అన్నీ అబద్ధాలే
సీఎం ప్రసంగంపై రైతుల మండిపాటు
వ్యవసాయ రుణాల మాఫీపై శాసనసభలో అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు రూ.50వేలలోపు పంటరుణాలను ఒకేసారి మాఫీ చేశామని, ఆ రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయలేదని చెప్పిన బాబు 2007లో ఉన్న ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ ధరల ఆధారంగానే రుణ మాఫీ చిన్న, సన్నకారు రైతులను నిలువునా ముంచిన ముఖ్యమంత్రి
తిరుపతి: శాసనసభలో సోమవారం నిర్వహించిన చర్చలో రుణమాఫీపై సీఎం చంద్రబాబు చెప్పిన వివరాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో తనను మించిన వారు లేరని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారని మండిపడు తున్నారు. అంతర్గత సమావేశాల్లోనైనా బహిరంగసభలోనైనా.. చివరకు శాసనసభలోనైనా పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని మరోసారి ఆయన చాటి చెప్పారని నిప్పులు కక్కుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలను మాఫీ చేసి.. రైతులకు ఉపశమనం కల్పిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ.. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీ అమలును నీరుగార్చుతూ వచ్చారు. ఒక్కో కుటుంబానికి గరి ష్టంగా రూ.1.5 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్నారు. ఐదు విడతల్లో రుణాన్ని మాఫీ చేస్తానని సెలవి చ్చారు. రూ.50 వేలలోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించారు.
ఆ మేరకే రుణమాఫీ మార్గదర్శకాలను రూపొందించి.. లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లను ఆదేశిం చారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544, రెండో విడత 1,42,229 మొత్తం 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసింది. తక్కిన 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. రూ.11,180.25 కోట్లకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ చేసినట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.
ఎండగట్టిన విపక్ష నేత..
రుణ మాఫీలో రైతులకు చేసిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ శాసనసభలో సోమవారం చర్చకు పట్టుబట్టింది. ఈ చర్చలో రైతులకు చేసిన అన్యాయాన్ని ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. భేషరతుగా రుణ మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు.. రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసి పొట్టకొట్టారు. ఒకే విడత ఆ రైతులకు రుణ మాఫీ చేయలేదు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తోన్న చంద్రబాబుకు రైతులు తగిన రీతిలో బుద్ధిచెబుతారు. అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు ఒకేసారి రుణ మాఫీ వర్తింపజేశామని.. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేయలేదని పబ్లిగ్గా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయలేదని.. అన్యాయం చేసిన రైతు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.
చట్టసభ సాక్షిగా అబద్ధాలా..?
రుణ మాఫీపై సీఎం చంద్రబాబు శాసనసభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని బ్యాంకర్లు.. ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2013-14లో ఆర్‌బీఐ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎకరంలో చెరకు పంటకు రూ.50 వేలు, వరి పంటకు రూ.24 వేలు, వేరుశనగ పంటకు రూ.12 వేలు రుణం ఇచ్చేలా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూపొందించారు. పంట రుణాలు ఇచ్చేటపుడు బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలు ఇస్తారు. బంగారు ఆభరణాలను తనఖా పెట్టినప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పాటించాలన్న నిబంధన లేదు. ప్రభుత్వం రుణ మాఫీ చేసేటపుడు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింపజేసింది. అదీ 2007లో అమల్లో ఉన్న ధరలను వర్తింపజేయడం గమనార్హం. 2007లో చెరకు పంటకు ఎకరానికి రూ.28 వేలు, వరి పంటకు రూ.17 వేలు, వేరుశనగ పంటకు రూ.ఎనిమిది వేలు స్కేల్ ఫైనాన్స్‌గా ఉండేది. రుణ మాఫీలో అవే ధరలను వర్తింపజేసి చిన్న, సన్నకారు రైతులను సైతం ముంచేశారు. పలమనేరు మండలం కన్నమాకులపల్లెకు చెందిన వెంకటాచలం అనే సన్న కారు రైతు ఉదంతమే అందుకు తార్కాణం. వెంకటచాలం ఒక్క రైతుకే కాదు.. లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం ఇదే రీతిలో మాఫీ పేరుతో నిలువునా మోసం చేసింది. శాసనసభలో రుణ మాఫీపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు.
రైతుల పాలిట శాపంగా మారిన బాబు
సీఎం చంద్రబాబు నాయుడు రైతుల పాలిట శాపంగా మారారు. బ్యాంకుల్లో రుణాలు తోసేస్తామని చెప్పారు. ఆచరణలో మాత్రం శూన్యం. బ్యాంకర్లు మాత్రం రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నాను. రుణమాఫీపై బ్యాంకు అధికారులను అడిగాను. ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటున్నారు. ప్రస్తుతానికి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టమని చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్యే శరణ్యం.
-నాగరాజు, గట్టు గ్రామం, పుత్తూరు మండలం
పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలోని కన్నమాకులపల్లెకు చెందిన ఎస్.వెంకటాచలం
(ఖాతా నంబర్ 24187 978) రెండెకరాల సన్నకారు రైతు. కొలసమాసనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లో పట్టాదారు పాసుపుస్తకం తనఖా పెట్టి ఫిబ్రవరి 11, 2013న రూ.49 వేలు పంట రుణం గా పొందాడు. వెంకటాచలం ఆధార్‌కార్డు నంబర్ 282870625380. ఇప్పుడు వడ్డీతో సహా ఆయన అప్పు రూ.53,955.09కు చేరుకుంది. సీఎం చంద్రబాబు సోమవారం శాసనసభలో చెప్పిన ప్రకారం వెంకటాచలం రుణం ఒకేసారి మాఫీ కావాలి. కానీ.. ఆ రైతుకు కేవలం రూ.30,831.48 మాత్రమే మాఫీ చేస్తున్నట్లు ధ్రువపత్రం ఇచ్చారు. తొలి విడతగా 2014-15లో రూ.6,166.30ను రుణ మాఫీ కింద జమా చేస్తున్నట్లు ఆ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. రూ.50వేలలోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేయనట్లు సోమవారం శాసనసభలో సీఎం పేర్కొన్నారు. కానీ.. ఆ రైతుకు 2007లో ఉన్న స్కేల్ ఆఫ్ పైనాన్స్‌ను వర్తింపజేసినట్లు అదే ధ్రువపత్రంలో ఉంది. 2013-14లో చెరకు పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధన మేరకు ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేలకు రుణం ఇవ్వవచ్చు. ఆ మేరకు వెంకటాచలానికి బ్యాంకు రూ.49 వేలను రుణంగా ఇచ్చింది. కానీ.. రూ.21 వేలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా అధికంగా రుణం ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.
వ్యవసాయ రుణాల మాఫీపై సీఎం చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదని చెప్పడానికి ఇదో తార్కాణం. సోమవారం శాసనసభలో రుణమాఫీపై నిర్వహించిన చర్చలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం.