ఆమె వార్షిక వేతనం రూ.30 కోట్లు! | One IT employee receiving highest salary in Telugu states | Sakshi
Sakshi News home page

ఆమె వార్షిక వేతనం రూ.30 కోట్లు!

Published Tue, Jul 24 2018 1:58 AM | Last Updated on Tue, Jul 24 2018 10:23 AM

One IT employee receiving highest salary in Telugu states - Sakshi

సోమవారం మీడియాతో మాట్లాడుతున్న ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎస్పీ చౌదరి

సాక్షి, హైదరాబాద్‌: ఆమె వార్షిక వేతనం అక్షరాలా రూ.30 కోట్లకు పైనే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగి కూడా ఆమే. హైదరాబాద్‌ నగరంలోని ఓ ఐటీ కంపెనీలో ప్రముఖ హోదాలో పని చేస్తున్న ఆమె.. గతేడాది తన సంపాదన నుంచి 30 శాతాన్ని ఆదాయ పన్నుగా చెల్లించారు. వ్యక్తిగతంగా అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిందీ  ఆమే. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రాంతీయ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎస్పీ చౌదరి వెల్లడించారు. గోప్యత కారణాల వల్ల ఆమె వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ఈనెల 24న 158వ ఆదాయ పన్ను దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వార్షిక పురోగతి వివరాలను తెలియజేశారు.  

రూ.60,845 కోట్ల లక్ష్యం 
వేతన జీవులు, నాన్‌ ఆడిటెడ్‌ ఇన్‌కం కలిగిన వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31తో గడువు ముగుస్తుందని ఎస్పీ చౌదరి తెలిపారు. గతేడాది జూలై చివరి నాటికి 7,41,450 మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారని వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి గతేడాది మొత్తంగా 36 లక్షల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని చెప్పారు. గతేడాది ఇరురాష్ట్రాల నుంచి రూ.49,775 కోట్ల ఆదాయ పన్నులు వసూలు చేశామని, 2018–19లో రూ.60,845 కోట్ల ఆదాయ పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీ చౌదరి తెలిపారు. గతేడాది 8.13 లక్షల కొత్త ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయని, ఈ ఏడాది 10.13 లక్షల కొత్త రిటర్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గతేడాది కార్పొరేట్‌ రంగం నుంచి రూ.24,242 కోట్ల ఆదాయ పన్ను వసూలు చేశామన్నారు. కేవలం 17 కంపెనీలు మాత్రమే రూ.100 కోట్లకు పైగా పన్నులు చెల్లించాయని అన్నారు. పన్నుల చెల్లింపుల్లో ఉత్పత్తి రంగం అగ్రస్థానంలో నిలవగా, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. 

డూప్లికేట్‌ పాన్‌ కార్డులకు అడ్డుకట్ట! 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కోటికి పైగా పాన్‌ కార్డులున్నాయని ఎస్పీ చౌదరి తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో పాన్‌ కార్డులను వినియోగిస్తూ ఆదాయ పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వ్యక్తులను గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకురానున్నామని వెల్లడించారు. పేర్లలోని అక్షరాలను స్వల్పంగా మార్చడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందిన వారు ఉన్నారని, సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఇలాంటి పేర్లను జల్లెడపట్టి పట్టుకుంటామని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద 83 ఆస్తులను సీజ్‌ చేశామని, నల్లధనం చట్టం కింద గత జూన్‌ నాటికి 108 కేసుల్లో నోటీసులు జారీ చేశామని తెలిపారు. గతేడాది 38 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.40.95 కోట్లు జప్తు చేశామని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు 11 చోట్ల తనిఖీలు జరిపి రూ.14.28 కోట్లను జప్తు చేశామన్నారు. గతేడాది నిర్వహించిన తనిఖీల సందర్భంగా రూ.1,166.97 కోట్ల అప్రకటిత ఆస్తులను కలిగి ఉన్నామని ఆదాయ పన్ను చెల్లింపుదారులు అంగీకరించారని, ఈ ఏడాది రూ.285.7 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించామని చెప్పారు. గతేడాది 415 సర్వేలు జరిపి రూ.589.41 కోట్ల లెక్కలు లేని ఆస్తులను గుర్తించామన్నారు. గతేడాది ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన మూడు కేసుల్లో నిందితులపై నేరం రుజువైందని, మరో ఏడు కేసుల్లో అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement