Loans Granted
-
మౌలికానికి రూ.60,000 కోట్ల రుణ వితరణ
ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్‌ఫిడ్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ వెల్లడించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్‌కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్‌పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు. ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లకు నాబ్‌ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది. ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్‌ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్‌కిరణ్‌రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు. -
మోదీజీ మీ హయాంలో రుణాల సంగతేంటి..?
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం తోసిపుచ్చారు. తామిచ్చిన రుణాల్లో ఎంతమేర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారాయో వెల్లడించాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణాలను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు రీకాల్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 2014 మే తర్వాత జారీ చేసిన రుణాల్లో ఎంత మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారాయో చెప్పాలని ఎన్డీఏ సర్కార్‌ను నిలదీశారు.పార్లమెంట్లో ఎన్నిసార్లు ఈ ప్రశ్నను లేవనెత్తినా సమాధానం లేదని చిదంబరం వరుస ట్వీట్లలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఇచ్చిన రుణాలు ఎన్పీఏలుగా మారాయని శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014కు ముందు 12 మంది బడా ఎగవేతదారులకు ఇచ్చిన రూ 1.75 లక్షల కోట్ల బకాయిదారులపై తీవ్ర చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మరో 27 భారీ రుణ ఖాతాల నుంచి రూ లక్ష కోట్లు రికవరీ చేసే చర్యలు చేపట్టామని చెప్పారు. -
10 రోజుల్లోనే ఎస్బీఐ గృహరుణాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మరింత వేగవంతంగా గృహరుణాలు మంజూరు చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్ట్ తత్కాల్’ ప్రారంభించింది. దీని కింద హోమ్ లోన్ దరఖాస్తు, సంబంధిత పత్రాలు అందిన 10 రోజుల్లోగా ఎస్బీఐ రుణం మంజూరు చేస్తుంది. గృహ రుణాల వ్యాపారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్ తత్కాల్ అమలు చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. హోమ్ లోన్ దరఖాస్తులను అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఆమోదించేందుకు ఎస్బీఐ ఇటీవలే ఆన్లైన్ కస్టమర్ అక్విజిషన్ సొల్యూషన్ (ఓసీఏఎస్)ను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం ముప్పై లక్షల పైచిలుకు హోమ్ లోన్ కస్టమర్లకు దాదాపు రూ. 16,60,000 కోట్ల మేర రుణాలను బ్యాంకు ఇచ్చింది. -
రైతు రుణం.. అధోముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాకం కారణంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది పంట రుణాలు చాలినంత అందని దుస్థితి నెలకొంది. ఎక్కడైనా రైతులకు ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యం ప్రతిఏటా పెరుగుతూ రావడం పరిపాటి. రాష్ట్రంలో సైతం ఇటీవలి రెండేళ్లలో ఏటా సుమారు రూ.10 వేల కోట్ల చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. అంతేకాదు 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాలను మించి రుణాలు మంజూరయ్యాయి. 2012-13లో రుణాల లక్ష్యం రూ.35,654 కోట్లు కాగా లక్ష్యాన్ని మించి ఏకంగా రూ.50,060 కోట్ల మేరకు రుణాలు ఇచ్చారు. 2013-14 లోనూ లక్ష్యానికన్నా సుమారు రూ.3 వేల కోట్లు అధికంగానే రుణాలు మంజూరయ్యాయి. కానీ ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా బ్యాంకులు ఇచ్చే రుణాల లక్ష్యం తగ్గడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి రుణ మాఫీ పేరుతో కనీసం వడ్డీలకు సరిపడా డబ్బులు కూడా ఇవ్వకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టడం వల్ల రుణాల లక్ష్యం ఈసారి దాదాపు రూ.2 వేల కోట్లు తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీలో రైతులకు రూ.56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.53,925 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయకపోవడం, ప్రభుత్వం విధించిన రకరకాల ఆంక్షలు, రైతుల పాత రుణాలు తీరకపోవడం తదితర కారణాల వల్ల గతేడాది బ్యాంకులు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయకుండా గణనీయంగా కోత విధించాయి. ఆ ఏడాది ఖరీఫ్, రబీ రుణ లక్ష్యంలో ఏకంగా రూ.16 వేల కోట్లు తక్కువగా రైతులకు రుణాలు అందాయి. అంటే పరోక్షంగా ప్రభుత్వమే రైతులను వడ్డీ వ్యాపారస్తుల హస్తాల్లోకి నెట్టేసిందన్నమాట. గతేడాది ఖరీఫ్ రుణ లక్ష్యంలో సగం కూడా రైతులకు మంజూరు చేయలేదు. అంతకు ముందు ఏడాది కంటే గతేడాది బ్యాంకుల ద్వారా రైతులకు అందిన రుణాల్లో ఏకంగా రూ.10 వేల కోట్ల తగ్గుదల చోటుచేసుకుంది. కౌలు రైతుల పరిస్థితి దారుణం : ఇక రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దిగజారింది. గతంలో లక్షల సంఖ్యలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. గతేడాది కేవలం 36,543 మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రూ.63.36 కోట్ల రుణాలే అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ పరపతి ప్రణాళికపై గత నెలలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరగాల్సి ఉంది. అయితే సీఎం సమయం ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ విజ్ఞప్తి మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమయం కేటాయించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరపతి ప్రణాళికను సీఎం విడుదల చేయనున్నారు. 2015-16లో ఖరీఫ్, రబీ కలిపి పంట రుణాల కింద రూ.40 వేల కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.13,925 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.