మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌కు చెందిన రైతు విజయ్‌కుమార్‌రెడ్డి క్వింటా వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున వెచ్చించి 6 క్వింటాళ్ల విత్తనాలు తెచ్చాడు. వీటితో ఏడు ఎకరాల్లో సాగు చేయగా.. పంట చేతికి వచ్చే వరకు రూ.2 లక్షలు పెట్టుబడి కోసం ఖర్చయింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సినా వాతావరణంలో మార్పులతో ఎకరాకు కేవలం 20 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తంగా 148 బస్తాల పంట చేతికి అందింది. ఈ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.4,450తో అమ్మితే నష్టమే తప్ప లాభముండదు. దీంతో క్వింటాకు రూ.6వేలు వచ్చే వరకూ అమ్మేది లేదంటూ ఇంట్లోనే నిల్వ చేశాడు.
మరికల్ (నారాయణపేట): మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలో వెంకటాపూర్ ఓ చిన్న గ్రామం. ఇక్కడి రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన వేరుశనగ పంటకు మార్కెట్‌లో మద్దతు ధర లభించలేదు. దీంతో మార్కెట్‌లో దళారులు కొనుగోలు చేసే అరకొర ధరకు అమ్మలేక, నష్టాలను కొని తెచ్చుకోలేక మద్దతు ధర వచ్చేంత వరకు పంటను అమ్మరాదనే ఉద్దేశంతో గ్రామంలోని రైతులందరూ ఏకమైయ్యారు. పండించిన పంటను ఏ ఒక్కరూ అమ్మకుండా తమ ఊళ్లోనే నిల్వ ఉంచుకున్నారు.
ఈ ఏడాది రబీలో సుమారు 120 ఎకరాల్లో దాదాపు 25 మంది రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి క్వింటాల్ వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున తెచ్చి నాటారు. ఎకరాకు రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. అయితే వాతావరణంలో మార్పుల కార ణంగా పంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు రావాల్సిన పంట, కేవలం 15 నుంచి 20 బస్తాల లోపే వచ్చింది. పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు క్వింటాల్ వేరు శనగను కేవలం రూ.4,200 అడుగుతున్నారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే క్వింటాకు రూ.4,450 ధర కట్టడంతో చేసేది లేక పంటను వెనక్కి తీసుకొచ్చారు. ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన రూ.6 వేల మద్దతు ధర ఇస్తేనే అమ్ముతామని చెబుతూ ఇళ్లలో వేరుశనగ పంటను నిల్వ చేసుకున్నారు. అయితే రైతులకు పెట్టుబడికోసం అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు వస్తు న్నాయి. కానీ పంటను ఇప్పటి ధరకు అమ్మితే అప్పులు తీరకపోగా.. చేతికి ఏమీ మిగలదనే భావనతో కష్టమైనా సరేనంటూ పట్టుదలగా వేరుశనగను అలాగే ఉంచేశారు. పంటను ఇంట్లో నిల్వ ఉంచుకుని రెండు నెలలు దాటింది. ప్రభుత్వం క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
మద్దతు ధర వచ్చే వరకు అమ్మబోం
వేరుశనగ పంటకు మద్దతు ధర వచ్చే వరకు గ్రామం నుంచి ఒక్క క్వింటా కూడా అమ్మబోం. నాలుగు నెలల పాటు రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడిన పంటకు మద్దతు రాకపోతే మా పరిస్థితి ఏమిటి? ధర వచ్చే వరకు ఇలాగే ఉంటాం. – గుణవతి, మహిళా రైతు, వెంకటాపూర్
రూ.6 వేలతో కొనుగోలు చేయాలి
ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టి పండించిన వేరుశనగ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర క్విటాలుకు రూ.4,450 కొనుగోలు చేసిన పంటనే కే–6 సబ్సిడీ విత్తనాలు అంటూ మళ్లీ మిగతా రైతులకు క్వింటా రూ.7వేలకు అమ్ముతున్నారు. ఇది న్యాయమేనా? రూ.6వేల ధర ఇచ్చే వరకు పంటను నిల్వ ఉంచుకుంటాం. – లక్ష్మారెడ్డి, రైతు, వెంకటాపూర్
ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనుగోలు
రబీలో రైతులు పండించిన వేరుశనగ పంట క్వింటాకు ప్రభుత్వం రూ.4,450 ధర నిర్ణయించింది. ఈ ధరతోనే కేంద్రాల్లో కొనుగోలు చేస్తాం. మార్కెట్‌లో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధర ఇస్తామంటే రైతులు అమ్ముకోవచ్చు. «రైతులు డిమాండ్ చేస్తున్నారని ధర పెంచే అవకాశం మా చేతుల్లో ఉండదు. – సక్రియానాయక్, ఏడీఏ, నారాయణపేట
Comments
Please login to add a commentAdd a comment