2023 Top-10 Jobs List Released By Simply Learn - Sakshi
Sakshi News home page

అధిక జీతాలిచ్చే 'కొలువులివే'.. డిమాండ్‌ అధికంగా ఉన్న ఉద్యోగాలు

Published Mon, Feb 6 2023 4:03 AM | Last Updated on Mon, Feb 6 2023 9:13 AM

2023 Top-10 Jobs List released by Simply Learn - Sakshi

ఆర్థిక మాంద్యంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండటం.. తాజాగా చదువులు పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల్లో గుబులుపుట్టిస్తోంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తుండడంతో అంతే వేగంగా ఉపాధి అవకాశాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బట్టి ఆయా సంస్థలు వేతనాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు పూర్తయిన తర్వాత అధిక వేతనాలిచ్చే కొలువులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో.. 2023లో అధిక వేతనాలిస్తూ డిమాండ్‌ అధికంగా ఉన్న 10 రకాల ఉద్యోగాలను ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ సింప్లీ లెర్న్‌ విడుదల చేసింది. ఈ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ పది ఉద్యోగాల్లో వార్షిక వేతనం రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందిస్తున్నాయి. 
 – సాక్షి, అమరావతి

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌
దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యధిక వేతనాలు అందిస్తున్న వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ కొలువు ఒకటి. ఖాతాదారులకు సంబంధించిన నగదును నిర్వహిస్తూ వారికి అధిక లాభాలను అందించడమే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ విధి. ఫైనాన్స్‌ సబ్జెక్ట్‌తో పాటు వివిధ ఫైనాన్షియల్‌ సేవలపై పట్టున్న వారికి ఇది సరైన కెరీర్‌. ఈ రంగంలో ప్రారంభ వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్నా, అనుభవమున్న వారికి రూ.40 లక్షల వరకు కూడా ఇవ్వడానికి సంస్థలు ముందుకొస్తున్నాయి. సిటీబ్యాంక్, డచ్‌ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, గోల్డ్‌మాన్‌శాక్స్, జేపీ మోర్గాన్‌ ఛేజ్‌ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి. 

బ్లాక్‌చైన్‌ డెవలపర్‌
ఈ మధ్య కాలంలో కొత్త టెక్నాలజీ కోర్సుల్లో అత్యధికంగా వినపడేది బ్లాక్‌చైన్‌ టెక్నాలజీనే. దేశాల నగదు లావాదేవీలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డేటా సెక్యూరిటీ వంటి వాటిలో బ్లాక్‌చైన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసి బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు చేసినవారికి సగటు ప్రారం¿ý  వేతనం రూ.8,01,938 లభిస్తుంటే, అనుభవం ఉన్నవారికి రూ.45 లక్షలు వరకు ఇస్తున్నాయి. ఆక్సీసెస్, సైంజీ, ప్రిమ్‌చైన్, సాఫ్ట్‌కోల్, ఓపెన్‌ ఎక్సల్, మైండెఫ్ట్‌ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. 

వైద్య వృత్తి
అధిక వేతనంతో అధిక డిమాండ్‌ ఉన్న వాటిలో వైద్య వృత్తి కూడా ఒకటి. దేశంలో వైద్య సేవలు వేగంగా విస్తరిస్తుండటంతో వైద్య నిపుణులకు అధిక వేతనం చెల్లించడానికి ఆస్పత్రులూ వెనుకాడటంలేదు. కేవలం డాక్టర్స్, సర్జన్సే కాకుండా ఈ రంగానికి అవసరమైన హెల్త్‌కేర్‌ అడ్మిన్, నర్సింగ్, ఫార్మసీ, హోమ్‌ హెల్త్‌ వంటి రంగాలకు డిమాండ్‌ ఉంటోంది. దేశంలో సగటు వైద్యుడి వేతనం రూ.10 లక్షలుగా ఉంది. జనరల్‌ ఫిజీషియన్స్‌కు రూ.6.99 లక్షలు, జనరల్‌ సర్జన్స్‌కు రూ.11.59 లక్షలు ఇస్తుంటే స్పెషలైజేషన్‌ చేసిన వారికి రూ.20 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, మాక్స్, కొలంబియా ఆసియా వంటి ఆస్పత్రులు అధిక వేతనాన్ని ఇస్తున్నాయి. 

మెషిన్‌ లెర్నింగ్‌ 
వ్యాపార సంస్థలు తమ వ్యాపార విస్తరణలో మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) కీలకపాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కు సంబంధించిన వాటిలో మెషిన్‌ లెర్నింగ్‌ ఒకటి. ఎంఎల్‌ ప్రోగ్రాంల ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన ఆల్గోరిథమ్స్‌ను ఈ నిపుణులు అభివృద్ధి చేస్తారు. ఎంఎల్‌ కోర్సు పూర్తిచేసిన వారికి సగటున రూ.7.28 లక్షల వేతనం లభిస్తోంది. అదే అనుభవం ఉన్న వారికి రూ.19.48 లక్షల వరకు వేతనాన్ని ఇస్తున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, ఐటీసీ ఇన్ఫోటెక్, జైకస్, క్వాంటిపి వంటి సంస్థలు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. 

ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 
వ్యాపార రంగంలో ఒక వస్తువును డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసి దాన్ని వేగంగా మార్కెట్లోకి తీసుకెళ్లడం అనేది అత్యంత కీలకం. ప్రోడక్ట్‌ మేనేజర్లు ఒక వస్తువును డిజైన్‌ చేసి దాన్ని మార్కెటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో సగటు ప్రారంభ వేతనం రూ.14.40 లక్షలుగా ఉంది. ప్రారంభ వేతనం రూ.7లక్షలు లేదా రూ.8 లక్షల నుంచి, అనుభవమున్న వారికి రూ.17లక్షలు–రూ.26లక్షల వరకు ఇస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, సేల్స్‌ఫోర్స్, ఊబర్, ఓలా వంటి సంస్థల్లో వీరికి డిమాండ్‌ ఉంది.

మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌
ఎంబీఏ చేసి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ వృత్తిని ఎంచుకున్న వారికి సగటున రూ.11.49 లక్షల వేతనం లభిస్తోంది. వీరికి ప్రారంభ వేతనం రూ.6లక్షలు–రూ.7 లక్షల నుంచి ఉంటే అనుభవం ఉన్న వారికి రూ.17లక్షలు నుంచి రూ.26 లక్షల వరకు వేతనం లభిస్తోంది. కేపీఎంజీ, పీడబ్ల్యూసీ, మెకన్సీ, డెలాయిట్, ఎర్నెస్ట్‌ యంగ్, యాక్సెం­చర్‌ వంటి సంస్థలు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి. సీఏ, మార్కెటింగ్‌ మేనేజర్స్, బిజినెస్‌ అనలిస్ట్‌ వంటి రంగాల్లో కూడా రూ.4 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి.

ఈ మూడు వృత్తులను ఎంచుకున్న వారికి ఈ ఏడాది దేశంలోని పలు అంతర్జాతీయ సంస్థలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌కు స్టాండర్డ్‌ చార్టర్డ్, ఎర్నెస్ట్‌ ఎంగ్, డెలాయిట్, కేపీఎంజీ, బీడీఓ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు.. మార్కెటింగ్‌ మేనేజర్లకు ఐబీఎం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టీసీఎస్, టాటా మోటర్స్‌ వంటి సంస్థలు.. బిజినెస్‌ అనలిస్ట్‌లకు మైక్రోసాఫ్ట్, సిటీ, యాక్సెంచర్, అమెజాన్‌ వంటి సంస్థలు అవకాశాలను కల్పిస్తున్నాయి.  

డేటా సైంటిస్ట్‌
అంతర్జాతీయంగా ఇప్పుడు అత్యధిక డిమాండ్‌ ఉన్నది డేటా సింటిస్ట్‌లకే. అందుబాటులో ఉన్న డేటాను సేకరించి సరైన విశ్లేషణ చేసే వారికి రూ.లక్షల్లో జీతాలను ఇవ్వడానికి సంస్థలు పోటీ పడుతున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో పట్టున్న వారికి డేటా సైంటిస్ట్‌ రంగం సరైన వేదిక.

డేటాసైన్స్‌ రంగం ఎంచుకున్న వారికి దేశంలో సగటున రూ.11 లక్షల వేతనం అందుతుండగా, అనుభవం ఉన్న వారికి రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వేతనం ఇవ్వడానికి కంపెనీలు వెనుకాడటంలేదు. డేటాసైన్స్‌ సర్టిఫికేషన్‌ పూర్తిచేసిన వారికి అమెజాన్, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, వాల్‌మార్ట్‌ ల్యాబ్స్, గ్రే ఆటమ్‌ వంటి సంస్థలు తలుపులు తెరిచి ఉంచుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement