scale of finance
-
చిట్టి గింజలకు పెద్ద సాయం
సాక్షి, అమరావతి : చిరు ధాన్యాలకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల సాగును పెంపొందించేలా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పారు. చిరు ధాన్యాల పంటలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని, సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలు, వర్క్‌షాపులు, నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలో చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేంద్రీయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాలని సూచించారు. విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుల నుంచి ఏపీ సీడ్స్ నేరుగా కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. దీని వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు, విత్తనాల ఉత్పత్తిలో నాణ్యతకు, స్వయం సమృద్ధికి ఊతం ఇచి్చనట్టవుతుందని చెప్పారు. రైతులకు వివిధ పంటలపై అవగాహన, సాగులో మెళకువల కోసం వైఎస్సార్ పొలం బడి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని పంటలను ఇ–క్రాప్ విధానంలో నమోదు చేయాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు లేదా సెల్ఫోన్లు ఇవ్వనున్నామని తెలిపారు. మరో 2 వేల గ్రామాల్లో వాతావరణ పరిశీలనా కేంద్రాలు, ప్రతి గ్రామంలో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ సీఎం వైఎస్ జగన్ వ్యవసాయాధికారులను జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతమే నమోదైందని అధికారులు వివరించారు. ప్రస్తుత రబీలో 25.84 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తారని, రిజర్వాయర్లు నిండినందున వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయాల పక్కనే రైతుల కోసం పెడుతున్న వర్క్‌షాపులను మరింత పటిష్టం చేయాలన్నారు. వర్క్‌షాపులో రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. విత్తనాల కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం మొదలు రైతులకు అందించే వరకూ ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, ఉత్తమ ప్రమాణాలతో జరగాలన్నారు. చంద్రబాబు లాంటి మనుషులు అదే పనిగా వేలెత్తి చూపించడానికి ప్రయతి్నస్తారని, ఏదైనా మంచి పని జరుగుతుందంటే చూసి ఓర్వలేరని అన్నారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా అంతా అవినీతి అని, అంతా అన్యాయం జరిగిపోయిందని.. ఇలా నానా రకాలుగా మాట్లాడి విష ప్రచారం చేస్తారని, అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలుగా వర్క్‌షాపులు.. పంట సమస్యలను నివేదించడానికి గ్రామ పరిధిలోనే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయంలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభించేలా ఏర్పాటు ఉండాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే వర్క్‌షాపులకు రైతు భరోసా కేంద్రాలుగా పేరు పెట్టి రైతు సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు వివరించారు. సచివాలయాల్లో బ్లాక్ బోర్డులు పెట్టి, పంటలపై సూచనలు, పరిష్కారాలు సూచిస్తామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఏమి చేసినా వ్యవసాయంలో ఉత్తమ విధానాలనే రైతులకు సూచించాలన్నారు. రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను ధరల స్థిరీకరణ నిధికి, ప్రకృతి వైపరీత్యాల నిధికి లింక్ చేయండని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అరటి చెట్లు పడిపోతే రైతులకు బీమా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలాంటి విషయాల్లో ప్రకృతి వైపరీత్యాల నిధితో అండగా నిలవాలన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు సీఎం తెలిపారు. తుపాన్లు, పెను గాలులను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల డిజైన్లు రూపొందాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందు భూసార పరీక్ష పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్, ఉద్యాన విభాగం కమిషనర్ చిరంజీవి ఛౌదురీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పెదవేగి ఆయిల్ పామ్ రైతులకే : కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకే అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ మంత్రి కన్నబాబు చెప్పారు. తెలంగాణతో సమానంగా ఏపీ ఆయిల్ పామ్ రైతులకూ న్యాయం చేస్తామని మీడియాతో అన్నారు. రాష్ట్ర పామాయిల్ రైతులకూ రూ.87 కోట్లు మంజూరు చేశామన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 2018లో 15.50 లక్షల మంది బీమా చేయించుకుంటే 2019 ఖరీఫ్‌లో ఆ సంఖ్య 21.5 లక్షల మందికి చేరిందన్నారు. పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్ సమస్యపై బ్యాంకు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సీఎం ఆదేశించారన్నారు.గోదావరిలో మునిగిన పడవను వెలికి తీయడంలో శ్రమించిన ధర్మాడి సత్యానికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. చిరు ధాన్యాలు అంటే.. చిరు ధాన్యాలను ఇటీవలి కాలం వరకు తృణ ధాన్యాలుగా పిలిచేవారు. ఎంతో పోషక విలువలున్న వీటిని ఇంగ్లిషులో మిల్లెట్స్ అని, స్మాల్ మిల్లెట్స్ అని రెండుగా విభజించారు. మనందరికీ తెలిసిన చిరు ధాన్యాలు.. సజ్జ, జొన్న, రాగి. కంకిని నూర్చితే నేరుగా విత్తనాలు వస్తాయి. పొట్టు ఉండదు కనుక వాటిని నేరుగా వండుకుని తినవచ్చు. మరీ చిన్నవిగా ఉండే ధాన్యాలు కొన్ని ఉన్నాయి. అవి.. కొర్రలు, అరికెలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, వరిగలు. వీటి కంకుల్ని నూర్చితే పొట్టున్న గింజలు వస్తాయి. వాటిని మళ్లీ మర పట్టించుకుని వండుకోవాలి. ఈ ప్రక్రియ కాస్త కష్టం కావడంతో కొంత కాలం క్రితం వరకు అవి మరుగున పడ్డాయి. వీటి విలువ తెలియడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. నాణ్యతకు ప్రభుత్వం తరఫున గ్యారెంటీ ఇస్తున్నామనే విషయాన్ని గుర్తించుకోవాలి. షాపులో పెట్టే ప్రతి ఉత్పత్తికీ శాంపిల్ కచ్చితంగా ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ -
రైతులకు పూర్తిస్థాయి రుణాలు ఇవ్వండి
ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కోసం రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశంలోనూ, అనంతరం విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మొత్తాన్ని విడుదల చేసిందని, రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందజేయాలని మంత్రి కోరారు. రుణమాఫీ నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని, ఈ విషయంలో బ్యాంకు బ్రాంచీలు చొరవ తీసుకోవాలని అన్నారు. ఏవైనా డాక్యుమెంట్లు బ్యాంకుల వద్ద ఉంటే వెంటనే ఆయా రైతులకు అందజేయాలని సూచించారు. రైతులకు పంటల బీమా అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 23.02 లక్షల మంది రైతులు పంటరుణాలు తీసుకుంటే అందులో కేవలం 6.7 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లిం చాలన్నారు. రబీలో 13.50 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 2.23 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. పంటల ప్రీమియం చెల్లింపునకు గడువు తేదీలు ముందే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందువల్ల గడువు తేదీల కంటే ముందే రైతులకు రుణాలు ఇవ్వాలని, అందుకోసం అవసరమైతే ఏఈవోలు రైతుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొని బ్యాంకులకు అందజేస్తారన్నారు. కొన్ని బ్యాంకులు ప్రీమియం సొమ్ము రైతుల నుంచి సేకరించినా బీమా కంపెనీలకు చెల్లించడంలేదని విమర్శించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సరిగా అమలు చేయడంలేదని అన్నారు. . రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 816 కోట్లు రుణాలు ఇచ్చాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి మాట్లాడుతూ 2016–17లో కేవలం 15 శాతమే బీమా ప్రీమియం చెల్లించారని, వచ్చే ఖరీఫ్ నుంచి 40 శాతం వరకు చెల్లించేలా చూడాలని కేంద్రం ఆదేశించిందని వివరించారు. రెండు, మూడు నెలల్లో మరో 500 ఏఈవో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వివిధ బ్యాంకుల ప్రతి నిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పావులా వడ్డీ, వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్) పథకాల నుంచి రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయని, కనీ సం జీవో కూడా జారీ చేయకపోతే ఎలా అని మంత్రి పోచారాన్ని నిలదీశారు. దీంతో మంత్రి స్పందిస్తూ త్వరలో అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తామని హామీయిచ్చారు. -
రూ.18,000
- వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు - మిగిలిన అన్ని రకాల పంటలు, పండ్లతోటలకు కూడా.. అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017–18) సంబంధించి జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పంటల వారీగా తయారు చేసిన బ్యాంకు రుణపరిమితి (స్కేల్‌ఆఫ్ పైనాన్స్) నివేదికను రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. పంటల వారీగా పెట్టుబడులు, దిగుబడులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకుల ద్వారా ఎంత రుణం ఇవ్వాలనే అంశంపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీకి ఇది వర్తించనుంది. వర్షాధారంగా వేరుశనగ సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.18 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకర్లు, రైతుల నమ్మకాన్ని బట్టి ఎకరాకు రూ.20 వేల వరకు ఇచ్చే వీలు కూడా ఉంటుంది. నీటి వసతి కింద సాగు చేసే వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.22 వేలుగా నిర్ణయించారు. అన్ని పంటలతో పాటు మల్బరీ, పండ్లతోటలు, కూరగాయల పంటలకు కూడా రుణపరిమితి ఖరారు చేశారు. పెరిగిన పంట పెట్టుబడులతో పోల్చితే ప్రస్తుత రుణపరిమితి తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని రైతుసంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. -
పంట రుణం... అయోమయం!
లక్ష్యానికి దూరంగా రబీ రుణాల పంపిణీ ►లక్ష్యం రూ.1444 కోట్లు.. ►ఇచ్చింది రూ.305.54 కోట్లు ►అదును దాటుతున్నా 20.94 శాతమే పంపిణీ ► రుణాలకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ సాక్షి, కరీంనగర్ : సాగునే నమ్ముకున్న రైతులకు పంటరుణాల విషయంలో ఈసారి కూడా అష్టకష్టాలు తప్పడం లేదు. రబీ సీజన్ ఆరంభం కావడంతో పెట్టుబడులకు డబ్బులు లేక రైతన్నలు సతమతం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.1448 కోట్లను 2.93 లక్షల మంది రైతులకు అందజేసినట్లు అధికారులు చెప్తున్నా రు. అరుుతే క్షేత్రస్థారుులో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నారుు. పంట రుణమాఫీ, రుణాల రీ షెడ్యూల్ పోను రైతుల చేతికి అందింది అంతంతమాత్రమే అంటున్నారు. రబీ సీజన్లో రూ.1444.20 కోట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగ్గా... కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో రబీ పంటరుణాల లక్ష్యం ఇప్పటికీ రూ.20.94 శాతం దాటలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్సకు మంగళం వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రుణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. వ్యవసాయశాఖ అంచనాల మేరకు జిల్లా అధికారులు రుణా లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల పరిధిలోని 423 బ్రాంచిలలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.2900 కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ చివరి, అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాల్సిన రుణాలను అక్టోబర్ చివరి వారంలో మొదలెట్టారు. బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.305.54 కోట్లు మాత్రమే ఇవ్వగా.. రబీ రుణలక్ష్యం 20.94 శాతంగా ఉంది. పంట ల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఎంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నారుు. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ పైనాన్స) విధానాన్ని పాటించడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో సూచించిన విధంగా మొక్కజొన్నకు ఎకరానికి రూ.20వేలు, వేరుశనగకు రూ.18వేలు, పొద్దుతిరుగుడుకు రూ.13 వేలు, వరి ఎకరానికి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పంట రుణం ఇవ్వాల్సి ఉండగా... ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నారు. రైతులకు అందని రుణమాఫీ పంటరుణాల సంగతి ఇలావుంటే.. రుణమాఫీ, రీషెడ్యూల్‌పైన స్పష్టత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు, బ్యాంకర్ల వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం, స్పష్టతపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. అధికారులు, బ్యాంకర్లు చెప్తున్న గణాంకాల ప్రకారం రుణమాఫీ కింద 3,74,632 మంది రైతులకు రూ.1662.52 కోట్ల పంటరుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఇందులో మొదటి విడతగా 2014-15లో రూ.415.632 కోట్లు, రెండో విడతగా 2015-16లో 12.5 శాతం చొప్పున రెండుమార్లు రూ.416 కోట్లు మాఫీ చేశారు. మూడో విడత మరో రూ.415 కోట్లు విడుదలైనట్లు చెప్తున్నా... చాలామంది రైతులు తమ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి రుణమాఫీ అమలు, రీ షెడ్యూల్ చేయడం, లక్ష్యాల మేరకు పంటరుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పెద్దనోట్ల రద్దు దెబ్బ పంట రుణాల విషయంలో ఐదారు రోజులుగా పెద్దనోట్ల రద్దు అంశం కూడా ప్రతిబంధకంగా మారిందని రైతులు చెప్తున్నారు. ‘మాకు ఇప్పటివరకు బ్యాంకు రు ణాలు అందలేదు. పెద్దనోట్ల రద్దుతో పంటరుణాలు ఇవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని బ్యాంకర్లు అం టున్నారు. దీనికితోడు పెద్ద నోట్లతో గందరగోళం ఏర్పడింది. మార్కెట్లో నలభై క్వింటాళ్ల వరిధాన్యాన్ని విక్రరుుంచాను. వాళ్లు డబ్బులు ఇచ్చేది ఎప్పుడో.. నేను తీసుకునేది ఎప్పుడో. మా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రా మానికి చెందిన రైతు బోగ రామస్వామి పేర్కొన్నాడు. -
బంగారంపై వ్యవసాయ రుణాలివ్వొద్దు
-
బంగారంపై వ్యవసాయ రుణాలివ్వొద్దు: సీఎం
సాక్షి, అమరావతి: బంగారాన్ని తనఖా పెట్టుకుని సాగు రుణాలిచ్చే విధానానికి ఇకపై స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. బంగారంపై వ్యవసాయ రుణాలివ్వడం వల్ల వడ్డీలో నాలుగు నుంచి ఆరు శాతం వరకూ తేడా వస్తోందని తెలిపారు. పంటను పరిగణనలోకి తీసుకుని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనల ప్రకారం రుణాలివ్వాలని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోజరిగిన 195వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రుణాలను ప్రాథమిక రుణాలుగానే ఇవ్వాలన్నారు. భూమి వివరాలకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ పోర్టల్ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. -
ప్రత్తిపాటి నోట... ఓటి మాట
రోజురోజుకో నిబంధన జిల్లాలో బంగారం తాకట్టు రుణాల రైతులు 2,60,737 మంది రుణాలు రూ. 3,276 కోట్లు కొలమానంతో కోత మచిలీపట్నం : ‘బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులెవరూ తిరిగి చెల్లించవద్దు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తరహా రుణాలన్నీ మాఫీ చేసి అక్కచెల్లెమ్మల బంగారు పుస్తెల తాళ్లను ఇంటికే తీసుకువచ్చి ఇస్తా’మంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు హామీలతో ఊదరగొట్టారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో కొర్రీలు పెట్టారు. నగల వేలానికి నోటీసులిచ్చారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బంగారు రుణాలు పొందినవారెవరికీ నోటీసులు పంపలేదంటూ చెప్పుకొచ్చారు. అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పలువురు జిల్లా రైతులు ధ్వజమెత్తారు. కానీ పంట రుణాలు పూర్తిస్థాయిలో రద్దు కాలేదు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణా లకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స (కొల మానం)ను అమలు చేశారు. రైతులు తీసుకున్న రుణానికి, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన నగదు బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న పం ట రుణాలు వడ్డీకే చాలీచాలని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్లను 2,60,737 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. అధికారం చేపట్టిన తరువాత తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయటంలో ప్రభుత్వం తన పంథాను మార్చడంతో వడ్డీ కొండలా పెరిగింది. దీంతో బ్యాంకు అధికారులు నగలను వేలం పాటలను కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతుల బంగారు నగలు వేలం వేయడం లేదని ప్రకటించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రైతు బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటే మొదటి సంవత్సరంలో పావలా వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఈ వడ్డీని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వమే చెల్లించింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో రైతులు రుణాలు చెల్లించకపోవటంతో ఏడాది దాటిన తరువాత 7 శాతం వడ్డీ అనంతరం 14 శాతం వడ్డీ పెరిగింది. 2013 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లు కావటంతో రుణమాఫీలో రూ.50వేల కన్నా పైబడి పంట రుణం తీసుకున్న వారికి 20 వేలు మాత్రమే ప్రభుత్వం జమ చేయడంతో ఈ నగదు వడ్డీకే చాలని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మూడు విడతల్లో రుణమాఫీ చేశారు. జిల్లాలో అన్ని రకాల వ్యవసాయ రుణాలకు 4,04 ,402 మంది రైతులకు రూ.1490 కోట్లు మాఫీ జరిగినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇప్పటి వరకు రూ. 573 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తాకట్టు పెట్టి రుణం తీసుకుని ఏడాది గడిస్తే గడువు మీరిందనే కారణంతో బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. రుణం అధికంగా ఉం టే అధికారులు బంగారు నగలు వేలం వేస్తున్నామని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంతో పరువు బజారున పడుతోందని రైతులు వాపోతున్నారు. ఏడాది గడవకముందే నోటీసు సంవత్సరం కిందట బ్యాంక్‌లో రూ.35 వేలు రుణం తీసుకున్నాను. ఏడాది కూడా గడవక ముందే బ్యాంక్ అధికారులు అప్పు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. -ఎన్ శివనాగేంద్రం, కొలకలూరు, గుంటూరు జిల్లా -
ఖరీఫ్ నుంచి కొత్త బీమా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల విడుదల సాక్షి, హైదరాబాద్: రుణ కొలబద్ద (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)కు సమానంగా రైతులకు పంటల బీమా సొమ్ము చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎం ఎఫ్బీవై) అమలు మార్గదర్శకాలను తాజాగా ప్రకటించింది. అలాగే ఈ కొత్త బీమా పథకాన్ని వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేయాలని వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) రాష్ట్ర వ్యవసాయశాఖకు బుధవారం లేఖ రాసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ జిల్లాలో, ఏ పంటలకు రైతులు ఎంత బీమా ప్రీమియం చెల్లించాలో కూడా అందులో ప్రస్తావించింది. నేరుగా చెల్లించే అవకాశం వ్యవసాయంలో సుస్థిర ఉత్పత్తి సాధనే లక్ష్యం గా కొత్త బీమా పథకాన్ని ఏర్పాటు చేశారు. గుర్తించిన పంటలన్నింటికీ ఇతర రైతులతోపాటు కౌలు రైతులు కూడా ఈ బీమాకు అర్హులు. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల నుంచి రక్షణ కల్పిస్తుంది. సేద్యం ఖర్చులకూ బీమా ఉంది. సాగులో ఉన్నా, పంట వేయకపోయినా, కోతకు వచ్చినా, కోత తర్వాత వచ్చే కష్టనష్టాలకు బీమా ఉంటుంది. పీఎంఎఫ్‌బీవైను అమలుచేయడంలో నోడల్ ఏజెన్సీగా జాతీయ వ్యవసాయ బీమా పథకం(ఎన్ఏఐఎస్) లేదా జాతీయ పంటల బీమా కార్యక్రమం(ఎన్సీఐపీ) వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు 9-12 శాతం వరకున్న ప్రీమియాన్ని 1.5 శాతం, 2శాతానికి తగ్గించడంవల్ల రైతుపై ప్రీమి యం భారం తగ్గనుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రీమియం చెల్లింపును వారి ఇష్టానికే వదిలేశారు. రుణాలు తీసుకునే రైతులందరికీ ఈ బీమాను తప్పనిసరి చేశారు. రుణం తీసుకోని రైతులు బీమా కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాంకు ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. సీజన్ మధ్యలో నష్టం జరిగితే... సీజన్ మధ్యలో కరువు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాలు సంభవించి 50 శాతం కంటే తక్కువ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేసిన తక్షణమే రైతులకు 25 శాతం వరకు బీమా పరిహారాన్ని కంపెనీలు అందజేస్తాయి. నష్టం అంచనాను బీమా కంపెనీ సహా రాష్ట్ర ప్రభుత్వం కలసి చేస్తాయి. ప్రభుత్వరంగ బీమా సంస్థతో సహా ప్రైవేటు బీమా కంపెనీలూ ఈ పథకాన్ని అమలుచేస్తాయి. రాష్ర్టంలో జిల్లాల వారీగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియం శాతాలను ఏఐసీ వ్యవసాయ శాఖకు పంపింది. ఉదాహరణకు ఖరీఫ్‌లో వరికి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు 5 శాతం, కరీంనగర్ జిల్లాలో 2.40 శాతం, ఖమ్మం జిల్లాలో 3, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల రైతులు 2 శాతం చొప్పున సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద చెల్లించాల్సి ఉంటుంది. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర పంటలకు అన్ని జిల్లాల రైతులు 2.5 శాతం చొప్పున, పత్తికి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 13 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించాలి. ఇది అత్యధికం. ఖరీఫ్‌కు జూలై 31, రబీకి డిసెంబర్ 31 బీమా ప్రీమియం చెల్లింపునకు ఖరీఫ్‌కు జూలై 31, రబీలో డిసెంబర్ 31లను గడువు తేదీలుగా ప్రకటించారు. ప్రీమియంలో ఇచ్చే సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. పంటల సీజన్ ప్రారంభమైన సమయంలోనే బీమా కంపెనీలకు ప్రభుత్వాలు 50 శాతం వరకు ముందే ప్రీమియం సొమ్ము చెల్లిస్తాయి. -
అంకెల్లో ఘనం...అందని రుణం
♦ బ్యాంకర్ల శల్యసారథ్యం ♦ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్‌కు నోచుకోని రైతులు ♦ అప్పుల కోసం తిప్పలు అంతా అంకెల గారడి..కాగితాల మీద అట్టహాసంగా రుణ ప్రణాళిక. రూ. వందలకోట్లు ఇచ్చినట్టు వివరాలు. బ్యాంకర్ల శల్యసారథ్యంతో అరక పట్టిన రైతుకు మాత్రం మిగులుతున్నది అప్పుల తిప్పలు. ప్రైవేటు వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు. ఇది జిల్లాలో అన్నదాతల దుస్థితి. ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో ఈ ఏడాది 2.65లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. జూన్‌లోనే తొలకరి పలుకరించడంతో కాడెపట్టిన రైతన్నపై కొంతకాలం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కమ్ముకొచ్చిన కరవును చూసి కలతచెందాడు. పదిరోజులుగా అడపాదడపా వర్షాలతో వ్యవసాయపనులు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు 75శాతం విస్తీర్ణంలో నాట్లుపడ్డాయి. వచ్చేనెల మొదటివారానికల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు ఒక్కో రైతు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పంటచేతికొచ్చే సమయానికి మరో రూ. పదివేలవరకు అవసరమవుతుంది. తొలకరి జల్లుపడిన మొదలు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలుచేస్తూనే ఉన్నారు అన్నదాతలు. ఖరీఫ్‌లో రూ.840కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.605 కోట్లరుణాలిచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో రెండున్నర లక్షలమంది రైతులుండగా ఇప్పటి వరకు లక్ష మందికి ఈ రుణాలందినట్టు తెలుస్తోంది.పైగా ఇటీవల స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ రూ.24వేలకు పెంచినందున ఆ మేరకు గతంతో ఖరీఫ్‌తో పోలిస్తే ప్రతీరైతుకు రూ.ఐదు వేలకు పైగా అదనంగా రుణం అందిందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. గణాంకాలు ఇలా ఉంటే వాస్తవపరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ వర్తించిన రైతుల్లో 70 శాతం మందికి తొలి విడత జమైన 20శాతం మాఫీ సొమ్ము పోను మిగిలిన అప్పు వడ్డీతో కలిసి తడిసి మోపడైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల్లో 85శాతం రుణమాఫీ వర్తించిన రైతులకు మిగిలిన బకాయిల రెన్యువల్‌కే సరిపోయాయి. పూర్తిగా రుణమాఫీ అయిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు చేతికందాయి. కేవలం 15శాతం మాత్రమే కొత్త రైతులకు రుణాలందాయి. అంటే రుణాలు పొందిన లక్షమంది రైతుల్లో కేవలం 15వేల మందికి మాత్రమే ఫలితం దక్కింది. మిగిలిన వారిలో ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చేతికంద లేదు. కాగితాల మీద మాత్రం వారికి రుణమిచ్చినట్టుగా చూపిస్తున్నప్పటికీ చేతికి చిల్లిగవ్వ అందని పరిస్థితి.. దీంతో వీరంతా అప్పుల కోసం వడ్డీవ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలుచేయాల్సిన దుస్థితి.ఎటువంటి అడంగల్ పత్రాలు లేకుండానే లక్ష వరకు పంట రుణం ఇవ్వాలని సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రుణాల మంజూరులో బ్యాంకర్లు మోకాలొడ్డు తున్నాయి. పైగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ తనఖా పెట్టుకునే కేవలం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.24వేలకు మించి రుణం ఇవ్వడం లేదు. బంగారు ఆభరణాలు కుదవపెట్టుకున్నా సరే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు మించి ఇవ్వడం లేదు. దీంతో ఇతర ఖర్చుల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఉదాహరణకు..తనకు మాఫీ కాగా రూ.55వేల వరకు అప్పు ఉందని..ప్రస్తుతం తనకున్న రెండెకరాలకు కొత్త రుణం కోసం దరఖాస్తు చేస్తే రూ.48వేలుమంజూరు చేశారని..ఆ మొత్తం రెన్యువల్‌కే సరిపోయిందని. చేతికి రూపాయి రాలేదని చీడికాడకు చెందిన కొండబాబు అనే రైతు వాపోయాడు. తాను రూ.5ల వడ్డీకి 50వేలు అప్పు చేసి సాగు చేయాల్సి వస్తుందని వాపోయాడు. -
పునరుద్ధరణతోనే సరి..!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణం పుట్టడం లేదు. రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులన్నీ వారి నుంచి వడ్డీ కట్టించుకుని రుణాలను పునరుద్ధరిస్తున్నాయి తప్ప కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రుణ పరిమితి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెంచకపోవడమే. ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు. ఈ పంటకు ఎకరాకు గతేడాది రూ.20 వేలు రుణ పరిమితి ఉండగా ఈ ఏడాది అంతే కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకులు ఒక్క పైసా అదనంగా రుణం మంజూరు చేయడం లేదు. తొలి విడత మాఫీ వడ్డీలకే సరిపోలేదు.. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో తొలి విడత ఇచ్చిన 20 శాతం నిధులు రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకే సరిపోలేదు. దీంతో రైతులు మిగతా బకాయిలపై వడ్డీ చెల్లిస్తే గానీ వారి రుణాలు పునరుద్ధరించే పరిస్థితి లేదు. దీంతో బ్యాంకులే రంగంలోకి దిగి వడ్డీ చెల్లించి రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే వడ్డీ భారం పెరిగిపోతుందంటూ రైతులకు నచ్చచెబుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటి వరకు రూ.15 వేల కోట్ల రుణాలను వడ్డీ కట్టించుకుని రెన్యువల్స్ చేశాయి. దీనికోసం వారు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీ చెల్లిస్తున్న రైతులకు రుణం రెన్యువల్ అవుతోంది తప్ప కొత్తగా పైసా అందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటల వారీగా రుణ పరిమితిని పెంచకపోవడమేనని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రుణ పరిమితి పెంచి ఉంటే కొంత ఇచ్చేందుకు వీలుండేదటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 20 శాతం నిధులతో మాఫీ చేయగా మిగిలిన 80 శాతం రుణంపై వడ్డీ ఎవరు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ప్రతినిధులు కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పెదవి విప్పలేదు. దీంతో బ్యాంకులు అన్నదాతల నుంచే వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించాయి. రైతులకు నచ్చచెప్పి వడ్డీని కట్టించుకుని రుణాలను తిరిగి రెన్యువల్ చేస్తున్నాయి. -
దారుణం
లక్ష్యం మేరకు అప్పులు అనుమానమే పాస్‌బుక్‌పై అన్నదాతకు ఒకే పంటరుణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే వర్తింపు వరికి ఎకరాకు రూ.24 వేలు చెరకుకు రూ.35వేలలోపే.. రుణమాఫీ పరోక్షంగా రైతులకు శాపమవుతోంది. ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాతలకు బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక పాస్‌బుక్‌పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆపై కావాలంటే ఇప్పుడున్న ఏడు శాతానికి బదులు 12 శాతం వడ్డీ భరించాల్సిందే. విశాఖపట్నం : జిల్లాలో ఖరీఫీలో 2,08,988 హెక్టార్లలో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఈ మేరకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,93,447 మంది రైతులకు షార్ట్‌టర్మ్(పంట) రుణాలుగా రూ.1200 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది కేవలం 60 శాతమే రుణాలిచ్చారు. ఈఏడాది ఏదిఏమైనా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా యంత్రాంగం పట్టుదలతో ఉంది. గతేడాది 32 మంది కౌలురైతులకు రూ.8లక్షలు మాత్రమే రుణంగా ఇచ్చారు. ఈ ఏడాది 40వేల మందికి కౌలుఅర్హత కార్డుల జారీకి ఏర్పాట్లుతో ఆ మేరకు కార్డులు జారీ అయిన ప్రతీఒక్కరికి రుణాలివ్వాలని యోచిస్తున్నారు. కానీ వీరి ప్రయత్నాలకు ఆర్బీఐ నిబంధనలు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. విరివిగా రుణాలిచ్చేవారు... : గతంలో భూమి దస్తావేజులు, పాస్‌బుక్, టైటిల్ డీడ్లను తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు..ఈ పాస్‌పుస్తకం జెరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధరంగాలకు అవసరాలకు తగ్గట్టుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలిలక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద... ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునే వారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడు శాతం వడ్డీతోనే రైతు చెల్లించే వాడు. ఇప్పుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టీ ఆ భూమిపై వేసే పంటకు సంబంధించి స్కేల్ఫైనాన్స్కు తగ్గట్టుగా రుణమివ్వాలని ఆర్బీఐ స్పష్టంగా ఆదేశించింది. ఇలా అయితే లక్ష్యం కష్టమే.. వరికైతే ఎకరాకు రూ.24వేలు, చెరకుకు రూ.35వేల వరకు మాత్రమే రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదార్ పాస్పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు కుదువపెట్టి భూమి డాక్యు మెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు..కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డింపు భరించాల్సిందే. దీంతో గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అధికారం బ్యాంకర్లకు లేదు. అధికారులు సిఫారసు చేసినంత మాత్రాన కౌలురైతులకు రుణాలిచ్చే అవకాశం లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి. దీంతో రుణ అర్హత కార్డులు అలంకారప్రాయం కానున్నాయి. -
నిండా మోసపోయాం
♦ రుణమాఫీ వర్తించక రైతుల గగ్గోలు ♦ రెండో జాబితాలోనూ వేలాది మందికి మొండిచేయి ఈయన పేరు పీలా జగ్గారావు..అనకాపల్లిమండలం తుమ్మపాలలో ఇతనికి ఎకరా 50 సెంట్ల భూమి ఉంది. భూమి డాక్యుమెంట్లతో పాటు ఇంటిలోని బంగారమంతా కుదువపెట్టి 2013లో రూ.93వేల రుణం బ్యాంకులో తీసుకున్నాడు. ఇప్పుడు వడ్డీతో లక్షా 20వేలకుపైగా అయింది. గతేడాది డిసెంబర్లో విడుదల చేసిన రుణమాఫీ తొలి జాబితాలో ఇతని పేరు లేదు. ఇదేమిటని అడిగితే నీ వివరాలు సరిగ్గా నమోదు కాలేదు..మీసేవ కేంద్రానికి వెళ్లి పట్టాదారుపాసుపుస్తకం, టైటిల్ డీడ్, ఆధార్, రేషన్‌కార్డులన్నీ అప్లోడ్ చేసుకుంటే రెండో జాబితాలో రుణమాఫీ వర్తింస్తుందని అధికారులు చెప్పారు. చెప్పులరిగేలా తిరిగి చివరకు అన్నీ అప్లోడ్ చేయించుకున్నాడు. రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. సాక్షి, విశాఖపట్నం : ఇది ఒక్క జగ్గారావు ఆవేదనే కాదు..జిల్లా లో రుణమాఫీ జాబితాల్లో చో టు దక్కని అక్షరాలా లక్షా 54 వేల మంది రైతుల ఆర్తదానం. జిల్లాలో మూడు లక్షల 87వేల మంది రైతులకు రూ.1250 కోట్ల వరకు రుణాలున్నాయి. సకాలంలో వీటిని చెల్లించకపోవడంతో పావలా, జీరో పర్సంట్ వడ్డీ రాయితీలను రైతులు కోల్పోయారు. జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే 3.45 ఖాతాల వివరాలను మాత్రమే అప్లోడ్ చేయగలిగారు. అయినప్పటికీ లక్షా 54వేల ఖాతాదారులు రుణమాఫీకి అర్హత కోల్పోయారు. ఇక జాబితాలో చోటు దక్కిన వారి పరిస్థితి కూడా ఏమాత్రం గొప్పగా లేదు. ఉన్న అప్పు రూ.లక్షన్నర అయితే పడింది ఐదువేలు..పదివేలు. అడిగితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నీకున్న పొలం విస్తీర్ణాన్ని బట్టి రూ.24వేలే మాఫీ వర్తిస్తుంది. తొలి ఏడాది రూ.6వేలు పడింది. వచ్చే నాలుగేళ్లు ఇదే రీతిలో ఆరేసి వేలు చొప్పున జమవుతుంది. మిగిలిన మొత్తం వడ్డీతో సహా చెల్లించుకుంటే మేలు లేకపోతే వడ్డీతో తడిసిమోపెడవుతుంది అంటూ బ్యాంకర్ల బెదిరింపులు రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 600కు పైగా బ్యాంకులశాఖల్లో కుదువపెట్టిన కిలోల కొద్దీ బంగారాన్ని సకాలంలో విడిపించుకోలేదనే సాకుతో వేలంవేస్తున్నారు. ఇలా రుణమాఫీ పేరుతో దగాపడ్డ రైతన్నల పరిస్థితి దయనీయంగా తయారైంది.. చంద్రన్న రుణమాఫీహామీతో నిండామోసపోయాం. అప్పులఊబిలో కూరుకుపోయాం. మేమేం పాపం చేసుకున్నామో తెలియడం లేదు. మా పేర్లు ఎందుకు జాబితాలో లేవో అర్థం కావడం లేదంటూ వేలాదిమంది రైతులు జిల్లా వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. దీంతో బంగారం విడిపించుకోలేక బ్యాంకుల్లోనే వదిలేస్తున్న రైతులు కొందరైతే..ఉన్న ఇల్లు వాకిలి అమ్ముకుని అప్పులు తీర్చేందుకు మరికొందరు సిద్ధపడుతుంటే..ఇక వ్యవసాయం మా వల్ల కాదంటూ ఇంకొందరు కూలీలుగా అవతారమెత్తే దుస్థితి నెలకొంది. రెండో జాబితాలోనూ నా పేరు లేదు నేను కొండలఅగ్రహారంలోని గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.38వేలు రుణం తీసుకున్నాను. మొదటి రుణమాఫీ జాబితాలో కౌలు రైతుగా పేరు నమోదై వచ్చింది. దీని వల్ల నాకు మాఫీ వర్తించలేదు. దీనిపై కౌలురైతును కానంటూ దరఖాస్తు చేశాను. మళ్లీ రెండో జాబితాలో కూడా కౌలు రైతుగానే పేరు రావడంతో ఈ సారి కూడా మాఫీ కాలేదు. నా సమస్యను ఎవరూ పట్టాంచుకోలేదు. - అడిగర్ల లక్ష్మణమూర్తి, రైతు , కొండలఅగ్రహారం, మాకవరపాలెం మండలం -
మనసు కరగదు..ఆశ చావదు
కర్నూలు(అగ్రికల్చర్): ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. ప్రజాదర్బార్‌కు వివిధ సమస్యలతో ప్రజలు బారులు తీరుతున్నా.. అధిక శాతం నిరాశే ఎదురవుతోంది. జిల్లా కేంద్రానికి వస్తే ఊరట కలుగుతుందనే భావన కాస్తా నీరుగారుతోంది. అధికారుల మనసు కరగదని తెలిసీ.. ఆశ చంపుకోలేక అదే వినతులతో పదేపదే ప్రదక్షిణ చేస్తున్నారు. ఎప్పటిలానే భారీగా తరలివచ్చిన బాధితులతో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ పోటెత్తింది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జేసీ కన్నబాబు, అదనపు జేసీ రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్‌లు వినతులు స్వీకరించారు. కలెక్టర్ చిత్తశుద్ధి చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కారణంగా ప్రజాదర్బార్ రోజురోజుకు ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. వచ్చిన వనతులపై జిల్లా అధికారులు కిందిస్థాయి సిబ్బందిపైకి తోసేయడం.. అక్కడేమో వినతులకు బూజుపట్టడం పరిపాటిగా మారింది. సార్.. పింఛన్ ఇవ్వండి అనారోగ్యంతో కాలు సగం తొలగించారు. నిరుపేద కుటుంబం కావడంతో జీవనం భారంగా మారింది. పింఛను మంజూరు చేయాలని కోరుతున్నా మండల స్థాయిలో అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరైనా న్యాయం చేయండి. - అన్సర్, ఆదోని పింఛన్ తొలగించారయ్యా రెండు కళ్లు పూర్తిగా కనిపించవు. 100 శాతం వికలత్వం ఉంది. సర్వే పేరిట నా పింఛను తొలగించారు. ఎలాంటి ఆధారం లేని నాకు.. ఉన్న ఒక్క ఆసరానూ తొలగించారు. దయతలిచి పింఛను పునరుద్ధరించండి. - మాలిక్, నాగులదిన్నె స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో అన్యాయం సార్. నాకు 5.30 ఎకరాల భూమి ఉంది. మిరప సాగుకు బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.30 వేలు ఉండగా, రూ.12 వేలు మాత్రమే చూపారు. ఈ కారణంగా పూర్తి రుణమాఫీకి నోచుకోలేదు. ఓర్వకల్లు మండలంతో పాటు పలు గ్రామాల్లో మిరపకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.30 వేలుగా తీసుకున్నా.. ఉయ్యాలవాడలో మాత్రమే తగ్గించడం సరికాదు. పూర్తి రుణమాఫీకి ఆదేశించండి. - నారాయణ, రైతు, ఉయ్యాలవాడ గ్రామం -
'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొత్త విషయం కాదు'
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెటింగ్ విధానం తీసుకొస్తామన్నారు. మార్కెటింగ్ కోసం నిపుణులతో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల కేలండర్ ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నట్టు చెప్పారు. రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది కొత్త విషయం కాదని, 1973 నుంచి ఆర్ బీఐ అమలు చేస్తోందన్నారు. -
పాపం.. మట్టిజన్మ
అన్నదాతలంటే అందరికీ లోకువే.. డేటా తీసుకునేందుకు నిరాకరిస్తున్న బ్యాంకర్లు ముఖం చాటేస్తున్న తహశీల్దార్లు మొరాయిస్తున్న టోల్‌ఫ్రీ నంబర్లు రుణమాఫీ సందేహాలు నివృత్తి చేసేదెవరు? మసిపూసి మారేడు కాయ చేస్తూ రుణమాఫీ అయిందనిపించేందుకు సర్కార్ ఎత్తుగడలు రైతుల పాలిటశాపంగా పరిణమిస్తున్నాయి. బేషరతుగా రుణమాఫీ చేస్తానని నమ్మబలికి అన్నదాతలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ముప్పుతిప్పలు పెడుతూ మూడుచెరువుల నీళ్లు తాగిస్తున్నారు. 50వేల లోపు రుణాలున్న వారితో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలోకి వచ్చే రైతుల పేర్లతో రెండు జాబితాలను విడుదల చేసిన సర్కార్ పలు కొర్రీలతో జాబితాను కుదించేందుకు కుట్రలు పన్నుతోంది. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. విశాఖఫట్నం: జిల్లాలో 3.87 లక్షల ఖాతాల్లో లక్షా 30వేల 979 ఖాతాలతో రుణమాఫీతొలి అర్హత జాబితాను ఈ నెల 6వతేదీన ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 349.34 కోట్ల మాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించిన సర్కార్ తొలివిడతలో రూ.157.17కోట్లు సర్దుబాటవు తుందని చెప్పినప్పిటకీ చివరికి కేవలం రూ.20.43కోట్లు మాత్రమే అయింది. తొలి జాబితాలో చోటుదక్కని అర్హులైన 2.57లక్షల మంది రైతులు రెండో జాబితాలో ఉంటారని కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రకటించారు. కానీ ఎంతమందికి చోటు దక్కతుందనేదానిపై నేటికి స్పష్టత లేదు. మూడోవంతు మంది పేర్లు లేవని చెబుతున్నారు. రికార్డులన్ని సక్రమంగా ఉన్న వారికే తొలి జాబితాలో చోటుదక్కగా, రెండో జాబితాలో చోటు దక్కిన వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్, బ్యాంకుమేనేజర్లతో పాటు మీసేవా కేంద్రాల్లో సమర్పించుకునే వీలు కల్పించింది. ఏ బ్యాంకులో ఎంత రుణం ఏ అవసరం కోసం తీసుకున్నదో తెలియడంతో పాటు ఆధార్,రేషన్, ఓటరు ఐడీ కార్డులతో పాటు పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు అకౌంట్ జెరాక్స్ కాఫీలను సమర్పించాల్సి ఉంది. ఇలా జిల్లాలో ఏఒక్క బ్యాంకు మేనేజర్ వీరి గోడు వినేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. సందేహాల నివృత్తి కోసం వచ్చే రైతులను ఈసడించుకుంటున్నారు. మాకు సమయం లేదు..మీ తహశీల్దార్‌ను అడిగి తెలుసుకోండి..మీ పత్రాలు అక్కడే ఇవ్వండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. తహశీల్దార్ వద్దకు వెళ్తే ఆయన నుంచి కూడా ఇదేరీతిలో సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. వీఆర్వోల వద్దకు వెళ్లండి వాళ్లు చెబుతారు..మీ రికార్డులన్నీ ఆయనకు సమర్పించండి అని తప్పించుకుంటున్నారు. కనీసం మీ- సేవా కేంద్రానికి వెళ్లి అప్లోడ్ చేసుకుందామంటే మీ డేటా లేదు..ప్రొసెస్‌లో ఉందంటూ సమాధానం వస్తోంది. రెండో జాబితా పరిధిలోకి వచ్చే 2.57లక్షల మందిలో కనీసం పది శాతం మంది రైతులు తమ వివరాలను అప్లోడ్ చేసుకోలేకపోయారు. దీంతో మిగిలిన వారిలో గుబులు మొదలైంది. పేర్లున్న వార్ని పరిస్థితి ఇలా ఉంటే ఇక పేర్లు లేని వారి పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. మరొక పక్క జాబితాలో చోటు దక్కి చనిపోయిన వారికి చెందిన రుణమాఫీ వారి వారసులకు వర్తించాల్సి ఉంది. మాఫీకి విధిగా ఆధార్ అనే నిబంధన పెట్టడం..ఆ చనిపోయిన వ్యక్తికి ఆధార్ లేక పోవడంతో మాఫీ ఆ కుటుంబానికి వర్తించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివారు జిల్లాలో కనీసం రెండువేల మందికిపైగా ఉంటారని అంచనా. రూపాయి మాఫీ కాలేదు.. నాది నక్కపల్లి మండలం కాగిత. నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. మదుపుల కోసం వేంపాడు సొసైటీలో రూ.20వేలు, నక్కపల్లి ఐవోబీలో బంగారం కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. రుణమాఫీ వర్తిస్తుందని ఆశతో ఎదురు చూశాను. అన్ని సక్రమంగా ఉన్నా రూపాయి కూడా మాఫీ కాలేదు. బ్యాంకులకు వెళితే మీ-సేవలో ఫిర్యాదు చేసుకోమంటున్నారు. అక్కడ ఎటువంటి డేటా లేదని చెబుతున్నారు.-కొప్పిశెట్టి పామురాజు, రైతు, కాగిత,నక్కపల్లి మండలం -
అప్పుల ఆత్మహత్యలని తేలితేనే పరిహారం
అన్నదాతల ఆత్మహత్యలపై సీఎం చంద్రబాబు ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 93 శాతం మంది రైతులు రుణగ్రస్తులు గత ప్రభుత్వాల విధానాలే రైతుల అప్పులకు కారణం రూ. 50 వేల లోపు రుణం ఉన్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదు ఆ పైన ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేస్తాం ఈ లోగా రీషెడ్యూల్ చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుంది రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే ప్రతిపక్షం.. ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? శాసనసభలో చర్చకు సీఎం సమాధాన ప్రసంగంలో వ్యాఖ్యలు హైదరాబాద్: ఏపీలో 92.9 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన శాంపిల్ సర్వేలో తేలిందని.. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే రైతుల అప్పులకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందిస్తామంటూనే.. అప్పుల బాధతోనే ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలితేనే సాయం అందిస్తామని షరతు విధించారు. కుటుంబ కలహాలు, ప్రేమ, మానసిక ఆందోళన.. తదితర కారణాలతో ఆత్మహత్యలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. రుణ మాఫీ, కరువు, రైతుల ఆత్మహత్యల మీద 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. రుణ మాఫీలో.. రూ. 50 వేల వరకు రుణం తీసుకున్న వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించదని, ఈ రుణాలను ఒకే దఫా మాఫీ చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసిన తర్వాత రుణ మాఫీకి అర్హత మొత్తం రూ. 50 వేల లోపు ఉంటే ఒకే దఫా చెల్లించడానికి (వన్ టైం సెటిల్మెంట్) ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిగతా రుణాలను ఐదు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు. ఈలోగా రుణాలను రీషెడ్యూలు చేసుకుంటే 4 శాతం వడ్డీనే పడుతుందని, తాను 10 శాతం ఇస్తాను కాబట్టి 6 శాతం లాభం రైతులకు మిగులుతుందని లెక్కలు చెప్పారు. బీమా పరిహారాన్ని రుణ మాఫీ కింద జమ చేసుకోవడం లేదని, రైతుల ఖాతాలకే ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తున్నామన్నారు. అనంతపురానికి హంద్రీ-నీవా నీళ్లు.. అనంతపురం జిల్లాలో 10 ఎకరాల వరకు బిం దు, తుంపర సేద్యానికి 90 శాతం రాయితీ ఇస్తున్నామని సీఎం చెప్పారు. గోదావరి మెట్ట ప్రాం తాల రైతులకూ ఈ రాయితీ వర్తింపజేయనున్నట్లు తెలిపారు. హంద్రీ-నీనా సుజల స్రవంతి ద్వారా ఈ ఏడాది తాను 12 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు తరలించానన్నారు. తుంగభద్ర హైలెవల్ కెనాల్‌కు సమాంతరంగా కొత్తగా కాలువ తవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించానని, ఆ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు దీన్ని అప్పగించిందన్నారు. ఇది సాకారమైతే అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయన్నారు. విద్యుత్ విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయనే విషయాన్ని చెప్పడానికి ఏమీ లేదని, తాను పదేళ్లకు భవిష్యత్ ప్రణాళికలు తయారు చేశానని ఘనంగా ప్రకటించారు. తోటపల్లికి, వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే..: గోదావరిలో ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతోందని, ఆ నీటిలో 70 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ కు లిఫ్ట్ చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని చెప్పారు. ఈమేరకు కృష్ణలో మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు విని యోగించుకుంటామన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసింది తానేనంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు తీసుకుందని విమర్శిం చారు. రుణ మాఫీ, కరవు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్షం.. ఎర్రచందనం, బెరైటీస్ గురించి ఎందుకు మా ట్లాడటం లేదని సీఎం ప్రశ్నించారు. ఆదర్శ రైతులకు వ్యవసాయం అంటే తెలీదని, అందు కే తొలగించామని బాబు పేర్కొన్నారు. అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయి రాజధాని ప్రాంతంపై మండలిలో చంద్రబాబు వ్యాఖ్యలు రాష్ట్ర రాజధానిని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో విజయవాడ - గుంటూరు మధ్యన అనువైన ప్రాంతంగా నిర్ణయించి ఎంపిక చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగు పంటలు వచ్చే భూములను తీసుకుంటే ఎలా అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడుతున్నారంటూ.. అక్కడ పంటలు వేయకపోతే నీళ్లు మిగులుతాయని, వాటిని రాయలసీమకు తరలిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏపీ రాజ ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు-2014ను మంగళవారం మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లులో ఉన్న అనుమానాలు, లోటుపాట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో భవిష్యత్తులో భూకంపం వస్తుందని ప్రజల్లో భ యాందోళనలు కలిగించే రీతిలో మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ పార్టీల ప్రతిని ధుల అభిప్రాయాలు తీసుకోకుండా రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారనే ఆరోపణల్లో అర్థం లేదన్నారు. -
అన్నీ అబద్ధాలే
సీఎం ప్రసంగంపై రైతుల మండిపాటు వ్యవసాయ రుణాల మాఫీపై శాసనసభలో అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు రూ.50వేలలోపు పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామని, ఆ రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయలేదని చెప్పిన బాబు 2007లో ఉన్న ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ధరల ఆధారంగానే రుణ మాఫీ చిన్న, సన్నకారు రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి తిరుపతి: శాసనసభలో సోమవారం నిర్వహించిన చర్చలో రుణమాఫీపై సీఎం చంద్రబాబు చెప్పిన వివరాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారని మండిపడు తున్నారు. అంతర్గత సమావేశాల్లోనైనా బహిరంగసభలోనైనా.. చివరకు శాసనసభలోనైనా పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని మరోసారి ఆయన చాటి చెప్పారని నిప్పులు కక్కుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీ అమలును నీరుగార్చుతూ వచ్చారు. ఒక్కో కుటుంబానికి గరి ష్టంగా రూ.1.5 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్నారు. ఐదు విడతల్లో రుణాన్ని మాఫీ చేస్తానని సెలవి చ్చారు. రూ.50 వేలలోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ మేరకే రుణమాఫీ మార్గదర్శకాలను రూపొందించి.. లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశిం చారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544, రెండో విడత 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసింది. తక్కిన 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ.11,180.25 కోట్లకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఎండగట్టిన విపక్ష నేత.. రుణ మాఫీలో రైతులకు చేసిన అన్యాయంపై వైఎస్సార్సీపీ శాసనసభలో సోమవారం చర్చకు పట్టుబట్టింది. ఈ చర్చలో రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. భేషరతుగా రుణ మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు.. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసి పొట్టకొట్టారు. ఒకే విడత ఆ రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తోన్న చంద్రబాబుకు రైతులు తగిన రీతిలో బుద్ధిచెబుతారు. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు ఒకేసారి రుణ మాఫీ వర్తింపజేశామని.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేయలేదని పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయలేదని.. అన్యాయం చేసిన రైతు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. చట్టసభ సాక్షిగా అబద్ధాలా..? రుణ మాఫీపై సీఎం చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని బ్యాంకర్లు.. ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2013-14లో ఆర్బీఐ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎకరంలో చెరకు పంటకు రూ.50 వేలు, వరి పంటకు రూ.24 వేలు, వేరుశనగ పంటకు రూ.12 వేలు రుణం ఇచ్చేలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూపొందించారు. పంట రుణాలు ఇచ్చేటపుడు బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలు ఇస్తారు. బంగారు ఆభరణాలను తనఖా పెట్టినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పాటించాలన్న నిబంధన లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేసేటపుడు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసింది. అదీ 2007లో అమల్లో ఉన్న ధరలను వర్తింపజేయడం గమనార్హం. 2007లో చెరకు పంటకు ఎకరానికి రూ.28 వేలు, వరి పంటకు రూ.17 వేలు, వేరుశనగ పంటకు రూ.ఎనిమిది వేలు స్కేల్ ఫైనాన్స్‌గా ఉండేది. రుణ మాఫీలో అవే ధరలను వర్తింపజేసి చిన్న, సన్నకారు రైతులను సైతం ముంచేశారు. పలమనేరు మండలం కన్నమాకులపల్లెకు చెందిన వెంకటాచలం అనే సన్న కారు రైతు ఉదంతమే అందుకు తార్కాణం. వెంకటచాలం ఒక్క రైతుకే కాదు.. లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం ఇదే రీతిలో మాఫీ పేరుతో నిలువునా మోసం చేసింది. శాసనసభలో రుణ మాఫీపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల పాలిట శాపంగా మారిన బాబు సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పాలిట శాపంగా మారారు. బ్యాంకుల్లో రుణాలు తోసేస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం శూన్యం. బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నాను. రుణమాఫీపై బ్యాంకు అధికారులను అడిగాను. ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటున్నారు. ప్రస్తుతానికి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టమని చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యే శరణ్యం. -నాగరాజు, గట్టు గ్రామం, పుత్తూరు మండలం పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలోని కన్నమాకులపల్లెకు చెందిన ఎస్.వెంకటాచలం (ఖాతా నంబర్ 24187 978) రెండెకరాల సన్నకారు రైతు. కొలసమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో పట్టాదారు పాసుపుస్తకం తనఖా పెట్టి ఫిబ్రవరి 11, 2013న రూ.49 వేలు పంట రుణం గా పొందాడు. వెంకటాచలం ఆధార్‌కార్డు నంబర్ 282870625380. ఇప్పుడు వడ్డీతో సహా ఆయన అప్పు రూ.53,955.09కు చేరుకుంది. సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పిన ప్రకారం వెంకటాచలం రుణం ఒకేసారి మాఫీ కావాలి. కానీ.. ఆ రైతుకు కేవలం రూ.30,831.48 మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తొలి విడతగా 2014-15లో రూ.6,166.30ను రుణ మాఫీ కింద జమా చేస్తున్నట్లు ఆ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. రూ.50వేలలోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయనట్లు సోమవారం శాసనసభలో సీఎం పేర్కొన్నారు. కానీ.. ఆ రైతుకు 2007లో ఉన్న స్కేల్ ఆఫ్ పైనాన్స్ను వర్తింపజేసినట్లు అదే ధ్రువపత్రంలో ఉంది. 2013-14లో చెరకు పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేలకు రుణం ఇవ్వవచ్చు. ఆ మేరకు వెంకటాచలానికి బ్యాంకు రూ.49 వేలను రుణంగా ఇచ్చింది. కానీ.. రూ.21 వేలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా అధికంగా రుణం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. వ్యవసాయ రుణాల మాఫీపై సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని చెప్పడానికి ఇదో తార్కాణం. సోమవారం శాసనసభలో రుణమాఫీపై నిర్వహించిన చర్చలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. -
కొండంత బకాయి ...గోరంత మాఫీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో రైతులు తీసుకున్న రుణానికి, జరిగిన మాఫీకి పొంతనలేకుండా పోయింది. ఇప్పుడిస్తున్న మాఫీ మొత్తం రుణాలకయ్యే వడ్డీకి కూడా సరిపోవడం లేదు. ప్రభుత్వం చూపించిన లెక్కలే అందుకు సాక్ష్యం. జిల్లాలో మూడు లక్షల 20వేల మంది రైతులు రూ.1,391కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారు. అయితే వారిలో రెండు లక్షల 79వేల 125 మందిని మాత్రమే రుణమాఫీకి అప్లోడ్ చేశారు. వేర్వేరు కారణాలు చూపించి 40,875 మందిని ముందే పక్కన పెట్టేశారు. పోనీ అప్లోడ్ చేసిన రెండు లక్షల 79 వేల 125మందికైనా రుణ మాఫీ చేశారా అంటే, అదీలేదు. అందులో లక్షా 44వేల 621మందికి మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. పోనీ వీరికైనా తీసుకున్న రుణమం తా మాఫీ అయిందా అంటే అదీ జరగలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పండించిన పంటకు ఇచ్చే రుణంలోనూ పరిమితులు విధించి, రుణమాఫీ మొత్తానికి భారీ స్థాయిలో కత్తెర వేశారు. లక్షా 44వేల 621మందికి గాను రూ.390.39 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుందని, అందులో ఫస్ట్ ఫేజ్ కింద రూ.184.61కోట్లును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అంటే రైతులు తీసుకున్న రుణమొత్తం మాఫీ చేయకపోగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ధేశించిన మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. మొదటి విడత పోను మిగతా మొత్తాన్ని దశల వారీగా ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, మాఫీ జాబితాల్లో ఉన్న వారు పోనూ ఇంకా లక్షా 34 వేల 504 మంది అనర్హులుగా మిగిలిపోయారు. వీరందర్నీ అభ్యంతరాల జాబితాలో చేర్చారు. అభ్యంతరాల ను సరిచేసుకుని జన్మభూమి కమిటీల ద్వారా పంపిస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లక్షా 34వేల 504మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదంతా చూస్తుంటే జిల్లాకు రూ.నాలుగైదు వందల కోట్ల ఇచ్చి చేతులు దులుపేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పరోక్షంగా చెప్పుకొస్తున్నాయి. ఇక, మాఫీ వివరాలను తెలుసుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెట్ సెంటర్లవద్ద పడిగాపులు కాస్తున్నారు. అనర్హత జాబితాల్లో ఉన్న వారైతే మరింత ఇబ్బందులు పడుతున్నారు. అభ్యంతరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియక, ఎక్కడెళ్లి సరిచేయాలో అవగాహన లేక నానా బాధలు పడుతున్నారు. -
మాఫీ మాయలు!
* రూ.50 వేలు పూర్తి రద్దు అబద్ధమే * స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక * దిక్కుతోచని అన్నదాత సాక్షి ప్రతినిధి, విజయవాడ : రైతు రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. రూ.50 వేలు లోపు ఉన్న రుణాలన్నీ పూర్తిగా రద్దవుతాయని ప్రభుత్వం ప్రకటన చేయగా, ఆచరణలోకి వచ్చేసరికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మెలిక పెట్టి అందులోనూ కోత పెట్టారు. జిల్లాలో రుణమాఫీ ఎంత జరిగిందనేది కూడా అధికారులకు తెలియదు. లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను ఏది అడిగినా తెలియదనే సమాధానమే చెబుతున్నారు. ఇతర బ్యాంకుల మేనేజర్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సేకరించిన వివరాలను పరిశీలిస్తే... రూ.50 వేల లోపు 20 శాతమే మాఫీ... గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో 823 మంది రైతులు రూ.3 కోట్ల 28 లక్షల 62 వేల 856 రుణాలుగా పొందారు. అందులో 377 మందికి తాజాగా రుణమాఫీ అయినట్లు జాబితాలో వచ్చింది. అందులో 205 మాత్రం రూ.50 వేల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారు. వారిలో కూడా 172 మందికి 20 శాతమే రుణమాఫీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. పీఏసీఎస్‌లో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులు 470 మంది ఉన్నారు. ఈ లెక్కన మరో 265 మందికి రూ.50 వేల లోపు రుణమాఫీ జరగాల్సి ఉంది. వారి పరిస్థితి ఏమిటనేది స్పష్టత లేదు. గుడివాడ ఎస్బీఐ మెయిన్‌బ్రాంచ్‌లో డిసెంబర్ 2013 వరకు రుణాలు తీసుకున్నవారి సంఖ్య 920. వారిలో మొదటి జాబితాలో అర్హులైనవారు 265 మంది. రూ.50 వేల లోపు 230 మందికి మాఫీ అవుతున్నట్లు బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగతా 35 మంది రైతులకు 20 శాతం చొప్పున రూ.6 లక్షల మాఫీ వచ్చింది. నందివాడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో 3,200 మంది వివిధ రకాల రుణాలు రూ.19కోట్లు పొందారు. మొదటి విడత జాబితాలో 725 కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. బ్యాంక్ పరిధిలో రూ.50 వేలలోపు రుణాలు పొందినవారు 1500 మంది వరకు ఉన్నారు. వీరిలో 20 శాతం మందికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు కాలేదు. దీంతోపాటు బంగారం రుణాలు పొందినవారిలో 90 శాతం మందికి రుణమాఫీ వర్తించలేదు. రుణం రూ.20 వేలు.. చూపుతోంది రూ.56 వేలు బ్యాంకులో పంట రుణం కింద తీసుకున్న రుణం రూ.20 వేలు అయితే.. రుణమాఫీ జాబితాలో రూ.56 వేలుగా చూపడం ఓ రైతు కుటుంబాన్ని విస్తుపోయేలా చేసింది. కోడూరు మండలం లింగారెడ్డిపాలేనికి చెందిన చిట్టిప్రోలు మునేశ్వరమ్మ 2011 సెప్టెంబర్ 14న కోడూరు స్టేట్‌బ్యాంకులో తన ఎకరం 40 సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాన్ని కుదవపెట్టి రూ.20 వేలు పంట రుణం తీసుకున్నారు. అప్పటి నుంచి పంటలు సరిగ్గా పండక తీసుకున్న రుణాన్ని బ్యాంకుకు జమ చేయలేకపోయారు. ఈలోపు ఎన్నికలు రావడం, చంద్రబాబు రుణమాఫీ ప్రకటన చేయడంతో రుణం చెల్లించలేదు. ప్రస్తుతం ఈ రుణం వడ్డీతో కలిపి రూ.30,500 అయింది. ఈ ఏడాది అక్టోబరులో పంట సాగు కోసం అదే బ్యాంకులో బంగారం కుదవపెట్టి మరోసారి రూ.35 వేలు రుణం పొందారు. ఈ నెల ఆరోతేదీన రూ.50 వేల లోపు ఉన్న పంట రుణాలు మొత్తం ఒక్కసారే మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటన విడుదల చేయడంతో మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు ముందుగా తీసుకున్న తమ రుణం రూ.20 వేలు వడ్డీ సహా మాఫీ అయిపోతుందని భావించారు. ఈ నెల ఎనిమిదిన ఆన్లైన్లో విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2013లో తీసుకున్న రుణం రూ.56 వేలు అని, అందులో మొదటి విడత కింద రూ.5,194 మాఫీ అవుతుందని చూపించింది. దీంతో కంగుతిన్న మునేశ్వరమ్మ కుటుంబసభ్యులు స్థానిక బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించగా, ‘మీరు తీసుకున్న అప్పు మొత్తం మాఫీ కాదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద కొంత మొత్తమే వర్తిస్తుంది. గడువు మీరిన నేపథ్యంలో మిగతా సొమ్ము వెంటనే చెల్లించని పక్షంలో ఈ ఏడాది పంట రుణం కింద కుదవపెట్టిన బంగారాన్ని వేలం వేస్తాం’ అంటూ బ్యాంక్ మేనేజర్ చెప్పారని మునేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011లో రూ.20 వేలు రుణం తీసుకోగా.. 2013లో రూ.56 వేలు రుణం తీసుకున్నట్లుగా పేర్కొనడమే పొరపాటు కాగా, ఇందులో రుణమాఫీ కింద పోగా మిగిలిన మొత్తానికి ఈ ఏడాది తీసుకున్న రుణానికి సంబంధించిన బంగారాన్ని వేలం వేసి జమ చేస్తామని చెప్పడమేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా తీసుకున్న రుణం వరకే నమోదై ఉంటే వడ్డీతో కలిపి రూ.30,500 సొమ్ము మాఫీ కావాల్సి ఉంది. ప్రస్తుతం బ్యాంకు అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇది బ్యాంక్ అధికారుల పొరపాటా? లేక ప్రభుత్వం రుణమాఫీ ఎగవేతకు పన్నిన వ్యూహమా? అనేది బ్యాంకు అధికారులకు, ప్రభుత్వానికే తెలియాలి. -
అప్పుల ఊబిలోనే రైతన్న
* రైతన్న పాలిట యమపాశంగా మారనున్న రుణమాఫీ * చంద్రబాబు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో ఇక ఐదేళ్లయినా అసలు తీరదు * రూ.87 వేల కోట్లున్న వ్యవసాయ రుణాలకు ఆంక్షలు, * పరిమితులు పెట్టి రూ.15 వేల కోట్లకు కుదించిన బాబు సర్కారు * కోటికిపైగా ఉన్న ఖాతాలను 22 లక్షలకు కుదించి మాఫీ అంటూ హడావిడి * రూ.12,800 కోట్ల వడ్డీ ఉంటే మాఫీకి రూ.5 వేల కోట్లే ఇస్తామన్న చంద్రబాబు * తొలి విడతగా 20%, మిగతాది నాలుగేళ్లలో 4 విడతలుగా చెల్లిస్తామన్న ప్రభుత్వం * బాబు మాటలు నమ్మి రుణాలు కట్టక దగాపడ్డ రైతన్న సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ పథకం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీరని శాపంగా మారబోతోంది. ఐదేళ్ల తర్వాత కూడా తీసుకున్న రుణం తీరకపోగా.. మళ్లీ మొదటికే వచ్చి అన్నదాతను మరింత అప్పుల ఊబిలోకి నెట్టనుంది. చంద్రబాబును నమ్ముకున్న రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొత్తగా రుణాలు పొందే అర్హతను కోల్పోతున్నారు. ఆపదలో ఆదుకునే పంటల బీమా ప్రభుత్వ నిర్వాకంతో అందకుండా పోయింది. రైతులు సక్రమంగా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాల మంజూరుకు వెనుకంజ వేస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.56 వేల కోట్ల రుణాల మంజూరును లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకులు.. పేరుకుపోయిన బకాయిల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల రుణాలు కూడా ఇవ్వలేకపోయాయి. వెరసి మొత్తం పరపతి వ్యవస్థ కుప్పకూలిపోయింది. వ్యవసాయ రుణాలకు సంబంధించి రాష్ట్రంలో కోటికిపైగా ఖాతాలు ఉండగా, వాటిపై మొత్తం రూ.87,612 కోట్ల రుణాలున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాతే చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తామనే హామీ ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. చంద్రబాబు మాఫీ చేస్తారన్న నమ్మకంతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. సకాలంలో రుణాలు చెల్లించని కారణంగా ఆ రుణాలపై రైతాంగంపై 12,800 కోట్ల రూపాయల అపరాధ వడ్డీ భారం పడింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలపాటు కాలయాపన చేసి ఆంక్షలు, పరిమితులు, షరతులు అంటూ చివరకు కేవలం 22 లక్షల ఖాతాలను మాత్రమే రుణ మాఫీకి పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ఖాతాలకు ఏటా 20 శాతం చొప్పున చెల్లించి వచ్చే ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. కానీ బడ్జెట్లో చూపినట్టుగా ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని రూ.87 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.15 వేల కోట్లకు కుదించారు. చివరకు ఈ 22 లక్షల ఖాతాలకు కూడా రుణమాఫీ పూర్తిగా వర్తింపజేయడం లేదు. ఇదంతా చూస్తే ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందా? వడ్డీ మాఫీ చేస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అరకొరగా వచ్చే డబ్బును బ్యాంకులు రైతుల వడ్డీ కింద సర్దుబాటు చేస్తున్నాయి. 12,800 కోట్ల రూపాయల వడ్డీ ఉండగా, 5 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులకు వడ్డీ భారం కూడా తీరడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే అయిదేళ్లకు లెక్కలేసి చూస్తే రైతుల ఖాతాల్లో రుణ బకాయి అలాగే ఉండిపోయే పరిస్థితి కన్పిస్తోంది. తొలి విడత చెల్లింపుతో బయటపడుతున్న అసలు రంగు రుణ మాఫీ కింద తొలి విడతగా 20 శాతం చెల్లిస్తున్నామని, మిగిలిన సొమ్మును మరో నాలుగేళ్లలో నాలుగు విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరూ రుణమాఫీ అవుతుందన్న భ్రమల్లో పడిపోయారు. తీరా బ్యాంకుల వద్దకు వెళ్లాక ఇందులోని అసలు మాయ ఏంటో బయటపడుతోంది. ప్రభుత్వం చెబుతున్న అయిదేళ్ల తర్వాత కూడా బ్యాంకుల్లో రైతుల రుణాలు అప్పు అసలు అలాగే పేరుకుపోయే పరిస్థితులున్నాయి. అరకొరగా కొంతమంది రైతులకు అయిదేళ్ల తర్వాత అది కూడా కొంత మేరకు ఊరట ఉంటుందేమో కానీ మెజారిటీ రైతుల అప్పు అసలంతా బ్యాంకుల్లో బకాయి తేలుతోంది. అలా బకాయి పడిన కారణంగా రైతన్నలు త్వరలోనే బ్యాంకు రికార్డుల్లో డిఫాల్టర్లుగా నమోదు కాబోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఇంతకాలం రుణాలు, దానిపై పడిన వడ్డీ చెల్లించని కారణంగా భారం తడిసిమోపెడైంది. సర్కారు నిర్వాకం కారణంగా రుణ పరపతి క్రమం దెబ్బతినడం, రైతులపై అపరాధ వడ్డీ భారం పడటం, ఆ భారాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం వెరసి రైతులు చిక్కుల్లో పడ్డారు. ఆంక్షలు, పరిమితులు, షరతులు ఇలా రకరకాలుగా జాబితాను కుదిస్తూ కుదిస్తూ చివరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త మెలిక పెట్టి మొత్తం వ్యవహారాన్ని గందరగోళంగా మార్చింది. ప్రభుత్వం తన భారాన్ని తగ్గించుకోవడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక పెట్టి రైతుల రుణాలకు ఎగనామం పెడుతుండగా, రుణాలిచ్చే విషయంలో తిరిగి ఇదే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు బ్యాంకులు పరిమితం కావలసి వస్తుంది. తద్వారా భవిష్యత్తులో రైతులకు బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి కూడా ఉండదు. మాఫీ నుంచి తప్పించుకోనున్న సర్కారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో రైతులు తీసుకున్న రుణ బకాయిలను సగానికి సగం తగ్గించారు. ఆ సగంలో కూడా ప్రస్తుతం 20 శాతం ప్రభుత్వం చెల్లిస్తోంది. అది కూడా ఇప్పటివరకు అయిన వడ్డీని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. గత ఏడాది డిసెంబర్ వరకు అసలు, వడ్డీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఆ మొత్తంలో 20 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగతా 80 శాతం మొత్తాన్ని వడ్డీతో సహా ఆయా రైతులే రుణ బకాయిలను చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. తొలుత ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉన్న రుణ బకాయిలను మొత్తం వడ్డీతో చెలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. గత ఏడాది డిసెంబర్ వరకు తీసుకున్న, అప్పటివరకు చెల్లించకుండా బకాయిలుగా ఉన్న అప్పులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. ఆ రుణాలపై ఇప్పటి వరకు ఉన్న వడ్డీ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా తీరా ఇప్పుడు రుణ మాఫీలో ఆ విషయాన్ని వదిలేసింది. కేవలం గత ఏడాది డిసెంబర్ వరకు ఉన్న వడ్డీనే పరిగణనలోకి తీసుకుంది. దాంతో రైతులు జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న వడ్డీని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం చెల్లించి మిగతా 80 శాతం రైతుల రుణ బకాయిలను చెల్లించుకునే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ సంస్థ ద్వారా హామీ పత్రాలు (నాలుగేళ్లకు నాలుగు) ఇవ్వడంతో ఇక రుణ మాఫీ నుంచి పూర్తిగా తప్పుకోనున్నారు. ఆ పత్రాలు జారీ చేయడంతో రుణ మాఫీ అన్నది బ్యాంకులు, రైతులకు మాత్రమే సంబంధించిన విషయమని, ప్రభుత్వం తన పని తాను చేసిందని చెప్పబోతోంది. సర్కారు చెల్లింపు వడ్డీకే సరి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ వరకే వడ్డీని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింప చేయడంతో ఇప్పుడిస్తున్న 20 శాతం నిధులు కూడా రైతుల రుణ బకాయిల అపరాధ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఆ కారణంగా రైతుల రుణాలు రెన్యువల్ అయ్యే అవకాశం కూడా కోల్పోతున్నారు. మిగతా వడ్డీని రైతులు చెల్లిస్తేనే వారి రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకులు అవకాశమిస్తాయి. ప్రభుత్వం నాలుగు పత్రాలు ఇచ్చింది కదా నాలుగేళ్లలో ఆ బకాయిలకయ్యే మొత్తాన్ని రైతు సాధికారిక కార్పొరేషన్ ఇస్తుందనుకుంటే రైతులు మోసమోయినట్లేనని బ్యాంకర్లు విడమరిచి చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు మిగిలిన రుణ బకాయిలకే హామీ పత్రాలు ఇస్తుందని, మిగతా రుణాలను, ఆ రుణాలపై వడ్డీని రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. నాలుగు పత్రాలు ఇచ్చారు కదా నాలుగేళ్లలో రుణం తీరుతుందని రైతులు అనుకుంటే పొరపాటే. నాలుగుగేళ్లు అయినా రుణం తీరకపోగా ఈ నాలుగేళ్లతో కొత్తగా అప్పుపుట్టడం ఉండదు. పైగా వడ్డీల బారిన పడి అప్పులు ఊబిలో కూరుకుపోతారు. కృష్ణా జిల్లాలో ఒక రైతు ఎదుర్కొన్న పరిస్థితి ఇదీ కృష్ణా జిల్లాలోని ఒక రైతు తన రెండెకరాల పొలం సేద్యం చేయడానికి బ్యాంకు నుంచి 50 వేల రూపాయల అప్పు తీసుకోగా సకాలంలో చెల్లించని కారణంగా మొదటి ఏడాది 7 శాతం వడ్డీ భారం పడింది. అంటే 50 వేలకు 3,500 రూపాయలు వడ్డీ అవుతుంది. అంటే అప్పు మొత్తం 53,500 అయ్యింది. రెండో సంవత్సరంలో వడ్డీ 14 శాతం పడుతుంది. 14 శాతమంటే మరో 7,490 రూపాయల భారం పడుతుంది. అప్పుడు అసలు, వడ్డీ కలిపి 60,990 రూపాయలవుతుంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ప్రభుత్వం కొత్తగా చెబుతున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఆ రైతుకు ఎకరాకు 19 వేల చొప్పున రెండెకరాలకు 38 వేల రూపాయలు మాత్రమే రుణ అర్హత ఉందని, ఆ రుణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. (పంటల ఆధారంగా ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిగణనలోకి తీసుకుంది) ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికన ఏటా 20 శాతం చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఇప్పుడు తొలి విడతలో ప్రభుత్వం చెల్లిస్తామన్న 20 శాతమంటే...7,600 రూపాయలే. రైతుకు ఉన్న మొత్తం అప్పు 60,990 నుంచి 7,600 రూపాయలను బ్యాంకులు మాఫీ చేస్తాయి. మాఫీ అయిన డబ్బు తీసివేయగా అప్పటి కీ ఆ రైతు 53,390 (అసలు రూ.50 వేలే) బకాయి ఉంటాడు. దీనిపై ఆ వచ్చే ఏడాది మరో 14 శాతం అపరాధ వడ్డీ భారం పడుతుంది. అంటే 7,474 రూపాయలు వడ్డీ పడుతోంది. అసలు వడ్డీ కలిపి తిరిగి 60,864 రూపాయలకు చేరుతుంది. రెండో విడతలో ప్రభుత్వం ఇచ్చిన హామీ పత్రం బ్యాంకులో సమర్పిస్తే మరో 7600 రూపాయలు మాఫీ చేస్తారు. అలా మాఫీ అయిన సొమ్ము పోగా తిరిగి 53,264 రూపాయల అప్పు అలాగే మిగిలిపోతుంది. వచ్చే అయిదేళ్ల పాటు ఇలాగే సాగుతుంది. ఈ లెక్కన రైతుల అసలు రుణం తీరకపోగా మరింత భారంగా మారుతుంది. ప్రతి ఏటా 14 శాతం అపరాధ వడ్డీ పెరుగుతుంటే, ప్రభుత్వం హామీ పత్రం రూపేణా ఇచ్చే మొత్తం ఆ వడ్డీకి కూడా సరిపోదు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో రైతుల పరిస్థితి కూడా ఇదే. -
‘పచ్చ’ అబద్ధం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, చీరాల,దర్శి : ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాట మార్చారు. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తానని అబద్ధ్దాలాడడమే కాకుండా రూ.50 వేలలోపు రుణాలన్నీ మాఫీ అయిపోయినట్లేనని ఆర్భాటంగా ప్రకటించారు. తాజాగా రుణమాఫీలు రైతు ఖాతాల్లో పడ్డాయి. 50 వేలలోపు రుణాలు మాఫీ అయ్యాయని భావించిన రైతులకు చంద్రబాబు షాకిచ్చారు. వీరి ఖాతాల్లో కేవలం మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే మాఫీ కింద చూపించడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. రుణమాఫీ పేరుతో రైతులను దా‘రుణ’ంగా మోసగించింది. బాసటగా ఉండాల్సింది రుణమాఫీ శాపంగా మారింది. బంగారం వేలం వేస్తామంటే పొలం అమ్మకం బుర్లవారిపాలేనికి చెందిన బుర్ల శ్రీనివాసరావు అనే రైతు వ్యవసాయ రుణాల కింద బంగారాన్ని తనఖా పెట్టి 2012లో 1,30,000 రుణాన్ని తీసుకున్నాడు. బ్యాంకు అధికారులు బంగారాన్ని వేలం వేస్తామని హెచ్చరించడంతో తనకున్న స్థలాన్ని తాకట్టు పెట్టి బంగారు నగలను విడిపించేందుకు సిద్ధమయ్యాడు. రూ.50 వేలు లోపున్నా...సున్నాయే చీరాల మండలం బోయినవారిపాలేనికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు 2012లో ఈపూరుపాలెం ఎస్.బి.ఐ.లో తనకున్న పదెకరాల పొలాన్ని తనఖా పెట్టి రూ.80 వేలు రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం అది వడ్డీతో కలిపి రూ.1,18,500 అయింది. జాబితాను చూసుకోగా కేవలం రూ.40 వేలు మాత్రమే మాఫీ అయినట్లు బ్యాంకు అధికారులు చెప్పడంతో లబోదిబోమన్నాడు. బోయినవారిపాలేనికిు చెందిన రైతు బి.రామకృష్ణ తనకున్న రెండున్న ఎకరం పొలాన్ని 2012లో తనఖా పెట్టి రూ.24,500 రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం అది వడ్డీతో కలిపి రూ.38 వేలు అయింది. రూ.50 వేలులోపు రుణం తీసుకున్నవారికి మాఫీ అవుతుందని చెప్పడంతో ఎంతో ఆశగా ఎదురు చూశారు. రూ.18,500 మాత్రమే మాఫీ అయింది. మిగిలిన మొత్తం చెల్లించి పాసు పుస్తకాలు తీసుకెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆ రైతు కుటుంబం గొల్లుమంది. పెట్టిన వాతలు చాలవా? ఉన్న కొర్రీలతో పెట్టిన వాతలు చాలక ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పేరుతో మరో వంచనకు బాబు ప్రభుత్వం దిగింది. అది కుడా బ్యాంకర్ల విధించిన మొత్తంకంటే తక్కువగా నిర్ణయించి అన్యాయానికి పాల్పడిందని రైతులు వాపోతున్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ కింద బ్యాంకర్లు ఎకరా వరికి పంట రుణం కింద రూ.25 వేలు, పత్తికి రూ.35 వేలు, పొగాకుకు రూ.55 వేలు, మిర్చికి రూ.55 వేలు, శనగకు రూ.16 వేలు చొప్పున రుణం మంజూరు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని పంటలకు సగానికి సగం చొప్పున రుణ పరిమితికి కోత పెట్టింది. ఎకరా వరికి రూ.12 వేలు, పొగాకుకు రూ.32 వేలు మాత్రమే రుణమాఫీకి వర్తింపచేసింది. అంటే వరి సాగుచేసే రైతు పంట రుణం కోసం రెండెకరాలకు బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నట్లయితే ఆ రైతుకు రెండెకరాలకు కలిపి రూ.24 వేలు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మిగిలిన రూ.26 వేలు, అపరాధ వడ్డీ బ్యాంకులకు రైతు కట్టాల్సిందే. 37 రూపాయలూ రుణమాఫీనే దర్శి మండలం రాజంపల్లికి చెందిన కందుకూరి అరుణాచలానికి 3.01 ఎకరాలు భూమి ఉండగా రుణమాఫీ జాబితాలో 0.01 సెంటు భూమి ఉన్నట్లుగా జాబితాలో ఉంది. ఆ రైతుకు 189.81 రూపాయలు రుణమాఫీ జాబితాలోకి రాగా రూ. 37.96 తొలివిడత మాఫీలోకి వచ్చింది. తప్పుడు రాతల మూలంగా మాఫీ కావాల్సిన రూ.70 వేలు కాకుండా పోయింది. కొమరోలులో... ఒక రేషన్ కార్డు పరిధిలో మరో కుటుంబం చేరిపోవడంతో ఇరువురికీ నష్టం వాటిల్లింది. కొమరోలు మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన వర్రా వీరనారాయణ తండ్రి వీరయ్య స్టేట్‌బ్యాంకులో బంగారం రుణాన్ని లక్ష రూపాయలు మిరప పంటను సాగుచేసుకునేందుకు వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఈ రైతుకు 2.43 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకం ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో వీరనారాయణ రేషన్‌కార్డు నంబరు కింద ఇదే గ్రామానికి చెందిన వర్రా పెద్ద వీరయ్య తండ్రి బాలయ్య ఆధార్ నంబరుకు జతచేసి ఉంది. స్థానిక ఆంధ్రాబ్యాంకులో వర్రా పెద్ద వీరయ్య తండ్రి బాలయ్య అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం ద్వారా రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. దీంతో వీరనారాయణకు సంబంధించిన ఖాతాకు మరో వ్యక్తి జతచేయడం, పట్టాదారు పాసుపుస్తకంలో 2.43 ఎకరాలుండగా కేవలం ఒక ఎకరాకు రూ.20 వేలు మాత్రమే వర్తించడంతో ఇదేమి లెక్కంటూ తల పట్టుకుంటున్నాడీ రైతు. -
రుణమాఫీలో కొత్త మాయ
* స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట రైతులకు టోపీ * రుణంలో 30-40 శాతానికే మాఫీ వర్తింపు * అందులోనూ జమయింది అతి తక్కువ * రైతుల లబోదిబో; బ్యాంకర్ల అయోమయం సాక్షి, విజయవాడ బ్యూరో: రుణమాఫీ కోసం ఎదురు చూసిన రైతుల్ని ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరిట దెబ్బతీసింది. రైతులు ఎంత రుణం తీసుకున్నారనేది పక్కనబెట్టి... వారికున్న భూమికి, వేసిన పంటను బట్టి బ్యాంకులు ఎంతవరకూ రుణం ఇవ్వవచ్చు? అనేది పరిగణనలోకి తీసుకుంటోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో 2013 ఖరీఫ్ సీజన్లో వరి పంటకు ఎకరానికి 23,000 రుణం ఇవ్వాలని నిర్ధారించారు. రెండెకరాలున్న రైతు వరి కోసం రూ.70వేలు రుణం తీసుకుని ఉంటే... దాన్లో రూ.46వేల మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం మాఫీ పరిధిలోకి తీసుకుంటోంది. మిగిలింది రైతులమీదే పడుతోంది. ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పంటను బట్టి, సీజన్‌ను బట్టి, జిల్లాను బట్టి మారుతుండటం గమనార్హం. దీనిప్రకారం పలువురు రైతులకు నామమాత్రంగానే రుణాలు మాఫీ అవుతుండటంతో జాబితాల్లో చూసుకుని వారు బ్యాంకుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. రూ.50 వేల లోపు పూర్తి మాఫీ ఎక్కడ? రూ.50 వేల రుణం ఒకేసారి రద్దవుతుందని చెప్పినా దానికీ అనేక మెలికలు పెట్టి ప్రభుత్వం నామమాత్రపు సొమ్ములను మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేసింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను (ఎస్ఓఎఫ్) రూ.50 వేల రుణాలకు వర్తింపజేయబోమని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఎస్ఓఎఫ్ నిబంధనల మేరకే వారి రుణాన్ని లెక్కిస్తున్నారు. అలా లెక్కించినా కూడా మాఫీ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడంలేదు. ఉదాహరణకు... శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గురండికి చెందిన బోర తిమ్మన్న రెండెకరాల వరి పంటకు రూ.50 వేల రుణం తీసుకున్నాడు. ఎస్ఓఎఫ్ ప్రకారం ఎకరానికి రూ.13,500గా లెక్కించినా రూ.27 వేలు మాఫీ కావాలి. కానీ ఆయన ఖాతాలో కేవలం 10,249 మాత్రమే జమయింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం బాలసానివారిపల్లెకు చెందిన రైతు ఎస్ బైరిశెట్టి 1.45 ఎకరాల్లో వేరుశెనగ పంట సాగుకోసం బి. కొత్తకోట ఎస్బీఐలో రూ.లక్ష రుణం తీసుకున్నాడు. ఆయనకు మాఫీ చేసిన మొత్తం రూ.2,888. వడ్డీతో కలిపి 3,158 మాఫీ అవుతున్నట్లు వెబ్సైట్లో ఉంది. దీన్లో తొలి విడత మాఫీ అయ్యేది కేవలం రూ.631. మొగిలిన మొత్తాన్ని మరో మూడు విడతల్లో మాఫీ చేస్తారట. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన చదరం ఆదినాయుడు యూనియన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టి రూ.28 వేల క్రాప్‌లోన్ తీసుకున్నాడు. రూ.50 వేల కంటే తక్కువ ఉంది కనక పూర్తిగా రద్దవుతుందని ఆశపడ్డాడు. కానీ జాబితాలో అతని పేరే లేదు. వీరేకాదు. చాలామంది రైతుల అనుభవాలు ఇలానే ఉన్నాయి. తొలిదశ రుణమాఫీకి అర్హత పొందిన 22.79 లక్షల కుటుంబాల్లో 40 శాతం మంది వరకూ రూ.50 వేల కంటె తక్కువ రుణాలు తీసుకున్న వారేనని బ్యాంకర్లు చెబుతున్నారు. అంటే 9 లక్షలకు పైనే. ప్రభుత్వం తీరుతో వారికీ న్యాయం జరగలేదు. కాగా రుణ మాఫీ తీరును చూసి బ్యాంకర్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. రైతులపై నమ్మకంతో ఎస్ఓఎఫ్ నిబంధనల కంటే ఎక్కువ రుణాలిచ్చిన బ్యాంకర్లు ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకులకు వస్తున్న రైతులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద జాబితాలు ఓపెన్ కాకపోవటంతో రైతులు మీ సేవా కేంద్రాల వద్ద నిరీక్షించటం కనిపించింది. -
‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’లోనూ కత్తెర..!
విజయనగరం అర్బన్ : పంట రుణమాఫీ అమలు కోసం ఇన్నాళ్లూ సవా‘లక్ష’న్నర నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను భారీగా కుదించిన ప్రభుత్వం, తాజాగా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ కొలమానం ప్రకారం పండించిన పంటకు ఇచ్చే రుణంలోనూ పరిమితులు విధించి, రుణమాఫీ మొత్తానికి భారీస్థాయిలో కతెక్తర వేసింది. ఆ మేరకు తొలి అర్హులజాబితాను తాజాగా విడుదల చేసింది. దీంతో చాలా మంది రైతులు నష్టపోతున్నారు.‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ పట్టిక మేరకు నిర్ణయించిన రుణ మంజూరు పరిమితులను విస్మరించి,తమకు తోచినట్టుగా కుదించారు. 2012-13 వార్షిక స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు చెరుకు పంటకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేల (అగ్రికల్చర్ టెక్నికల్ కమిటీ అధికారికంగా నిర్ణయించిన పట్టిక ప్రకారం) వరకు రుణ అర్హత ఉంది. అయితే తొలి జాబితాలోని చెరుకు పంట రుణాలకు ఎకరాకు కేవలం రూ.15 వేలు మాత్రమే పరిధిని నిర్ణయించి రుణమాఫీ లెక్కలు కట్టారు. దీంతో దాదాపు మూడొంతులలో రెండొంతుల రుణాన్ని మాఫీకి దూరం చేశారు. ఆ సొమ్మును రైతులు కచ్చితంగా బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు ఈ విధంగా కుట్రచేసింది. రైతన్నలకు ఝలక్.. రుణాలు మాఫీ అవుతాయని కొండంత ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూపంలో ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. దీంతో అధికంగా రుణాలు వాడిన చెరుకు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా విడుదల చేసిన అర్హుల తొలి జాబితాను పరిశీలిస్తే అది స్పష్టం అవుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పరిధిలోని ఎస్.కోట శాఖలో పడాల వెంకట విశ్వనాథం అనే రైతు రుణమాఫీ ఖాతాను పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. నాలుగు ఎకరాల్లో చెరకు పంట వేసేందుకు 2013 జూన్ 22న రుణం పొందే సమయానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక ప్రకారం ఎకరాకు రూ. 40 వేల చొప్పున రూ. లక్షా 20 వేల రూపాయల వరకు అప్పుతీసుకునే అర్హత ఉంది. అయితే ఆయన ఎకరాకు రూ.15 వేల చొప్పున నాలుగు ఎకరాలకు రణ పరిధిని నిర్ణయించినట్లు ఆన్లైన్ జాబితా పట్టికలో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే తీరులో జిల్లాలోని 20 వేల మంది చెరకు రైతుల రుణపరిమితిని కుదించి మాఫీ అమలు చేయనున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కత్తెర వల్ల ఒక్క డీసీసీబీలోనే రూ. 14 కోట్ల మేరకు మాఫీ నిధిని కుదించారు. డీసీసీబీలో తొలిజాబితాలోని 39,259 మంది రైతులకు రూ.104 కోట్ల మేర రుణం ఉండగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పట్టిక మేరకు అమలు చేయడం వల్ల రూ.90.23 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ కానుంది. రుణమాఫీ పరిధిని తగ్గించడంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రూ.50 వేల లోపు రుణం తీసకున్న రైతుల ఖాతాల్లో రూ.47.23 కోట్లు జమ అయినట్టు డీసీసీబీ అధికారులు చెప్పారు. అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులు ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసిన అర్హుల తొలి జాబితాలో 1,43,808 మంది రైతులున్నారని సమాచారం. రెండుమూడు అకౌంటులున్న రైతులను కలుపుకొంటూ ఈ జాబితా తయారయినట్టు అధికారులు ప్రకటించారు. అదే విధంగా ఖాతాదారుల జాబితాలను మండలాల వారీగా ఆయా మండలాల వ్యవసాయ శాఖలకు నేరుగా పంపారు. దీనిలో రూ.50 వేలు లోపు రుణం ఉన్న రైతులను విభజించకపోవడం వల్ల ఖాతాదారులకు వివరణ ఇవ్వలేని పరిస్థితిలో బ్యాంక్ అధికారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పలుప్రాంతాలలో రూ.50 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు పూర్తి స్థాయిలో నగదు జమ కాలేదు. బాడంగి, తెర్లాం, ఎస్.కోట, గంట్యాడ మండలాలల్లో రైతులకు ఇలా జరగడం వల్ల ఎవరిని అడిగి వివరాలు తెలుకోవాలో తెలియక ఆందోళనలో రైతులు పడ్డారు. -
పచ్చ మోసం
రుణమాఫీ అమలులో రైతన్నలను మోసం చేసిన సర్కారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రూ.50 వేల లోపు రుణాల్లోనూ కోత ఖాతాలో పడుతున్న డబ్బులు చూసి బోరుమంటున్న రైతులు అనంతపురం : జిల్లా వ్యాప్తంగా లక్షల మంది రైతులు రుణమాఫీ ఉచ్చులో పడి నిలువునా మోసపోయారు. రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ఆర్థిక పరిస్థితి బాగోలేదు 1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ఇపుడు చెబుతున్నారు. చివరకు 50వేల రూపాయల లోపు ఒకేసారి మాఫీ చేస్తానని, అంతకంటే ఎక్కువ బకాయిలు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని మీడియా సాక్షిగా ఈ నెల 4న చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ మాటపై కూడా చంద్రబాబు నిలబడలేకపోయారు. ‘నోరొకటి చెబుతుంది...చేయ్యి మరొకటి చేస్తుంది.. దేనిదోవ దానిదే’ అనే తరహాలో వ్యవహరించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో రైతన్నల నడ్డి విరిచారు. ఆన్లైన్లో 6.62 లక్షల ఖాతాలు జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాలున్నాయి. ఇందులో 9.86 లక్షల ఖాతాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి పంపారు. ఇందులో 8.83 లక్షల ఖాతాలు అర్హమైనవిగా ప్రకటించారు. అయితే తీరా జాబితా వచ్చిన తర్వాత చూస్తే 6.62,663 ఖాతాలు ఆన్లైన్లో కనిపించాయి. ఈ లెక్కన 2,21,144 ఖాతాలు గల్లంతయ్యాయి. సరే! ఈ ఖాతాలకైనా ఈ నెల 4న చెప్పిన ప్రకారం రుణమాఫీని అమలు చేశారా? అంటే అదీ లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూపంలో అరకొర చిల్లర విధిల్చి చేతులు దులుపుకున్నారు. ఇదీ బాబు మాఫీ మాయ జిల్లాలో సన్నకారు రైతులు 50 వేల లోపు రుణాలు తీసుకున్నారు. బాబు చెప్పిన ప్రకారం ఈ రుణాలన్నీ ఒకే విడతలో మాఫీ కావాలి. కానీ రైతులు బ్యాంకులో తనఖాపెట్టిన పాస్‌పుస్తకాల్లోని పొలానికి నిబంధనల ప్రకారం ఎంత రుణం ఇవ్వచ్చో.. ఆమేరకే మాఫీ చేస్తున్నారు. అంటే ఉదాహరణకు ఆంజనేయులు 2.50 ఎకరాలకు రూ.46 వేల రుణం తీసుకున్నారనుకుందాం. ఇతనికి వడ్డీ కలిపి 52 వేల రూపాయల బకాయి ఉంది. ఇందులో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు బ్యాంకర్లు 12 వేలు ఇవ్వాలి. ఈ లెక్కన 2.50 ఎకరాలకు 30వేల అవుతుంది. ఈ 30వేల రూపాయలను మాఫీ చేస్తారు. అది కూడా 50 వేలు దాటింది కాబట్టి, 30 వేలకు 20 శాతం డబ్బులు ఖాతాలో వేసి తక్కిన డబ్బులను నాలుగేళ్లలో నాలుగు విడతల్లో మాఫీ అవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. రుణమాఫీపై చంకలు గుద్దుకున్న టీడీపీ నేతలు, డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాక వారు కూడా బహిరంగంగా బాబును విమర్శిస్తున్నారంటే ‘బాబు మాఫీ మాయ’పై రైతన్నలు ఏస్థాయిలో మండిపడుతున్నారో ఇట్టే తెలుస్తోంది. బ్యాంకుల్లో పూర్తిగా వెల్లడికాని రుణాల వివరాలు రుణమాఫీ జాబితాల వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం జిల్లాలోని బ్యాంకులు, మీసేవా కేంద్రాలు రైతులతో కిటకిటలాడాయి. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలివెళ్లారు. తీరా ఖాతాలోని వివరాలు చూసి భరించలేని కోపంతో ప్రభుత్వంపై తిట్లపురాణం అందుకుంటూ ఇంటిబాట పట్టారు. జాబితాలు మంగళవారం కూడా బ్యాంకులకు పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ నెల 10న ప్రభుత్వం నుంచి బ్యాంకులకే ప్రత్యేకంగా హార్డ్‌కాపీ జాబితా వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో నేడు మాఫీ జాబితా వివరాలు పూర్తిగా తెలియనున్నాయి. ఏడీసీసీ బ్యాంకుకు సంబంధించి 350 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇందులో 77 కోట్ల రూపాయలు మాఫీ అవుతున్నాయి. ఇందులో 50 వేల రూపాయల లోపు ఉన్న ఖాతాలకు సంబంధించి రూ.50 కోట్లు మాఫీ అవుతున్నాయి. అలాగే రూ.50 వేలుపైబడి రుణాలున్న ఖాతాల్లో 20 శాతం చొప్పున రూ. 27 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన బాల నాగన్న పేరుతో 1.65, భార్య పేరుపై 0.84 ఎకరాల భూమి ఉంది. నాలుగేళ్ల కిందట శింగనమల సిండికేట్ బ్యాంకులో 18 వేల రూపాయలు పంట రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి 19,968 రూపాయలైంది. అప్పటి నుంచి రీషెడ్యూలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలకు కలిపి 40,535 రూపాయల రుణం ఉంది. స్కేల్ ఆప్ పైనాన్స్ ప్రకారం వీరికి రూ. 33,447లు మాత్రమే రుణం మాఫీ అయినట్లు వచ్చింది. 50 వేల రూపాయల వరకూ రుణమాఫీ అవుతుందని చంద్రబాబు ప్రకటించారు.. కానీ తనకు రూ.40 వేలు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ కాలేదని నాగన్న వాపోతున్నారు. పుట్లూరు మండలం పి.చింతలపల్లికి చెందిన రామిరెడ్డికి 2.68 ఎకరాల పొలం ఉంది. తాడిపత్రి ఎస్బీఐలో రూ.15 వేల రుణాన్ని మూడేళ్ల కిందట తీసుకున్నాడు. అప్పటి నుంచి ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటున్నాడు. ఇతని ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌తో సహా అన్ని పత్రాలను సమర్పించారు. బ్యాంకర్లు కూడా రుణమాఫీకి అర్హత సాధించావన్నారు. అయితే రుణమాఫీ జాబితా రావడంతో మాఫీ అవుతుందని సంతోషంగా బ్యాంకుకు వెళ్లాడు. కానీ ఇతని పేరు జాబితాలో లేదు. -
మాఫీ మాయ
బ్యాంకర్ల చుట్టూ రైతుల ప్రదక్షిణ మెజార్టీ బ్యాంకులకు చేరని జాబితాలు అర్హులకు దక్కని చోటు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం దగా చేశారు.. రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన అధికారులు.. బ్యాంకర్లు.. రైతులను గందరగోళంలోకి పడేసింది. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో.. ఎవరికిమాఫీ అయిందో.. ఎవరికి కాలేదో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సీఎం ప్రకటించి ఆరురోజులు గడిచి పోయాయి. జాబితా విడుదలచేసి నాలుగురోజులైంది. ఏ బ్యాంకు వద్ద పూర్తి స్థాయిలో సమాచారం లేదు . కొన్నిశాఖలలో జాబితాలు ప్రకటించినా వాటిలో అర్హులకుచోటు దక్కని దుస్థితి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం మండలాల వారీగా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణమాఫీపై పరిశీలన జరపగా అంతటా గందరగోళమే నెలకొంది. విశాఖపట్నం: జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే రూ.50వేల రుణమాఫీ సీలింగ్ పేరుతో కేవలం లక్ష 30వేల 979 ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 2.83,021 ఖాతాల్లో మరో లక్షమంది వరకు అర్హులున్నప్పటికీ వారికి మొండిచేయే మిగిలింది. వీటిలో 50వేలకుపై బడి రూ.500ల నుంచి ఐదువేల లోపు ఉందనే సాకుతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ జాబితాలోకి చేర్చినట్టు చెబుతున్నప్పటికీ 70 శాతం మందికి అర్హుల జాబితాలో చోటు దక్కలేదు. సాధారణంగా ఏజెన్సీలోని గిరిజన రైతులంతా 50వేల లోపు రుణం తీసుకున్న వారే. కానీ జాబితాలో చోటు దక్కింది మాత్రం 35 శాతం లోపే. ఉదాహరణకు వి.మాడుగలలో పదివేల మందికి పైగా రైతులుంటే కేవలం 4వేల మందికే జాబితాలో చోటు దక్కింది. కోటపాడులో 8వేలమందిరైతులుంటే కేవలం 3వేల మందికే మాఫీ వర్తించింది. భీమిలి నియోజకవర్గంలో ఏకంగా 6వేల మంది రైతులకు రూ.12.5కోట్ల రుణాలుంటే అర్హుల జాబితాలో ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఇక్కడ పీఎస్సీఎస్ పరిధిలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులు 720మంది ఉంటే కేవలం 62 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది. ఏజెన్సీలో ఒక్కమండలానికే: ఏజెన్సీలో కేవలం కొయ్యూరు మండల పరిధిలోని రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. మిగిలిన మండలాల్లోని సోసైటీల్లో ఎక్కడా జాబితాలనే ప్రదర్శించలేదు. మైదానంలో కేవలం పది మండలాల్లో మాత్రమే అదీ కూడా కొన్ని బ్యాంకుల్లోనే మంగళవారం జాబితాలను ప్రదర్శించారు. 50వేల లోపు రుణాలు తీసుకున్నవారు ఎక్కువ మంది సహకార సంఘాల పరిధిలోనే ఉంటారు. సొసైటీల పరిధిలో రూ.250కోట్లకు పైగా రుణాలున్నాయి. వీటిలో కనీసం 80 శాతం రుణాలు తొలి జాబితాలోనే చోటు దక్కాల్సి ఉన్నప్పటికీ కనీసం 40శాతం రుణాలు కూడా మాఫీకాని పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి మాఫీ సర్టిఫికెట్ల జారీ: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు క్షేత్ర స్థాయి లో రైతుసాధికారత సదస్సుల పేరిట స మావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు మాఫీ సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు బ్యాంకర్లు, జిల్లా అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీకాలేదు. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఉ న్నామని డీఆర్వో నాగేశ్వరరావు సాక్షికి తెలిపా రు. బుధవారం నాటికి క్లారిటీ వస్తుందన్నారు. మోసపోయాం.. ప్రభుత్వం మోసం చేసింది. నాకు పాడేరు డీసీసీబీ బ్యాంకులో 40వేల రుణం ఉంది. వడ్డీతో 50వేల లోపే ఉంది. కానీ జాబితాలో నా పేరు లేదు. అడిగితే మీకు రాలేదంటున్నారు. ఎందుకురాలేదని అడిగితే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పైగా కసురుకుంటున్నారు.ఎందుకు మాఫీ కాలేదో కూడా చెప్పే పరిస్థితిలేదు. -మువ్వల సత్యనారాయణ, గిరిజన రైతు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు రెండు రోజులుగా రుణ మాఫీ జాబితా గురించి బ్యాంకు చుట్టూ తిరుతున్నా జాబితా రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చీడిగుమ్మల సొసైటీలో రూ.30 వేలు, నర్సీపట్నం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. సొసైటీలో రుణమాఫీ గురించి అడిగితే రాలేదంటున్నారు. ఏబీడీ బ్యాంక్ వస్తే అసలు రుణ జాబితా రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటనతో రైతులను ఇబ్బంది పెడుతున్నది. -గండి శ్రీను, చీడిగుమ్మల నాది ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు.ఖరీఫ్ కోసం గతేడాది ఎస్.రాయవరం మండలం గుడివాడ ఎస్బీఐలో రూ.40వేల రుణం తీసుకున్నారు. పుస్తెలతాడుతో సహా బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరో పాతికవేల తీసుకున్నాను. పంట కలిసిరాలేదు. చంద్రబాబు హామీతో అప్పు మాఫీ అవుతుందని ఆశపడ్డాను. మాఫీ జాబితాలో నా పేరు లేదు. ఇంతకంటే దగా ఇంకేముంటుంది. -కె.సత్యలక్ష్మి -
మరో పన్నాగం!
సాక్షిప్రతినిధి, అనంతపురం : రుణ మాఫీపై ఇన్నాళ్లూ రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం తీరా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసే ముందు మరో పన్నాగం పన్నింది. సీఎం చేసిన విధాన ప్రకటనలా కాకుండా ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం మాఫీ చేసేందుకు సిద్ధమైంది. దీంతో చాలామంది రైతులు కచ్చితంగా బ్యాంకులకు నగదు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల నుంచి రూ.6,817 కోట్ల రుణాలను ‘అనంత’ రైతులు తీసుకున్నారు. రుణమాఫీ అమలుకు సర్కారు విధించిన నిబంధనల ప్రకారం అధికారులు జల్లెడ పట్టి 8.68 లక్షల ఖాతాలు అర్హమైనవిగా తేల్చి నివేదికలు పంపారు. ప్రస్తుతం రుణమాఫీ జాబితా ఎన్నో చిక్కుముళ్ల మధ్య ‘ఆన్లైన్’లో రైతులకు అందుబాటులోకి వచ్చింది. బ్యాంకుల వారీగా జాబితాలు వెబ్సైట్లో పొందుపరచడంతో రైతులకు అందుబాటులో జాబితాలను బ్యాంకర్లు ఇంకా డిస్ప్లే చేయలేదు. అయితే ఇప్పుడు బ్యాంకర్ల నుంచి కొత్త మాట వినిపిస్తోంది. రైతులు తీసుకున్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా ‘స్కేల్ ఆఫ్ పైనాన్స్’ ప్రకారం రుణమాఫీని చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను బ్యాంకర్లకు సూచించినట్లు తెలుస్తోంది. రైతులకు తెలీకుండానే వారి నుంచి నగదును రాబట్టే మోసపూరిత ప్రక్రియ ఇది. ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ప్రకారం రుణమాఫీ జరిగితే జిల్లాలోని రైతులకు మరింత అన్యాయం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఖాతాలు అర్హమైనవిగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే, అందులో 22.79 లక్షల మాత్రమే అర్హత సాధించాయని తెలిపారు. అంటే ప్రతిపాదిత ఖాతాల్లో దాదాపు 50 శాతం ఖాతాలు తొలివిడత మాఫీ జాబితాలోకి చేరలేదు. ఈ లెక్కన ‘అనంత’ నుంచి అధికారులు పంపిన 8.68 లక్షల్లో కూడా దాదాపు సగం ఖాతాలు జాబితాలో ఉండవకపోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 4-5లక్షల ఖాతాలు జాబితాలో ఉండొచ్చు. వీరిలో 50 వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1.60 లక్షల నుంచి 2లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మొత్తానికి ఏడాదిన్నరగా వడ్డీ డబ్బును ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై స్పష్టత రాలేదు. దీంతో పాటు స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అమలు చేస్తే తక్కిన డబ్బును రైతులు చెల్లిస్తేనే రుణవిముక్తులై కొత్త రుణాలు తీసుకునేందుకు అర్హత సాధిస్తారు? లేదంటే బకాయిదారుల జాబితాలోనే ఉంటారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే : శివశంకర్ అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.12 వేల రుణాన్ని బ్యాంకర్లు ఇవ్వాలి. అయితే బ్యాంకుకు, తనకూ ఉన్న సత్సంంబంధాలు, లావాదేవీలను బట్టి మూడెకరాలకు రూ.50 వేల రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రూ.50 వేల రుణం మాఫీ కావాలి. అయితే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం శివ శంకర్ 3 ఎకరాలకు 36 వేల రూపాయలు మాత్రమే రుణానికి అర్హుడు. దీంతో ప్రభుత్వం 36 వేల రూపాయలను మాత్రమే మాఫీ చేయనుంది. తక్కిన 14 వేల రూపాయలను బ్యాంకుకు చెల్లించి తీరాల్సిందే! పైగా మొత్తం 50 వేల రూ పాయలకు ఏడాదిన్నరగా 14 శాతం వడ్డీ పడుతుంది. దీన్ని అదనంగా చెల్లించాలి. బంగారు రుణాలదీ మరీ చిత్రమైన సమస్య మూడో ప్రాధాన్యత కింద బంగారు రుణాలను మాఫీ చేస్తానని సీఎం ప్రకటించారు. బంగారు తాకట్టుపెట్టి రైతులు రుణాలు తీసుకున్నపుడు 5 ఎకరాలుంటే 3-6 లక్షల రూపాయల అప్పు కూడా తెచ్చుకున్నారు. కానీ వీరికి స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 60 వేల రూపాయలు మాత్రమే అర్హత వస్తుంది. 50 వేల రూపాయల పైన ఉన్న రుణాలకు ఇప్పుడు 20 శాతం చెల్లించి, తక్కిన మొత్తాన్ని 4 విడత్లో చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన కూడా ప్రభుత్వం ఇచ్చే పత్రాల్లో విధాన ప్రకటన చేసిన సమయంలో ప్రకటించిన విధంగా అప్పును పొందుపరుస్తారా? లేదంటే స్కేల్‌ఆఫ్‌ఫైనాన్స్ ప్రకారం అప్పలపట్టీ చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. ఇదే జరిగితే ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధమైన విధానాలతో రైతులు, బ్యాంకర్లకు మధ్య కొత్త చిక్కులు తలెత్తి వారి మధ్య వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. ‘మేమే కచ్చితంగానే చేశాం. బ్యాంకర్లే లేనిపోని సాకులు చెబుతున్నారు’ అని రైతుల ముందు బ్యాంకర్లను దోషులుగా చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్లు చర్యలను చూస్తే స్పష్టమవుతోంది. -
రుణమాయేనా?
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి అనేక మెలికలు విస్తుపోతున్న రైతాంగం మచిలీపట్నం : రైతు రుణాల మాఫీ ప్రక్రియలో ప్రభుత్వం అనేక గిమ్మిక్కులు చేస్తోంది. తాజాగా ఆన్లైన్లో ఉంచిన రుణమాఫీ జాబితాల్లో వివరాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. జాబితాల్లో ఆయా బ్యాంకులు, రైతుల ఖాతా నంబర్ల వారీగా ఆన్లైన్లో ఉంచారు. బ్యాంకులోని ఖాతాదారుల నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ ఖాతాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయి. రూ.50 వేలకు పైబడి రుణం తీసుకుంటే సంబంధిత రైతు కుటుంబ సభ్యులు తీసుకున్న రుణం వివరాలు, వడ్డీ ఎంత అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎంత రుణమాఫీ జరిగే అవకాశం ఉంది వంటి వివరాలను చూపారు. ఎంత నగదు రుణమాఫీ అయ్యిందన్న కాలం వద్ద ఎలాంటి వివరాలూ చూపలేదు. దీంతో రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు అందుబాటులో లేవు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణమాఫీ జాబితాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది.. ఎంత నగదు జమ చేశారు.. తదితర వివరాలు తమ వద్ద లేవని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుతో పాటు కలెక్టరేట్లోని ఎన్ఐసీ సెంటర్ డీఐవోను, లీడ్‌బ్యాంకు మేనేజరును, వ్యవసాయశాఖ జేడీ, కేడీసీసీ బ్యాంకు సీఈవోను, ఆయా బ్యాంకు మేనేజర్లను రుణమాఫీపై వివరాలు అడిగినా తమ వద్ద లేవని చెప్పడం గమనార్హం. కొలమానంతో కోత ప్రభుత్వం 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2013 డిసెంబరు 31 వరకు తీసుకున్న రుణాలను రుణమాఫీ కింద పరిగణిస్తామని ప్రకటించింది. గుట్టుచప్పుడు కాకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ లెక్కన 2007-08లో పంట రుణం తీసుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఆ బకాయికి ఎకరానికి రూ.14 వేలు మాత్రమే వర్తింపజేసింది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2007-08 సంవత్సరానికి సంబంధించి ఎకరానికి రూ. 14 వేలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని చూపింది. 2012-13లో తీసుకున్న రుణాలకు ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా నిర్ణయించింది. వాస్తవానికి ఆ ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.23 వేలుగా ఉంది. రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతుల ఆశలను వమ్ము చేస్తూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రుణమాఫీ చేయడం నిలువునా మోసం చేయడమేనని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నాటి నుంచే రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, కోటయ్య కమిటీ ఏర్పాటు దీనికి ఉదాహరణని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుండెపగిలిన అన్నదాత... రుణమాఫీకి సంబంధించి ఆన్లైన్లో ఉంచిన జాబితాలో తన పేరు లేదనే బెంగతో గుడ్లవల్లేరు మండలం కట్టవానిచెరువుకు చెందిన అబ్ధుల్ బారీ అనే రైతు సోమవారం గుండెపోటుకు గురై మరణించడం గమనార్హం. రుణమాఫీ ద్వారా ఎంతో కొంత వెసులుబాటు లభిస్తుందని గత కొన్నిరోజులుగా పీఏసీఎస్, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగాడు. రుణమాఫీ జాబితాలో అతని పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలానికి వెళుతూ కుప్పకూలి మరణించాడు. . -
రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి
-
రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి
హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీపై ఈనెల 4న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 20 శాతం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, మిగిలిన మొత్తారికి సర్టిఫికెట్లు జారీచేస్తామని చెప్పారు. అర్హులైన వారికి ముందుగా నగదు జమ చేస్తామన్నారు. వివరాలు సమర్పించేందుకు మరింత ఇచ్చామని చెప్పారు. 82 లక్షల ఖాతాలకు గానూ ఇప్పటికి 43 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అందాయని వెల్లడించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రూ. 50 వేలలోపు రుణం ఉన్నవారిని దీన్ని వర్తింపజేయాలా, వద్దా అనే దానిపై గురువారం ప్రకటన చేస్తామన్నారు. -
అయోమయం
- రైతు రుణమాఫీలో గందరగోళం - ఖాతాలకు సొమ్ములు ఉత్తిదే - ధ్రువీకరించని 3.08 లక్షల ఖాతాలలో 70వేలే పరిశీలన కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అంతా రహస్యంగానే ఉంచుతుండటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. అర్హుల జాబితా చేరిందని చెప్పడంతో మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్దకు రైతులు పరుగులు తీశారు. తుది జాబితా రాలేదని బ్యాంకర్లు చెబుతుండటంతో ఉసూరుమన్నారు. ఆర్థిక శాఖ అధికారులు జిల్లాలో 3,08,380 మంది ఖాతాలకు సంబంధించిన వివరాలలో తేడాలు ఉన్నాయని మండల రెవిన్యూ అధికారులకు నేరుగా ఆన్లైన్లో జాబితాను పంపించినా ఇంత వరకు 70 వేల మంది ఖాతాలను మాత్రమే పరిశీలించి సరిచేశారు. జపాన్ పర్యటన నుంచి సీఎం తిరిగిరాగానే ఖాతాలలో మాఫీ సొమ్ములు పడతాయని చెప్పినా ఇంకా తుది రూపం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా మండలాల్లో రుణమాఫీకి సంబంధించిన పరిశీలన పూర్తి కాలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ చేసి తీరుతామని ఢంకా బజాయించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేదు. కేవలం మసిపూసి మారేడు కాయచేసేందుకే ఈ హంగామా అంతా అని రైతు సంఘాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. స్కేల్ ఆప్ ఫైనాన్స్ అంటూ కొత్త బాణీ .. ఏదో ఒక వంక పెట్టి రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తే రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లిస్తారనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా గట్టిగానే పట్టుపడుతుండటంతో పంటల సాగులో జిల్లా బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదించిన స్కేల్ ఆప్ ఫైనాన్స్ ప్రాతిపదికన రుణమాఫీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి కుట్రపన్నుతున్నట్లు సమాచారం. అదే నిజమైతే రైతులకు రుణమాఫీలో భారీగా గండిపడే అవకాశాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా పంటల సాగు కోసం భూములు, బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి 5,50,513 మంది రైతులు రుణాన్ని తీసుకున్నారు. ఇందులో ఆధార్, రేషన్‌కార్డులకు ముడిపెట్టి 3,08,377 ఖాతాలను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లాలో రేషన్‌కార్డులు లేని రైతులు 41,365 మంది, ఆధార్‌కార్డులు లేనివారు 14,291 మంది, ఆధార్, రేషన్ కార్డులు లేని 85,104 ఖాతాలు, ఆధార్ ఉండి కూడా ఆన్లైన్ ధుృవీకరించనివి 1,67,617 ఖాతాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం జిల్లాలోని ఏపీజీబీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇతర బ్యాంకులు కలిపి 3,08,377 ఖాతాలకుగాను ఇప్పటి వరకు 70,452 ఖాతాలను మాత్రమే సరిచేశారు. ప్రాధమిక సహకార పరపతి సంఘ బ్యాంకులకు జాబితా... జిల్లాలోని ప్రాధమిక సహకార పరపతి సంఘాల బ్యాంకులకు మాత్రం పరిశీలన జాబితా వచ్చిందని, ఇది తుది జాబితా కాదని ఆ బ్యాంకు ఇన్ చార్జ్ ఛీప్ మేనేజరు విజయ భాస్కరరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాలో పంట రుణం తీసుకున్నవారు 72828 మంది కాగా ఇందులో ఆధార్,రేషన్‌కార్డు సమర్పించిన వారు 58127 మంది ఉన్నారు. ఈ ఖాతాలలో మొదటి జాబితాలో 43200 మంది పేర్లు వచ్చాయి. మిగిలిన వారి పేర్లు కూడా వస్తాయని చెబుతున్నా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అర్హుల జాబితా వస్తే ఆ తరువాతి ఖాతాల సంగతేమిటని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులకు తుది జాబితా పంపామని ఒక పక్క ప్రభుత్వం చెబుతున్నా అలాంటిదేమీ లేదని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. -
దారుణం
కరీంనగర్ అగ్రికల్చర్: జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో రైతులు అధికంగా పంట రుణాలు తీసుకుంటారు. వ్యవసాయ పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు పంట రుణాల లక్ష్యాన్ని పెంచుతోంది. ప్రతి సంవత్సరం భారీ లక్ష్యాలు పెట్టుకోవడం, ఆ తర్వాత వాటిని అందుకోలేక చేతులెత్తేయడం రివాజుగా మారింది. కానీ గత ఏడేళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఒక్క 2012-13లో మాత్రమే రుణ లక్ష్యాన్ని చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు గల ఖరీఫ్ సీజన్లో సగటున 60 శాతం మంది రైతులు పంట రుణాలు పొందుతున్నారు. కానీ.. ఈసారి టీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ విషయంలో తీవ్ర జాప్యం చేయడంతో రైతులకు బ్యాంకు రుణాలు పుట్టలేదు. రుణమాఫీ నిబంధనలపై స్పష్టత లేకపోవడం వల్ల ఆగస్టు వరకు కూడా బ్యాంకర్లు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేకపోయారు. ఎట్టకేలకు గత నెలలో రాష్ట్ర సర్కారు రుణమాఫీపై ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ అప్పటికే పుణ్యకాలం కాస్తా పూర్తయింది. రుణమాఫీ డబ్బులను నాలుగు విడతలుగా బ్యాంకర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ కింద జిల్లాకు మొత్తం రూ.1656.856 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, తొలి విడతగా 25 శాతం అంటే రూ.41.25 కోట్లను 3,73,876 మంది రైతులకు విడుదల చేసింది. రుణమాఫీ నిధులు విడుదల కావడంతో రైతులకు పంట రుణాలను ఇవ్వాలని, మాఫీ పొందిన వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. సెప్టెంబర్ 30కి ఖరీఫ్ గడువు ముగిస్తుండగటంతో ఈ నెల 15 వరకు గడువు పెంచింది. ఈ గడువు ముగిసే దశలో జిల్లా యంత్రాంగం కేవలం ఒక్క రోజులో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి రూ.500 కోట్ల పంట రుణాలు అందించేలా బ్యాంకర్లను ప్రోత్సహించింది. అయితే రుణమాఫీ పొందిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు తిప్పలు పెట్టారు. 1బీ రికార్డులు, పహణీ నకలు, 2పాస్‌పోర్టు సైజు ఫొటోలతో రుణమాఫీ హామీ పత్రంపై సంతకం చేసిన రైతులకు కొత్త రుణాలు అందించారు. సమయం తక్కువ కావడం, 1బీ రికార్డు, పహణీ నకలు కోసం రెవెన్యూ అధికారులు తిప్పుకోవడం, మరోవైపు ఆహారభ ద్రత కార్డు, పెన్షన్లు, ఇతర సర్టిఫికెట్లకు దరఖాస్తులు స్వీకరించడంలో అధికారులు బిజీగా మారడంతో ఖరీఫ్ పంట రుణం గడువు కాస్తా పూర్తయ్యింది. బ్యాంకర్ల మెలికలు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులు పంట రుణాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే రుణమాఫీ పొందిన రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి ఇవ్వాలన్న ఆదేశాలను బ్యాంకర్లు పట్టించుకోలేదు. ఉదాహరణకు బ్యాంకులో రూ.81 వేల అప్పు ఉంటే.. ఇందులో 25 శాతం తొలివిడతగా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. రూ.81 వేలలో నాలుగో వంతు అంటే రూ.20,250 రుణమాఫీ కింద ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు రైతుకు రూ.60 వేల రుణం ఇవ్వాల్సి ఉండగా, చాలా మందికి రూ.10 నుంచి రూ.20 వేలు మాత్రమే ఇచ్చారు. రబీలోనూ బ్యాంకర్లు ఇదే పంథా కొనసాగిస్తే.. ఇప్పటికే పెట్టుబడుల భారంతో అప్పులపాలైన అన్నదాతల పరిస్థితి మరింత దా‘రుణం’ కానుంది. రబీలో పంట రుణం లక్ష్యం రూ.650 కోట్లు నిర్దేశించినా.. ఏ మేరకు ఇస్తారో చూడాల్సిందే. -
ఆందోళన వద్దు
సాక్షి, మహబూబ్‌నగర్: రుణమాఫీకి సంబంధించి రై తులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని భరోసాఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం 25శాతం కింద రూ.682 కోట్లు మంజూ రు చేసిందని, త్వరలో మిగతా 75శాతం రు ణం మంజూరవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత రుణమాఫీ కేవలం పంటల బీమాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం 25శాతం నిధులు మాత్రమే మంజూరుచేసిందని వివరించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.682 కోట్లలో ఇప్పటికే దాదాపు 80శాతం బ్యాంకులకు అందజేశామని, మిగతా బ్యాంకులు ఖాతాలు తెరవగానే అందజేస్తామని వెల్లడించారు. కావునా పాత రుణాలను మరిచి కొత్తలోన్లు ఎంత అవకాశముంటే దానిప్రకారం బ్యాంకులు చెల్లిస్తాయని తెలిపారు. చెల్లింపు విధానం ఇలా.. ప్రస్తుత రుణంలో 25శాతం ప్రభుత్వం మాఫీచేసింది. పాతరుణం 75శాతం ఉంటుంది. మాఫీ అయిన 25శాతం రుణానికి కిసాన్ క్రెడిట్‌కార్డు(కెసీసీ)నామ్స్ ప్రకారం అదనంగా రుణం ఇస్తారు. ఈ ప్రకారంగా కొత్తగా 55శాతం రుణం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. ఉదాహరణకు ఒక రైతు రూ.10వేల రుణం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం రూ.2,500 మాఫీ చేసింది. కేసీసీ నామ్స్ ప్రకారం అదనంగా 30శాతం లోన్ కలుపుకుని కొత్తగా రూ.5,500రుణం పొందవచ్చు. అయితే భూమి విస్తీర్ణం, స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ పంట ఎంతమేరకు ఇవ్వొచ్చనే దానిపై రుణం అందుతుందని స్పష్టంచేశారు. రుణమాఫీ కోసం అర్హత సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి ఎంత ఉందనే విషయాన్ని పేర్కొంటూ రెవెన్యూ అధికారి, ఏ పంట ఎంతమేర సాగుచేశారనే విషయాన్ని మండల వ్యవసాయాధికారి గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 30వేల డాక్యుమెంటేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. కొత్తరుణం తీసుకోకపోవడమే ఉత్తమం ప్రస్తుతం బ్యాంకులు కొత్తగా ఇచ్చేరుణాలను రైతులు తీసుకోకపోవడమే ఉత్తమమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రుణాలు కేవలం పంటబీమాను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనాఅనుకోని కరువు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధిచేకూరే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా చెల్లిస్తేనే పంటలబీమా వర్తిస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని వివరించారు. -
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
-
ఎంత రుణం ఇవ్వొచ్చో అంతకే మాఫీ
బంగారం రుణాల మాఫీలో ఏపీ సర్కారు మరో మెలిక హైదరాబాద్: బంగారంపై పంట రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో షరతు విధించిం ది. మాఫీ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రెండు రోజులకోసారి కొత్తగా ఆంక్షలు విధిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లా ల్లో పంట రుణాలకన్నా బంగారం కుదవపెట్టి తీసుకున్న పంట రుణాలు అత్యధికంగా ఉండటంతో వీలైనంతగా ఆ రుణ మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాజాగా మరో నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ వెసులుబాటు అంతంత మా త్రంగానే దొరుకుతుందని, ప్రభుత్వంపై మాఫీ భారం తగ్గిపోతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నారుు. ఏ పంటకు ఎంత మేర రుణం ఇవ్వాలో (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనే అంశంపై బ్యాంకర్లకు స్పష్టమైన నిబంధనలున్నారుు. ఈ నిబంధనల మేరకు తీసుకున్న రుణ మెుత్తాలకే మాఫీ వర్తింపజేయనున్నారు. అంటే బంగారం కుదవ పెట్టి ఎకరం వరి పంటకు లక్ష రూపాయలు రుణం తీసుకున్నప్పటికీ.. నిబంధనల ప్రకారం ఎకరం వరి పంటకు ఎంతమేరకు రుణం ఇవ్వవచ్చో.. అంత మేరకే రుణ మాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట. ఒకవేళ ఎకరం వరి పంటకు రూ.25 వేలు మాత్రమే రుణం మంజూరు చేయాలనే నిబంధన ఉండి.. రైతు లక్ష రూపాయల రుణం తీసుకున్నాడనుకుంటే.. రూ.25 వేల రుణం మాత్రమే మాఫీ అవుతుంది. మిగతా రూ.75 వేలు రైతులే బ్యాంకులకు చెల్లించుకోవాల్సి ఉంటుం దని అధికార వర్గాలు వివరించాయి. ఇతర పంటల విషయంలోనూ ఇదే నిబంధన అమలవుతుంది. ఈ నేపథ్యంలో బంగారం కుదవపెట్టి ఎన్ని ఎకరాల్లో ఏ పంటపై రుణం తీసుకున్నారు, ఆ పంటకు ఎకరానికి ఎంత రుణం మంజూరు చేయాలి.. వివరాలను రుణమాఫీ నమూనా పత్రంలో నింపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు నమూనా పత్రంలో భూ విస్తీర్ణం, సర్వే నంబరు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర అంశాలను చేర్చారు. బ్యాంకులు ఈ నెల 25వ తేదీ వరకు వివరాలు ఇచ్చేందుకు వీలుగా గడువును పొడిగించారు.