యూరి‘యాతన’
యలమంచిలి/రాంబిల్లి : ఖరీఫ్ రైతులకు యూరియా యాతన తప్పడం లేదు. కేటాయింపులు మేరకు అసరమైన ఎరువులు రప్పించడంలో వ్యవసాయధికారులు విఫలమవుతున్నారు. దీంతో కొరత ఏర్పడుతోంది. మరికొందరు ఎడాపెడా ఎరువులు కొనుగోలు చేసి ఇళ్ల వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు. ఇది రైతులు క్యూలు, బ్లాక్‌మార్కెట్‌కు దారి తీస్తోంది. వరి పంట పొట్టదశకు చేరుకోవడంతో ఎరువుల కోసం అన్నదాతలు ఎగబడుతున్నారు.
సోమవారం యలమంచిలి మండలం లక్కవరం, రాంబిల్లి మండలం దిమిలి సొసైటీల వద్ద ఈ పరిస్థితి ప్రస్పుటంగా కనిపించింది. ఉన్న ఎరువులు తక్కువ, వచ్చిన రైతులు ఎక్కువమంది కావడంతో ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, వ్యవసాయాధికారులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. లక్కవరం సొసైటీలో 330 బస్తాలు అమ్మకానికి సిద్ధం చేశారు. దాదాపు 700 మంది వరకు రైతులు రావడంతో తోపులాటలు జరిగాయి.
చాంతాడంత క్యూలైన్లు ఉండటంతో కొందరు రైతులు అందరికీ ఎరువులు ఇవ్వాలంటూ సొసైటీ సిబ్బందిని నిలదీశారు. సొసైటీ కార్యదర్శి రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. కార్యదర్శి యలమంచిలి రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రూరల్ పోలీసులు పీఏసీఎస్ వద్దకు చేరుకుని రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు తమకు ఎరువులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఎరువుల బస్తాల విక్రయం అర్ధంతరంగా నిలిచిపోయింది.
దిమిలి సొసైటీలో...: దిమిలి సొసైటీకి 400 బస్తాలు యూరియా వచ్చిందన్న సమాచారంతో పలు గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సొసైటీ సిబ్బంది అందరికీ యూరియా సరఫరా చేయలేక చేతులెత్తేశారు. దీంతో రైతులమధ్య తోపులాటలు, అరుపులు, కేకలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం మేరకు ఏడీఏ మాలకొండయ్య, ఏవో బి. నరసింహనాయక్ సొసైటీ వద్దకు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పురుషులు, మహిళా రైతులను వేర్వేరుగా క్యూలో నిలబెట్టారు. వ్యవసాయాధికారులు దగ్గర వుండి రైతులకు యూరియా సరఫరా చేశారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన పని లేదని మరో రెండు లారీల యూరియా రెండు మూడు రోజుల్లో రప్పిస్తామని ఏడీఏ మాలకొండయ్య తెలిపారు.