రైతు రుణం.. అధోముఖం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాకం కారణంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ఏడాది పంట రుణాలు చాలినంత అందని దుస్థితి నెలకొంది. ఎక్కడైనా రైతులకు ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యం ప్రతిఏటా పెరుగుతూ రావడం పరిపాటి. రాష్ట్రంలో సైతం ఇటీవలి రెండేళ్లలో ఏటా సుమారు రూ.10 వేల కోట్ల చొప్పున పెరుగుదల చోటు చేసుకుంది. అంతేకాదు 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాలను మించి రుణాలు మంజూరయ్యాయి.
2012-13లో రుణాల లక్ష్యం రూ.35,654 కోట్లు కాగా లక్ష్యాన్ని మించి ఏకంగా రూ.50,060 కోట్ల మేరకు రుణాలు ఇచ్చారు. 2013-14 లోనూ లక్ష్యానికన్నా సుమారు రూ.3 వేల కోట్లు అధికంగానే రుణాలు మంజూరయ్యాయి. కానీ ఈ ఏడాది ఇందుకు విరుద్ధంగా బ్యాంకులు ఇచ్చే రుణాల లక్ష్యం తగ్గడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి రుణ మాఫీ పేరుతో కనీసం వడ్డీలకు సరిపడా డబ్బులు కూడా ఇవ్వకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టడం వల్ల రుణాల లక్ష్యం ఈసారి దాదాపు రూ.2 వేల కోట్లు తగ్గిపోయింది.
గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్, రబీలో రైతులకు రూ.56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.53,925 కోట్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయకపోవడం, ప్రభుత్వం విధించిన రకరకాల ఆంక్షలు, రైతుల పాత రుణాలు తీరకపోవడం తదితర కారణాల వల్ల గతేడాది బ్యాంకులు లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయకుండా గణనీయంగా కోత విధించాయి. ఆ ఏడాది ఖరీఫ్, రబీ రుణ లక్ష్యంలో ఏకంగా రూ.16 వేల కోట్లు తక్కువగా రైతులకు రుణాలు అందాయి.
అంటే పరోక్షంగా ప్రభుత్వమే రైతులను వడ్డీ వ్యాపారస్తుల హస్తాల్లోకి నెట్టేసిందన్నమాట. గతేడాది ఖరీఫ్ రుణ లక్ష్యంలో సగం కూడా రైతులకు మంజూరు చేయలేదు. అంతకు ముందు ఏడాది కంటే గతేడాది బ్యాంకుల ద్వారా రైతులకు అందిన రుణాల్లో ఏకంగా రూ.10 వేల కోట్ల తగ్గుదల చోటుచేసుకుంది. కౌలు రైతుల పరిస్థితి దారుణం : ఇక రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దిగజారింది. గతంలో లక్షల సంఖ్యలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. గతేడాది కేవలం 36,543 మంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రూ.63.36 కోట్ల రుణాలే అందాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ పరపతి ప్రణాళికపై గత నెలలోనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరగాల్సి ఉంది. అయితే సీఎం సమయం ఇవ్వలేదు. ఎస్‌ఎల్‌బీసీ విజ్ఞప్తి మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమయం కేటాయించారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ పరపతి ప్రణాళికను సీఎం విడుదల చేయనున్నారు. 2015-16లో ఖరీఫ్, రబీ కలిపి పంట రుణాల కింద రూ.40 వేల కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.13,925 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.