data centre
-
డేటా సెంటర్ మార్కెట్లో బెంగళూరు కంపెనీ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో ఉన్న బెంగళూరు కంపెనీ ఆర్ఎంజడ్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. డేటా సెంటర్ ఆపరేటర్ కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్‌తో సమాన వాటాగా సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్ఎంజడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ద్వారా భారత డేటా సెంటర్ మార్కెట్లో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎంజడ్ వెల్లడించింది.ఈ నిధులతో తొలుత నవీ ముంబై, చెన్నైలోని అంబత్తూర్లో ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తారు. భవిష్యత్తులో అదనంగా మూడవ కేంద్రాన్ని జోడిస్తారు. అన్ని దశలు పూర్తి అయితే డేటా సెంటర్ల పూర్తి సామర్థ్యం 250 మెగావాట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. యూరప్, జపాన్‌తోపాటు భారత్‌లో కోల్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ 25 ఏళ్లుగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణలో నిమగ్నమై ఉంది. -
ఎయిర్టెల్ డేటా సెంటర్ అరుదైన ఘనత
ఎయిర్టెల్ డేటా సెంటర్ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది. కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.భారత్‌లో ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది. -
అంబానీ కీలక ప్రకటన.. అదానీకి టెన్షన్!
Reliance-Brookfield data centre: రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్‌కు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రానున్న వారంలో ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూఎస్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ డిజిటల్ రియాల్టీ ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న ప్రస్తుత జాయింట్ వెంచర్లోకి ప్రవేశించడానికి రిలయన్స్ గత ఏడాది జూలైలో సుమారు రూ. 378 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ వెంచర్లో మూడు సంస్థలకు ఒక్కొక్క దానికి 33 శాతం వాటా ఉంది. చెన్నైలో జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ తమ గ్రూప్ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు ఆ రాష్ట్రంలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, డిజిటల్ రియాలిటీ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక డేటా సెంటర్‌ను వచ్చే వారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ డేటా సెంటర్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంవత్సరానికి 40 శాతం చొప్పున వృద్ధితో 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సునీల్ మిట్టల్‌కు సంబంధించిన భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్‌లు ఇప్పటికే తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. వీటికి పోటీగా రిలయన్స్ ప్రవేశంతో డేటా సెంటర్ల మార్కెట్ వేడెక్కుతోంది. -
2025-26 నాటికి డేటా సెంటర్లకు రూ.45000 కోట్ల పెట్టుపడులు...
-
మెడ్‌టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్‌టెక్ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
డేటా సెంటర్ల కేంద్రంగా విశాఖపట్నం... ఇంకా ఇతర అప్డేట్స్
-
గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా.. డేటా సెంటర్ హబ్‌గా ఉమ్మడి విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో కీలక ప్రాజెక్టులకు అడుగులు పడుతున్నాయి. ఐటీ హబ్‌గా పర్యాటక డెస్టినీగా భాసిల్లుతున్న వైజాగ్.. ఇప్పుడు డేటా సెంటర్‌కు ప్రధాన కేంద్రంగానూ, గ్రీన్ ఎనర్జీకి కేరాఫ్‌గా మారనుంది. ఏకంగా 1.10 లక్షల కోట్ల పెట్టుబడితో 61 వేల మందికి ఉపా«ధి కల్పించేలా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రూ.7,210 కోట్ల పెట్టుబడితో 20 వేల పై చిలుకు ఉద్యోగాలు కల్పించేలా డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉమ్మడి విశాఖ చరిత్రలో ఒకేసారి రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులు, 80 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కీలక ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖపట్నం మారుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలో పెట్టుబడులకు, భారీ ప్రాజెక్టులకు ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ఐపీబీ) సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,44,185.07 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఇందులో సింహభాగం విశాఖకే చెందినవి కావడం గమనార్హం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకంగా రూ.1,17,210 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో సరికొత్త విభాగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గ్రీన్ ఎనర్జీ కేరాఫ్ పూడిమడక దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు అచ్యుతాపురం మండలంలోని పూడిమడక చిరునామాగా మారనుంది. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా లక్షా 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో న్యూ ఎనర్జీ పార్కు నిర్మించనుంది. ఈ పార్కులో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, హైడ్రోజన్ సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి. ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కొత్త తరహాలో ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రణాళికలు తయారు చేసింది. రెండు దశల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 61 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రానున్నాయి. ప్రాజెక్టు పేరు : ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పార్కు పెట్టుబడి : రూ.1,10,000 కోట్లు విస్తీర్ణం : సుమారు 1000 ఎకరాలు ఉపాధి అవకాశాలు : 61 వేల మందికి మొదటి దశ : రూ.55 వేల కోట్లు, 30 వేల మందికి ఉపాధి అవకాశాలు పూర్తి చేసే సమయం : 2027 రెండోదశ : రూ.55 వేల కోట్లు, 31 వేల మందికి ఉపాధి అవకాశాలు పూర్తి చేసే సమయం : 2033 కాపులుప్పాడలో డేటా సెంటర్ మధురవాడ ఐటీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం విదితమే. రూ.14,634 కోట్ల పెట్టుబడులతో 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటాపార్క్ రాబోతోంది. తాజాగా 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో డేటా సెంటర్ దాని సమీపంలోని కాపులుప్పాడ ప్రాంతంలో ఏర్పాటుకు ఎస్ఐపీబీ పచ్చజెండా ఊపింది. వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ సంస్థ ఈ డేటా సెంటర్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.7,210 కోట్ల పెట్టుబడులతో 20,450 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలని సంకల్పించారు. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయితే విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్‌కు డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. ప్రాజెక్టు పేరు : డేటా సెంటర్ ఎవరి ఆధ్వర్యంలో : వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ పెట్టుబడి : రూ.7,210 కోట్లు ఉపాధి అవకాశాలు : 20,450 మందికి ప్రత్యక్షంగా : 14,825 మందికి పరోక్షంగా ఉపాధి : 5,625 మందికి ప్రాజెక్టు పూర్తయ్యేది : 2026 మొదటి దశలో.. : 10 మెగావాట్లు రెండో దశలో : 40 మెగావాట్లు మూడో దశలో : 50 మెగావాట్లు -
రూ.6200 కోట్లతో ‘కాపిటాలాండ్’
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ఐటీపీహెచ్)లో డేటా సెంటర్ వృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాపిటాలాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ (క్లైంట్) నడుమ మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్ 36 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్లైంట్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడుతామని క్లైంట్ వెల్లడించింది. కేవలం డేటా సెంటర్ వృద్ధికే పరిమితం కాకుండా క్లైంట్ లాజిస్టిక్స్, సౌర విద్యుత్ ప్లాంట్ల వంటి మౌలిక వసతుల రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించింది. డేటా సెంటర్లలో హైదరాబాద్ వృద్ది భారత్‌లో డేటా సెంటర్ల రంగంలో హైదరాబాద్ అతివేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాపిటాలాండ్‌తో కేవలం డేటా సెంటర్ల రంగంలోనే కాకుండా ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. కాపిటాలాండ్ వచ్చే ఐదేళ్లలో ఆఫీస్ స్పేస్‌ను రెట్టింపు చేయడం హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అన్నారు. యూరోప్, ఆసియా ఖండంలో 25 డేటా సెంటర్లను కలిగిన క్లైంట్ భారత్‌లో రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో వృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లైంట్కు ఇప్పటికే స్థానికంగా ఐటీపీహెచ్, సైబర్ పెరల్, అవెన్స్ పేరిట మూడు బిజినెస్ పార్కులు ఉన్నాయని సంస్థ సీఈఓ సంజీవ్ దాస్‌గుప్తా వెల్లడించారు. 2.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బిజినెస్ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరోప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 25 డేటా సెంటర్లను క్లైంట్ అభివృద్ధి చేసిందన్నారు. -
30 లక్షల ఓట్లపై డేటా దొంగల గురి!
సాక్షి, అమరావతి: కంచే చేను మేసింది! ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన వారే సున్నితమైన డేటాను ఆగంతకులు, సంస్థలకు చేరవేశారు. 2019 ఎన్నికల సందర్భంగా 30 లక్షల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగం, అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు సమాచారాన్ని చేరవేసినట్లు నిర్ధారణ అయింది. డేటా చౌర్యంపై విచారించేందుకు శాసనసభ నియమించిన సభాసంఘం విచారణలో చంద్రబాబు సర్కారు బరితెగింపు బట్టబయలైంది. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పన్నాగంతోనే డేటా చోరీకి తెగబడినట్లు తేలింది. సభా సంఘం విచారణలో వెల్లడైన అంశాలు సంగ్రహంగా... స్టేట్ డేటా సెంటర్ కేంద్రంగా.. చంద్రబాబు సర్కారు ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల కీలక సమాచారం పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు చేరింది. ఏకంగా స్టేట్ డేటా సెంటర్ నుంచే సున్నితమైన ఈ సమాచారాన్ని అక్రమంగా చేరవేశారు. స్టేట్ డేటా సెంటర్లో 264 కంప్యూటర్లు / సర్వర్లు ఉండగా 18 సర్వర్లను ప్రజా సాధికారిక సర్వే కోసం వినియోగించారు. ఆ సర్వర్ల నుంచే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు భారీగా డేటాను చేరవేశారు. 18 సర్వర్లలో నాలుగు సర్వర్ల నుంచి ఏకంగా 24.3 టెరా బైట్ల సమాచారాన్ని చేరవేసినట్లు సభా సంఘం విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 సర్వర్ల నుంచి ఇంకెంతో సమాచారాన్ని అక్రమంగా బదలాయించారో అంతుబట్టడం లేదు. 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 మధ్య ఈ తతంగాన్ని నడిపారు. ► టీడీపీ సర్కారు స్టేట్ డేటా సెంటర్‌కే పరిమితమవ్వాల్సిన సమాచారాన్ని ఇతర శాఖల కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ శాఖలు వాటి సర్వర్లను స్టేట్ డేటా సెంటర్లో కాకుండా బయట నిర్వహించాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఉన్నతాధికారులు సభా సంఘానికి నివేదించారు. అంటే ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించి స్టేట్ డేటా సెంటర్లో ఉంచాల్సిన సమాచారాన్ని ముందస్తు వ్యూహం ప్రకారమే బయటకు కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చారన్నది స్పష్టమైంది. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు ఆ సమాచారాన్ని తరలించారు. ► సర్వర్ల నుంచి డేటాను ఎక్కడికి తరలించారన్నది కీలకంగా మారింది. అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చెందిన ఐపీ అడ్రస్‌లకు డేటాను బదిలీ చేశారని విచారణలో వెల్లడైంది. వాటి ఐపీ అడ్రస్‌లను ఎవరు నిర్వహిస్తున్నారో గూగుల్ సంస్థ కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. పక్కాగా తప్పుడు చిరునామాలు, వివరాలతో నకిలీ ఐపీ అడ్రస్‌లతో ఉన్న గూగుల్ ఖాతాల్లోకి డేటాను చేరవేశారన్నది స్పష్టమైంది. ► ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారానికి స్టేట్ డేటా సెంటర్, ఆర్టీజీఎస్ కస్టోడియన్‌గా ఉన్నాయి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. కానీ ఆ శాఖల నుంచే సమాచారం బయటకు వెళ్లిందంటే కచ్చితంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతితోనే చేసి ఉంటారని సభా సంఘం నిర్ధారించింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని బయటకు తరలించడం సాధ్యపడదని స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులు సభా సంఘానికి స్పష్టం చేయడం గమనార్హం. అంటే డేటా చోరీ పన్నాగం టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే సాగిందన్నది సుస్పష్టమైంది. క్రిమినల్ కేసులకు సిద్ధం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని శాసనసభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సర్కారు హయాంలో డేటా చోరీకి పాల్పడ్డారని శాసనసభకు మధ్యంతర నివేదిక సమర్పించిన సభా సంఘం రెండో దశ విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఫోన్ కాల్స్ ట్యాపింగ్, డేటా చోరీ కోసం నిఘా పరికరాల కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించనుంది. అప్పటి ఐటీ శాఖ బాధ్యులు, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్, స్టేట్ డేటా సెంటర్ ఉన్నతాధికారులతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలను కూడా సభా సంఘం విచారించనుందని తెలుస్తోంది. అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే డేటాను అనధికారిక వ్యక్తులు, సంస్థలకు తరలించినట్లు ఇప్పటికే సభా సంఘం విచారణలో వెల్లడైంది. దీంతో వారిని విచారణకు పిలవనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసుల నమోదుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం, ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చేరవేయడం రాజ్యాంగ విరుద్ధం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమైన అంశం. దీన్ని సభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. 30 లక్షల ఓట్ల తొలగింపు కుట్ర – టీడీపీ సేవామిత్ర యాప్ చేతికి డేటా సెంటర్ సమాచారం: భూమన – డేటా చౌర్యంపై శాసనసభకు ఉపసంఘం మధ్యంతర నివేదిక రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా బయటకు తరలించి 2016–19 మధ్య కాలంలో టీడీపీ సర్కారు డేటా చౌర్యానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని శాసనసభ ఉపసంఘం అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 30 లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు యత్నించారని నిగ్గు తేలిందన్నారు. ఉపసంఘం మధ్యంతర నివేదికను మంగళవారం శాసనసభకు సమర్పించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. వివిధ శాఖల అధిపతులు, ఇతర అధికారులతో నాలుగుసార్లు సమావేశమై ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి విచారించినట్లు తెలిపారు. స్టేట్ డేటా సెంటర్లో ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ ద్వారా దుర్వినియోగం చేసి ఇతరులను అందజేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. టీడీపీకి ఓట్లు వేయని వారి సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై మరికొంత మందిని విచారించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదికను శాసనసభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌కి వస్తోన్న వెబ్‌వెర్క్స్.. రూ.500 కోట్లతో డేటా సెంటర్
ముంబైకి చెందిన వెబ్‌వెర్క్స్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిగ్నల్ ఇచ్చింది. నగరంలో రూ. 500 కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2022 చివరి నాటికి తొలి దశ పనులు పూర్తి కానున్నాయి. ఇండియా, యూఎస్, యూరప్‌తో పాటు ఏషియా పసిఫిక్ దేశాల్లో 19 డేటా సెంటర్ల ద్వారా వెబ్‌వెర్క్స్ సేవలు అందిస్తోంది. వెబ్‌వెర్క్స్ సంస్థకి ఇండియాలో ముంబై, ఢిల్లీ, పూనేలలో ఇప్పటికే టైర్ 3 తరహా డేటా సెంటర్లు ఉన్నాయి. కొత్తగా ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అయితే వీటిలో హైదరాబాద్ డేటా సెంటర్ అన్నింటికంటే పెద్దదిగా రూపొందుతోంది. 2026 నాటికల్లా పూర్తి స్థాయిలో హైదరాబాద్ డేటా సెంటర్ రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్‌గా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో డేటా సెంటర్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. చెన్నై, ముంబై లాంటి నగరాల్లో ఇప్పటికిప్పుడు పెద్ద ఆర్డర్ వచ్చినా టేకప్ చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో అనేక కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. -
హైదరాబాద్‌కి బంపర్ ఆఫర్ ! మైక్రోసాఫ్ట్ నుంచి త్వరలో కీలక ప్రకటన?
Microsoft, Telangana seal deal: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్న హైదరాబాద్ ఫ్యూచర్ టెక్నాలజీలకు అనుగుణంగా సిద్ధమవుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజీ, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని అందరూ చెబుతున్న మాట. దీనికి తగ్గట్టే తెలంగాణ సర్కారు ఇప్పటికే డేటా సెంటర్ పాలసీనీ తీసుకువచ్చింది. దేశంలో ఈ పాలసీ తీసుకువచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ రెడీ అయినట్టు సమాచారం. త్వరలో తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, తెలంగాణ సర్కార్ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కొత్తగా నెలకొల్పబోయే డేటా సెంటర్ కోసం రూ.15 వేల కోట్ల రూపాయలను మైక్రోసాఫ్ట్ కేటాయించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రచురించింది. అయితే హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఇటు తెలంగాణ సర్కాను, మైక్రోసాఫ్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు: షియోమీ
న్యూఢిల్లీ: భారతీయ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు, సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే విధంగా వచ్చే సంవత్సరంలోగా భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షియోమీ వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించే డేటా సెంటర్ కు 'ఆపిల్ ఆఫ్ చైనా' అని పేరు పెట్టనున్నట్టు షియోమీ తెలిపింది. చైనా దేశానికి సంబంధించిన కస్టమర్ల డేటాను యూఎస్, సింగపూర్ సర్వర్లకు తరలించే కార్యక్రమాన్ని ఇప్పటికే షియోమీ కంపెనీ చేపట్టింది. షియోమీ కంపెనీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు షియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా భారతీయ కస్టమర్ల సమాచారానికి ఎలాంటి ముప్పు ఉండదు అని పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షియోమీ ఉపాధ్యక్షుడు హ్యూగో బర్రా తెలిపారు.