groundnut crop
-
ఏడాది గడచినా ఏ సాయమూ లేదు
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే రైతు కురువ నారాయణ పంటలు పండక అప్పులపాలయ్యాడు. చంద్రబాబు హామీ ప్రకారం పూర్తిగా రుణ మాఫీ జరగలేదు. పేరుకుపోయిన అప్పుల భయంతో సొంత పొలంలోనే 2018 జనవరి 2న పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా డోన్ రూరల్ మండల పరిధిలోని తాడూరు. నారాయణ ఆత్మహత్య చేసుకొని ఏడాది గడచినా ప్రభుత్వం నుంచి అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందలేదు.నారాయణకు భార్య లక్ష్మీదేవితో పాటు కుమారుడు మల్లికార్జున, కుమార్తె సుజాతమ్మ ఉన్నారు. అయితే, నారాయణ భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యం వల్ల చనిపోగా, కూతురు కుటుంబ కలహాల వల్ల అల్లుడి చేతిలో హతమైంది. కుమారుడు మల్లికార్జునకు పెళ్లయింది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. నారాయణకు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో నాలుగెకరాలు గుత్తకు తీసుకొని కంది, వేరుశనగ పంటలను వేసేవారు. పంటనే నమ్ముకున్న ఆయన తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సీజన్లుగా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ఆంధ్రా బ్యాంకులో రూ. లక్ష పంట రుణంతో పాటు బయటి వ్యక్తుల దగ్గర మరో రూ.4.80 లక్షలు అప్పులు మిగిలాయి. తొలి విడతలో రూ. 36 వేల వరకు మాత్రమే రుణ మాఫీ జరిగింది. పంటలు సరిగ్గా పండక, ప్రభుత్వం పట్టించుకోక, అప్పులు తీర్చే మార్గం లేక నారాయణ తీవ్ర మనస్తాపం చెందారు. పంట పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి విచారణ చేసిన ఆర్డీఓ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని కుటుంబానికి హామీ ఇచ్చారు. అయినా, నేటి వరకు నయాపైసా సహాయం అందలేదని, దిక్కుతోచడం లేదని నారాయణ కుమారుడు మల్లికార్జున ఆవేదన చెందుతున్నారు. రామాంజినేయులు, సాక్షి, డోన్ రూరల్, కర్నూలు జిల్లా. -
‘పంట’ పండింది!
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రాష్ట్రంలోనే రికార్డు స్థాయి కొనుగోళ్లు నిర్వహించినట్లు తెలుస్తోంది. వనపర్తి మార్కెట్‌కు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక్కరోజే 40 వేల బస్తాల వేరుశనగ విక్రయానికి వచ్చింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి వచ్చే కొనుగోలుదారులు వనపర్తి ప్రాంత వేరుశనగ పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. నెల రోజుల నుంచి వనపర్తి మార్కెట్‌కు వేరుశనగ పోటెత్తుతోంది. కాగా, సోమవారం క్వింటా వేరుశనగకు రూ.5,220 ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. రాత్రి పొద్దుపోయే వరకు కాంటాలు కొనసాగాయి. అయి తే, జనవరిలో క్వింటాకు అత్యధికంగా రూ.6,181 ధర పలికిందని.. ఇప్పుడు పడిపోతుండటంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. -
పాలమూరు జిల్లా వెంకటాపూర్ రైతుల పట్టుదల
మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌కు చెందిన రైతు విజయ్‌కుమార్‌రెడ్డి క్వింటా వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున వెచ్చించి 6 క్వింటాళ్ల విత్తనాలు తెచ్చాడు. వీటితో ఏడు ఎకరాల్లో సాగు చేయగా.. పంట చేతికి వచ్చే వరకు రూ.2 లక్షలు పెట్టుబడి కోసం ఖర్చయింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి రావాల్సినా వాతావరణంలో మార్పులతో ఎకరాకు కేవలం 20 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తంగా 148 బస్తాల పంట చేతికి అందింది. ఈ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.4,450తో అమ్మితే నష్టమే తప్ప లాభముండదు. దీంతో క్వింటాకు రూ.6వేలు వచ్చే వరకూ అమ్మేది లేదంటూ ఇంట్లోనే నిల్వ చేశాడు. మరికల్ (నారాయణపేట): మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలో వెంకటాపూర్ ఓ చిన్న గ్రామం. ఇక్కడి రైతులు ఆరుగాలం కష్టపడి పడించిన వేరుశనగ పంటకు మార్కెట్లో మద్దతు ధర లభించలేదు. దీంతో మార్కెట్లో దళారులు కొనుగోలు చేసే అరకొర ధరకు అమ్మలేక, నష్టాలను కొని తెచ్చుకోలేక మద్దతు ధర వచ్చేంత వరకు పంటను అమ్మరాదనే ఉద్దేశంతో గ్రామంలోని రైతులందరూ ఏకమైయ్యారు. పండించిన పంటను ఏ ఒక్కరూ అమ్మకుండా తమ ఊళ్లోనే నిల్వ ఉంచుకున్నారు. ఈ ఏడాది రబీలో సుమారు 120 ఎకరాల్లో దాదాపు 25 మంది రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి క్వింటాల్ వేరుశనగ విత్తనాలకు రూ.11,500 చొప్పున తెచ్చి నాటారు. ఎకరాకు రూ.35 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. అయితే వాతావరణంలో మార్పుల కార ణంగా పంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు రావాల్సిన పంట, కేవలం 15 నుంచి 20 బస్తాల లోపే వచ్చింది. పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే దళారులు క్వింటాల్ వేరు శనగను కేవలం రూ.4,200 అడుగుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే క్వింటాకు రూ.4,450 ధర కట్టడంతో చేసేది లేక పంటను వెనక్కి తీసుకొచ్చారు. ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన రూ.6 వేల మద్దతు ధర ఇస్తేనే అమ్ముతామని చెబుతూ ఇళ్లలో వేరుశనగ పంటను నిల్వ చేసుకున్నారు. అయితే రైతులకు పెట్టుబడికోసం అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు వస్తు న్నాయి. కానీ పంటను ఇప్పటి ధరకు అమ్మితే అప్పులు తీరకపోగా.. చేతికి ఏమీ మిగలదనే భావనతో కష్టమైనా సరేనంటూ పట్టుదలగా వేరుశనగను అలాగే ఉంచేశారు. పంటను ఇంట్లో నిల్వ ఉంచుకుని రెండు నెలలు దాటింది. ప్రభుత్వం క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మద్దతు ధర వచ్చే వరకు అమ్మబోం వేరుశనగ పంటకు మద్దతు ధర వచ్చే వరకు గ్రామం నుంచి ఒక్క క్వింటా కూడా అమ్మబోం. నాలుగు నెలల పాటు రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడిన పంటకు మద్దతు రాకపోతే మా పరిస్థితి ఏమిటి? ధర వచ్చే వరకు ఇలాగే ఉంటాం. – గుణవతి, మహిళా రైతు, వెంకటాపూర్ రూ.6 వేలతో కొనుగోలు చేయాలి ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి పెట్టి పండించిన వేరుశనగ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు రూ.6వేలతో కొనుగోలు చేయాలి. రైతుల దగ్గర క్విటాలుకు రూ.4,450 కొనుగోలు చేసిన పంటనే కే–6 సబ్సిడీ విత్తనాలు అంటూ మళ్లీ మిగతా రైతులకు క్వింటా రూ.7వేలకు అమ్ముతున్నారు. ఇది న్యాయమేనా? రూ.6వేల ధర ఇచ్చే వరకు పంటను నిల్వ ఉంచుకుంటాం. – లక్ష్మారెడ్డి, రైతు, వెంకటాపూర్ ప్రభుత్వం ప్రకటించిన ధరకే కొనుగోలు రబీలో రైతులు పండించిన వేరుశనగ పంట క్వింటాకు ప్రభుత్వం రూ.4,450 ధర నిర్ణయించింది. ఈ ధరతోనే కేంద్రాల్లో కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధర ఇస్తామంటే రైతులు అమ్ముకోవచ్చు. «రైతులు డిమాండ్ చేస్తున్నారని ధర పెంచే అవకాశం మా చేతుల్లో ఉండదు. – సక్రియానాయక్, ఏడీఏ, నారాయణపేట -
అంతకు మించి
జిల్లాకు వరప్రదాయినిగా మారిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. రబీలో సాగు చేసిన వేరుశనగ పంట రైతు చేతికి వచ్చింది. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారగా రైతులు తమ రెక్కల కష్టంతో పసిడి పంటలుపండించారు. దీంతో జిల్లాలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లన్నీ రబీ వేరుశనగతో కిటకిటలాడుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్ : రబీ పంటలు చేతికొచ్చాయి. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ రైతుల సందడే కనిపిస్తోంది. ట్రాక్టర్లు, ఆటోలు, ఎద్దుల బండ్లన్నీ మార్కెట్‌యార్డుల చెంతకే వెళ్తున్నాయి. వారంపదిరోజులుగా అయితే వేలాది బస్తాల వేరుశనగ ప్రతిరోజూ ఆయా మార్కెట్లకు తరలి వస్తుందంటే నమ్మశక్యం కావడంలేదు. సరుకును కొనేందుకు స్థానిక వ్యాపారులే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన వారు సైతం ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగానే మార్కెట్లలో ధర లభిస్తోంది. జిల్లా లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.5వేలకు పైగా ధర లభిస్తుండటంతో రైతుల ము ఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ ధర రై తుల కష్టాలను పూర్తిగా తీర్చనప్పటికీ ఆ రువేల పైచిలుకు ధర లభిస్తే రైతులకు కొంత లాభం చేకూరే అవకాశాలున్నాయి. కలిసొచ్చిన తుంపర సేద్యం ఆరుగాలం శ్రమించే జిల్లా రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా కృష్ణా జలాలు పొలాల గుండా పారాయి. 2017 అక్టోబర్ నుంచి కాలువల నుంచి నీరు పారుతుండటంతో రైతులు ధైర్యంగా రబీ పంటకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు భూగర్భ జలాలు మెరుగు పడటంతో తుంపర సేద్యం ద్వారా వేరుశనగను భారీగా సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణం 69వేల 887 ఎకరాలు కాగా ఈసారి లక్షా 30వేల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలోనే కందనూలు జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగైనట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మూడు ప్రధాన మార్కెట్లలో పెరిగిన వ్యాపారం జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్లకు పెద్ద ఎత్తున వేరుశనగ తరలివస్తోంది. నేరుగా కమీషన్ ఏజెంట్లే రైతుల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనప్పటికీ వేరుశనగ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు ధరను మించి ధర లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి వేరుశనగ లావాదేవీలలో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.5039 చెల్లించి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.4029 జిల్లాలో వేరుశనగ ధర నమోదైంది. సరాసరిగా రూ.4735 క్వింటాల్‌కు ప్రైవేటు వ్యాపారులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు 28వేల 991 క్వింటాళ్ల వేరుశనగను కొనుగోలు చేశారు. వేరుశనగ విక్రయాలు మరో 20 రోజులపాటు ఇదేవిధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో సాగయిన వేరుశనగ విస్తీర్ణంలో కేవలం 25 శాతం మాత్రమే ఇప్పటి వరకు రైతుల చేతికి వచ్చింది. మొత్తం పంట దిగుబడి అంచనా ఒక లక్షా 61వేల 140 మెట్రిక్ టన్నులుగా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎకరాకు 6 నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థలాభావంతో ఇబ్బందులు జిల్లాలోని రబీ పంట ఒక్కసారిగారైతుల చేతికి రావడంతో మార్కెట్ యార్డులలో స్థలాలు సరిపోక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పర్యటించిన సందర్భంలో వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో రైతులకు మార్కెట్ యార్డులలో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనాలు లేకపోవడం, భోజనం చేయటానికి వేర్వేరుగా రూములు లేకపోవడంతో ఆరు బయటనే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. మలమూత్ర విసర్జనకు సైతం మూత్రశాలలు లేకపోవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మార్కెట్ చుట్టూ ప్రహరీ గోడ లేక పందుల బెడదతో పంటకు రక్షణ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరత అధికమైంది. వేరుశనగ పంట తొలగింపునకు ఒక్కో మహిళా కూలీకి రూ.300 దాకా కూలి చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూలీలు దొరకక చాలామటుకు భూముల్లోనే వేరుశనగ మిగిలి ఉంది. ఇలా మరికొద్ది రోజులు గడిస్తే వేరుశనగ కాయలు మొలకెత్తే ప్రమాదం లేకపోలేదు. వ్యవసాయ శాఖాధికారులు వేరుశనగ పంట తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాల వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహం లేక రైతులకు వచ్చే లాభమంతా కూలీలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరం వేరుశనగ సాగుకు రూ.10వేలు విత్తనాలకు, మరో 10వేలు ఎరువులు, కూలీల ఖర్చులు అవుతాయి. ఇలా ఎకరానికి ఒక్కో రైతు రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎకరా దిగుబడి సరాసరి ఐదు క్వింటాళ్లు అనుకుంటే రైతుకు ప్రస్తుతం అందుతున్న ధర ప్రకారం రూ.25వేలు చేతికొస్తాయి. అంటే రైతు పెట్టిన పెట్టుబడి రూ.20వేలు పోగా ఎకరాకు కేవలం రూ.5వేలు మాత్రమే రైతు చేతికి అందుతుండటంతో నష్టం లేకుండా రైతులు కొద్దిపాటి లాభంతో బయట పడుతున్నారు. కొల్లాపూర్ మార్కెట్ నిరుపయోగం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ యార్డు ఉన్నా అక్కడి మార్కెట్లో వేరుశనగ కొనుగోలు చేసే ట్రేడర్లు లేక ఆ ని యోజకవర్గంలోని రైతులంతా నాగర్‌కర్నూ ల్ మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. దీంతో వారికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అధికంగా వస్తోంది. మిగిలే ఆ డబ్బులు కూడా రైతులు పొందలేకపోతున్నారు. అధికారులు అక్కడే కొనుగోళ్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. కొల్లాపురం నుంచి వచ్చినా.. నాలుగు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. 27 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే కొల్లాపూర్ మార్కెట్లో వ్యాపారులు లేక ఇంత దూరం రావాల్సి వచ్చింది రూ.3వేలు పెట్టి ట్రాక్టర్ కిరాయి తీసుకుని నాగర్‌కర్నూల్ మార్కెట్‌కు వచ్చాను. ఇక్కడ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4729 చొప్పున 94 బస్తాలను కొన్నారు. – శ్రీను, ఎల్లూరు, కొల్లాపూర్ మండలం అందరూ ప్రైవేట్‌లోనే విక్రయిస్తున్నారు.. ప్రస్తుతం జిల్లాలో అన్ని మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేటుగానే రైతులకు అధికంగా వస్తుండటంతో ఎవరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. రానున్న రోజుల్లో ప్రైవేటు వ్యాపారుల వద్ద ధర తగ్గితే అప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యం కొంటాం. – బాలమణి, మార్కెటింగ్ ఏడీ -
వెలుగులు నింపే ‘ఓలిక్’ వేరుశనగ!
వేరుశనగలో అత్యంత మేలైన , మెట్ట ప్రాంత రైతులకు అధిక రాబడిని అందించే రకాలేవి? ఓలిక్ యాసిడ్ ఎక్కువ శాతం ఉండే రకాలు! ఎందుకని?.. సాధారణ వేరుశనగలు 2 నెలల్లోనే మెత్తబడి పోతాయి. వీటిలో ఓలిక్ యాసిడ్ 45–50% వరకు ఉండటమే కారణం. కాబట్టి, ఇటువంటి వేరుశనగలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయటం కష్టం. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉంటే.. 9 నెలల వరకు మెత్తబడి పాడు కాకుండా నిల్వ చేయొచ్చు! అంతేకాదు.. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగలు వినియోగదారుల ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయి. అందుకే.. మన దేశంలో, ఇతర ఆసియా దేశాల్లోని ఆహార శుద్ధి కంపెనీలు ఆస్ట్రేలియా నుంచి ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉన్న వేరుశనగలను ప్రతి ఏటా వేలాది టన్నులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఓలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే వేరుశనగ రకాలను మనమే అభివృద్ధి చేసుకోగలిగితే ఎంతబావుంటుందో కదా..? ఆ రకాలు అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తిక్క తెగులు, తుక్కు తెగుళ్లను కూడా సమర్థవంతంగా తట్టుకొనగలిగినవైతే మన రైతులకు మరింత మేలు కదూ? సరిగ్గా ఏడేళ్ల క్రితం డా. పసుపులేటి జనీలకు ఈ ఆలోచన వచ్చింది. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ(ఇక్రిశాట్)లోని వేరుశనగ వంగడాల అభివృద్ధి విభాగంలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఏడేళ్ల పాటు కొనసాగించిన పరిశోధన సఫలీకృతమైంది. గుజరాత్‌లోని జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి పరిశోధనా కేంద్రం, ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలెం పరిశోధనా కేంద్రం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో, క్షేత్రప్రయోగాల్లో పాలుపంచుకున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు కావు.. తిరిగి వాడుకోవచ్చు.. ఇక్రిశాట్లో డా. జనీల ఆధ్వర్యంలో 2011 నుంచి ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడాలపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే అమెరికన్ వంగడం(సనోలిక్95ఆర్)తో స్థానిక వంగడాలను సంకరపరచి 16 కొత్త వంగడాలను రూపొందించారు. జన్యుమార్పిడి పద్ధతులను అనుసరించలేదు. మాలిక్యూలర్ మార్కర్స్తోపాటు అనేక సాంకేతికతలను వినియోగించడం ద్వారా సాధారణం కన్నా 3–4 ఏళ్ల ముందుగానే పరిశోధనను తక్కువ ఖర్చుతోనే కొలిక్కి తెచ్చామని డా. జనీల సంతోషంగా చెప్పారు. ఓలిక్ యాసిడ్ 80% వరకు ఉండే ఐ.సి.జి.వి. 03043 అనే రకంతో పాటు మరో రెండు వేరుశనగ వంగడాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రకాలను సాగు చేసే రైతులు తమ పంట నుంచి కొన్ని కాయలను పక్కన పెట్టుకొని తిరిగి విత్తనంగా వాడుకోవచ్చు. స్థానికంగా క్షేత్ర ప్రయోగాలు చేసిన తర్వాత వేరుశనగ విస్తారంగా సాగయ్యే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 2017లో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌కు చెందిన నరసింహారెడ్డి తదితర రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకూ రైతులు ఇష్టపడి సాగుచేస్తున్న వేరుశనగ రకాల కన్నా (5–15% నుంచి 84% వరకు) అధిక దిగుబడి వచ్చిందని, ఓలిక్ యాసిడ్ 80% వరకు వచ్చిందని డా. జనీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. సాధారణంగా మన వేరుశనగ గింజల్లో 48% వరకూ వచ్చే నూనె దిగుబడి.. ఐ.సి.జి.వి. 03043 రకంలో 53% రావటం విశేషమన్నారు. ఆరోగ్యదాయకం.. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వేరుశనగలు వినియోగదారులకు మరింత ఆరోగ్యదాయకమైనవి. ఓలిక్ యాసిడ్ తక్కువగా ఉండే సాధారణ వేరుశనగలు లేదా వాటితో తయారు చేసిన ఆహారోత్పత్తులు రెండు నెలల్లో మెత్తబడుతాయి. కాబట్టి, ఆహార శుద్ధి కర్మాగారాల యాజమాన్యాలు ఆస్ట్రేలియా నుంచి 9 నెలల పాటు నిల్వ సామర్థ్యం కలిగిన, అధిక ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశనగలను ఏటా భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు సిద్ధమైన కొత్త వంగడాలు పూర్తిగా సాగులోకి వస్తే ఈ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోని ఆహార శుద్ధి కర్మాగారాలకు ఇంకా ఓలిక్ యాసిడ్ ప్రాధాన్యంపై తగినంత చైతన్యం లేదని ఆమె అన్నారు. వీరిలో చైతన్యం పెంపొందించడంతోపాటు రైతులకు కొత్త వంగడాలను అందిస్తే పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు కూడా మేలు కలుగుతుంది. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల వేరుశనగ నూనె వాసన మెరుగ్గా ఉంటుందని, గుండె జబ్బుల నివారణతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరతాయని ఆమె అన్నారు. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఆహార శుద్ధి కంపెనీలతో ముందస్తు ఒప్పందాల మేరకు ఈ వంగడాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఈ వంగడాలను సాగు చేయటం వల్ల రైతులకు అధిక ఉత్పత్తితోపాటు కనీసం 10% అధిక ధర కూడా లభిస్తుందని డా. జనీల చెబుతున్నారు. గుజరాత్లో సుమారు 8 వేల మంది రైతులతో కూడిన ఖెదుత్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ అనే సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా కొత్త వంగడాలను సాగు చేయించారు. మార్కెట్ అవసరాలకు తగినంత నాణ్యత కలిగిన వేరుశనగలను వారు పండించి లబ్ధిపొందుతున్నారని డా. జనీల వివరించారు. ప్రస్తుతం దేశంలో 48 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతోంది. ఇక్రిశాట్ రూపొందించిన కొత్త వంగడాలు తక్కువ ఎరువులు, పురుగుమందులతోనే మంచి దిగుబడినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అత్యధికంగా 40 వరకు ఊడలు వస్తున్నందున ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయదారులు కూడా ఈ వంగడాలను సాగు చేయడం ద్వారా మంచి గిట్టుబాటుధర పొందడానికి అవకాశం ఉంటుందంటున్నారు. చెట్టుకు 30కి పైగా కాయలున్నాయి..! పదేళ్లుగా వేరుశనగను సాగు చేస్తున్నా. కె6, టాగ్ 24 రకాలు మచ్చ(తిక్క) తెగులును తట్టుకోవటం లేదు. దిగుబడి 3, 4 క్వింటాళ్లే వస్తున్నది. ఈ ఏడాది ఐ.సి.జి.వి. 03043 రకం సాగు చేశా. మచ్చ తెగులును తట్టుకోవటంతో చేనంతా పచ్చగా ఉంది. ఊడలు ఎక్కువగా వచ్చాయి. 60 రోజుల తర్వాతే ఊడలు వస్తున్నాయి. చెట్టుకు 30కి పైగా కాయలు ఉన్నాయి. 5 నెలల పంట కాలం. ఆకుమచ్చ తెగులు రాలేదు కాబట్టి ఆకు రాల్లేదు. మంచి పశుగ్రాసం కూడా వస్తుంది. తుప్పు తెగులు ఒకటి, రెండు మొక్కలకు తప్ప రాలేదు. 10 రోజుల్లో కాయలు కోస్తాం. బాగా లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నా. – మల్లాయపల్లి నరసింహారెడ్డి (86869 55757), వేరుశనగ రైతు, శ్రీరంగాపూర్, వనపర్తి జిల్లా నారాయణ, కె6 కన్నా అధిక దిగుబడి.. ఉత్పత్తిదారుల సంఘాలకు విత్తనాలిస్తాం! ఈ కొత్త వేరుశనగ వంగడాలను ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేయించగా.. నారాయణ రకంతో సమానంగా దిగుబడి వచ్చింది. ఓలిక్ యాసిడ్ 80% వచ్చింది. అధిక ఉష్ణోగ్రతను, బెట్టను, తుప్పు తెగులు, తిక్క తెగులును తట్టుకున్నాయి. తెలంగాణలో కె6 కన్నా మెరుగైన దిగుబడి వచ్చింది. 2018లో కూడా క్షేత్రస్థాయి ప్రయోగాలు కొనసాగుతాయి. ఆ తర్వాత అధికారికంగా విడుదల అవుతాయి. అయితే, ఈ లోగానే కొంత మేరకు విత్తనోత్పత్తి కోసం వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు, జాతీయ విత్తన సంస్థ(ఎన్.ఎస్.సి.)కు వచ్చే ఖరీఫ్ నాటికి కొత్త విత్తనాలను అందించాలనుకుంటున్నాం. – డా. పసుపులేటి జనీల (99899 30855), ముఖ్య శాస్త్రవేత్త, ఇక్రిశాట్, పటాన్చెరు, మెదక్ జిల్లా. p.janila@cgiar.org వేరుశనగ రకాల మధ్య తేడాలను వివరిస్తున్న రైతు నరసింహారెడ్డి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వేరుశనగకు బ్రేక్
- 32 సంవత్సరాల తర్వాత తగ్గిన విస్తీర్ణం – 1985 తర్వాత 3.65 లక్షల హెక్టార్లకే పరిమితం – 1960 నుంచి 1985 వరకు చిరుధాన్యాలదే పైచేయి అనంతపురం అగ్రికల్చర్: ముప్పై రెండు సంవత్సరాల తర్వాత జిల్లాలో వేరుశనగ పంట విస్తీర్ణం తగ్గింది. ఇది మంచికా చెడుకా అని పక్కన పెడితే ఈ సారి పంటల సాగులో వైవిద్యం కనిపించే అవకాశం ఉంది. వేరుశనగతో పాటు కంది, పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, కొర్ర, రాగి, పెసర, అలసంద, ఉలవ లాంటి ప్రత్యామ్నాయ పంటలు కొంతవరకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా పంటల సాగు రైతులకు ఎంత వరకు ఉపకరిస్తుందనేది వేచిచూడాలి. దెబ్బతీసిన జూలై జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల 6.04 లక్షల హెక్టార్లకు గానూ వేరుశనగ విస్తీర్ణం 3.65 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. జిల్లా చరిత్రలో 1985 తరువాత సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఇదే తొలిసారి. ఇటీవల కాలంలో 2009లో 5.10 లక్షల హెక్టార్లు, 2015లో 4.44 లక్షల హెక్టార్లలో పంట వేశారు. 1985 సంవత్సరానికి ముందు వేరుశనగ కన్నా ప్రత్యామ్నాయ పంటలే ఎక్కువ వేసేవారు. కాలక్రమేణా వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల వాణిజ్య పంటగా అవతరించిన వేరుశనగ 1986 నుంచి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 1995లో ఏకంగా 8.78 లక్షల హెక్టార్ల అత్యధిక విస్తీర్ణం పంట సాగు చేశారు. అలా పెరుగుతూ వచ్చిన వేరుశనగ 1990 తర్వాత జిల్లా రైతులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకుని ఏకపంటగా విస్తరించింది. వేరుశనగ లేనిదే ‘అనంత’ వ్యవసాయం లేదనే స్థాయికి చేరుకుంది. స్పష్టత లేని ప్రత్యామ్నాయం జూన్, జూలైలో నెలకొన్న వర్షాభావం వల్ల ఖరీఫ్ సాగు నిరాశాజనకంగా సాగుతోంది. ప్రత్యామ్నాయ పంటలు ఏ మేరకు వేస్తారనేదానిపై ఇంకా అంచనాకు రాలేకపోతున్నారు. దాదాపు 30 మండలాల్లో వేరుశనగ పంట విస్తీర్ణం సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వేశారు. ఇప్పటివరకు అయితే కంది 44 వేల హెక్టార్లు, ప్రత్తి 25 వేల హెక్టార్లు, మొక్కజొన్న 10 వేల హెక్టార్లు, ఆముదం 7 వేల హెక్టార్లు, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఉలవ, పెసర, అలసంద తదితర అన్ని పంటలు కలిపి ఒక లక్ష హెక్టార్లలో వేశారు. ఆగస్టు చివరి వారంతో పాటు సెప్టెంబర్‌లో ఏ మేరకు పంటలు సాగులోకి వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. వ్యవసాయశాఖ ఐదు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తారని అంచనా వేసినా అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2 నుంచి 2.50 లక్షల హెక్టార్లలో వేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నా తెగుళ్ల భయంతో వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో చిరుధాన్యాలదే పైచేయి 1960 నుంచి 1985 వరకు జిల్లాలో చిరుధాన్యపు పంటల హవా కొనసాగింది. ఆరికలు, సాములు, జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జ పంటలు విపరీతంగా పండించేవారు. 1960కు ముందు కూడా ఈ పంటలే పూర్తీస్థాయిలో వేసేవారు. 1961–62లో చిరుధాన్యపు పంటలు 5.55 లక్షల హెక్టార్లలో వేయగా, వేరుశనగ కేవలం 1.94 లక్షల హెక్టార్లలో వేశారు. 1971–72లో చిరుధాన్యాలు 4.01 లక్షల హెక్టార్లు కాగా వేరుశనగ 2.55 లక్షల హెక్టార్లలో వేశారు. 1981–82 లో చిరుధాన్యపు పంటలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ పంటలు 3 లక్షల హెక్టార్లు కాగా వేరుశనగ విస్తీర్ణం 3.74 లక్షల హెక్టార్లకు పెరిగింది. 1991–92కు వచ్చే సరికి వేరుశనగ జాతర మొదలైంది. చిరుధాన్యపు పంటలు కేవలం 60 వేల హెక్టార్లు కాగా వేరుశనగ ఒక్కసారిగా 7.35 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. ఇప్పుడిప్పుడే కాస్తంత బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. -
వేరుశనగ వేయకపోవడమే మేలు
అనంతపురం అగ్రికల్చర్: ఆగస్టులో వేరుశనగ పంట వేయకూడదని శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రకటించారు. గత చరిత్రను పరిశీలిస్తే ఆగస్టులో వేసిన పంట నుంచి 40 శాతం మేర దిగుబడులు తగ్గిపోయినందున జూలై 31వ తేదీనే కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. మంగళవారం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తల మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లాల వారీగా పంట సాగు, వర్షపాతం, ప్రత్యామ్నాయ ప్రణాళిక గురించి ఆయా జిల్లాల జేడీఏలు పవర్‌పాయింట్ ద్వారా వివరించారు. వ్యవసాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, ఆంగ్రూ విస్తరణ సంచాలకులు డాక్టర్ కె.రాజారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎన్వీ నాయుడు, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ అధిపతి డాక్టర్ బి.గోపాలరెడ్డి సమక్షంలో ఖరీఫ్ వ్యవసాయం, ప్రత్యామ్నాయంపై సుదీర్ఘచర్చలు జరిపారు. నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో రక్షకతడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్ని జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. బోరుబావుల నుంచి నీరు తొడేస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వస్తే కొంత వరకు ఫలితం ఉంటుందని అభిప్రాయపడ్డారు. + అనంతపురం జిల్లా పరిస్థితి గురించి వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి పవర్‌పాయింట్ ఇచ్చారు. 8 లక్షల హెక్టార్లకు గానూ 2 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని, అందులో వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లు కాగా 1.60 లక్షల హెక్టార్లలో వేశారన్నారు. జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కేవలం 26 శాతం విస్తీర్ణం సాగులోకి వచ్చిందన్నారు. కూడేరు, బీకేఎస్, పుట్లూరు, తనకల్లు మినహా మిగతా మండలాల్లో వర్షాలు తక్కువగా పడ్డాయన్నారు. అందులో 46 మండలాల్లో మరీ తక్కువ వర్షాలు నమోదైనట్లు తెలిపారు. ఈ క్రమంలో 5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడానికి 72,238 క్వింటాళ్లు జొన్న, రాగి, అలసంద, పెసర, పొద్దుతిరుగుడు, ఉలవ, సజ్జ విత్తనాలు అవసరమవుతామని ప్రతిపాదించామన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వై.పద్మలత, రవీంద్రనాథరెడ్డి, నాయక్‌లు మాట్లాడుతూ... కదిరి ప్రాంతంలో ఆగస్టు మొదటి వారం వరకు వేరుశనగ వేసుకోవచ్చన్నారు. మిగతా ప్రాంతాల్లో వేయకపోవడం మేలన్నారు. ఇటీవల తేలికపాటి వర్షాలు పడటంతో వేసిన వేరుశనగ పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందన్నారు. రక్షకతడి కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అనంతరం చిత్తూరు జేడీఏ విజయకుమార్, కర్నూలు జేడీఏ ఉమా మహేశ్వరి, వైఎస్సార్ కడప జిల్లా జేడీఏ ఠాగూర్‌నాయక్, ప్రకాశం జిల్లా జేడీఏ వంశీకృష్ణారెడ్డి పవర్‌పాయింట్ ద్వారా ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు..తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను తెలియజేశారు. -
విత్తుకోని ఆశలు!
జిల్లాలో తగ్గుతోన్న వేరుశనగ సాగు - పెట్టుబడి సమస్యతో రైతుల అవస్థలు - ఇప్పటికీ అందని ఇన్పుట్ సబ్సిడీ, ఇనూరెన్స్ - కరువు, ఆర్థిక ఇక్కట్లతో ఉక్కిరిబిక్కిరి - ఖాళీగా దర్శనమిస్తున్న విత్తన కేంద్రాలు - తొమ్మిదేళ్లలో తగ్గిన 2.70లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం - ప్రత్యామ్నాయం వైపు రైతుల చూపు ‘అనంత’ రైతులు ఖరీఫ్‌కు సిద్ధమయ్యేలోపు ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తాం. సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చుకు ఇబ్బంది లేకుండా చూస్తాం.’ – గత ఏప్రిల్ 20న పామిడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ఇది పూట్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం. రైతులకు వేరుశనగ విత్తనాలను ఇక్కడే పంపిణీ చేస్తున్నారు. బుధవారం చింతరపల్లికి చెందిన కుళ్లాయప్ప అనే రైతు మాత్రమే నాలుగు బస్తాలు వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నారు. అధికారులు సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించినా ఇతర రైతుల జాడ లేకపోయింది. ఇక్కడే కాదు.. జిల్లాలోని అన్ని పంపిణీ కేంద్రాల్లో 15 రోజులుగా ఇదే పరిస్థితి. అలాగని పంట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటు. పెట్టుబడికి డబ్బులు లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే ప్రాంతం అనంతపురం. 2008లో ఇక్కడ 8.70లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. గతేడాది 6.02లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 6.02లక్షల హెక్టార్లలో పంట సాగువుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. జిల్లాలో పరిస్థితి చూస్తుంటే 5–5.50లక్షల హెక్టార్లలోపు పంట మాత్రమే సాగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వరుస కరువుతో పంట నష్టపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు రైతులను ఉక్కరిబిక్కిరి చేశాయి. ఇదే సమయంలో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడంతో పంట సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆర్థిక ఇబ్బందులతో విత్తనాలు కూడా కొనలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీ కేంద్రాలు రైతులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లలోనే వేరుశనగ సాగు గతేడాది జూన్‌లో 1.72లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 35వేల హెక్టార్లకే పరిమితమైంది. ఇందుకు వర్షాభావంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు 4.01లక్షల క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సేకరించారు. అవసరమైతే అదనంగా మరో 50వేల క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో 3.19లక్షల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. తక్కిన విత్తన కాయల కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. పంపిణీ చేసిన విత్తనాల్లో కూడా కొనుగోలు చేసిన రైతుల సంఖ్య తక్కువే. ఏటా మూడు బస్తాలు పంపిణీ చేస్తే ఈ ఏడాది 4బస్తాలు పంపిణీ చేశారు. దీంతో 3.19లక్షల క్వింటాళ్ల సంఖ్య కన్పిస్తోంది. వీటిని కొనుగోలు చేసిన రైతులు మాత్రం తక్కువే కావడం గమనార్హం. నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతోంది. కరువు మండలాలను ప్రకటిస్తున్నా.. హక్కుగా దక్కాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందని పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్‌లోపు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని గత ఏప్రిల్ 20న జిల్లా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేకపోయారు. బీమా పరిహారం నిబంధనల మేరకు గతేడాది అక్టోబర్‌కే రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉన్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. దీంతో పెట్టుబడికి రైతుల వద్ద డబ్బుల్లేని పరిస్థితి. బ్యాంకు రుణాలు కూడా రైతులకు పెట్టుబడికి సరిపడా అందడం లేదు. ఈ ఏడాది రూ.4,264కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం కాగా.. బ్యాంకర్లు రూ.3,400కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇందులో కూడా గతేడాది రుణాలకు వడ్డీలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవడం మినహా రైతుల చేతికి డబ్బులు వచ్చింది లేకపోవడం గమనార్హం. వర్షపాతమూ కారణమే.. విత్తనాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు కారణమైతే, కొనుగోలు చేసిన రైతులు పంట సాగుకు ఉపక్రమించకపోవడానికి వర్షపాతమూ కారణమే. జూన్‌లో 63.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంటే, 59 మిల్లీమీటర్లకే పరిమితమైంది. ఈ నెల 6న మాత్రమే ఓ మోస్తరు వర్షం కురిసింది. తక్కిన రోజుల్లో పదునుకు సరిపడా వర్షం లేదు. రైతులు పంటసాగు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమే. అయితే గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూలై ఆఖరు వరకూ విత్తనం వేసేందుకు అవకాశం ఉండటంతే సాగు విస్తీర్ణం ఏ మేరకు పెరుగుతుందనేది చూడాలి. సాగుభూమి కూడా తగ్గుతోందా? గత తొమ్మిదేళ్లతో పోలిస్తే ఇటీవల జిల్లాలో విండ్‌పవర్ కోసం రైతుల నుంచి భూముల కొనుగోలు భారీగా పెరిగింది. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, గుంతకల్లుతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైతులు విండ్‌పవర్ కంపెనీలకు భూములను విక్రయిస్తున్నారు. ఇది కూడా సాగు విస్తీర్ణం తగ్గేందుకు కారణం. అటవీ ప్రాంతాల్లో పంటసాగు చేస్తే పందులు, జింకల బెడద తీవ్రంగా ఉంది. దీంతో పాటు ఏటా పంటసాగుకు ఉపక్రమిస్తున్నా రైతులను నష్టాలు వెక్కిరిస్తున్నాయి. పెట్టుబడి కోసం చేసిన అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 187 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు అంతా వేరుశనగ సాగు చేసే రైతులే. దీంతో వేరుశనగ సాగుపై రైతుల్లో కూడా ఆసక్తి తగ్గినట్లు కన్పిస్తోంది. పండ్ల తోటలతో పాటు పత్తి, కంది, పెసర లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. గత ఏడేళ్లలో వర్షపాతం వివరాలు ఇలా.. –––––––––––––––––––––––––––––––– సంవత్సరం వర్షపాతం(మిల్లీమీటర్లలో) భూగర్భ జలమట్టం(మీటర్లలో) –––––––––––––––––––––––––––––––––––– 2009–10 615.6 13.04 2010–11 722.4 12.01 2011–12 495.4 14.65 2012–13 455.6 16.23 2013–14 538.7 18.59 2014–15 404.3 21.87 2015–16 503 22.32 2016–17 284 23.50 –––––––––––––––––––––––––––––––––––– ఏడేళ్లుగా అనంతపురం జిల్లాలో ఖరీఫ్ పంట నష్టం(అధికారిక లెక్కల ప్రకారం): ––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం పంట నష్టం(రూ.కోట్లలో) ––––––––––––––––––––––––––––––––––––––– 2009 2,150 2010 2,300 2011 1,950 2012 2,225 2013 2,650 2014 3,100 2015 3,400 2016 3,700 -
జిప్సం, బోరాన్ ప్రాముఖ్యత
– 50 శాతం రాయితీతో పంపిణీ – వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి అనంతపురం అగ్రికల్చర్ : జిప్పం, జింక్ సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాల విలువ తెలుసుకుని వేరుశనగ పంటలో వాడితే వాటి ప్రయోజనాలు పొందవచ్చని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. భూసార పరీక్షల ఫలితాలను బట్టి సిఫారసు మేరకు వీటిని పంటకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. 50 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేయడానికి అన్ని మండలాల్లో వాటిని నిల్వ చేశామన్నారు. మండల వ్యవసాయాధికారులను సంప్రదించి టన్ను జిప్పంకు రైతు వాటాగా రూ.1,918 ప్రకారం, క్వింటా జింక్ సల్ఫేట్కు రూ.1,925 ప్రకారం, కిలో బోరాన్‌కు రూ.45 ప్రకారం చెల్లించి తీసుకోవచ్చన్నారు. జిప్సం ప్రాముఖ్యత జిప్సంలో కాల్షియం, గంధకం ధాతువులుగా ఉంటాయి. చౌడుభూముల్లో ఉండే సోడియంను తగ్గించి నేలలను బాగుచేయడానికి జిప్సం ఎరువు అవసరం. జిప్సం ఎరువులో కాల్షియం ధాతువు మొక్కలో కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తి, సాగుదలకు, మొక్కల్లో సేంద్రియ ఆమ్లాలను తటస్థపరచడానికి, పత్రహరితం ఏర్పడానికి, క్రోమోజోములు ఏర్పడ్డానికి దోహదపడుతుంది. జిప్సం ఎరువులో గంధకం ధాతువు మొక్కలో కొన్ని రకాల అమైనో ఆమ్లాల , అనేక ఎంజైముల తయారీకి, నత్రజని స్థిరీకరణకు, కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగడానికి పనిచేస్తుంది. నూనెగింజల పంటల్లో మాంసపుకృత్తులు, నూనెశాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. జిప్సం ఎరువు వేసే సమయం కారుచౌడు నేలలను బాగు చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో కలియదున్నాలి. తరువాత పొలంలో నీటిని నిలగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంను వాడొచ్చు. నూనెగింజల పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను చివరి దుక్కిలో వేయాలి. వేరుశనగ పంటలో అయితే పూత దశలో వేసి నేలలో కలపాలి. తక్కువ ధరకు లభించే జిప్పంను వేరుశనగకు వేయడం ద్వారా అధిక దిగుబడులు పొందొచ్చు. సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు జిప్సం ఎరువును చివరి దుక్కిలో ఎకరాకు 50–100 కిలోల వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. బోరాన్ ధాతులోపం మొక్కల పూత దశలో సంపర్కము, ఫలదీకరణలో కీలక పాత్ర వహిస్తుంది. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కల్లోని అన్నిభాగాలకు చేరవేయడంలో ఉపయోగపడుతుంది. మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరం. సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుకొనలు నొక్కుకు పోయినట్లయి పెలుసుబారుతాయి. ఆకులు ముడుచుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. కాయదశలో కాయలు పగుళ్లు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. గింజల అభివృద్ధికి బోరాన్ అవసరం. ఎకరాకు ఒక కిలో బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్గాని, బోరికామ్లాన్ని గాని భూమిలో వేయాలి. లేదా 0.1 నుంచి 0.2 శాతం బోరాక్స్ లేదా బోరికామ్లాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు 10–15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. -
రూ.18,000
- వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు - మిగిలిన అన్ని రకాల పంటలు, పండ్లతోటలకు కూడా.. అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017–18) సంబంధించి జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పంటల వారీగా తయారు చేసిన బ్యాంకు రుణపరిమితి (స్కేల్‌ఆఫ్ పైనాన్స్) నివేదికను రాష్ట్రస్థాయి టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. పంటల వారీగా పెట్టుబడులు, దిగుబడులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకుల ద్వారా ఎంత రుణం ఇవ్వాలనే అంశంపై స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల పంపిణీకి ఇది వర్తించనుంది. వర్షాధారంగా వేరుశనగ సాగుచేసే రైతులకు ఎకరాకు రూ.18 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. బ్యాంకర్లు, రైతుల నమ్మకాన్ని బట్టి ఎకరాకు రూ.20 వేల వరకు ఇచ్చే వీలు కూడా ఉంటుంది. నీటి వసతి కింద సాగు చేసే వేరుశనగకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.22 వేలుగా నిర్ణయించారు. అన్ని పంటలతో పాటు మల్బరీ, పండ్లతోటలు, కూరగాయల పంటలకు కూడా రుణపరిమితి ఖరారు చేశారు. పెరిగిన పంట పెట్టుబడులతో పోల్చితే ప్రస్తుత రుణపరిమితి తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని రైతుసంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. -
వేరుశనగలో పొగాకు లద్దెపురుగు
- సస్యరక్షణ చర్యలు చేపడితే ఫలితం – ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సహదేవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : రబీలో వేసిన వేరుశనగ పంటకు పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలుగజేస్తున్నందున రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగ, వరి, దానిమ్మ పంటలతో పాటు కోళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. + వేరుశనగ పంట ప్రస్తుతం చాలా చోట్ల శాఖీయ దశ నుంచి ఊడలు దిగే దశలో ఉంది. ఈ సమయంలో పొగాకు లద్దె పురుగు ఆశించింది. నివారణ చర్యల్లో భాగంగా ఎకరా పొలంలో 30 ఆముదం మొక్కలు వేసుకోవాలి. లద్దె పురుగు గ్రుడ్లు లేదా లార్వాలు ఆముదం మొక్కలపై గుర్తించిన వెంటనే తీసి నాశనం చేయడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నపుడు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకోవాలి. అలాగే ఎకరాకు 400 మి.లీ క్వినాల్ఫాస్ లేదంటే లీటర్ వేపనూనె 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎకరా పొలంలో 10 పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పురుగు ఉనికి, ఉధృతి తెలుస్తుంది. ఎదిగిన లార్వాల నివారణకు ఎకరాకు 200 గ్రాములు థయోడికార్బ్ లేదా 200 మి.లీ నొవాల్యురాన్ లేదా 400 మి.లీ క్లోరోఫెనాఫేర్ లేదా 40 మి.లీ ఫ్లూమెండమైడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే 5 కిలోలు వరి తవుడు+ అర కిలో బెల్లం+ 50 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోఫైరిపాస్+ 350 మి.లీ మిథోమిల్ ద్వారా విషపు ఎరలు తయారు చేసుకుని ఎకరా పొలంలో సాయంత్రం వేళల్లో చల్లుకోవాలి. + వరి పంటలో అక్కడక్కడ సుడిదోమ ఆశించింది. నివారణకు 1.6 మి.లీ బుఫ్రోపెజిన్ లేదా 2 మి.లీ ఇతోఫెన్ఫ్రోక్స్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లేదా ఇమిడాక్లోప్రిడ్+ 0.25 గ్రాములు ఎథిప్రోల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. వరిలో కాండం తొలిచే పురుగు కనిపిస్తోంది. నివారణకు 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. చిరుపొట్ట దశలో 4–జి గుళికలు ఎకరాకు 8 కిలోలు లేదా 3–జి గుళికలు ఎకరాకు 10 కిలోలు వాడాలి. + దానిమ్మ తోటల్లో బ్యాక్టీరియా మచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నందున 2.5 గ్రాములు సాఫ్ (12 శాతం కార్బండిజమ్+ 63 శాతం మాంకోజెబ్) లేదంటే 0.5 మి.లీ స్ట్రెప్టోసైక్లీన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. + వేసవి ప్రారంభం కావడంతో కోళ్ల సంరక్షణ చర్యలు చేపట్టాలి. కోళ్ల ఫారాలలో నీటి తొట్టెలు, నీటిని సరఫరా చేసే పైపులను తడి గోనెపట్టలతో కప్పి ఎప్పటికప్పుడు నీరు చల్లగా ఉండేలా చూసుకోవాలి. రోజంతా కోడిపిల్లలకు తాగునీరు అందుబాటులో ఉంచాలి. గదిలో ఉష్ణోగ్రతల నియంత్రణకు ఫాగర్లు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి. గది పైకప్పును తాటి, కొబ్బరి మట్టలు లేదా బోధ గడ్డితో కప్పుకుంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. గదిలో అమ్మోనియా వాసన రాకుండా తగినంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం అందించాలి. -
వేరుశనగను బాగా ఆరబెట్టాలి
– ఏఆర్ఎస్ నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : తొలగించిన వేరుశనగ పంటను బాగా ఆరబెట్టుకోవాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి సూచించారు. సాధారణంగా పంట తొలగించిన సమయంలో కాయల్లో తేమ 35 నుంచి 60 శాతం వరకు ఉంటుందన్నారు. అది 8 నుంచి 9 శాతానికి చేరే దాకా ఆరబెట్టుకోవాలని సూచించారు. లేకపోతే శిలీంధ్రాలు అభివద్ధి చెంది దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. వాతావరణం: నాలుగు రోజులుగా ఎక్కడా వర్షం పడలేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 35, రాత్రిళ్లు 17 నుంచి 19 డిగ్రీల డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఉదయం పూట బాగానే ఉన్నా మధ్యాహ్న సమయంలో తేమశాతం 21 నుంచి 27కు పడిపోయింది. గంటకు 4 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. వర్షం పడే సూచనలు లేవు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 నుంచి 31, కనిష్టం 19 నుంచి 21 డిగ్రీలు నమోదు కావచ్చు. గాలిలో తేమ ఉదయం 49 నుంచి 74, మధ్యాహ్నం 29 నుంచి 47 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటల సమాచారం: వర్షం పడే పరిస్థితి లేనందున జూన్, జూలైలో వేసిన వేరుశనగ, కొర్ర, సజ్జ లాంటి పంటలు తొలగించుకోవచ్చు. బెట్ట పరిస్థితులు ఏర్పడినందున అవకాశం ఉంటే పత్తి, ఆముదం, కందికి రక్షకతడి ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. కందికి ఆశించిన శనగపచ్చ పురుగు నివారణకు 5 మిల్లిలీటర్ల వేపగింజల కషాయం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వరిలో కాండం తొలిచే పురుగు ఆశించినందున 2.5 మిల్లిలీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1.5 గ్రాము అసిఫేట్ లేదా 2 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. సుడిదోమ నివారణకు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాట వదలాలి. సుడిదోమ ఆశిస్తే 330 మిల్లిలీటర్ల అప్లాడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అక్కడక్కడ వరిలో ఆకునల్లి ఆశించినందున 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. రబీ పంటలుగా పప్పుశెనగ, కుసమ అక్టోబర్ నెలాఖరు వరకు మంచి సమయం. నవంబర్ మొదటి వారం నుంచి రబీ వేరుశనగ పంట బోరుబావుల కింద వేసుకోవచ్చు. -
సర్వనాశనం
= ఈసారీ తుడిచిపెట్టుకుపోయిన వేరుశనగ = పంట కోత ప్రయోగాల ద్వారా వెల్లడవుతున్న వాస్తవాలు = ప్రయోజనం లేని రక్షకతడులు = పెట్టుబడులూ గల్లంతే అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా రైతులు ఎప్పటిలాగే ఈ ఖరీఫ్‌లోనూ కోటి ఆశలతో వేరుశనగ పంట సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15.22 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో పంట వేశారు. ఇందులో అత్యధికంగా జూన్‌లో 7.56 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగతాది జూలై, ఆగస్టులో వేశారు. వర్షాభావం వల్ల జూన్‌లో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. తర్వాత వేసిన పంటదీ దాదాపు ఇదే పరిస్థితి. ప్రణాళిక, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రస్తుతం జూన్‌లో వేసిన వేరుశనగకు సంబంధించి పంటకోత ప్రయోగాలు చేపడుతున్నారు. 63 మండలాల పరిధిలో 756 ప్రయోగాల ద్వారా పంట దిగుబడులను లెక్కించాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 40–45 ప్రయోగాలు పూర్తి చేశారు. ఎకరాకు కాస్త అటూ ఇటుగా 50 కిలోల దిగుబడి దక్కే పరిస్థితి ఉంది. అంటే ఒక బస్తా లేదా కొంచెం ఎక్కువ రావచ్చని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఆధారంగా కచ్చితమైన దిగుబడులను చెప్పలే కపోయినా.. జిల్లా అంతటా పంట పరిస్థితి దాదాపు ఒకేలా ఉండటంతో ఒక అంచనాకు రావచ్చని అధికారులు అంటున్నారు. గ్రాముల్లోనే దిగుబడులు ఇప్పటివరకు రాయదుర్గంలో రెండు పంటకోత ప్రయోగాలు జరిగాయి. ఒక దాంట్లో 520 గ్రాములు, మరొక ప్రయోగంలో కేవలం 50 గ్రాముల దిగుబడి వచ్చింది. 50 గ్రాములంటే ఎకరాకు 10 కిలోల దిగుబడి కూడా లభించదు. అలాగే కనగానపల్లి మండలం వేపకుంటలో 170 గ్రాములు, 130 గ్రాములు, నెమలివరంలో 170 గ్రాములు, 180 గ్రాములు, సోమందేపల్లి 710, గుమ్మఘట్ట కేవలం 50, పుట్లూరు 285, తనకల్లు 150 గ్రాములు, 140 గ్రాములు, చెన్నేకొత్తపల్లి మండలంలో ఒక ప్రయోగంలో కేవలం 10 గ్రాములు, రెండో ప్రయోగంలో 30 గ్రాములు వచ్చాయి. ఇక అత్యధికంగా ఎన్పీ కుంటలో 2.050 కిలోలు, కదిరి 1.300, నల్లమాడ 1.240, సోమందేపల్లి 1.590 కిలోలు వచ్చాయి. ఇక్కడ ఎకరాకు 70 నుంచి 150 కిలోల వరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రూ.1,200 కోట్ల నష్టం ! పంట దిగుబడులను పక్కనపెడితే పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు దక్కించుకునే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ లెక్కన జూన్‌లో వేసిన పంటకు సంబంధించి 7.56 లక్షల ఎకరాలకు గాను రూ.1,450 కోట్ల వరకు వెచ్చించారు. ప్రస్తుత దిగుబడులు, ధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.250 కోట్ల వరకు రైతులకు దక్కే అవకాశముంది. ఇక అంతో ఇంతో పశువుల మేత లభిస్తుంది. ఎంతలేదన్నా రూ.1,200 కోట్ల వరకు రైతులకు నష్టం వాటిల్లనుందని అంచనా వేస్తున్నారు. పంట కోత ప్రయోగాలు పూర్తయితే ఈ లెక్కల్లో స్పష్టత వస్తుంది. జూలై, ఆగస్టులో వేసిన పంట పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో ఈ సారి జిల్లా రైతులు భారీ నష్టాలు మూటగట్టుకునే దుస్థితి ఏర్పడింది. -
ఆశ చావక..
– వర్షాభావంతో ఎండిన వేరుశనగ పంట – గ్రాసమైనా మిగులుతుందని పక్వానికి రాకనే చెట్లు పీకివేస్తున్న రైతులు తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ప్రభుత్వం రెయిన్గన్ల ద్వారా తడులు ఇచ్చేశాం.. అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసింది గానీ ప్రయోజనం శూన్యమే. రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కనీసం ఉన్న కాస్త చెట్టు పశుగ్రాసానికైనా దక్కితే చాలని రైతులు భావిస్తున్నారు. పూర్తిగా ఎండిపోయే దశలో ఉన్న వేరుశనగ చెట్లను పక్వానికి రాకుండానే పీకేసేందుకు సిద్ధమయ్యారు. చిత్తూరు (అగ్రికల్చర్): వేరుశనగ రైతు ఆశలు ఎండిపోయాయి. ఎకరం పంటను కూడా ఎండనివ్వమని ముఖ్యమంత్రి, మంత్రులు హంగామా చేశారు. హడావుడిగా పర్యటించారు. కానీ ఫలితం శూన్యం. పంట పూర్తిగా ఎండిపోయింది. ఈ ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాలు బాగా కురవడంతో వేరుశనగ పంటపై రైతులకు ఆశలు చిగురించాయి. జిల్లాలోని 1.21 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. గత 40 రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం పది రోజుల క్రితం రెయిన్ గన్ల ద్వారా ఎండిన వేరుశనగ పంటను తడులు ఇచ్చి కాపాడేస్తామంటూ హామీలు గుప్పించింది. జిల్లావ్యాప్తంగా రెయిన్ గన్ల ద్వారా పంటలకు చాలీచాలని తడులు ఇచ్చేసి, మొత్తం పంటను తడిపేశామంటూ ప్రకటించేసింది. మొదట ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించారు. తర్వాత నలుగురు మంత్రులు జిల్లాలో తిష్టవేసి వేరుశనగ పంటకు తడులు ఇవ్వడాన్ని పర్యవేక్షించారు. ఎకరాకు 4 ట్యాంకర్ల మేరకు మాత్రమే నీటిని సరఫరా చేసి తడులు ఇచ్చారు. ఈ చాలీచాలని తడులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కనీసం ఉన్నకాస్త చెట్లయినా పశుగ్రాసంకు దక్కితే చాలని భావించి పంట మధ్య దశలోనే పీకేస్తున్నారు. బంగారుపాళ్యం మండలం బేరుపల్లికి చెందిన రైతు కృష్ణమందడికి 2 ఎకరాల మామిడి తోటలో అంతర పంటగా వేరుశనగ పంట సాగు చేశాడు. 40 రోజులుగా నెలకొన్న తీవ్ర వర్షాభావంతో పంట ఎండిపోయింది. పంట ఎండుముఖం పట్టిన సమయంలోనే రెయిన్గన్లతో తడులు అందించాలని అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. ఎండిన చెట్లను పశుగ్రాసానికైనా ఉపయోగపడుతుందని ఆయన భావించాడు. గురువారం ఆయన కుమారుడు ధనంజయ, భార్య నవనీతమ్మ పంటకు బిందెలతో నీళ్లు పోసి తడిపి పంట పక్వానికి రాకనే చెట్లు పీకేశారు. తీవ్రంగా నష్టపోయాం వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంటలో తీవ్రంగా నష్టపోయాం. రెండెకరాల్లో వేరుశనగ పంట సాగుచేసేందుకు ఇప్పటికి రూ. 15 వేలు ఖర్చయింది. కనీసం పశువులకైనా తినేందుకు ఉపయోగపడుతుందని కాయలు కోసం ఎదురుచూడకుండా చెట్లు పెరుకుతున్నాం. – నవనీతమ్మ , మహిళారైతు , బేరుపల్లి -
వేరుశనగ పంటను కాపాడాలి
అనంతపురం అర్బన్: ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగపంట ఎండిపోకుండా రెయిన్గన్ల ద్వారా రక్షక నీటి తడులను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంఐపీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 12,387 హెక్టాలర్లలో వెరుశనగర పంట బెట్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పటి వరకు 6,446 హెక్టార్లలో రెయిన్ గన్ల ద్వరా రక్షక తడి అందించారని, కొన్ని చోట్ల ఎంపీఈఓలు, ఏఓలు సక్రమంగా స్పందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా పంట ఎండితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జీడిపల్లి రిజ్వాయర్‌లో 1.2 టీఎంసీల నీరుందని, హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని, ఎక్కడైనా చెరువుల్లో ఉన్న నీటిని వినియోగించుకుని రెయిన్గన్ల ద్వారా పంటకు అందించాలని ఆదేశించారు. ఐదుగురు ఎంపీడీఓలకు అవార్డులు జిల్లాలో ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చారని, అక్టోబరు 2 నాటికి 150 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దాలని అధికారులను జేసీ లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తయ్యేలా చేసిన పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి, పెద్దపప్పూరు, పుట్టూరు ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు ఈ నెల 26న అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. తాడిపత్రిలోనూ వంద శాతం ఓడీఎస్ చేసినందున మునిసిపల్ కమిషనర్‌కి కూడా అవార్డు ప్రకటించామన్నారు. -
వైఎస్ హయంలోనే రైతుకు సంక్షేమం
గాలివీడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే రైతుల సంక్షేమానికి విశేష కృషి చేయడం జరిగిందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రామాలయంలో వైసీపీ నాయకుడు మలసాని సుబ్బారెడ్డి కుమార్తె ప్రవళ్లిక, మల్రెడ్డి విహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరిగిన అరవీడు గ్రామ బీసీ నాయకుడు బాలయ్య కుమారుడు మల్లికార్జున, మానస వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి వేరుశనగ పంట సాగు చేసి నష్టాలకు గురైన రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 సంవత్సరానికి సంబంధించి ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటలబీమా ఇంత వరకు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ ప్రాంత సాగు రైతులను ఆదుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పలు దఫాలుగా చర్చించి కుడికాలువకు నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకుడు యదు భూషణ్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, వైకాపా నాయకులు ధనుంజయరెడ్డి, రమణారెడ్డి, బిసీ నాయకులు ఉమామహేశ్వర్‌నాయుడు, శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ఎండుతున్న వేరుశనగ
→ రక్షకతడి కోసం రైతుల ఆరాటం → గోడౌన్లలోనే మగ్గుతున్న రెయిన్గన్లు అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ పంట ఎండుముఖం పడుతోంది. 15 రోజులుగా వరుణుడు మొహం చాటేయడంతో జిల్లా అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండలు మరోవైపు గాలులు కూడా జోరుగా వీస్తుండటంతో 5.90 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంటతో పాటు 1.10 లక్షల హెక్టార్లలో సాగైన కంది, ఆముదం, ప్రత్తి, మొక్కజొన్న, అలసంద, పెసర లాంటి మిగతా పంటలు కూడా వాడుముఖం పట్టాయి. వేరుశనగ ఎండిపోకుండా రక్షకతడులతో కాపాడుతామంటూ చెబుతున్న అధికారులు ఇప్పటివరకు ఆ దిశగా ఇప్పటివరకు కార్యాచరణకు దిగకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కీలకదశలో పంటలు సాధారణంగా ఖరీఫ్ పంటలు ఆగస్టులో కీలకదశకు చేరుకుంటాయి. పూత, ఊడలు దిగడం, కాయ ఊరేదశలో ఉంటాయి. ఈ సమయంలో వేరుశనగ లాంటి పంటకు తప్పనిసరిగా నీటి తడులు అవసరం ఉంటుంది. కానీ... ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఎక్కడా ఒక్క వర్షం కూడా నమోదు కాలేదు. ఈ క్రమంలో చాలా మండలాల్లో వేరుశనగ వాడిపోగా మరికొన్ని చోట్ల ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇంకో వారం వర్షం పడకుండా ఇదే విధంగా కొనసాగితే పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెయిన్గన్లు వచ్చినా.. ఒక్క ఎకరా వేరుశనగ పంట ఎండిపోకుండా ఒకట్రెండు రక్షకతడులు (లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్) ఇచ్చి కాపాడుతామంటూ పాలక యంత్రాంగం ఘనంగా ప్రకటించినా కార్యాచరణకు దిగకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాకు 4,600 సెట్లు రెయిన్గన్లు, స్ప్రింక్లర్యూనిట్లు, డీజిల్ ఇంజిన్లు, 1.30 లక్షల సంఖ్యలో హెచ్డీ పైపులు ఇందుకోసం కేటాయించగా ఇప్పటివరకు అందులో సగం వరకు జిల్లాకు చేరినట్లు ఏపీఎంఐపీ, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని మండలాల్లోనూ వాటిని గోదాముల్లో నిల్వ చేశామంటున్నారు. కానీ... వేరుశనగ పంట ఎండుముఖం పట్టినా రెయిన్గన్లను గోదాముల నుంచి బయటకు తీయడం లేదు. రక్షకతడులు కోసం జిల్లా వ్యాప్తంగా 65 వేల మంది రైతులు తమ బోరు బావుల నుంచి పరిసర ప్రాంత పొలాలను నీళ్లు ఇచ్చేలా ఒప్పించామని చెబుతున్నారు. అలాగే పంట సంజీవిని కింద నిర్మించిన నీటికుంటల్లోకి నీళ్లు నింపి అక్కడి నుంచి నీటి తడులు ఇస్తామంటున్నారు. ప్రణాళికను ఆచరణలోకి పెట్టడంలో అధికారులు వెనుకాడుతున్నారు. రక్షకతడి ఇవాళ... రేపు అంటూ అధికారులు ఊరిస్తూ కాలయాపన చేస్తుండటంతో అంతలోగా వేరుశనగ పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. -
పదెకరాల వేరుశెనగ పంట దహనం
మద్దికెర: కర్నూలు జిల్లాలో పదెకరాల వేరుశెనగ పంటను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. జిల్లాలోని మద్దికెర మండలం హంప గ్రామంలో సోమవారం వేకువజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో తలారిగా పనిచేసే రాముడు తన పదెకరాల్లో వేసిన వేరుశెనగ పంటను వాముగా వేశాడు. ఆ వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పంట పూర్తిగా కాలి బూడిదయింది. దీంతో సుమారు రూ.1.50 లక్షల మేర రైతుకు నష్టం వాటిల్లింది. బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. -
భారీగా తగ్గిన వేరుశనగ సాగు విస్తీర్ణం
అనంతపురం: వేరుశనగ అత్యధికంగా సాగయ్యే అనంతపురం జిల్లాలో ఈ ఏడు గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో 7 లక్షల హెక్టార్లలో వేరు శనగను సాగు చేయాల్సి ఉండగా... ఇప్పటికి కేవలం 2.2 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటను వేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనరేట్ జేడీఏ లక్ష్మణ్‌రాజు శుక్రవారం ప్రకటించారు. అందులోనూ వర్షాభావంతో 80 వేల హెక్టార్లలో వేసిన పంట ఎండిపోయినట్టు తెలిపారు. శుక్రవారం అనంతపురం వచ్చిన లక్ష్మణ్‌రాజు శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. కాగా, వర్షాలు కురిస్తే ఆగస్ట్ 15లోపు వేరు శనగను సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అనంతపురం: అప్పుల బాధతో కూడేరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన వడ్డే వెంకటప్ప (56) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు...వెంకటప్పకు ఐదెకరాల పొలం ఉండగా, మరో ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడులు, ఇంటి అవసరాలకు రూ. 5 లక్షలు అప్పులు చేశాడు. ఇటీవల రుణదాతల ఒత్తిడి అధికం కావడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (కళ్యాణదుర్గం) -
వేరుశనగ కు తరుణమిదే..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తారు. దర్శి, మార్కాపురం ఏరియాలో కూడా కొంత సాగు చేస్తుంటారు. ట్యాగ్-24, ధరణి రకం విత్తనాలు అనుకూలం. వీటినే జిల్లాల్లో రైతులు ఉపయోగిస్తున్నారు. ఇది నూనెగింజ పంటల్లో ప్రధానమైనది. డిసెంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రబీలో శనగ సాగుకు ఇదే అదును. ప్రస్తుతం శనగ సాగు చేయాలనుకునే రైతులకు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన వాతావరణ పరిస్థితికి అనువైన విత్తనాలు ఎంచుకుని, తగినంత మోతాదులో వేస్తే అధిగ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. అనుకూలమైన నేలలు ఇసుకతో కూడిన నేలలు, చెలక, ఎర్రగరప నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య గల నేలలు ఉత్తమమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు. నేల తయారీ లోతుగా దుక్కి దున్నడం ద్వారా పంటను నష్టపరిచే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేల మొత్తాన్ని దుక్కి దున్ని చదును చేయాలి. విత్తనాలు అరకలు లేదా ట్రాక్టర్ల సహాయంతో వేయవచ్చు. ట్రాక్టర్ యంత్రంతో వేయడం వల్ల కూలీ ఖర్చు తగ్గుతుంది. విత్తన మోతాదును మన ఎంపిక ప్రకారం వేసుకోవచ్చు. అంటే పలుచగా లేదా చిక్కగా విత్తనం విత్తుకోవచ్చు. విత్తన మోతాదు గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరానికి 60 నుంచి 70 కిలోల విత్తనం సరిపోతుంది. మన జిల్లాలో నేలలకు ట్యాగ్-24, ధరణి రకాలను ఉపయోగిస్తుంటారు. నీటి పారుదల కింద సాగు చేసే వారు సాళ్ల మధ్య 22.5 సెంటీమీటర్లు, విత్తనాల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్లు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలు, వేరు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి. నిద్రావస్థను తొలగించడానికి.. నిద్రావస్థలో ఉన్న విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇథిరికలన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి అందులో 12 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎరువుల వినియోగం భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. నత్రజని ఎకరాకు(యూరియా రూపంలో) 12 కిలోలు, భాస్వరం(సింగిల్ సూపర్‌ఫాస్పేట్ రూపంలో) 16 కిలోలు, జిప్సం 200 కిలోలు వినియోగించాలి. నీటి పారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సం పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి కలుపు తీయాలి. అనంతరం మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపు నివారణ కలుపు మొలకెత్తక ముందే నశింపజేసే కలుపు నాశనులను వినియోగించాలి. పెండి మిథాలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా భ్యూటోక్లోరా మందు 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు లేక మూడు రోజుల వ్యవధిలో నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల్లోగా గొర్రుతో అంతర కృషి చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు. అలా చేస్తే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన 21 నుంచి 25 రోజులలోపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిల్ 300 మిల్లీలీటర ్లను 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి నాశనం చేయాలి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో సాగు చేసిన వేరుశనగకు 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. ఊడలు దిగే దశ నుంచి కాండం ఊరే దశ వరకు నీరు సక్రమంగా తగిన మోతాదులో పెట్టుకోవాలి. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కక్ష సాధింపు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు సాక్షి, అనంతపురం : రామగిరి మండలం నసనకోట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీసే ధ్యేయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు పాల్పడుతున్నారు. గ్రామస్తులు, బాధితుడి కథనం మేరకు... గ్రామ సమీపంలో చెరువును ఆనుకుని నారాయణరెడ్డికి 22 ఎకరాల పొలం ఉంది. ఎనిమిది ఎకరాలలో చీనీచెట్లు, ఏడు ఎకరాలలో వేరుశనగ పంట సాగుచేసుకుంటున్నాడు. ఇటీవలి కాలంలో బోర్లు ఎండిపోవడంతో పొలం సరిహద్దులో కొత్త బోరు వేశాడు. ఈ నీటితోనే చీనీ చెట్లను బతికించుకుంటున్నాడు. నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలన్న దురుద్దేశంతో గ్రామ టీడీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి వేసుకున్న బోరు చెరువు పరిధిలో ఉందని ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సర్వేయర్లతో కొలతలు వేయించి బోరు చెరువు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చీనీ చెట్లను బతికించుకునేందుకు బోరు వేసుకున్నానని, రెండు వర్షాలు పడి పాత బోర్లలో నీరు చేరితే చెరువు పరిధిలో ఉన్న బోరును తొలగిస్తానని నారాయణరెడ్డి చెప్పినా టీడీపీ నాయకులు ససేమిరా అన్నారు. దీంతో నారాయణరెడ్డికి టీడీపీ వారికి మాటా మాటా పెరిగింది. ఇదే అదనుగా తీసుకుని సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త చండ్రాయుడు ‘నన్ను నారాయణరెడ్డి కులం పేరుతో దూషించాడని’ పోలీసులకు ఫిర్యాదు చేసి ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ’ కేసు నమోదు చేయించాడు. ఈ ఫిర్యాదు మేరకు ధర్మవరం ఏఎస్పీ అభివషేక్మహంతి, ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌లు నసనకోట గ్రామంలో పర్యటించి ఆ గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీనీ చెట్లు బతికించుకునేందుకు బోరు వేసుకుంటే అభ్యంతరం తెలపడమే కాకుండా ‘ఎస్సీ, ఎస్టీ’ కేసు పెట్టడం వెనక నారాయణరెడ్డిని ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్ర ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.