న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్స్ అందుకుంటున్నారని, ఐటీ సీటీ బెంగళూర్ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందనీ రాండ్‌స్టడ్ ఇన్‌సైట్ సాలరీ ట్రెండ్స్ (2019) నివేదిక వెల్లడించింది. బెంగళూర్‌లో జూనియర్ లెవెల్ టెకీకే సగటు వేతనం రూ 5.27 లక్షలు కాగా, మధ్యస్ధాయి ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు రూ 16.45 లక్షలు, సీనియర్ లెవల్ టెకీకి రూ 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ సంస్థ 2017, 2018లో వెల్లడించిన సాలరీ ట్రెండ్స్ నివేదికలోనూ బెంగళూర్ అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఎంట్రీలెవల్ టెకీకి అత్యధిక వేతనాల్లో హైదరాబాద్ (రూ 5 లక్షలు) ముంబై (రూ 4.59లక్షల) లు వరుసగా టాప్ టూ, టాప్ త్రీ స్ధానాల్లో నిలిచాయి.
ఇక మధ్యస్ధాయి ఐటీ సిబ్బందికి వేతనాల విషయంలో ముంబై (రూ 15.07 లక్షలు) ఢిల్లీ ఎన్‌సీఆర్ (రూ 14.5 లక్షలు) లు ముందుండగా, సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో ముంబై (రూ 33.95 లక్షలు), పూణే (రూ 32.68లక్షలు) లు బెంగళూర్ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని నివేదిక పేర్కొంది. అత్యధిక సగటు వార్షిక వేతనం విషయంలో కూడా ఐటీ రంగమే అగ్రభాగాన నిలిచిందని వెల్లడించింది. ఇక సీనియర్ ప్రొఫెషనల్స్‌లో రూ 35.65 లక్షల వార్షిక వేతనంతో డిజిటల్ మార్కెటర్లు అత్యధిక వేతనం అందుకుంటున్నారని తెలిపింది. క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ వంటి నూతన టెక్నాలజీలతో ఈ ఏడాది ఐటీ రంగం మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. జీఎస్టీ రాకతో ఈ రంగంలో నిపుణులు, అకౌంటెంట్లు, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, న్యాయవాదులకు డిమాండ్ పెరగడంతో వృత్తి నిపుణుల సేవల రంగం రెండో అతిపెద్ద వేతన చెల్లింపు రంగంగా నిలిచింది. ఎనిమిది నగరాల్లో విస్తరించిన 15 పరిశ్రమ విభాగాల్లో లక్ష ఉద్యోగాలను రాండ్‌స్టడ్ ఇన్‌సైట్స్ సాలరీ ట్రెండ్స్ నివేదిక విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment