ఆ రుణప్రణాళిక రూ. 4542.90 కోట్లు
గతేడాది కంటే ఈ సారి 10శాతం అదనం
పదేళ్లలో పదింతలు పెరిగిన లక్ష్యం
కలెక్టర్ ముందుకు తాజా ప్రతిపాదనలు
నేడోరేపో రుణప్రణాళిక ఆవిష్కరణ
మహబూబ్‌నగర్ వ్యవసాయం: జిల్లా వ్యవసాయ వార్షిక ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది రూ.4542.90కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లీడ్ బ్యాంకు అధికారులు కసరత్తు పూర్తిచేసిన అనంతరం ప్రతిపాదనలను కలెక్టర్ ముందుంచారు. ఆమె ఆమోదం తెలపగానే వార్షిక ప్రణాళిక విడుదలయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో గతేడాది రూ.4129.91కోట్ల పంటరుణాల ఇవ్వాలని లక్ష్యం నిర్ణయించగా.. ఈ ఏడాది 10శాతం అదనంగా రూ.412.99కోట్లు కలుపుకుని మొత్తం రూ.4542.90కోట్ల పంటరుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించారు. గతేడాది ఖరీఫ్‌లో రూ.2522.40కోట్లు, రబీలో రూ.1607.51కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ధేశించుకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2774.64కోట్లు, రబీలో రూ.1768.26కోట్ల వ్యవసాయ పంట రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. కాగా, వ్యవసాయ టర్మ్, పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై ఓ స్పష్టత రాలేదు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు
రైతులు సాగుచేసిన పంటలపై ఇచ్చే వ్యవసాయ పంట రుణాల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పటికే ఖరారైంది. నీటిపారుదల కింద సాగుచేసే వరి పంటకు ఎకరాకు రూ.27వేల నుంచి. రూ.30వేల వరకు రైతులు పంటరుణం పొందవచ్చు.. పత్తి పంటకు వర్షధారం కింద రూ.24వేల నుంచి రూ.28వేలు, నీటి పారుదల కింద రూ.29,500 నుంచి రూ.32500 తీసుకోవచ్చు. అలాగే విత్తనపత్తికి రూ.85వేల నుంచి రూ.1.12లక్షల వరకు పొందే అవకాశం ఉంది. అలాగే వర్షాధారిత జొన్న పంటకు రూ.15వేల నుంచి రూ.17వేలు, కందికి రూ.16వేల నుంచి రూ.18వేలు, ఆముదం పంటకు రూ.19వేల నుంచి రూ.22వేల పంట రుణం తీసుకునే అవకాశం కల్పించారు. ఇలా పంటలపై ఇచ్చే రుణాల పరిమితిని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
పదేళ్లలో పదింతలు
2005-06వ వార్షిక ఏడాదిలో రూ.418కోట్ల పంట రుణలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్ధేశించగా రూ.355.86కోట్లు పంపిణీచేశారు. గతేడాది రూ.4129.91కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత వార్షిక ఏడాదిలో రూ.4542.99కోట్ల పంటరుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ధేశించారు.
వార్షిక ప్రణాళిక విడుదలయ్యేనా?
మరో 15రోజులు దాటితే ఖరీఫ్ సీజన్ వచ్చేస్తోంది. కాగా, ఖరీఫ్ కాలం ముంచుకొస్తున్నా ఇంకా రుణాల వార్షిక ప్రణాళిక ఖరారు కాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువుతో అలమటిస్తున్న తమకు వచ్చే ఖరీఫ్‌లో పెట్టుబుడుల పెట్టేందుకు బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే సాగుచేయడం కష్టతరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణ ప్రణాళికను ప్రకటించి రుణాలు ఇచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.
ప్రధాన పంటల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇలా...(ఎకరాకు)
క్ర.స పంట పొందేరుణం(రూ..)
1 వరి 27000- 30000
2 జొన్న 15000- 17000
3 మొక్కజొన్న 18500- 22000
4 పత్తి(వర్షాధారం) 24000- 28000
5 పత్తి(నీటి పారుదల) 29500- 32500
6 వేరుశనగ 24000- 29000
7 కంది 13000- 14500
8 ఆముదం 19000- 22000
9 పొద్దుతిరుగుడు 12000- 14000
10 పెసర 12000- 13000