టెకీలు మెచ్చే టాప్ 10 నగరాల్లో హైదరాబాద్!!
ప్రపంచంలోని ఏ నగరంలో ఉండాలని టెకీలు ఎక్కువగా భావిస్తారు? వాళ్లకు ఏయే నగరాలంటే ఎక్కువ మక్కువ ఉంది? సరిగ్గా ఇదే విషయమై సామాజిక నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ ఓ సర్వే చేసింది. అందులో టాప్ 10 నగరాల్లో ఐదు మన దేశానివే. అందులోనూ మూడో స్థానాన్ని మన హైదరాబాద్ దక్కించుకుంది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు మొత్తం జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాత వరుసగా పుణె, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్ పదో స్థానంలో ఉంది. బెంగళూరులో ఉండే 45 శాతం మంది ప్రజలు సాంకేతిక నిపుణులు. తర్వాత పుణె, చెన్నైలలో 43 శాతం మంది చొప్పున ఉన్నారు. వీటితో పోలిస్తే, శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఉన్నారు.
ఇంతకుముందు కంటే ఎక్కువగా పెద్ద నగరాలకు జనం బాగా వెళ్తున్నారని, భారతీయ సాంకేతిక రంగం అయితే విపరీతంగా అభివృద్ధి చెందుతోందని లింక్డ్ ఇన్లో రీసెర్చ్ కన్సల్టెంటుగా పనిచేస్తున్న సోహన్ మూర్తి తెలిపారు. భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ దాదాపు 118 బిలియన్ల డాలర్లు (7,09,700 కోట్లు) అని అంచనా. మొత్తం ప్రపంచంలోని 52 నగరాలను లింక్డ్ ఇన్ పరిశీలించింది. టాప్ టెన్ జాబితాలో ఇంకా సీటెల్, ఆస్టిన్, మెల్బోర్న్, సిడ్నీ నగరాలు నిలిచాయి.