ఖరీఫ్ నుంచి కొత్త బీమా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల విడుదల
సాక్షి, హైదరాబాద్: రుణ కొలబద్ద (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)కు సమానంగా రైతులకు పంటల బీమా సొమ్ము చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎం ఎఫ్‌బీవై) అమలు మార్గదర్శకాలను తాజాగా ప్రకటించింది. అలాగే ఈ కొత్త బీమా పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేయాలని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) రాష్ట్ర వ్యవసాయశాఖకు బుధవారం లేఖ రాసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ జిల్లాలో, ఏ పంటలకు రైతులు ఎంత బీమా ప్రీమియం చెల్లించాలో కూడా అందులో ప్రస్తావించింది.
నేరుగా చెల్లించే అవకాశం
వ్యవసాయంలో సుస్థిర ఉత్పత్తి సాధనే లక్ష్యం గా కొత్త బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. గుర్తించిన పంటలన్నింటికీ ఇతర రైతులతోపాటు కౌలు రైతులు కూడా ఈ బీమాకు అర్హులు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల నుంచి రక్షణ కల్పిస్తుంది. సేద్యం ఖర్చులకూ బీమా ఉంది. సాగులో ఉన్నా, పంట వేయకపోయినా, కోతకు వచ్చినా, కోత తర్వాత వచ్చే కష్టనష్టాలకు బీమా ఉంటుంది.
పీఎంఎఫ్‌బీవైను అమలుచేయడంలో నోడల్ ఏజెన్సీగా జాతీయ వ్యవసాయ బీమా పథకం(ఎన్‌ఏఐఎస్) లేదా జాతీయ పంటల బీమా కార్యక్రమం(ఎన్‌సీఐపీ) వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు 9-12 శాతం వరకున్న ప్రీమియాన్ని 1.5 శాతం, 2శాతానికి తగ్గించడంవల్ల రైతుపై ప్రీమి యం భారం తగ్గనుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రీమియం చెల్లింపును వారి ఇష్టానికే వదిలేశారు. రుణాలు తీసుకునే రైతులందరికీ ఈ బీమాను తప్పనిసరి చేశారు. రుణం తీసుకోని రైతులు బీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాంకు ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
సీజన్ మధ్యలో నష్టం జరిగితే...
సీజన్ మధ్యలో కరువు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించి 50 శాతం కంటే తక్కువ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసిన తక్షణమే రైతులకు 25 శాతం వరకు బీమా పరిహారాన్ని కంపెనీలు అందజేస్తాయి. నష్టం అంచనాను బీమా కంపెనీ సహా రాష్ట్ర ప్రభుత్వం కలసి చేస్తాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థతో సహా ప్రైవేటు బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలుచేస్తాయి.
రాష్ర్టంలో జిల్లాల వారీగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం శాతాలను ఏఐసీ వ్యవసాయ శాఖకు పంపింది. ఉదాహరణకు ఖరీఫ్‌లో వరికి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు 5 శాతం, కరీంనగర్ జిల్లాలో 2.40 శాతం, ఖమ్మం జిల్లాలో 3, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల రైతులు 2 శాతం చొప్పున సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర పంటలకు అన్ని జిల్లాల రైతులు 2.5 శాతం చొప్పున, పత్తికి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. ఇది అత్యధికం.
ఖరీఫ్‌కు జూలై 31, రబీకి డిసెంబర్ 31
బీమా ప్రీమియం చెల్లింపునకు ఖరీఫ్‌కు జూలై 31, రబీలో డిసెంబర్ 31లను గడువు తేదీలుగా ప్రకటించారు. ప్రీమియంలో ఇచ్చే సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. పంటల సీజన్ ప్రారంభమైన సమయంలోనే బీమా కంపెనీలకు ప్రభుత్వాలు 50 శాతం వరకు ముందే ప్రీమియం సొమ్ము చెల్లిస్తాయి.