30 లక్షల ఓట్లపై డేటా దొంగల గురి! | TDP Main Leaders conspiracy to remove 30 lakh votes Data thieves | Sakshi
Sakshi News home page

30 లక్షల ఓట్లపై డేటా దొంగల గురి!

Published Wed, Sep 21 2022 3:39 AM | Last Updated on Wed, Sep 21 2022 8:02 AM

TDP Main Leaders conspiracy to remove 30 lakh votes Data thieves - Sakshi

సాక్షి, అమరావతి: కంచే చేను మేసింది! ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన వారే సున్నితమైన డేటాను ఆగంతకులు, సంస్థలకు చేరవేశారు. 2019 ఎన్నికల సందర్భంగా 30 లక్షల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగం, అక్రమాల వ్యవహారం బట్టబయలైంది. స్టేట్‌ డేటా సెంటర్‌ కేంద్రంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు సమాచారాన్ని చేరవేసినట్లు నిర్ధారణ అయింది.

డేటా చౌర్యంపై విచారించేందుకు శాసనసభ నియమించిన సభాసంఘం విచారణలో చంద్రబాబు సర్కారు బరితెగింపు బట్టబయలైంది. టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతల పన్నాగంతోనే డేటా చోరీకి తెగబడినట్లు తేలింది. సభా సంఘం విచారణలో వెల్లడైన అంశాలు సంగ్రహంగా...

స్టేట్‌ డేటా సెంటర్‌ కేంద్రంగా..
చంద్రబాబు సర్కారు ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల కీలక సమాచారం పెద్ద ఎత్తున ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు చేరింది. ఏకంగా స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచే  సున్నితమైన ఈ సమాచారాన్ని అక్రమంగా చేరవేశారు. స్టేట్‌ డేటా సెంటర్‌లో 264 కంప్యూటర్లు / సర్వర్లు ఉండగా 18 సర్వర్లను ప్రజా సాధికారిక సర్వే కోసం వినియోగించారు. ఆ సర్వర్ల నుంచే గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు భారీగా డేటాను చేరవేశారు.

18 సర్వర్లలో నాలుగు సర్వర్ల నుంచి ఏకంగా 24.3 టెరా బైట్ల సమాచారాన్ని చేరవేసినట్లు సభా సంఘం విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మొత్తం 18 సర్వర్ల నుంచి ఇంకెంతో సమాచారాన్ని అక్రమంగా బదలాయించారో  అంతుబట్టడం లేదు. 2018 నవంబర్‌ 30 నుంచి 2019 మార్చి 31 మధ్య ఈ తతంగాన్ని నడిపారు.
 
► టీడీపీ సర్కారు స్టేట్‌ డేటా సెంటర్‌కే పరిమితమవ్వాల్సిన సమాచారాన్ని ఇతర శాఖల కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆ శాఖలు వాటి సర్వర్లను స్టేట్‌ డేటా సెంటర్‌లో కాకుండా బయట నిర్వహించాయని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టీజీఎస్‌) ఉన్నతాధికారులు సభా సంఘానికి నివేదించారు.

అంటే ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించి స్టేట్‌ డేటా సెంటర్‌లో ఉంచాల్సిన సమాచారాన్ని ముందస్తు వ్యూహం ప్రకారమే బయటకు కార్యాలయాలకు కూడా అందుబాటులోకి తెచ్చారన్నది స్పష్టమైంది. అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు ఆ సమాచారాన్ని తరలించారు. 

► సర్వర్ల నుంచి డేటాను ఎక్కడికి తరలించారన్నది కీలకంగా మారింది. అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చెందిన ఐపీ అడ్రస్‌లకు డేటాను బదిలీ చేశారని విచారణలో వెల్లడైంది. వాటి ఐపీ అడ్రస్‌లను ఎవరు నిర్వహిస్తున్నారో గూగుల్‌ సంస్థ కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. పక్కాగా తప్పుడు చిరునామాలు, వివరాలతో నకిలీ ఐపీ అడ్రస్‌లతో ఉన్న గూగుల్‌ ఖాతాల్లోకి డేటాను చేరవేశారన్నది స్పష్టమైంది. 

► ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారానికి స్టేట్‌ డేటా సెంటర్, ఆర్‌టీజీఎస్‌ కస్టోడియన్‌గా ఉన్నాయి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. కానీ ఆ శాఖల నుంచే సమాచారం బయటకు వెళ్లిందంటే కచ్చితంగా అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతితోనే చేసి ఉంటారని సభా సంఘం నిర్ధారించింది.

అత్యున్నత స్థాయి వ్యక్తుల అనుమతి లేకుండా ఆ సమాచారాన్ని బయటకు తరలించడం సాధ్యపడదని స్టేట్‌ డేటా సెంటర్‌ ఉన్నతాధికారులు సభా సంఘానికి స్పష్టం చేయడం గమనార్హం. అంటే డేటా చోరీ పన్నాగం టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే సాగిందన్నది సుస్పష్టమైంది. 

క్రిమినల్‌ కేసులకు సిద్ధం
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని శాసనసభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సర్కారు హయాంలో డేటా చోరీకి పాల్పడ్డారని శాసనసభకు మధ్యంతర నివేదిక సమర్పించిన సభా సంఘం రెండో దశ విచారణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఫోన్‌ కాల్స్‌ ట్యాపింగ్, డేటా చోరీ కోసం నిఘా పరికరాల కొనుగోలుపై ప్రధానంగా దృష్టి సారించనుంది.

అప్పటి ఐటీ శాఖ బాధ్యులు, పోలీస్‌ ఉన్నతాధికారులు, ఆర్‌టీజీఎస్, స్టేట్‌ డేటా సెంటర్‌ ఉన్నతాధికారులతో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలను కూడా సభా సంఘం విచారించనుందని తెలుస్తోంది. అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే డేటాను అనధికారిక వ్యక్తులు, సంస్థలకు తరలించినట్లు ఇప్పటికే సభా సంఘం విచారణలో వెల్లడైంది. దీంతో వారిని విచారణకు పిలవనుంది.

మరోవైపు ఈ వ్యవహారంపై క్రిమినల్‌ కేసుల నమోదుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం, ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థలకు చేరవేయడం రాజ్యాంగ విరుద్ధం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగకరమైన అంశం. దీన్ని సభా సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. 

30 లక్షల ఓట్ల తొలగింపు కుట్ర
– టీడీపీ సేవామిత్ర యాప్‌ చేతికి డేటా సెంటర్‌ సమాచారం: భూమన 
– డేటా చౌర్యంపై శాసనసభకు ఉపసంఘం మధ్యంతర నివేదిక 
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా బయటకు తరలించి 2016–19 మధ్య కాలంలో టీడీపీ సర్కారు డేటా చౌర్యానికి పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని శాసనసభ ఉపసంఘం అధ్యక్షుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 30 లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు యత్నించారని నిగ్గు తేలిందన్నారు.

ఉపసంఘం మధ్యంతర నివేదికను మంగళవారం శాసనసభకు సమర్పించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. వివిధ శాఖల అధిపతులు, ఇతర అధికారులతో నాలుగుసార్లు సమావేశమై ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లి విచారించినట్లు తెలిపారు. స్టేట్‌ డేటా సెంటర్‌లో ఉండాల్సిన ప్రజల సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ ద్వారా దుర్వినియోగం చేసి ఇతరులను అందజేశారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.

టీడీపీకి ఓట్లు వేయని వారి సమాచారాన్ని స్టేట్‌ డేటా సెంటర్ల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై మరికొంత మందిని విచారించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదికను శాసనసభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement