చినుకుపైనే ఆశ!
♦ రెండేళ్లుగా ఒడిదుడుకుల్లో వ్యవసాయరంగం
♦ వరుస కరువుతో భారీగా నష్టపోయిన రైతులు
♦ ఈసారి భారీ అంచనాలతో వ్యవసాయ శాఖ ప్రణాళికలు
♦ వర్షపాతంపై నిపుణుల సూచనలతో ఊరట
♦ సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణం సాగవుతుందని అంచనా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఈ సారి ఖరీఫ్‌పై జిల్లా రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. గతేడాది వరుణుడు కరుణించకపోవడంతో సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ సంకేతాలిచ్చిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలోనే సాధారణ సాగు విస్తీర్ణం 2,17,303 హెక్టార్లను అధిగమించి.. 2,29,026 హెక్టార్ల మేర పంటలను సాగు చేసేలా ప్రణాళిక రూపొందించింది.
ఎండల తీవ్రతకు తగ్గట్టుగానే వానలు పడతాయని, ఇవి కూడా సీజన్‌కు అనుగుణంగా కురుస్తాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేయడం కూడా సాగు విస్తీర్ణం అంచనాలు పెరిగేందుకు కారణమైందని చెప్పవచ్చు. గతేడాది 2,19,949 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా.. తొలకరి జల్లులు కురవకపోవడంతో 2,00,935 హెక్టార్లకు సాగు విస్తీర్ణానికి జిల్లా యంత్రాంగం కుదించింది. విస్తీర్ణం తగ్గించినప్పటికీ, సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో సాగు లక్ష్యం సగానికి పడిపోయింది.
చేతికొచ్చింది 50 శాతమే..
2015 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 2,00,935 హెక్టార్లలో పంటలు సాగవ్వగా.. ఇందులో 1,00,931.7 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించింది. మొత్తంగా 1,00,004 హెక్టార్లలో మాత్రమే పంటలు చివరిదశ వరకు గట్టెక్కి అత్తెసరు దిగుబడుల్ని అందించాయి. పంటలు ఎదిగేందుకు వీలుగా నిర్ణీత వ్యవధిలో వర్షాలు కురవకపోవడంతో... వేసిన పంటలు కూడా భూమిలోనే మగ్గిపోవడం.. కొన్ని మొలకెత్తినా వర్షాభావంతో ఎండిపోవడం జరిగింది. ఇంకొన్ని ఎదిగినా తగిన వర్షపాతం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు.
ఈ పరిణామాలన్ని జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా మార్చాయి. పంటలు, పశుగ్రాసం లేక రైతాంగం వలసలబాట పట్టేందుకు దారితీసింది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం.. ఈ సారి మాత్రం ఖరీఫ్‌పై గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ముందస్తు కార్యాచరణను తయారు చేసింది. వచ్చే నెలలో వాన చినుకులు పలకరించే అవకాశాలున్నందున సబ్సిడీ విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది.