highest salaries
-
గూగుల్ ఉద్యోగుల జీతాల లెక్క లీక్.. ఒక్కొక్కరి సాలరీ అన్ని కోట్లా?
ప్రపంచంలో ఎక్కువ శాలరీలు అందిస్తున్న సంస్థల్లో ఒకటి 'గూగుల్' (Google). చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా లీక్ అయిన ఒక డేటా ప్రకారం, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్యాకేజ్ వంటి వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సంస్థ తన ఉద్యోగుల సగటు వేతనం 2022లో సుమారు 2,79,802 డాలర్లు అని తెలిసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.30 కోట్లు వేతనంగా పొందుతున్నట్లు సమాచారం. అదే సమయంలో 2022లో గరిష్ట ప్రాధమిక జీతం 7,18,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 5.90 కోట్లు. అంటే ఉద్యోగి గరిష్ట వార్షిక వేతనం సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. గూగుల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇంజినీరింగ్ మేనేజర్, డైరెక్ట్ సేల్స్ ఇలా మొదలైన వారు ఉన్నారు. ఎక్కువ శాలరీ తీసుకున్న ఉద్యోగులు ఎవరనేది ఈ కింద చూడవచ్చు. (ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!) సాఫ్ట్వేర్ ఇంజనీర్: 7,18,000 డాలర్లు (రూ. 5.90 కోట్లు) ఇంజినీరింగ్ మేనేజర్: 4,00,000 డాలర్లు (రూ. 3.28 కోట్లు) ఎంటర్ప్రైజ్ డైరెక్ట్ సేల్స్: 3,77,000 డాలర్లు (రూ. 3.09 కోట్లు) లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు) సేల్స్ స్ట్రాటజీ: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు) యుఎక్స్ డిజైన్: 3,15,000 డాలర్లు (రూ. 2.58 కోట్లు) గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ: 3,12,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు) రీసర్చ్ సైంటిస్ట్: 3,09,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు) క్లౌడ్ సేల్స్: 3,02,000 డాలర్లు (రూ. 2.47 కోట్లు) ప్రోగ్రాం మేనేజర్: 3,00,000 డాలర్లు (రూ. 2.46 కోట్లు) -
అధిక జీతాలిచ్చే 'కొలువులివే'.. డిమాండ్ అధికంగా ఉన్న ఉద్యోగాలు
ఆర్థిక మాంద్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండటం.. తాజాగా చదువులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల్లో గుబులుపుట్టిస్తోంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో అంతే వేగంగా ఉపాధి అవకాశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బట్టి ఆయా సంస్థలు వేతనాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అధిక వేతనాలిచ్చే కొలువులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో.. 2023లో అధిక వేతనాలిస్తూ డిమాండ్ అధికంగా ఉన్న 10 రకాల ఉద్యోగాలను ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ సింప్లీ లెర్న్ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ పది ఉద్యోగాల్లో వార్షిక వేతనం రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కొలువు ఒకటి. ఖాతాదారులకు సంబంధించిన నగదును నిర్వహిస్తూ వారికి అధిక లాభాలను అందించడమే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ విధి. ఫైనాన్స్ సబ్జెక్ట్‌తో పాటు వివిధ ఫైనాన్షియల్ సేవలపై పట్టున్న వారికి ఇది సరైన కెరీర్. ఈ రంగంలో ప్రారంభ వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్నా, అనుభవమున్న వారికి రూ.40 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. సిటీబ్యాంక్, డచ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, గోల్డ్‌మాన్‌శాక్స్, జేపీ మోర్గాన్ ఛేజ్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. బ్లాక్‌చైన్ డెవలపర్ ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కోర్సుల్లో అత్యధికంగా వినపడేది బ్లాక్‌చైన్ టెక్నాలజీనే. దేశాల నగదు లావాదేవీలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిలో బ్లాక్‌చైన్ కీలకపాత్ర పోషిస్తుంది. కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు చేసినవారికి సగటు ప్రారం¿ý వేతనం రూ.8,01,938 లభిస్తుంటే, అనుభవం