ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తారు. దర్శి, మార్కాపురం ఏరియాలో కూడా కొంత సాగు చేస్తుంటారు. ట్యాగ్-24, ధరణి రకం విత్తనాలు అనుకూలం. వీటినే జిల్లాల్లో రైతులు ఉపయోగిస్తున్నారు. ఇది నూనెగింజ పంటల్లో ప్రధానమైనది. డిసెంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రబీలో శనగ సాగుకు ఇదే అదును. ప్రస్తుతం శనగ సాగు చేయాలనుకునే రైతులకు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన వాతావరణ పరిస్థితికి అనువైన విత్తనాలు ఎంచుకుని, తగినంత మోతాదులో వేస్తే అధిగ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు.
అనుకూలమైన నేలలు
ఇసుకతో కూడిన నేలలు, చెలక, ఎర్రగరప నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య గల నేలలు ఉత్తమమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు.
నేల తయారీ
లోతుగా దుక్కి దున్నడం ద్వారా పంటను నష్టపరిచే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేల మొత్తాన్ని దుక్కి దున్ని చదును చేయాలి. విత్తనాలు అరకలు లేదా ట్రాక్టర్ల సహాయంతో వేయవచ్చు. ట్రాక్టర్ యంత్రంతో వేయడం వల్ల కూలీ ఖర్చు తగ్గుతుంది. విత్తన మోతాదును మన ఎంపిక ప్రకారం వేసుకోవచ్చు. అంటే పలుచగా లేదా చిక్కగా విత్తనం విత్తుకోవచ్చు.
విత్తన మోతాదు
గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరానికి 60 నుంచి 70 కిలోల విత్తనం సరిపోతుంది. మన జిల్లాలో నేలలకు ట్యాగ్-24, ధరణి రకాలను ఉపయోగిస్తుంటారు. నీటి పారుదల కింద సాగు చేసే వారు సాళ్ల మధ్య 22.5 సెంటీమీటర్లు, విత్తనాల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి.
విత్తనశుద్ధి
కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్లు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలు, వేరు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి.
నిద్రావస్థను తొలగించడానికి..
నిద్రావస్థలో ఉన్న విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇథిరికలన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి అందులో 12 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
ఎరువుల వినియోగం
భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. నత్రజని ఎకరాకు(యూరియా రూపంలో) 12 కిలోలు, భాస్వరం(సింగిల్ సూపర్‌ఫాస్పేట్ రూపంలో) 16 కిలోలు, జిప్సం 200 కిలోలు వినియోగించాలి. నీటి పారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సం పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి కలుపు తీయాలి. అనంతరం మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి.
కలుపు నివారణ
కలుపు మొలకెత్తక ముందే నశింపజేసే కలుపు నాశనులను వినియోగించాలి. పెండి మిథాలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా భ్యూటోక్లోరా మందు 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు లేక మూడు రోజుల వ్యవధిలో నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల్లోగా గొర్రుతో అంతర కృషి చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు. అలా చేస్తే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన 21 నుంచి 25 రోజులలోపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్‌ఫిల్ 300 మిల్లీలీటర ్లను 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి నాశనం చేయాలి.
నీటి యాజమాన్యం
తేలిక నేలల్లో సాగు చేసిన వేరుశనగకు 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. ఊడలు దిగే దశ నుంచి కాండం ఊరే దశ వరకు నీరు సక్రమంగా తగిన మోతాదులో పెట్టుకోవాలి.
వేరుశనగ కు తరుణమిదే..
Published Tue, Nov 25 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement