
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12లో తొలి వివాదం రాజుకుంది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ సారథి ఈ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. జోరుమీదున్న జాస్ బట్లర్‌ను మన్కడింగ్ విధానంలో అశ్విన్ ఔట్ చేశాడు. అయితే క్రికెట్‌లో ఇది చట్టబద్దమైనా.. క్రీడా స్పూర్తికి విరుద్దమంటూ అభిమానులు, మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ట్విటర్‌లో స్పందించారు.
‘కోల్‌కతాలో జరిగిన ఓ ఐపీఎల్ సమావేశంలో విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి మన్కడింగ్ విధానాన్ని పాటించవద్దని నిర్ణయించాం. నాన్ స్ట్రైకర్ క్రీజు దాటి వెళితే బౌలర్ ఔట్ చేయవద్దని అనుకున్నాం’అంటూ ట్వీట్ చేశారు. ఇక అశ్విన్ మాత్రం తను చేసిన పనిని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..‘మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. అదేమీ కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే అతను క్రీజ్ వదిలాడు. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్‌మన్ జాగరూకతతో ఉండటం అవసరం.’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment