జిప్సం, బోరాన్ ప్రాముఖ్యత
– 50 శాతం రాయితీతో పంపిణీ
– వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : జిప్పం, జింక్ సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాల విలువ తెలుసుకుని వేరుశనగ పంటలో వాడితే వాటి ప్రయోజనాలు పొందవచ్చని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. భూసార పరీక్షల ఫలితాలను బట్టి సిఫారసు మేరకు వీటిని పంటకు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. 50 శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేయడానికి అన్ని మండలాల్లో వాటిని నిల్వ చేశామన్నారు. మండల వ్యవసాయాధికారులను సంప్రదించి టన్ను జిప్పంకు రైతు వాటాగా రూ.1,918 ప్రకారం, క్వింటా జింక్ సల్ఫేట్‌కు రూ.1,925 ప్రకారం, కిలో బోరాన్‌కు రూ.45 ప్రకారం చెల్లించి తీసుకోవచ్చన్నారు.
జిప్సం ప్రాముఖ్యత
జిప్సంలో కాల్షియం, గంధకం ధాతువులుగా ఉంటాయి. చౌడుభూముల్లో ఉండే సోడియంను తగ్గించి నేలలను బాగుచేయడానికి జిప్సం ఎరువు అవసరం. జిప్సం ఎరువులో కాల్షియం ధాతువు మొక్కలో కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తి, సాగుదలకు, మొక్కల్లో సేంద్రియ ఆమ్లాలను తటస్థపరచడానికి, పత్రహరితం ఏర్పడానికి, క్రోమోజోములు ఏర్పడ్డానికి దోహదపడుతుంది. జిప్సం ఎరువులో గంధకం ధాతువు మొక్కలో కొన్ని రకాల అమైనో ఆమ్లాల , అనేక ఎంజైముల తయారీకి, నత్రజని స్థిరీకరణకు, కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగడానికి పనిచేస్తుంది. నూనెగింజల పంటల్లో మాంసపుకృత్తులు, నూనెశాతం పెరగడానికి ఉపయోగపడుతుంది.
జిప్సం ఎరువు వేసే సమయం
కారుచౌడు నేలలను బాగు చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో కలియదున్నాలి. తరువాత పొలంలో నీటిని నిలగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంను వాడొచ్చు. నూనెగింజల పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను చివరి దుక్కిలో వేయాలి. వేరుశనగ పంటలో అయితే పూత దశలో వేసి నేలలో కలపాలి. తక్కువ ధరకు లభించే జిప్పంను వేరుశనగకు వేయడం ద్వారా అధిక దిగుబడులు పొందొచ్చు. సోయాచిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు జిప్సం ఎరువును చివరి దుక్కిలో ఎకరాకు 50–100 కిలోల వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
బోరాన్ ధాతులోపం
మొక్కల పూత దశలో సంపర్కము, ఫలదీకరణలో కీలక పాత్ర వహిస్తుంది. ఆకుల్లో తయారయ్యే ఆహారం మొక్కల్లోని అన్నిభాగాలకు చేరవేయడంలో ఉపయోగపడుతుంది. మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి బోరాన్ అవసరం. సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుకొనలు నొక్కుకు పోయినట్లయి పెలుసుబారుతాయి. ఆకులు ముడుచుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. కాయదశలో కాయలు పగుళ్లు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. గింజల అభివృద్ధికి బోరాన్ అవసరం. ఎకరాకు ఒక కిలో బోరాక్స్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్‌గాని, బోరికామ్లాన్ని గాని భూమిలో వేయాలి. లేదా 0.1 నుంచి 0.2 శాతం బోరాక్స్ లేదా బోరికామ్లాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు 10–15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.