ఉన్నవారికి రూ.45 లక్షలు వరకు ఇస్తున్నాయి. ఆక్సీసెస్, సైంజీ, ప్రిమ్చైన్, సాఫ్ట్కోల్, ఓపెన్ ఎక్సల్, మైండెఫ్ట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. వైద్య వృత్తి అధిక వేతనంతో అధిక డిమాండ్ ఉన్న వాటిలో వైద్య వృత్తి కూడా ఒకటి. దేశంలో వైద్య సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో వైద్య నిపుణులకు అధిక వేతనం చెల్లించడానికి ఆస్పత్రులూ వెనుకాడటంలేదు. కేవలం డాక్టర్స్, సర్జన్సే కాకుండా ఈ రంగానికి అవసరమైన హెల్త్‌కేర్ అడ్మిన్, నర్సింగ్, ఫార్మసీ, హోమ్ హెల్త్ వంటి రంగాలకు డిమాండ్ ఉంటోంది. దేశంలో సగటు వైద్యుడి వేతనం రూ.10 లక్షలుగా ఉంది. జనరల్ ఫిజీషియన్స్కు రూ.6.99 లక్షలు, జనరల్ సర్జన్స్‌కు రూ.11.59 లక్షలు ఇస్తుంటే స్పెషలైజేషన్ చేసిన వారికి రూ.20 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, మాక్స్, కొలంబియా ఆసియా వంటి ఆస్పత్రులు అధిక వేతనాన్ని ఇస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్ వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణలో మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన వాటిలో మెషిన్ లెర్నింగ్ ఒకటి. ఎంఎల్ ప్రోగ్రాంల ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన ఆల్గోరిథమ్స్‌ను ఈ నిపుణులు అభివృద్ధి చేస్తారు. ఎంఎల్ కోర్సు పూర్తిచేసిన వారికి సగటున రూ.7.28 లక్షల వేతనం లభిస్తోంది. అదే అనుభవం ఉన్న వారికి రూ.19.48 లక్షల వరకు వేతనాన్ని ఇస్తున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్, జైకస్, క్వాంటిపి వంటి సంస్థలు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వ్యాపార రంగంలో ఒక వస్తువును డిజైన్ చేసి, అభివృద్ధి చేసి దాన్ని వేగంగా మార్కెట్లోకి తీసుకెళ్లడం అనేది అత్యంత కీలకం. ప్రోడక్ట్ మేనేజర్లు ఒక వస్తువును డిజైన్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో సగటు ప్రారంభ వేతనం రూ.14.40 లక్షలుగా ఉంది. ప్రారంభ వేతనం రూ.7లక్షలు లేదా రూ.8 లక్షల నుంచి, అనుభవమున్న వారికి రూ.17లక్షలు–రూ.26లక్షల వరకు ఇస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, సేల్స్‌ఫోర్స్, ఊబర్, ఓలా వంటి సంస్థల్లో వీరికి డిమాండ్ ఉంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఎంబీఏ చేసి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ వృత్తిని ఎంచుకున్న వారికి సగటున రూ.11.49 లక్షల వేతనం లభిస్తోంది. వీరికి ప్రారంభ వేతనం రూ.6లక్షలు–రూ.7 లక్షల నుంచి ఉంటే అనుభవం ఉన్న వారికి రూ.17లక్షలు నుంచి రూ.26 లక్షల వరకు వేతనం లభిస్తోంది. కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, మెకన్సీ, డెలాయిట్, ఎర్నెస్ట్ యంగ్, యాక్సెంచర్ వంటి సంస్థలు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి. సీఏ, మార్కెటింగ్ మేనేజర్స్, బిజినెస్ అనలిస్ట్ వంటి రంగాల్లో కూడా రూ.4 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఈ మూడు వృత్తులను ఎంచుకున్న వారికి ఈ ఏడాది దేశంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు స్టాండర్డ్ చార్టర్డ్, ఎర్నెస్ట్ ఎంగ్, డెలాయిట్, కేపీఎంజీ, బీడీఓ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు.. మార్కెటింగ్ మేనేజర్లకు ఐబీఎం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టీసీఎస్, టాటా మోటర్స్ వంటి సంస్థలు.. బిజినెస్ అనలిస్ట్‌లకు మైక్రోసాఫ్ట్, సిటీ, యాక్సెంచర్, అమెజాన్ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. డేటా సైంటిస్ట్ అంతర్జాతీయంగా ఇప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్నది డేటా సింటిస్ట్లకే. అందుబాటులో ఉన్న డేటాను సేకరించి సరైన విశ్లేషణ చేసే వారికి రూ.లక్షల్లో జీతాలను ఇవ్వడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో పట్టున్న వారికి డేటా సైంటిస్ట్ రంగం సరైన వేదిక. డేటాసైన్స్ రంగం ఎంచుకున్న వారికి దేశంలో సగటున రూ.11 లక్షల వేతనం అందుతుండగా, అనుభవం ఉన్న వారికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వేతనం ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడటంలేదు. డేటాసైన్స్ సర్టిఫికేషన్ పూర్తిచేసిన వారికి అమెజాన్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, వాల్‌మార్ట్ ల్యాబ్స్, గ్రే ఆటమ్ వంటి సంస్థలు తలుపులు తెరిచి ఉంచుతున్నాయి. -
