీఐ ఖరారు చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 9న ఉప్పల్ మైదానంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్‌ల మధ్య మ్యాచ్, 12న పాకిస్తాన్, శ్రీలంకల మధ్య మ్యాచ్‌లు జరగాలి. అయితే మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలువనున్న భారత్, పాక్ పోరు అహ్మదాబాద్‌లో ఒకరోజు ముందుకు (అక్టోబర్ 15 నుంచి 14కు) జరిపారు. దీంతో పాకిస్తాన్‌కు సరైన విరామం కోసమని పాక్, శ్రీలంక మధ్య 12న జరగాల్సిన మ్యాచ్‌ను 10న నిర్వహించడమే హెచ్‌సీఏకు కష్టాలను తెచ్చిపెట్టింది. 9, 10 తేదీల్లో మ్యాచ్‌లంటే పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సుప్రీం కోర్టు నియమిత అడ్మిని్రస్టేటర్తో నడుస్తున్న హెచ్‌సీఏ తెలిపింది. నేను హైదరాబాద్ వేదిక ఇన్చార్జ్గా ఉన్నాను. అక్కడ ఏమైన సమస్యలుంటే పరిష్కరించవచ్చు. కానీ షెడ్యూల్ మార్పు ఒక్క బీసీసీఐ చేతుల్లో ఉండదు. ఐసీసీ, పాల్గొంటున్న జట్లు, ఇతరత్రా సంస్థలు (సదుపాయాలు, లాజిస్టిక్స్) అందర్నీ ఒప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. –బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా -
బీసీసీఐ కొత్త బాస్ ఎవరంటే..?
సౌరవ్ గంగూలీ తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ఎన్నిక దాదాపుగా ఖరారైంది. బిన్నీకి ఈ పదవి కట్టబెట్టేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులందరూ ఏకపక్షంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముంబైలో ఇవాళ జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశంలో అధ్యక్ష పదవితో పాటు ఉపాధ్యక్ష, కార్యదర్శి, ఐపీఎల్ చైర్మన్ అభ్యర్ధిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా జై షా కొనసాగనుండగా.. ఐపీఎల్ చైర్మన్‌గా బ్రిజేష్ పటేల్ స్థానంలో అరుణ్ ధుమాల్ ఆ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ భవితవ్యంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. గంగూలీని ఐసీసీ అధ్యక్ష బరిలో నిలిపేందుకు బోర్డు సభ్యులందరూ అంగీకారం తెలిపినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 18వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రోజర్ బిన్నీ విషయానికొస్తే.. 67 ఏళ్ల ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ భారత్ 1983 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అతను ప్రస్తుతం కర్నాటక క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్‌గా కొనసాగుతున్నాడు. గతంలో బిన్నీ జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బిన్నీ.. 1980-87 మధ్య 27 టెస్ట్ లు, 72 వన్డేలు ఆడి 1459 పరుగులు సాధించి, 113 వికెట్లు పడగొట్టాడు. 1983 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన బిన్నీ.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
‘అక్తర్ సూచన మరీ కామెడీగా ఉంది’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహించడమే కష్టంగా ఉన్న సమయంలో భారత్-పాకిస్తాన్ సిరీస్ ఎలా సాధ్యమవుతుందని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్‌శుక్లా ప్రశ్నించారు. కరోనాపై పోరాటంలో భాగంగా భారత్-పాక్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సూచించిన విషయం తెలిసిందే. అయితే అక్తర్ సూచనపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అక్తర్ వ్యాఖ్యలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్‌శుక్లా స్పందించారు. ‘అక్తర్ చాలా సరదా మనిషి అని అందరికీ తెలుసు. సమయానికనుగుణంగా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తుంటాడు. అయితే కరోనా విరాళాల కోసం భారత్-పాకిస్తాన్ సిరీస్ నిర్వహిస్తే రెండు దేశాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని సలహా ఇచ్చారు. అయితే అక్తర్ సూచన చాలా సరదాగా ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం(అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా) సాధ్యపడటం లేదు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేనటువంటి ఇలాంటి సమయంలో మూడు వన్డేల సిరీస్ ఎలా సాధ్యపడుతుంది. మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి, ఒకదేశం ఆటగాళ్లను మరో దేశంలోకి ఎలా అనుమతిస్తారు? అందుకే అక్తర్ వ్యాఖ్యలు కామెడీగా అనిపించాయి’అని రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు. చదవండి: భారత్ సాయం కోరిన అక్తర్ ఐపీఎల్ నష్టం రూ.3800 కోట్లు! -
‘మన్కడింగ్ వద్దనుకున్నాం కదా..’
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో తొలి వివాదం రాజుకుంది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ సారథి ఈ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. జోరుమీదున్న జాస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంలో అశ్విన్ ఔట్ చేశాడు. అయితే క్రికెట్లో ఇది చట్టబద్దమైనా.. క్రీడా స్పూర్తికి విరుద్దమంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ట్విటర్లో స్పందించారు. ‘కోల్‌కతాలో జరిగిన ఓ ఐపీఎల్ సమావేశంలో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి మన్కడింగ్ విధానాన్ని పాటించవద్దని నిర్ణయించాం. నాన్ స్ట్రైకర్ క్రీజు దాటి వెళితే బౌలర్ ఔట్ చేయవద్దని అనుకున్నాం’అంటూ ట్వీట్ చేశారు. ఇక అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’ అని అశ్విన్ పేర్కొన్నాడు. -
సెక్స్ ఫర్ సెలక్షన్.. పెను కలకలం
‘జట్టులో చోటు దక్కాలంటే అమ్మాయిలను ఫైవ్‌స్టార్ హోటళ్లకు పంపాల్సిందే... అలా అయితేనే టీమ్‌లో నువ్వు ఉంటావ్... లేకపోతే ఈ జన్మలో టీమ్ తరపున ఆడలేవ్’.. ఇది సెక్స్ ఫర్ సెలక్షన్ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసిన విషయం. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో వెలుగు చూసిన ఈ స్కాండల్‌తో క్రీడా రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మహమ్మద్ అక్రమ్ సైఫీ ఇందులో భాగస్వామి కావటంతో.. ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయాలంటే తనకు అందమైన అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ సైఫీ డిమాండ్ చేసినట్లు యూపీ యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ సాయంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. స్టింగ్ ఆపరేషన్... ‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి’ అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్‌లో తెలుస్తోంది. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు. అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. యూపీ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ.. ఈ వ్యవహారాలను అతనే దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజీనామా.. తొలుత ఆరోపణలుగా ఖండిచిన సైఫీ.. విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు అనుచరుడి రాజీనామాను శుక్లా వెంటనే ఆమోదించినట్లు తెలుస్తోంది. అయితే శుక్లా లాంటి పెద్దల అండ ఉన్న తనపై.. కావాలనే కుట్ర పన్నుతున్నారని అక్రమ్ చెబుతున్నారు. బీసీసీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెల్లడౌతాయన్న ఆశాభావం సైఫీ వ్యక్తం చేస్తున్నాడు. దిగ్భ్రాంతి... కాగా, ఈ వ్యవహారంపై పలువురు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విషయంలో శుక్లా పారదర్శకంగా వ్యవహరించి.. యంగ్ టాలెంట్‌కు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. -
ఐపీఎల్ వేలంపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ రైట్స్‌ను భారీ మోత్తానికి స్టార్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. అయితే స్టార్ ఇండియాకు ఐపీఎల్ మీడియా హక్కులు రావడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. సోమవారం నిర్వహించిన వేలంలో రూ. 16 వేల 347.50 కోట్ల భారీ మొత్తానికి స్టార్ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకోగా.. ఆ సంస్థకు మీడియా హక్కులు రావడంలో బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హస్తముందని.. అందుకుగానూ ఆయన రూ. 100 కోట్లు అందుకోనున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇంటర్నల్ ఆర్బిటరీ అప్లికేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్ కవర్లో అత్యధిక బిడ్ వేసిన గ్రూప్‌నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్ హక్కుల కోసం స్టార్‌తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్‌కు ఈ హక్కులుంటాయి. 2008లో తొలి ఐపీఎల్ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ దాదాపు రూ. 8,200 కోట్లు సొంతం చేసుకుంది. మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కాలానికి సోనీ గ్రూప్‌నకు 1.63 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఐపీఎల్ బిడ్‌లో అసలేం జరిగింది.. మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 కంపెనీలు బిడ్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసినా.. చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి. భారత్‌లో టీవీ హక్కుల కోసం స్టార్ రూ. 6,196.94 కోట్లతో బిడ్ వేయగా, సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా)లకు కూడా స్టార్ బిడ్ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. ఓవరాల్‌గా గ్లోబల్ బిడ్‌కే హక్కులు కేటాయించాల్సి రావడంతో స్టార్ ఇండియా ఐపీఎల్ హక్కులు దక్కించుకుంది. -
మొన్న కోహ్లి.. నిన్న శుక్లా!
ముంబై:మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ఫైనల్ కు చేరడంతో అటు ప్రముఖులు, ఇటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజా వరల్డ్ కప్ సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఓడించి భారత మహిళలు తుదిపోరుకు అర్హత సాధించారు. ఆసీస్ పై 36 పరుగుల తేడాతో గెలిచి కోట్లాది భారత అభిమానుల హృదయాలను దోచుకున్నారు. అయితే ఐపీఎల్ చైర్మన్, ఎంపీ రాజీవ్ శుక్లా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ పై గెలిచి ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు. ఆ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది'అని ట్వీట్ చేశారు. ఇలా పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే శుక్లాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. అసలు ఏ టోర్నీ జరుగుతుందో కూడా తెలియకుండా రాజీవ్ శుక్లా ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. ట్వీట్ చేసేముందు ఒకసారి సరిచూసుకో అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. క్రికెట్ వర్గానికి చెందిన వ్యక్తే ఇలా చేయడంపై సమర్ధనీయం కాదంటూ పలువురు విమర్శలు సంధించారు. దాంతో తను చేసిన తప్పును గ్రహించిన శుక్లా.. దాన్ని కొద్ది నిమిషాల్లోనే తొలగించారు. అంతకుముందు ఇదే ప్రపంచకప్ లో మిథాలీ రాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పూనమ్ రౌత్ ఫోటోను పోస్ట్ చేసి భారత పురుష క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్ లో అత్యధిక వన్డే పరుగుల రికార్డును సాధించిన క్రమంలో మిథాలీ రాజ్ ఫోటోకు బదులు పూనమ్ ఫోటోను కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు రాజీవ్ శుక్లా తప్పులో కాలేయడంపై భారత అభిమానుల ఆగ్రహం మరింత ఎక్కువైంది. అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తున్న మహిళా క్రికెట్ జట్టు అంటే ఇంతటి చిన్నచూపా అంటూ మండిపడుతున్నారు. -
రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ వ్యవహారాలు పర్యవేక్షించడానికి వినోద్ రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆయనకు పచ్చజెండా ఊపింది. శుక్లాను తొలగించే అవకాశముందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. రాజీవ్ శుక్లా పదవికి ముప్పు వాటిల్లకపోవడంతో ఐపీఎల్ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని తేలిపోయింది. అయితే ఐపీఎల్ పాలక మండలి కార్యకలాపాలను అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ పర్యవేక్షించనుంది. -
'టీ20వరల్డ్ కప్ టైమ్‌లో ఏం చేశారు?'
న్యూఢిల్లీ: కరువు పీడిత మహారాష్ట్ర నుంచి 13 ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించాలంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు బీసీసీఐని బిత్తరపోయేలా చేసింది. ప్రస్తుత పరిస్థితిలో ఐపీఎల్ మ్యాచ్‌లు తరలించడం సమస్యే అయినప్పటికీ, బీసీసీఐ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా చేయడంతోపాటు సీఎం రిలీఫ్ పండ్‌కు నిధులు ఇస్తామని బీసీసీఐ చెప్పినప్పటికీ, ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించొద్దంటూ హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో శుక్లా విలేకరులతో మాట్లాడుతూ 'ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ చాలా పెద్ద పని. ఇప్పుడు మ్యాచ్‌లు మార్చడం అంత సులభం కాదు. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఇప్పుడు మ్యాచుల తరలింపు అంటే సమస్యే. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను మేం గౌరవిస్తాం. మొత్తం 19 మ్యాచ్‌లలో 13ని మహారాష్ట్ర నుంచి తరలించాల్సి ఉంది. ఇందుకు మేం కష్టపడాలి' అని అన్నారు. 'మ్యాచ్‌లు తరలించాల్సి వస్తే.. ఎక్కడికి తరలించాలి? ఎలా తరలించాలి? అన్నది సమస్య. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇటీవల 24 మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు ఒక్కరూ కూడా ఈ అంశాన్ని (నీటి సమస్యను) లేవనెత్తలేదు. గత ఆరు నెలల్లో ఎవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదు. మహారాష్ట్రలో ఎన్నో సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటికి ఎంతో నీటి అవసరముంది. అయినా ఆ అంశాన్ని ఎవరూ లేవనెత్తడం లేదు. అన్ని సమకూరుస్తామన్నా.. ఐపీఎల్ విషయంలోనే ఈ విషయాన్ని లేవనెత్తారు' అని శుక్లా పేర్కొన్నారు. ఐపీఎల్ ను లక్ష్యంగా చేసుకున్నారన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. -
'ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం'
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రాసిన 'శటానిక్ వర్సెస్' పుస్తకంపై రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నిషేధం విధించడం సబబేనని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం వెలువరించిన అభిప్రాయం వ్యక్తిగతమైందని పేర్కొన్నారు. ఆయన ప్రటనకతో తాను విభేదిస్తున్నానని శుక్లా చెప్పారు. తమ అసహనం పెరిగిపోతున్నా ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు అధికార బీజేపీ ఇష్టపడడం లేదని ఆయన విమర్శించారు. 'శటానిక్ వర్సెస్' పుస్తకంపై నిషేధించడం విధించడం తప్పేనని చిదంబరం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ... 'సల్మాన్ రష్దీ పుస్తకంపై నిషేధం విధించడం తప్పేనని చెప్పడంలో నాకేలాంటి సంకోచం లేదు' అని వ్యాఖ్యానించారు. చిదంబరం వ్యాఖ్యలను బంగ్లాదేశ్ వివాదస్పద రచయిత్రి తస్రీమా నస్రీన్ సమర్థించారు. -
లాహోర్ అయితే మాకు ఓకే: రాజీవ్ శుక్లా
ముంబై: పాకిస్థాన్-టీమిండియాల మధ్య వచ్చే నెలలో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ యూఏఈలో జరుగుతుందా?లేక భారత్ లో నిర్వహిస్తారా?అనే సందిగ్ధత ఒకపక్క.. అసలు ఈ సిరీస్ పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎంతవరకూ ముందుకు వెళుతుందనేది మరోపక్క. ఇప్పటివరకూ ఓ సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న. కాగా, వీటిన్నంటికీ తెరదించుతూ కొత్త పల్లవి అందుకున్నారు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా. అసలు ఇరు దేశాల మధ్య జరగాల్సిన సిరీస్ ను యూఏఈలో నిర్వహించడం అనవసరం అని శుక్లా కుండబద్దలు కొట్టారు . ఆ సిరీస్ ను నేరుగా పాకిస్థాన్ లో నిర్వహిస్తే బాగుంటుందన్నారు. దీనికి లాహోర్ వేదికైతే ఎలా ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును (పీసీబీ) కి విజ్ఞప్తి చేశారు. 'పాకిస్థాన్ లో జరగాల్సిన హోం సిరీస్ ను యూఏఈలో నిర్వహించడం కూడా పీసీబీకి అంతగా సబబు కాదు. ఒకవేళ పాకిస్థాన్ తమ స్వదేశీ సిరీస్ లను ఇలానే బయట నిర్వహిస్తే వారు మెల్లగా మెల్లగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మేము లాహోర్ లో అయితే క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. మాకు పటిష్టమైన భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలి. మా ఆటగాళ్లకు భద్రతా పరంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి హామీ వస్తే లాహూర్ లో ఆడతాం' అని శుక్లా తెలిపారు. పాకిస్థాన్ తో అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడటానికి తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఈ సందర్భంగా శుక్లా పేర్కొన్నారు. యూఏఈలో సిరీస్ లో భాగంగా దుబాయ్ లో మ్యాచ్ నిర్వహణకు తమకు కొన్ని అడ్డంకులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు వెళ్లి సిరీస్ ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ద్వైపాక్షిక సిరీస్ భారత్ లో జరిగే అవకాశం!
-
ద్వైపాక్షిక సిరీస్ భారత్ లో జరిగే అవకాశం!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ పై భారత్ మరోసారి సానుకూలంగా స్పందించింది. ఎప్పట్నుంచో ఈ సిరీస్ పై వస్తున్న పలురకాలైన ఊహాగానాలకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ ను జరిపితేనే బావుంటుందని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్- పాకిస్థాన్ ల సిరీస్ జరగాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బలంగా కోరుకుంటుందన్నారు. కాగా, ద్వైపాక్షిక సిరీస్ ను యూఏఈలో కాకుండా భారత్ లో జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో ద్వైపాక్షిక సిరీస్ పై స్పష్టత ఇప్పటికే పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఇది సానుకూల మార్గంగానే కనిపిస్తోంది. కాగా, భారత్ లో సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయంపైనే ప్రధానంగా ఆధారపడింది. ఒకవేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారత్ లో ఆడటానికి మొగ్గు చూపినా.. అక్కడి ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత నెల్లో బీసీసీఐతో చర్చల్లో భాగంగా పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ భారత్ కు రావడంపై పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం లేనప్పుడు భారత్ కు ఎలా వెళతారని విదేశాంగ శాఖ షహర్యార్ ను ప్రశ్నించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు సిరీస్ పై ఆశలు పెట్టుకున్నా.. అంతిమంగా ప్రభుత్వ నిర్ణయం తరువాతే సిరీస్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
-
టీమిండియా సీనియర్ బౌలర్ గుడ్ బై
ముంబై: టీమిండియా సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు నేడు వీడ్కోలు పలికాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు జహీర్ ఖాన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందుగా ట్వీట్ చేశారు. 'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. ఐపీఎల్ లో అతడు ఆడతాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. గత మూడునాలుగేళ్లుగా గాయాల కారణంగా భారత జట్టులోకి వస్తూపోతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇంటర్నేషనల్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2000లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశాడు 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు 3 వన్డే వరల్డ్ కప్ లలో 23 మ్యాచ్ లు ఆడి 44 వికెట్లు తీశాడు 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు 17 టి20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు -
'మనోహర్ కే నా మద్దతు'
మొరదాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో లేనని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాస్పష్టం చేశారు. శశాంక్ మనోహర్ కు తాను పూర్తి మద్దతు తెల్పుతున్నట్టు చెప్పారు. తాను ఎల్లప్పుడూ బోర్డుకు విధేయుడిగా ఉంటానని పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అనురాగ్ ఠాకూర్, శరద్ పవార్ వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ముద్ర పడడంతో మనోహర్ పునరాగమానికి మార్గం సుగమం అయింది. అయితే రాజీవ్ శుక్లా పేరు కూడా తెరపైకి రావడంతో ఆయన వివరణ యిచ్చారు. తాను అధ్యక్ష పోటీలో లేనని, మనోహర్ కే మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు. శశాంక్ నాయకత్వంలో బోర్డు పనితీరు మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
సౌరభ్ గంగూలీకి కీలక బాధ్యతలు
ముంబై: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసేందుకు బీసీసీఐ నలుగురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, అనిరుధ్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. రాజీవ్ శుక్లా సారథ్యంలో ఈ గ్రూపు పనిచేస్తుంది. శుక్లా బృందం లోధా కమిటీ తీర్పును పూర్తిగా చదివి, తగిన ప్రతిపాదనలతో నివేదిక సమర్పిస్తుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథన్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్కుంద్రాలను లోధా కమిటీ దోషులుగా ప్రకటిస్తూ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక చెన్నై, రాజస్థాన్‌లపై రెండేళ్ల కాలం పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో నిషేధిత జట్ల స్థానాల్లో కొత్తవాటిని తీసుకోవడం, ఈ జట్ల ఆటగాళ్లకు అవకాశం కల్పించడం వంటి అంశాలపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. శుక్లా కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశముంది. -
ఏమీ తేల్చలేదు
లోధా తీర్పు అధ్యయనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ఆరు వారాల్లో ప్రతిపాదనలు ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రెండు ప్రధాన జట్లపై వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూసినా ప్రస్తుతానికి ఎటూ తేల్చలేదు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను శాశ్వతంగా నిషేధిస్తారా? లేక బోర్డే తమ చేతుల్లోకి తీసుకుని నిర్వహిస్తుందా? అనే అనుమానాలకు సమాధానం దొరుకుతుందని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారంపై జీసీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఆరు వారాల్లోగా ఈ గ్రూప్ సభ్యులు తీర్పును చదివి ఐపీఎల్ పాలక మండలికి తగిన ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇస్తారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
బీసీసీఐ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అక్రమాలకు పాల్పడ్డాయంటూ చెన్సై, రాజస్థాన్ జట్లతోపాటు ఆయా యజమానులపైనా నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ తీర్పు వెలువరించిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలను బీసీసీఐ వెల్లడించింది. జస్టిస్ లోథా తీర్పు అనంతర పరిణామాలు, ఆటపై వాటి ప్రభావం, చేపట్టాల్సిన మార్పులు తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఓ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎవరెవరిని సభ్యులుగా నియమించాలనే నిర్ణయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాకు వదిలేసింది. సదరు కమిటీ పని ప్రారంభించిన ఆరువారాలలోగా తన నివేదికను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు సమర్పించాల్సి ఉంటుంది. బీసీసీఐ వెల్లడించిన నిర్ణయాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. జస్టిస్ లోథా కమిషన్ తీర్పును బీసీసీఐ సంపూర్ణంగా గౌరవిస్తున్నది. కమిషన్ నిర్దేశించిన అంశాలను ఆచరిస్తుంది. క్రికెట్ ఉన్నతిని కాపాడాల్సిన అవసరాన్ని బీసీసీఐ గుర్తించింది. అందుకే కార్యాచరణ కమిటీ ఏర్పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా.. కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తారు. లోథా కమిషన్ తీర్పును అధ్యయనం చేయడంతోపాటు ఐపీఎల్ లో చేపట్టవలసిన మార్పులపై ఈ కమిటీ సూచనలు చేస్తుంది. ఐపీఎల్ సలహా మండలితోనూ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది. ఆటకు సంబంధించి ఎవరుకూడా నష్టపోవద్దన్నదే మా అభిమతం ఈ బృందం ఆరు వారాల్లోగ తన నివేదికను రూపొందించాలి. నివేదిక పరిశీలన అనంతరం బీసీసీఐ వర్కింగ్ కమిటీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. -
ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై శుక్లా గురి
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిష్టించాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా భావిస్తున్నారు. గత నెలలో ఐపీఎల్ ట్రెజరర్ పదవికి పోటీ చేసిన ఆయన శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓడిపోయారు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. శ్రీనివాసన్ వర్గం ప్రస్తుత అధ్యక్షుడు రంజీబ్ బిశ్వాల్ నే కొనసాగించాలని భావిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా తన మద్దతు ఎవరికి అనేది ఇంకా వెల్లడించలేదు. అయితే శుక్లా మాత్రం బోర్డులోని తన 'ఫ్రెండ్స్'ను నమ్ముకున్నారు. 2013లో టోర్నమెంట్ లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో రాజీవ్ శుక్లా ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. -
కొత్త ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ వృద్ధి
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వ విధానాలపై దేశ భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఆర్థికాభివృద్ధి బాగుంటుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారని, అయితే ప్రభుత్వం అనుసరించే కొత్త విధానాల ప్రాతిపదికపై ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రణాళికా సంఘం పూర్తి సమయపు సభ్యుల సమావేశం అనంతరం మాంటెక్ విలేకరులతో మాట్లాడారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2012-17) సగటు 8% వృద్ధి లక్ష్యాల సవరణ విషయం గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, రాబోయో కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో వృద్ధి సానుకూలంగా లేని సంగతి తెలిసిందే. 2012-13లో ఈ రేటు 4.5%గా ఉంటే, 2013-14లో ఈ పరిమాణం 4.9%గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5% దాటబోదని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 12వ ప్రణాళికలో 8 శాతం వృద్ధి కష్టమన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ ప్రణాళికా సంఘం మదింపు జరుపుతోందని (ప్రణాళిక మధ్యంతర మదింపు- ఎంటీఏ), కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే తాజా సంఘం ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళుతుందని మాంటెక్ వెల్లడించారు. అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.