రూ.18,000
- వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు
- మిగిలిన అన్ని రకాల పంటలు, పండ్లతోటలకు కూడా..
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017–18) సంబంధించి జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ (డీఎల్‌టీసీ) పంటల వారీగా తయారు చేసిన బ్యాంకు రుణపరిమితి (స్కేల్‌ఆఫ్ పైనాన్స్) నివేదికను రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. పంటల వారీగా పెట్టుబడులు, దిగుబడులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకుల ద్వారా ఎంత రుణం ఇవ్వాలనే అంశంపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు.
ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీకి ఇది వర్తించనుంది. వర్షాధారంగా వేరుశనగ సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.18 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకర్లు, రైతుల నమ్మకాన్ని బట్టి ఎకరాకు రూ.20 వేల వరకు ఇచ్చే వీలు కూడా ఉంటుంది. నీటి వసతి కింద సాగు చేసే వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.22 వేలుగా నిర్ణయించారు. అన్ని పంటలతో పాటు మల్బరీ, పండ్లతోటలు, కూరగాయల పంటలకు కూడా రుణపరిమితి ఖరారు చేశారు. పెరిగిన పంట పెట్టుబడులతో పోల్చితే ప్రస్తుత రుణపరిమితి తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని రైతుసంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.