ఈమె జీతం గంటకు రూ.54 లక్షలు
గంటకు రూ.54 లక్షలు..! రోజుకు రూ.13 కోట్లు..!! ఏడాదికి 4వేల కోట్లు!!! ఏంటి ఈ లెక్కలు? 2019–20 ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి ఏదైనా కంపెనీ ఆదాయం వివరాలు అనుకుంటున్నారా? మీరూహించిందాంట్లో సగమే నిజం.. ఇది కంపెనీ ఆదాయం కాదు డెనిస్ కొయెత్స్ అనే మహిళ వార్షిక వేతనం. ఆ.. !! అని నోరెళ్లబెడుతున్నారా? ఇంకా ఉంది ఆగండి. ఈమె పేరు చెప్పాం కదా.. ఉండేది లండన్‌లో.. వయసు 53 ఏళ్లు. ఆన్లైన్ జూదానికి కేరాఫ్ అడ్రస్ అయిన బెట్ 365 కంపెనీ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా? దాని బాస్ ఈమే. మొన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణా ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు. ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లతోపాటు, కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద మరో 48 మిలియన్ పౌండ్లు అదనం. అంటే ఈ రెండూ కలిపితే ఆరోజు నాటి పౌండుతో రూపాయి విలువ ప్రకారం దాదాపు 4742,59,83,500 కోట్లు!! అందుకే ఇది యూకే చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనంగా రికార్డు సృష్టించింది. ఇంకా చెప్పాలంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వార్షిక వేతనం కంటే సుమారు 2,360 రెట్లు డెనిస్ సొంతమైంది. అలాగే బ్రిటన్‌లోని 100 పెద్ద కంపెనీల సీవోల వార్షిక వేతనం కలిపినా అంతకంటే ఎక్కువే. కాగా, 2016తో పోలిస్తే డెనిస్ వార్షిక వేతనంలో పెరుగుదల 45శాతం అధికంగా నమోదైంది. అలాగే ఈ నాలుగేళ్లలో డెనిస్ మొత్తం ఆస్తి 1.3 బిలియన్ పౌండ్లకు చేరి, బ్రిటన్‌లోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఐదో స్థానం పొందింది. -
ఈ ఏడాది అత్యధిక వేతనం వీరికే
న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక వేతనాలను ఐటీ ఫ్రొఫెషనల్స్ అందుకుంటున్నారని, ఐటీ సీటీ బెంగళూర్ అత్యధిక వేతనాలను చెల్లించే నగరంగా ముందుందనీ రాండ్‌స్టడ్ ఇన్సైట్ సాలరీ ట్రెండ్స్ (2019) నివేదిక వెల్లడించింది. బెంగళూర్‌లో జూనియర్ లెవెల్ టెకీకే సగటు వేతనం రూ 5.27 లక్షలు కాగా, మధ్యస్ధాయి ఐటీ ఫ్రొఫెషనల్స్‌కు రూ 16.45 లక్షలు, సీనియర్ లెవల్ టెకీకి రూ 35.45 లక్షల వార్షిక వేతనం ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ సంస్థ 2017, 2018లో వెల్లడించిన సాలరీ ట్రెండ్స్ నివేదికలోనూ బెంగళూర్ అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఎంట్రీలెవల్ టెకీకి అత్యధిక వేతనాల్లో హైదరాబాద్ (రూ 5 లక్షలు) ముంబై (రూ 4.59లక్షల) లు వరుసగా టాప్ టూ, టాప్ త్రీ స్ధానాల్లో నిలిచాయి. ఇక మధ్యస్ధాయి ఐటీ సిబ్బందికి వేతనాల విషయంలో ముంబై (రూ 15.07 లక్షలు) ఢిల్లీ ఎన్సీఆర్ (రూ 14.5 లక్షలు) లు ముందుండగా, సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో ముంబై (రూ 33.95 లక్షలు), పూణే (రూ 32.68లక్షలు) లు బెంగళూర్ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని నివేదిక పేర్కొంది. అత్యధిక సగటు వార్షిక వేతనం విషయంలో కూడా ఐటీ రంగమే అగ్రభాగాన నిలిచిందని వెల్లడించింది. ఇక సీనియర్ ప్రొఫెషనల్స్‌లో రూ 35.65 లక్షల వార్షిక వేతనంతో డిజిటల్ మార్కెటర్లు అత్యధిక వేతనం అందుకుంటున్నారని తెలిపింది. క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వంటి నూతన టెక్నాలజీలతో ఈ ఏడాది ఐటీ రంగం మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. జీఎస్టీ రాకతో ఈ రంగంలో నిపుణులు, అకౌంటెంట్లు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు, న్యాయవాదులకు డిమాండ్ పెరగడంతో వృత్తి నిపుణుల సేవల రంగం రెండో అతిపెద్ద వేతన చెల్లింపు రంగంగా నిలిచింది. ఎనిమిది నగరాల్లో విస్తరించిన 15 పరిశ్రమ విభాగాల్లో లక్ష ఉద్యోగాలను రాండ్‌స్టడ్ ఇన్సైట్స్ సాలరీ ట్రెండ్స్ నివేదిక విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించింది. -
ఆమె వార్షిక వేతనం రూ.30 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆమె వార్షిక వేతనం అక్షరాలా రూ.30 కోట్లకు పైనే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగి కూడా ఆమే. హైదరాబాద్ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో ప్రముఖ హోదాలో పని చేస్తున్న ఆమె.. గతేడాది తన సంపాదన నుంచి 30 శాతాన్ని ఆదాయ పన్నుగా చెల్లించారు. వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిందీ ఆమే. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రాంతీయ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎస్పీ చౌదరి వెల్లడించారు. గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ఈనెల 24న 158వ ఆదాయ పన్ను దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వార్షిక పురోగతి వివరాలను తెలియజేశారు. రూ.60,845 కోట్ల లక్ష్యం వేతన జీవులు, నాన్ ఆడిటెడ్ ఇన్‌కం కలిగిన వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31తో గడువు ముగుస్తుందని ఎస్పీ చౌదరి తెలిపారు. గతేడాది జూలై చివరి నాటికి 7,41,450 మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారని వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి గతేడాది మొత్తంగా 36 లక్షల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని చెప్పారు. గతేడాది ఇరురాష్ట్రాల నుంచి రూ.49,775 కోట్ల ఆదాయ పన్నులు వసూలు చేశామని, 2018–19లో రూ.60,845 కోట్ల ఆదాయ పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీ చౌదరి తెలిపారు. గతేడాది 8.13 లక్షల కొత్త ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయని, ఈ ఏడాది 10.13 లక్షల కొత్త రిటర్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గతేడాది కార్పొరేట్ రంగం నుంచి రూ.24,242 కోట్ల ఆదాయ పన్ను వసూలు చేశామన్నారు. కేవలం 17 కంపెనీలు మాత్రమే రూ.100 కోట్లకు పైగా పన్నులు చెల్లించాయని అన్నారు. పన్నుల చెల్లింపుల్లో ఉత్పత్తి రంగం అగ్రస్థానంలో నిలవగా, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. డూప్లికేట్ పాన్ కార్డులకు అడ్డుకట్ట! ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కోటికి పైగా పాన్ కార్డులున్నాయని ఎస్పీ చౌదరి తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో పాన్ కార్డులను వినియోగిస్తూ ఆదాయ పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వ్యక్తులను గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకురానున్నామని వెల్లడించారు. పేర్లలోని అక్షరాలను స్వల్పంగా మార్చడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందిన వారు ఉన్నారని, సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి పేర్లను జల్లెడపట్టి పట్టుకుంటామని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద 83 ఆస్తులను సీజ్ చేశామని, నల్లధనం చట్టం కింద గత జూన్ నాటికి 108 కేసుల్లో నోటీసులు జారీ చేశామని తెలిపారు. గతేడాది 38 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.40.95 కోట్లు జప్తు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 చోట్ల తనిఖీలు జరిపి రూ.14.28 కోట్లను జప్తు చేశామన్నారు. గతేడాది నిర్వహించిన తనిఖీల సందర్భంగా రూ.1,166.97 కోట్ల అప్రకటిత ఆస్తులను కలిగి ఉన్నామని ఆదాయ పన్ను చెల్లింపుదారులు అంగీకరించారని, ఈ ఏడాది రూ.285.7 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించామని చెప్పారు. గతేడాది 415 సర్వేలు జరిపి రూ.589.41 కోట్ల లెక్కలు లేని ఆస్తులను గుర్తించామన్నారు. గతేడాది ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన మూడు కేసుల్లో నిందితులపై నేరం రుజువైందని, మరో ఏడు కేసుల్లో అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని తెలిపారు. -
జీతాల్లో బెంగళూరే ముందు!
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధాని బెంగళూరులో ప్రొఫెషనల్స్ అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్నారు. వీరి వేతనాలు సగటున వార్షికంగా రూ.10.8 లక్షల మేర ఉంటున్నాయి. రూ. 10.3 లక్షలతో పుణే, రూ. 9.9 లక్షలతో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) టాప్ 3 నగరాల్లో నిల్చాయి. కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియాలో భాగమైన రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ రూపొందించిన శాలరీ ట్రెండ్స్ 2018 నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... రూ.7.9 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ముంబై (రూ. 9.2 లక్షలు), అయిదో ర్యాంకులో చెన్నై (రూ. 8 లక్షలు) ఉన్నాయి. ఉద్యోగ విధుల రీత్యా చూస్తే కన్సల్టింగ్, అడ్వైజరీ ఉద్యోగులు అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో 6–10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి భారీ జీతభత్యాలు లభిస్తున్నాయి. 20 రంగాల్లో విభాగాలు, 15 రకాల ఉద్యోగ విధులు, 1,00,000 పైగా ఉద్యోగాల విశ్లేషణ ఆధారంగా రాండ్‌స్టాడ్ ఇండియా ఈ నివేదిక రూపొందించింది. ఫార్మా, హెల్త్‌కేర్‌లో భారీ జీతాలు.. రంగాలవారీగా చూస్తే ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలు అత్యధిక జీతభత్యాలు ఇస్తున్నాయి. ఈ రంగంలో సగటు వార్షిక సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) రూ. 9.6 లక్షలుగా ఉంది. ఇక, వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచి తత్సంబంధిత సర్వీసులు అందించే ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ గణనీయంగా పెరిగింది. రూ. 9.4 లక్షల సగటు వేతనాలతో ప్రొఫెషనల్ సర్వీసుల విభాగం రెండో స్థానంలో ఉంది. ఇక రూ. 9.2 లక్షల సగటు సీటీసీతో ఎఫ్ఎంసీజీ మూడో స్థానంలో, రూ. 9.1 లక్షలతో ఐటీ రంగం నాలుగో ర్యాంకులో, రూ. 9.0 లక్షలతో ఇన్ఫ్రా.. రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగం అయిదో స్థానంలో ఉన్నాయి. వృత్తి విద్యా నిపుణులకు సంబంధించి.. స్పెషలిస్టు డాక్టర్ల సీటీసీ అత్యధికంగా సగటున వార్షికంగా రూ. 18.4 లక్షలుగా ఉంటుండగా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌ల సీటీసీ రూ. 15.1 లక్షలు, ప్రొడక్టు ఇంజనీరింగ్ స్పెషలిస్టులు రూ. 14.8 లక్షలు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ నిపుణులు రూ. 14.6 లక్షలు అందుకుంటున్నారు. -
బెంగళూరులోనే టెకీల జీతాలు ఎక్కువ
బెంగళూరు: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్లనే టెకీలందరూ బెంగళూరు బాట పడుతున్నారని ఇంతకాలం భావించారు. కంపెనీలు ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కారణం కావచ్చుకానీ, టెకీలు మాత్రం అధిక జీతాల కారణంగానే బెంగళూరు బాట పడుతున్నారని హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ ‘ర్యాండ్స్టడ్’ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో సీనియర్ స్థాయి ఉద్యోగులకే కాకుండా జూనియర్ స్థాయి ఉద్యోగులకు కూడా జీతాలు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా 15 పరిశ్రమలు, లక్షమంది ఉద్యోగుల జీతాలను ర్యాండ్స్టడ్ విశ్లేషించగా తేలింది. బెంగళూరులో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఏడాదికి సరాసరి 28 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ముంబైలో 27 లక్షల రూపాయలను, హైదరాబాద్‌లో 26.8 లక్షల రూపాయలు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 లక్షలు, పుణెలో 25.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఆరు నుంచి 15 ఏళ్ల వరకు అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగులకు ముంబైలో 10.5 లక్షల రూపాయలు, బెంగళూరులో 10.4 లక్షలు, చెన్నైలో 10.3 లక్షలు, ఢిల్లీ–ఎన్సీఆర్లో 10.2 లక్షలు, హైదరాబాద్‌లో 9.8 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక జీరో నుంచి ఆరేళ్ల వరకు అనుభవం కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులకు బెంగళూరులో 5.5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5.3 లక్షలు, చెన్నైతో 5.2 లక్షలు, ముంబైలో 5.1 లక్షలు, హైదరాబాద్‌లో 4.9 లక్షల రూపాయలు జీతాలు వస్తాయి.