రబీలోనూ ఖరీఫ్ కథే
నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడమంటే ఇదే..! వర్షాభావంతో ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతన్నకు రబీలో సాంత్వన చేకూర్చతామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో వరికి గ్రామం యూనిట్‌గానూ.. వేరుశెనగ, మిర్చి పంటలకు మండలం యూనిట్‌గానూ సవరించిన పంటల బీమా పథకం(ఎమ్‌ఎన్‌ఏఐఎస్) వర్తింపజేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బీమా ప్రీమియం డిసెంబర్ 31లోపు చెల్లించాలని పేర్కొంది. కానీ.. బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండడంతో ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
⇒ రబీలో వరికి గ్రామం యూనిట్‌గా ‘సవరించిన పంటల బీమా’ అమలు
⇒ వేరుశెనగ, మిర్చి పంటలకు మండలం యూనిట్‌గా బీమా వర్తింపునకు ఉత్తర్వులు
⇒ బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేని దుస్థితి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖరీఫ్ తరహాలోనే రబీలోనూ రైతులకు బీమా ధీమా దక్కకుండా పోతోంది. జిల్లాలో రబీలో 36,338 హెక్టార్లలో వరి, 14,092 హెక్టార్లలో వేరుశెనగ, 1,936 హెక్టార్ల లో మిర్చి పంటలను రైతులు సాగుచేస్తారని వ్యవసాయ అధికారులు అంచనావేశారు. రబీలో 1,77,386 మంది రైతులకు రూ.920.7 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నిర్ధేశించింది. కానీ.. ఇప్పటిదాకా కేవలం 14,232 మంది రైతులకు రూ.42 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేసి బ్యాంకర్లు చేతులు దులుపుకున్నారు. నీటి లభ్యతను సాకుగా చూపి తెలుగుగంగ ఆయకట్టులో ప్రభుత్వం ఇప్పటికే క్రాప్ హాలిడే ప్రకటించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులకు జలకళ కొరవడింది. బోరు బావులు ఎండి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతన్న ఆర్థిక సంక్షోభంతో రబీ పంటల సాగుకు సాహసించలేని దుస్థితి నెలకొంది.
పంట రుణాలను మాఫీచేసి, కొత్త రుణాలతో రబీ సాగుకు ఊతమివ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రుణ మాఫీపై ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. కొత్త రుణాలు ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. బ్యాంకర్ల నుంచి పంట రుణాలు ఇప్పిం చలేని ప్రభుత్వం.. రబీలో వరి పంటకు గ్రామం యూనిట్‌గా, వేరుశనగ, మిరప పంటలకు మండలం యూనిట్‌గా సవరించిన పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. పంట రుణాలు బ్యాంకర్లు ఇచ్చేటపుడే బీమా ప్రీమియం మినహాయించుకోవడం ఆనవాయితీ.
రుణాలే బ్యాంకర్లు ఇవ్వని నేపథ్యంలో.. రైతులు ప్రీమియం ఎలా చెల్లిస్తారన్నది సర్కారుకే ఎరుక. ప్రభుత్వ చిత్తశుద్ధిలోపం.. బ్యాంకర్ల సహాయ నిరాకరణ వల్ల రబీ సాగు విస్తీర్ణం ఘోరంగా పడిపోయింది. వరి పంట కేవలం 14,169 హెక్టార్లు, వేరుశనగ 3,763 హెక్టార్లు, మిరప పంట 306 హెక్టార్లకే పరిమితమైంది. 2011 వరకూ ఖరీఫ్‌లో వేరుశనగ పంటకు జిల్లాలో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలయ్యేది. దీనిని రద్దు చేసి, వాతావరణ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతోండటంతో పంటల బీమా పథకంలోనే మార్పులు చేసి సవరించిన పంటల బీమా పథకాన్ని రబీలో అమల్లోకి తెచ్చింది.
సవరించిన పంటల బీమా పథకంలో త్రెష్‌హోల్డ్ ఈల్డ్(ఐదేళ్ల సగటు దిగుబడిలో 80 శాతం కన్నా తక్కువ నష్టం వాటిల్లితే.. ఆ నష్టానికి పరిహారం చెల్లించడం) 80 శాతానికి పెంచారు. ఇది వర్షాభావ ప్రాంతంలోని రైతులకు అనుకూలమైన నిర్ణయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. రబీ తరహాలోనే ఖరీఫ్‌లో వేరుశనగ పంటకు గ్రామం యూనిట్‌గా సవరించిన పంటల బీమా పథకాన్ని అమలుచేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.