రైతులకు పూర్తిస్థాయి రుణాలు ఇవ్వండి
ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కోసం రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలోనూ, అనంతరం విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము మొత్తాన్ని విడుదల చేసిందని, రైతులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందజేయాలని మంత్రి కోరారు. రుణమాఫీ నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని, ఈ విషయంలో బ్యాంకు బ్రాంచీలు చొరవ తీసుకోవాలని అన్నారు. ఏవైనా డాక్యుమెంట్లు బ్యాంకుల వద్ద ఉంటే వెంటనే ఆయా రైతులకు అందజేయాలని సూచించారు.
రైతులకు పంటల బీమా అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 23.02 లక్షల మంది రైతులు పంటరుణాలు తీసుకుంటే అందులో కేవలం 6.7 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లిం చాలన్నారు. రబీలో 13.50 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 2.23 లక్షల మంది మాత్రమే బీమా ప్రీమియం చెల్లించాలన్నారు. పంటల ప్రీమియం చెల్లింపునకు గడువు తేదీలు ముందే ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అందువల్ల గడువు తేదీల కంటే ముందే రైతులకు రుణాలు ఇవ్వాలని, అందుకోసం అవసరమైతే ఏఈవోలు రైతుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొని బ్యాంకులకు అందజేస్తారన్నారు. కొన్ని బ్యాంకులు ప్రీమియం సొమ్ము రైతుల నుంచి సేకరించినా బీమా కంపెనీలకు చెల్లించడంలేదని విమర్శించారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను సరిగా అమలు చేయడంలేదని అన్నారు. . రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 816 కోట్లు రుణాలు ఇచ్చాయని మంత్రి వెల్లడించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి మాట్లాడుతూ 2016–17లో కేవలం 15 శాతమే బీమా ప్రీమియం చెల్లించారని, వచ్చే ఖరీఫ్ నుంచి 40 శాతం వరకు చెల్లించేలా చూడాలని కేంద్రం ఆదేశించిందని వివరించారు. రెండు, మూడు నెలల్లో మరో 500 ఏఈవో పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వివిధ బ్యాంకుల ప్రతి నిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పావులా వడ్డీ, వడ్డీ లేని రుణాల(వీఎల్‌ఆర్) పథకాల నుంచి రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయని, కనీ సం జీవో కూడా జారీ చేయకపోతే ఎలా అని మంత్రి పోచారాన్ని నిలదీశారు. దీంతో మంత్రి స్పందిస్తూ త్వరలో అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తామని హామీయిచ్చారు.