బెంగళూరులోనే టెకీల జీతాలు ఎక్కువ
బెంగళూరు: వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్లనే టెకీలందరూ బెంగళూరు బాట పడుతున్నారని ఇంతకాలం భావించారు. కంపెనీలు ఎక్కువగా అక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కారణం కావచ్చుకానీ, టెకీలు మాత్రం అధిక జీతాల కారణంగానే బెంగళూరు బాట పడుతున్నారని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ ‘ర్యాండ్‌స్టడ్’ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో సీనియర్ స్థాయి ఉద్యోగులకే కాకుండా జూనియర్ స్థాయి ఉద్యోగులకు కూడా జీతాలు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా 15 పరిశ్రమలు, లక్షమంది ఉద్యోగుల జీతాలను ర్యాండ్‌స్టడ్ విశ్లేషించగా తేలింది. బెంగళూరులో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఏడాదికి సరాసరి 28 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ముంబైలో 27 లక్షల రూపాయలను, హైదరాబాద్‌లో 26.8 లక్షల రూపాయలు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 26 లక్షలు, పుణెలో 25.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.
ఆరు నుంచి 15 ఏళ్ల వరకు అనుభవం ఉన్న మధ్య స్థాయి ఉద్యోగులకు ముంబైలో 10.5 లక్షల రూపాయలు, బెంగళూరులో 10.4 లక్షలు, చెన్నైలో 10.3 లక్షలు, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 10.2 లక్షలు, హైదరాబాద్‌లో 9.8 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక జీరో నుంచి ఆరేళ్ల వరకు అనుభవం కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులకు బెంగళూరులో 5.5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 5.3 లక్షలు, చెన్నైతో 5.2 లక్షలు, ముంబైలో 5.1 లక్షలు, హైదరాబాద్‌లో 4.9 లక్షల రూపాయలు జీతాలు వస్తాయి.