ప్యానాసానిక్ ‘ఎల్యూగా యు’@ రూ.18,990
న్యూఢిల్లీ: ప్యానాసానిక్ కంపెనీ ఎల్యూగా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల మొదటివారం నుంచి ‘ఎల్యూగా యు’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. ధర రూ.18,990 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ హెచ్‌డీ డిస్‌ప్లే, 16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్-2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు.
15 స్మార్ట్‌ఫోన్‌లు: రానున్న కొన్ని నెలల్లో 15కు పైగా కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనున్నామని మనీష్ శర్మ తెలిపారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ వాటా ప్రస్తుతం 3 శాతమని, ఏడాదిలో దీనిని 5 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా 15కు పైగా స్మార్ట్‌ఫోన్లను, 8 ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తేనున్నామని పేర్కొన్నారు. అయితే స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. భారత్ కేంద్రంగా తమ మొబైల్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. సరైన ధరలకు నాణ్యత గల మొబైళ్లనందించే తమలాంటి కంపెనీలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు.