అదృశ్యమైన టెకీ జంట మృతి, చంపేశారా? | Bodies of Kerala techie couple found in Bengaluru families to be questioned | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన టెకీ జంట మృతి, చంపేశారా?

Published Mon, Dec 2 2019 4:10 PM | Last Updated on Mon, Dec 2 2019 4:21 PM

Bodies of Kerala techie couple found in Bengaluru families to be questioned - Sakshi

బెంగళూరు: కేరళకు చెందిన ప్రేమికుల ఆత్మహత్య కలకలం రేపుతోంది.  గత 40 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రేమికుల టెకీ జంట బెంగళూరు సమీపంలో ఒకే  చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి కనిపించారు.  హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో వీరి మృతదేహాలు కుళ్లిపోయి స్థితిలో నవంబరు 29 శుక్రవారం మధ్యాహ్నం గుర్తించారు.  ప్రేమ పెళ్లికి నిరాకరించిన కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి వుంటారని పోలీసుల కథనం. మరోవైపు మృతదేహాలు పడి వున్న తీరును బట్టి, వీరిని చంపేసి, జనసంచారం లేని ప్రాంతంలో చెట్టుకు వేలాడదీసి వుంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన శ్రీలక్ష్మి (21), అభిజిత్ మోహన్ (25) బెంగళూరులోని ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ అక్టోబర్ 11నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. మూడువారాలు గడిచినా శ్రీలక్ష్మి ఆచూకి  లభించకపోవడంతో, కుటుంబ సభ్యులు కర్ణాటక హైకోర్టులో హెబియస్‌  కార్పస్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. చివరికి చింతల మాడివాలాలోని అటవీ ప్రాంతంలో అతి దారుణమైన, అనుమానాస్పద స్థితిలో శవాలై తేలారు. మృతదేహాలను గుర్తించిన గొర్రెలకాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది.  మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి,  మోహన్ తల, మొండెం వేరు పడి వుండగా, శ్రీలక్ష్మి తల చెట్టు నుండి వేలాడుతూ, మిగిలిన శరీరం కింద పడిపోయి వుంది.

అయితే నవంబరు 23న తన మేనమామ​ అభిలాష్‌కు పోన్‌ చేసిన శ్రీలక్ష్మి, పెద్దవాళ్ల వేధింపులను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పి, ఫోన్‌ విసిరేసిందని ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అయితే కనిపించకుండా పోయిన రోజే వీరు మరణించి వుంటారనీ, ఇక శ్రీలక్ష్మి ఫోన్‌ చేసే అవకాశమే లేదని మరో వాదన. అటు ఈ జంట చనిపోయి నెలరోజులు అయ్యి వుంటుందని  పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు.

మరోవైపు అక్టోబర్14న శ్రీలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌  కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య  చేసుకున్నట్టుగా భావిస్తున్నామన్నారు.  పోస్ట్‌మార్టం నివేదిక కోసం  వేచి చూస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని,  తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement