Seed treatment
-
విత్తన విధానంపై జర్మనీతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విత్తన విధానం తయారు కోసం ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఒక నిర్ధిష్ట విధానం తప్పనిసరని భావించింది. దీనికోసం జర్మనీ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జర్మనీ, తెలంగాణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. హైదరాబాద్‌లో ఆదివారం ముగిసిన సేంద్రీయయ వ్యవసాయం జాతీయ సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, ఇండో–జర్మన్ కోఆపరేటివ్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ టీమ్ లీడర్ ఎక్కెహర్డ్ ష్రాడర్లు సంతకాలు చేశారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడున్న అవకాశాలు, బలాలు, బలహీనతలు వాటన్నింటిపైనా జర్మన్ బృందం అధ్యయనం చేస్తుందని పార్థసారధి వివరించారు. అనంతరం వారు నివేదిక ఇస్తారని, ఆ ప్రకారం విత్తన విధానాన్ని, కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తామన్నారు. ఇప్పటికే జర్మన్ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తున్నారన్నారు. అలాగే ఈ రెండ్రోజుల సదస్సులో జర్మనీలో సేంద్రీయ వ్యవసాయం, తనిఖీ, ధ్రువీకరణ , సేంద్రియ ఉత్పత్తుల సరఫరా, చైన్ యాజమాన్యం, జర్మనీలో సాంకేతిక ప్రమాణాలు, సేంద్రియ వ్యవసాయంలో పరాన్నజీవుల పాత్ర, జర్మనీలో సేంద్రీయ విత్తన ఉత్పత్తి, సహకార వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సేంద్రియ వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లు ఇలా అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. 13 రాష్ట్రాలకు చెందిన విత్తన ధ్రువీకరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, ఐదు రాష్ట్రాల వ్యవసాయ విద్యాలయాల ప్రతినిధులు, ఐకార్ శాస్త్రవేత్తలు ఐదుగురు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, రైతులు, సీడ్ మన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా రెండ్రోజులపాటు పీపుల్స్‌ప్లాజాలో సేంద్రియ ఉత్పత్తుల మేళా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చివరి రోజు సదస్సులో పార్థసారధి మాట్లాడుతూ వ్యవసాయరంగం సేంద్రియ వ్యవసాయం వైపు నడవాలన్నారు. గత పదిహేనేళ్లలో కేన్సర్ విపరీతమయిపోయిందన్నారు. జర్మనీలో ఎంతో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. -
విత్తనశుద్ధితో తెగుళ్లు దూరం
రాయికోడ్: రబీలో భాగంగా శనగ పంటలు సాగు చేసే వారు తప్పకుండా విత్తనశుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అభినాష్‌వర్మ రైతులకు సూచించారు. మండలంలోని పాంపాడ్ గ్రామంలో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో శనగ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ద్వారా పంట తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సూచించారు. మందుల వినియోగంలో విధిగా అధికారుల సూచనలు పాటించి పంటను కాపాడుకోవాలన్నారు. రసాయన ఎరువులను అధికంగా వాడితే నష్టం తప్పదని హెచ్చరించారు. అనంతరం రైతులు సాగు చేసిన శనగ పంటలను సందర్శించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఏఈఓ యాదయ్య, స్థానిక నాయకులు హన్మన్నపాటిల్, రైతులు గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అరటి సాగులో సస్యరక్షణ
నులి పురుగు బెడద వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు అరటికి నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో ఉండే ఈ పురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. వీటివల్ల వేర్లపై బుడిపెల వంటివి ఏర్పడుతాయి. ఉధృతి అధికంగా ఉంటే అరటి ఆకులు వాలిపోతాయి. అంచుల చివర్లు నల్లగా మారి మాడిపోతాయి. మొక్కల్లో ఎదుగుదల లోపిస్తుంది. పంటనాటే ముందు విత్తనశుద్ధి చేసుకుంటే పురుగును నివారించవచ్చు. నులి పురుగు ఆశించినట్లయితే 5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ 2.5. మి.లీ మోనోక్రొటోఫాస్ లీటరు నీటిలో కలిపి మిశ్రమ ద్రావణం తయారు చేసుకోవాలి. మిశ్రమ ద్రావణంలో అరటి పిలకల దుంపలను ముంచి నాటుకోవాలి. అరటి పెరిగే దశలో పురుగుల నియంత్రణ కోసం కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను మొక్కల దగ్గరగా వేయాలి. పంటల మార్పిడి వల్ల కూడా పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఆకుమచ్చ తెగులు దీని ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. బూడిద రంగులో ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవిగా మారుతాయి. ఆకులు మాడిపోయి మొక్కలు గిడసబారుతాయి. తెగులు నియంత్రణ కోసం తోటల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెగులు ఎక్కువగా ఉంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటరు నీటి చొప్పున కలపి పిచికారీ చేయాలి. అలాగే ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్ లేదా ప్రొపికొనజోల్ లీటరు నీటి చొప్పున కలిపి రెండు మూడు సార్లు స్ప్రే చేయాలి. కాయముచ్చిక కుళ్లు అరటి కాయల చివర ముచ్చిక వద్ద నల్లగా మారి కుళ్లు మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించిన కాయలను గుర్తించి తొలగించి తగులబెట్టాలి. నివారణ చర్యగా ఒక గ్రామం కార్బండజిమ్ లీటరు నీటిలో కలిపి అరటి గెలలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసి తెగులును అదుపు చేయవచ్చు. -
వేరుశనగ కు తరుణమిదే..
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తారు. దర్శి, మార్కాపురం ఏరియాలో కూడా కొంత సాగు చేస్తుంటారు. ట్యాగ్-24, ధరణి రకం విత్తనాలు అనుకూలం. వీటినే జిల్లాల్లో రైతులు ఉపయోగిస్తున్నారు. ఇది నూనెగింజ పంటల్లో ప్రధానమైనది. డిసెంబర్ వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రబీలో శనగ సాగుకు ఇదే అదును. ప్రస్తుతం శనగ సాగు చేయాలనుకునే రైతులకు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త జీ రమేష్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మన వాతావరణ పరిస్థితికి అనువైన విత్తనాలు ఎంచుకుని, తగినంత మోతాదులో వేస్తే అధిగ దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. అనుకూలమైన నేలలు ఇసుకతో కూడిన నేలలు, చెలక, ఎర్రగరప నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య గల నేలలు ఉత్తమమైనవి. ఎక్కువగా బంకమన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు. నేల తయారీ లోతుగా దుక్కి దున్నడం ద్వారా పంటను నష్టపరిచే చీడపీడల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేల మొత్తాన్ని దుక్కి దున్ని చదును చేయాలి. విత్తనాలు అరకలు లేదా ట్రాక్టర్ల సహాయంతో వేయవచ్చు. ట్రాక్టర్ యంత్రంతో వేయడం వల్ల కూలీ ఖర్చు తగ్గుతుంది. విత్తన మోతాదును మన ఎంపిక ప్రకారం వేసుకోవచ్చు. అంటే పలుచగా లేదా చిక్కగా విత్తనం విత్తుకోవచ్చు. విత్తన మోతాదు గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. ఎకరానికి 60 నుంచి 70 కిలోల విత్తనం సరిపోతుంది. మన జిల్లాలో నేలలకు ట్యాగ్-24, ధరణి రకాలను ఉపయోగిస్తుంటారు. నీటి పారుదల కింద సాగు చేసే వారు సాళ్ల మధ్య 22.5 సెంటీమీటర్లు, విత్తనాల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము కార్బండిజమ్ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్లు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. మొదలు, వేరు, కాండం కుళ్లు తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడీని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత శిలీంద్ర నాశనితో శుద్ధి చేయాలి. నిద్రావస్థను తొలగించడానికి.. నిద్రావస్థలో ఉన్న విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇథిరికలన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసి అందులో 12 గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎరువుల వినియోగం భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించాలి. నత్రజని ఎకరాకు(యూరియా రూపంలో) 12 కిలోలు, భాస్వరం(సింగిల్ సూపర్‌ఫాస్పేట్ రూపంలో) 16 కిలోలు, జిప్సం 200 కిలోలు వినియోగించాలి. నీటి పారుదల కింద ఎకరానికి 200 కిలోల జిప్సం పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర చాళ్లలో వేసి కలుపు తీయాలి. అనంతరం మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. కలుపు నివారణ కలుపు మొలకెత్తక ముందే నశింపజేసే కలుపు నాశనులను వినియోగించాలి. పెండి మిథాలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా భ్యూటోక్లోరా మందు 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు లేక మూడు రోజుల వ్యవధిలో నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల్లోగా గొర్రుతో అంతర కృషి చేయాలి. 45 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఏ విధమైన అంతర కృషి చేయకూడదు. అలా చేస్తే ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. విత్తిన 21 నుంచి 25 రోజులలోపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ఫిల్ 300 మిల్లీలీటర ్లను 200 లీటర్ల నీటిలో కలిపి సాళ్ల మధ్యలో కలుపు మీద పిచికారీ చేసి నాశనం చేయాలి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో సాగు చేసిన వేరుశనగకు 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. ఊడలు దిగే దశ నుంచి కాండం ఊరే దశ వరకు నీరు సక్రమంగా తగిన మోతాదులో పెట్టుకోవాలి. -
‘మినుము’తో రైతుకు బలము
బాల్కొండ : సాధారణంగా రబీలో నవంబర్ మూడోవారం వరకే మినుములు సాగు చేస్తారు. మాగాణుల్లో అయితే డిసెంబర్ 15 వరకు ఈ పంట సాగు చేయవచ్చు. ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలసాగు ఆలస్యమైంది. దాని ప్రభావం రబీపైనా పడింది. దీంతో ప్రస్తుతం పలువురు రైతులు మినుముల సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తన శుద్ధి పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశముంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్, 2.5 గ్రాముల థైరమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొదటిసారి ఈ పంట సాగు చేసే భూముల్లో.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది. విత్తనం ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు విత్తనం అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందిస్తోంది. నేల తయారీ, విత్తేవిధానం తేమను నిలుపుకోగలిగే భూములు పంట సాగుకు అనుకూలం. ముందుగా భూమిని బాగా దుక్కిదున్ని, విత్తడానికి ముందు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రుకొట్టాలి. వరి మాగాణుల్లో అయితే ఎరువుల అవసరం ఉండదు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెంటీ మీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. మాగాణుల్లో విత్తనాలను వెదజల్లినా సరిపోతుంది. నీటి తడులు ఒకటి రెండు నీటి తడులతో పంట చేతికి వస్తుంది. విత్తనాలు మొలిచిన తర్వాత 30 రోజుల దశలో మొదటిసారి, 55 రోజుల తర్వాత రెండోసారి నీరు అందించాలి. రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. కలుపుంటే.. పంటను మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. ఇందు కోసం 20 నుంచి 30 రోజుల దశలో గొర్రు లేదా దంతి ద్వారా అంతర కృషి చేయాలి. ఇలా చేయడం వల్ల కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలు పు బెడద ఎక్కువగా ఉంటే విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరాకు 1.25 నుంచి 1.50 లీటర్ల పెండి మిథాలిన్ లేదా అలాక్లోర్ కలుపు మందు ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. చీడపీడల నివారణకు.. రెండాకుల దశ నుంచే పురుగులు ఆశించే అవకా శం ఉంటుంది. పచ్చ రబ్బరు పురుగు రెండాకుల దశ నుంచి ఆశిస్తుంది. ఆకుల మధ్యలో ఇది గూ డు అల్లుకుంటుంది. గూడులో ఉండి తొడిమెల దగ్గర నుంచి పత్రహరితాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎండి, రాలి పోతాయి. లద్దె పురుగులు రాత్రి వేళల్లో ఆకులను తినడం వల్ల మోడుల్లా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరలను వాడాలి. 5 కిలోల తవుడు, కిలో బెల్లంలో లీటరు మోనోక్రొటోపాస్ లేదా కిలో కార్బారిల్ లేదా 250 గ్రాముల థయోడికార్ట్ నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలం అంతటా సమానంగా వేయాలి. ఇంకా ఇతర చీడపీడలు సోకితే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. -
పొద్దుతిరుగుడు మేలు
అనువైన నేలలు, విత్తన రకాలు డీఆర్ ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్-66తో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల సంకరాలను ఎంచుకోవచ్చు.ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూ ములు, ఎర్ర, ఇసుక, రేగడి, నల్ల ఒండ్రుమట్టి నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉంటాయి. విత్తనశుద్ధి మొలకశాతం పెంపొందించేందుకుగాను విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్+కార్బండిజం అనే మందు 2 గ్రాములను కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. విత్తేదూరం తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఉంచాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు వేయాలి. విత్తనం మొలకెత్తిన 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి. ఎరువులు ఎకరాకు 3-4 టన్నుల చివికిన పశువుల ఎరువు వేయాలి. నత్రజని ఎరువును విత్తనాలు వేసేటప్పుడు 26 కిలోలు, మొగ్గ తొడిగే దశలో 13 కిలోలు, 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 13 కిలోలు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, మొత్తం భాస్వరం 150 కిలోలు వేసుకోవాలి. పూత దశలో 2.0 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే విత్తనాలు అధికంగా ఏర్పడతాయి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో పది రోజులకు ఒకసారి, బరువు నేలల్లో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గ దశ, పూత దశ, గింజ కట్టే దశ, గింజ నిండే దశలో నీటి తడులు ఇవ్వాలి. చీడపీడల నివారణ ఇలా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు 30-40 రోజుల పంటగా ఉంది. ఈ దశలో పంటలను ఆశించే చీడపీడలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగు లేదా నల్లటి వలయకారపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో మచ్చలన్నీ కలిసిపోయి, ఆకులు ఎండి పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించి న వెంటనే కార్బండిజం+మాంకోజబ్ మందు 2.0 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1.9 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్లు లేదా తల కుళ్లు ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. ప్రథమ దశలో మొక్క చివరి భాగం, పువ్వు కింద ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత దశల్లో పువ్వు తొడిమ దగ్గర కుళ్లిపోయి ఎండిపోతుంది. నివారణకు ఫెన్థియాన్ ఒక మిల్లీలీటరు+నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు పచ్చదీపపు పురుగులు, తెల్లదోమలు, తామర పురుగులు, ఆకుల్లో రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఆకులన్నీ పసుపు పచ్చగా మారిపోయి, ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లేదా ట్రైకోఫాస్ 2.0 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు పొద్దు తిరుగుడు పండించే ప్రాంతాల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగు లార్వాలు.. పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రాము థయోడికార్బ్+నోవాల్యురాన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
రైతులూ ..ఈ సూచనలు పాటించండి
మినుము ప్రస్తుతం రబీలో మినుము సాగు చేసేందుకు అనువైనం సమయం. ఆయూ సమయూల్లో కింది రకాలు వేసుకుంటే మేలు. నవంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు మొదటి పక్షం వరకు విత్తుకొనే మినుము రకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-648 డిసెంబరు రెండో పక్షం నుంచి డిసెంబరు చివరి వరకు విత్తుకొనే మినుము రాకాలు ఎల్బీజీ-645, ఎల్బీజీ-685 జన వరిలో విత్తుకొనే రకాలు-ఎల్బీజీ-752, ఎల్బీజీ-623 పల్లాకు తెగులు తట్టుకునే పీయూ-31 రకాన్ని అన్ని కాలాల్లో విత్తుకోవచ్చు. పెసర నవంబరు రెండో పక్షం నుంచి జనవరి వరకు విత్తుకొనే రకాలు ఎల్జీజీ-42, టీఎం96-2, ఎల్జీజీ-410. విత్తనమోతాదు ఒక చదరపు మీటరుకు సుమారు 30-35 మొక్కలు ఉండేలా మినుము అరుుతే ఎకరాకు 16-18 కిలోలు, పెసర అరుుతే 10-12కిలోల విత్తనాలు వెదజల్లితే మంచి దిగుబడులు సాధించవచ్చు. విత్తనశుద్ధి కిలో విత్తనానికి 30 గ్రా.కార్బోసల్ఫాస్ మందును వాడి విత్తనశుద్ధి చేయూలి. కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా. థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేస్తే సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు. కలుపు నివారణ: గడ్డి, వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉంటే ఇమిజితాఫిర్ పది శాతం మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కొన్ని భూముల్లో బంగారుతీగ సమస్య ఎక్కువగా ఉంది. దీని నివారణకు ఆశించిన ప్రదేశాల్లో మాత్రమే పారాక్వాట్ 24 శాతం ద్రావకం 50 మిల్లీలీటర్లు, పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయూలి. పత్తి తీతలో మెలకువలు పత్తి తీయడం మొదలైనందున మంచి నాణ్యత కోసం కింది మెలకువలు పాటించాలి. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుంచి వేరుచేయూలి. మంచువల్ల పత్తి నాణ్యత దెబ్బతింటుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు పత్తి తీయూలి. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో పత్తి తీస్తే వాటితోపాటు గుల్ల వద్ద ఉన్న తొడిమలు, ఎండిన ఆకులు పెళుసెక్కి ముక్కలై పత్తికి అంటుకొంటారుు. పత్తి తీయగానే నీడలో మండెలు వేసి తగు తేమ శాతం వచ్చేవరకు ఆరబెట్టాలి. మొదటిసారి తీసిన పత్తిని తరువాత తీసిన పత్తితో కలపకుండా విడిగా అమ్ముకోవాలి. అప్పుడు తరువాత తీసిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుంది. వేరుశనగ రబీ సీజనుకు అనువైన వేరుశనగ రకాలు చిన్నగుత్తి రకాలు: కదిరి-6, కదిరి-9 కదిరి హరితాంధ్ర, అనంత మరియు ధరణి పెద్ద గుత్తి రకాలు: కదిరి-7 బోల్డ్ మరియు కదిరి-8 బోల్డ్ రబీలో వేరుశనగ డిసెంబరు 15 వరకు వేసుకోవచ్చు. విత్తన శుద్ధి: కిలో వేరుశనగ విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల డైథేన్ ఎం45 కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు సమస్య ఉన్న నేలలకు ఫ్యురడాస్ 4 జీ గుళికలు 5 కేజీలు ఎకరాకు దుక్కిలో వేసుకోవాలి. వేరుశనగ విత్తనం మొలకెత్తాక తొలి పూత కనిపించేవరకు (25 నుంచి 30 రోజులు) తడి ఇవ్వకూడదు. తరువాత నుంచి బెట్ట రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. రబీ పంట కాలం వేరుశనగ విత్తనోత్పత్తికి చాలా అనువైన కాలం. విత్తిన మూడు రోజుల్లోపు పై సాళ్లు వేసిన తరువాత ఒక లీటరు పెండి మెథాలిన్ కలుపు మందును ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన 40 నుంచి 50 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. -
పెసర..రైతుకు ఆసరా
బాల్కొండ : సాధారణంగా అక్టోబర్ నెలాఖరు వరకు పెసర సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్లోనూ కొందరు రైతులు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ పంట సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలమని, సుమారు రెండు నెలల్లో చేతికి వచ్చే పెసరను రబీలో ఈనెల మూడో వారం వరకు సాగు చేయవచ్చని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు. మాగాణుల్లో అయితే వచ్చేనెల 15వ తేదీ వరకు పంటను సాగు చేయవచ్చని పేర్కొన్నారు. విత్తన శుద్ధి పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 5 గ్రాముల ఇడిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ. మోనోక్రొటోఫాస్, 3 గ్రాముల కాప్టాన్ లేదా మాంకోజెబ్‌లతో విత్తన శుద్ధి చేయాలి. మొదటిసారి పెసర పంట సాగు చేసే భూముల్లో అయి తే.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తనం శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది. విత్తనం ఎకరానికి పది కిలోల వరకు విత్తనం అవస రం. అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. నేల తయారీ, విత్తేవిధానం ఒకసారి నాగలితో దున్నాలి. రెండు సార్లు గొర్రు కొట్టాలి. తర్వాత గుంటుకతోలి నేల ను తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెం టీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. -
తెగుళ్లు నివారిస్తేనే లాభాల పసుపు
ఈ తెగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన వ్యాపిస్తుంది. పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఆకులపై అక్కడక్కడ కనబడతాయి. మచ్చలు ముధురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి కిందకు వాలి పోతుంది. దీని నివారణకు దృఢమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. లీటర్ నీటిలో గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజబ్తో పాటు అర మిల్లీ లీటర్ సబ్బునీరు లేదా థయోఫానేట్ మిథైల్ గ్రాము మార్చిమార్చి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఈ ఆకుమచ్చ తెగులు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రతల వలన వస్తుంది. మొదట ఆకులపై చిన్న, చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడుతాయి. తరువాత చిన్నచిన్న గోధమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు ఎక్కువైతే ఆకుమాడి పోతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. తాటాకు మచ్చ తెగులుకు సూచించిన మందులతో పాటు 1 మి.లీ ప్రోపికోనజోల్ లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. దుంప, వేరుకుళ్లు తెగులు విత్తన శుద్ధిలేని కొమ్ములు నాటడం, మురుగు నీటి పారుదల సరిగా లేకపోవటం, సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించక పోవటం, ఎడతెరిపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు ఉండటంతో ఈ తెగులు సోకుతుంది. లక్షణాలు ఈ తెగులు సోకి తే ఆకులు మందంగా వాడిపోయి గోధుమ రంగుకు మారి చివరకు ఎండిపోతాయి. తరువాత మొక్క పై భాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తల్లి కొమ్ములు, పిల్ల దుంపలు కుళ్లి మెత్తబడిపోతాయి. చెడు వాసన వస్తుంది. నాణ్యత కూడా బాగా తగ్గుతుంది. దీని నివారణకు... లీటర్ నీటికి మూడు గ్రాముల రిడోమిల్ ఎం.జెడ్ లేదా మాంకోజెబ్ లేదా 2 మి.లీ మోనోక్రొటోఫాస్ లీటర్ నీటి చొప్పున కలిపిన ద్రావణంలో కొమ్ములను 30-40 నిమిషాలు నానబె ట్టాలి. తరువాత నీరు మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి నీడలో ఆరబెట్టి నాటు కోవాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలతో పంట మార్పిడి చేయాలి. దుంపలు విత్తిన తరువాత జీలుగు, జనుము, వెంపలి, వేప, కానుగ తదితర పచ్చి ఆకులు లేదా ఎండు వరిగడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంత వరకు కప్పడం వలన తెగులు ఉధృతిని కొంత వరకు తగ్గించవచ్చును. -
పెట్టుబడి కొంత..లాభం కొండంత
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోయాయి. విత్తనాలు, క్రిమిసంహారక మందుల్లో ఏది మంచిదో, ఏది నకిలీదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. విచక్షణారహితంగా పురుగుమందులు వాడటం వల్ల ఆర్థికంగా భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండని పరిస్థితి. ఆదీగాక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం తెలిసీ తెలియని విత్తనాలు వేయడం, అవి మొలకెత్తకపోవడం, ఒక వేళ మొలకెత్తినా కాపు సరిగా రాకపోవడం లాంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులు తగ్గించడానికి వివిధ రకాల రాయితీలను అందుబాటులో ఉంచింది. వాటిని సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు పొందవచ్చు. విత్తన శుద్ధి తప్పని సరి భూ సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తప్పకుండా పాటించాలి. సూటి ఎరువులు(యూరియా, దుక్కిలో సూపర్, విత్తిన తర్వాత పొటాష్) వాడాలి. సూక్ష్మధాతు లోపాలను కచ్చితంగా సవరించాలి. మూస పద్ధతి ఖర్చులకు స్వస్తి చెప్పి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఖర్చు తగ్గించుకునే మార్గాలు రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను వాటి మోతాదు మేరకే వాడాలి. భాస్వరం.. మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీన్ని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. వేపపిండి, యూరియా కలిపి వాడితే పోషకాలు వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందుతాయి. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. వ్యవసాయ భూముల్లో ఎక్కువగా జింక్, ఐరన్, బోరాన్, మెగ్నీషియం లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ఎరువులను తరచుగా వాడటం వల్ల భూముల్లో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్నాయి. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సస్యరక్షణ మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిపార్సు చేసిన మందును, సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. ఇవి చేయకండి కాంప్లెక్స్ ఎరువులు వాడితే మన భూముల్లో అంతగా ఫలితం ఉండదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ. పిచికారీ చేసే మందులు మోతాదుకు మించి వాడటం మానుకోవాలి. ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మందుకు ఇష్టారీతిగా నీటిని కలపకూడదు. 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. పురుగుమందులు, వ్యాధి మందులు కలిపి (ఉదా : ప్రాఫినోపాస్-ఎక్సాకొనగోట)వాడకూడదు. ఒకేసారి రెండు మూడు మందులను మిశ్రమంగా వాడరాదు(ఉదా : ఇమిడాక్లోఫిడ్, అసిటేట్‌ను వరి, వేరుశనగలో కలిపి వాడుతుంటారు). ఇలా కలిపి వినియోగిస్తే రైతుకు ఖర్చు పెరగడమేకాక మందులు సరిగా పనిచేయవు. ఒక్కోసారి పంటను నాశనం చేస్తాయి. -
పసుపు పంట..తెగుళ్లను నివారిస్తే సిరులే రైతు ఇంట
దుంప, వేరుకుళ్లు తెగులు దీనిని కొమ్ముకుళ్లు, అడుగు రోగం అనికూడా అంటారు. దీనివల్ల దిగుబడి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది జులైలో మొదలై అక్టోబర్, నవంబర్‌లో తీవ్రమవుతుంది. తెగులు సోకడానికి కారణాలు. తెగులు ఆశించిన పొలం నుంచి విత్తనం వాడటం. విత్తన శుద్ధి చేయకపోవడం. విత్తన పసుపును లోతుగా నాటడం. మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో సాగుచేయటం. ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం. పొటాష్, వేప పిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం. తెగులు లక్షణాలు పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు(పైనుంచి 3వ ఆకు) వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్ములు కుళ్లి మెత్తబడతాయి. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తాయి. తెగులు నివారణ తెగులను తట్టుకునే రకాలను(సుగుణ, సుదర్శణ, ప్రతిభ) మాత్రమే సాగుచేసుకోవాలి. చీడపీడలు, తెగులు సోకని పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలి. విత్తనశుద్ధి ముందుగా లీటరు నీటికి 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్+2 మిల్లీలీటర్ల మెనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోదర్మా విరిడి కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాలపాటు కొమ్ములను నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కి లోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితు ల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నేలలో పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తేగులు ఉధృతి కొంత వరకు తగ్గించవచ్చు వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రాము మేటాలాక్సిల్+మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫోరేట్ 10జీ గుళికలను 1 కిలో సైమాక్సోనిల్+మాంకోజెబ్ పొడి, తగినంత యూరియా(10 నుంచి 20 కిలోలు)లో కలుపుకొని పొలం అంతటా చల్లుకోవాలి. తాటాకు మచ్చ తెగులు దీనిని పక్షి, బెబ్బల, మర్రి ఆకు తేగులు అని కూడా అంటారు. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు కనిపిస్తుంది. తెగులు సోకడానికి కారణాలు ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం తెగులు సోకిన పొలం నుంచి విత్తనం వాడటం, విత్తన శుద్ధి చేయకపోవడం పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టు ఉండటం. తెగులు లక్షణాలు ఆకులపై అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందికి వాలుతుంది. తెగులు తీవ్రమైతే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. నివారణ తెగులు సోకని పొలం నుంచి మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి విత్తన శుద్ధి లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి, తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగులతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి వెంటనే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 2 గ్రాముల కార్బెండజిమ్+మాంకోజెబ్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్, 0.5 మి.లీ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధితో సెప్టెంబర్ నుంచి 3 నుంచి నాలుగు సార్లు పిచికారి చేయాలి. -
సిరుల వేరుశనగ!
విత్తన శుద్ధి ఇలా.. విత్తనాలు పురుగు పట్టినవి కాకుండా చూసుకోవాలి. ఎకరానికి 60 నుంచి 75 కిలోలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజబ్ పొడి మందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీంతో పాటు విత్తనానికి రైజోబియం లేక 6.5 మిల్లిలీటర్ల క్లోరో ఫైరిఫాస్ కానీ, రెండు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి తయారీ దుక్కి మెత్తగా చదును చేసుకున్న తర్వాత చివరి దుక్కిలో 4, 5 టన్నుల సేంద్రియ ఎరువులు వేయాలి. నీటి పారుదలకు కింద అయితే ఎకరానికి వంద కిలోల సూపర్‌ఫాస్పెట్, 33 కిలోల మ్యూరెట్ఆఫ్ పొటాష్ మరియు 20 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. 9 కిలోల యూరియా, ఎకరానికి 200 కిలోల జిప్సంను పంట విత్తిన 30 రోజుల త ర్వాత అంటే తొలిపూత దశలో వేసుకోవాలి. కలుపు నివారణ కలుపు నివారణ కొరకు ఫ్లూక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున దుక్కిపై పిచికారీ చేసి కలియ దున్నాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేయాలి. విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు మొక్కులూ లేకుండా చూడాలి. 45 రోజుల తర్వాత ఎలాంటి అంతరకృషి చేయకూడదు. ఆకుముడత తెగులు పురుగు ఆకు పొరల మధ్య తొలుస్తూ పత్రహరిత పదార్థాన్ని తింటుంది. దీంతో ఆకులు గోధుమ రంగులోకి మారి ముడతలుగా మారుతాయి. పురుగు లార్వా దశలో రెండు ఆకులను దగ్గరకు చేర్చి వాటి మధ్య గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఆకుపై పొరకు, కింది పొరకు మధ్య ఉన్న కణజాలాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎక్కువ సంఖ్యలో రాలిపోయి మొక్కల పెరుగుదల కాయల అభివృద్ధి తగ్గుతుంది. నివారణ ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేరుశనగ పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. లీటర్ నీటికి 1.6 మిల్లిలీటర్ల మొనోక్రోటోఫాస్, రెండు మిల్లిలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. లద్దె పురుగు.. లద్దె పురుగు నివారణకు వేసవిలో దుక్కి లోతుగా దున్ని నత్రజని, వేపపిండి వేసుకోవాలి. పురుగు తొలి దశ లలో ఐదు శాతం వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేపనూనే పిచికారీ చేసుకోవాలి. పురుగు లార్వా దశకు ఎదిగాక ఐదు కిలోల తవుడు, అరకిలో బెల్లం, అరలీటర్ మోనోక్రోటోఫాస్ లేదా అర లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి విషపు ఎరువు తయారు చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క మొదళ్ల వద్ద వేసినట్లయితే లద్దె పురుగును నివారించవచ్చు. తెగుళ్లు.. నివారణ చర్యలు పంటకు జింకులోపం ఏర్పడితే ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరాకు 400 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. లేత ఆకుమచ్చ తెగులు.. మొక్కలు 20 నుంచి 30 రోజుల వయసులో ఉన్నప్పుడు ఆకుపై మచ్చలు కనిపి స్తే ఒక లీటరు నీటికి 2.5 గ్రామాలో మంకొజెబ్, లీటరు నీటికి ఒక గ్రాము కార్బడిజం కలిపి 200 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని ఒక ఎకరానికి స్ప్రే చేయాలి. ముదురు ఆకుమచ్చ తెగులు.. ఈ తెగులు విత్తిన 30 రోజుల తర్వాత వంద రోజుల్లోపు ఆశించే అవకాశం ఉంది. తెగులు ఆశించిన వెంటనే లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజెబ్ గానీ లీటరు నీటికి గ్రాము కార్బడిజం గానీ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. -
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ
అద్దంకి : ఏ పంటయినా సరే విత్తన శుద్ధి చేస్తే కొన్ని రకాల తెగుళ్లను మొదట్లోనే నివారించవచ్చు. విత్తనాలను శుద్ధి చేయకుంటే పంట ఎదుగుదల, దిగుబడి తగ్గి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పంట దిగుబడి పెంచుకోవడానికి విత్తన శుద్ధి కూడా చక్కని మార్గం. విత్తనం ద్వారా సోకే రసం పీల్చే పురుగులను.. శుద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అదుపు చేసుకోవచ్చని అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కుప్పయ్య(88866 12945) తెలిపారు. విత్తనాలను శుద్ధి చేసే విధానంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : ఏఏ విత్తనాలను శుద్ధి చేసుకోవచ్చు ? జవాబు : అన్ని రకాల విత్తనాలను శుద్ధి చేయవచ్చు. ప్ర : వరిలో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి? జ : వరి విత్తనాలను రెండు పద్ధతుల్లో శుద్ధి చేసుకోవచ్చు. పొడి విత్తన శుద్ధి : వరి విత్తనాలను అంటుకుని ఉన్న శిలీంద్రాల నివారణ కోసం 2.గ్రా కార్బండిజమ్ మందును ఒక కిలో విత్తనానికి కలిపి 24 గంటల తర్వాత చల్లుకోవాలి. తడి విత్తన శుద్ధి : ఒక గ్రాము కార్బండిజమ్ మందును లీటరు నీటిలో కలిపి అందులో కిలో వరి విత్తనాలను 12-24 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మడిలో చల్లుకోవాలి. ప్ర : అపరాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా? జ : కంది, మినుము, పెసర పంటలను రసం పీల్చే పురుగులు తొలి దశలోనే నష్టం చేస్తాయి. వీటిని నివారించాలంటే కిలో అపరాల విత్తనాలకు 30 మి.లీ కార్బోసల్ఫాన్ మందును లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును విత్తనానికి పట్టించిన తర్వాత, 2.5-3గ్రా. కాప్టాన్‌ను కలిపి శుద్ధి చేయాలి. పొలంలో విత్తే ముందు 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను విత్తానానికి పట్టిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. కిలో కంది విత్తనాలకు 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడీని కలిపి శుద్ది చేసుకోవాలి. -
మిరపనారు సాగు ఖర్చు కొనుగోలు ధరలో సగమే.!
మార్కాపురం : ఒక ఎకరాలో మిరప నాటాలంటే సుమారు 10 వేల మొక్కలకు పైగా అవసరమవుతాయి. ఒక్కో మొక్క ధర రూ.0.80 నుంచి రూ.1 వరకు ఉంటుంది. రైతులు మొక్కలు కొనడానికే రూ.12 వేలు ఖర్చు పెట్టాలి. దీనికి తోడు రవాణా ఖర్చులు భారంగా పరిణమిస్తున్నాయి. రైతులే మిరప నారు పోసి కొన్ని మెళకువలు పాటించడంతో పాటు నారు దశలోనే తెగుళ్లను అరికడితే మంచి దిగుబడి సాధించవ చ్చు. ఈ జాగ్రత్తలు పాటించండి మిరప నారు మడి పెంచడానికి చౌడు భూములు తప్ప మిగిలిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఒండ్రు నేలలైతే మరీ మంచిది. మిరప నారుమడి కోసం ఎంపిక చేసుకున్న స్థలానికి పక్కనే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఒక మీటరు వెడల్పు, 40 మీటర ్ల పొడవు గల ప్రాంతంలో పెంచిన నారు ఎకరంలో పొలంలో నాటడానికి సరిపోతుంది. నారు పోసే ప్రదేశంలో 30 కిలోల పశువుల ఎరువు, అరకిలో 15:15:15 కాంప్లెక్స్ ఎరువు వేసి కలియదున్నాలి. విత్తన శుద్ధి ముఖ్యం ఎంపిక చేసుకున్న మేలు రకం మిర్చి విత్తనాలను శుద్ధి చేసేందుకు ఆర్గానో మెర్కురియల్ కాంపౌండ్ 2 గ్రాముల మందును ఒక కేజీ విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. వీటితో పాటు 200 గ్రాముల అజోప్పైరిల్లమ్ను కేజీ విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. జిల్లాలో జెమిని వైరస్, కుకుంబ(దోసకాయ) వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రైసోడియం, ఆర్థోఫాస్పేట్ మందు 2 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగుల బారి నుంచి మొక్కలను కాపాడాలంటే నారు పీకే వారం రోజుల ముందు కిలో నుంచి కిలోన్నర 3జీ కార్బోలిన్ గుళికలు వేయాలి. విత్తనాలను వరుసలో నాటేటప్పుడు 7.5 సెం.మీ దూరంలో నాటి, నీటి మట్టితో, పశువుల ఎరువుతో క ప్పేయాలి. మల్చింగ్ ఇలా.. నారుమడులను వరి చెత్త లేదా ఏైదె నా వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో మల్చింగ్ చేసి రోజ్ క్యాన్లతో నీటిని చ ల్లాలి. ఒక మి.లీ క్లోరోపైరిఫాస్ మందును ఒక లీటరు నీటిలో కలిపి నారుమడిపై పిచికారీ చేయడం వల్ల చీమలు రాకుండా అరికట్టవచ్చు. విత్తనాలు మడిలో వేసనప్పటి నుంచి అవి మొలకెత్తే వరకు రోజూ రెండు సార్లు నీరు పెట్టాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత రోజుకు ఒకసారి మడిని నీటితో తడపాలి. విత్తనాలు మొలకెత్తే ముందుగా మల్చింగ్ ని నారుమడి నుంచి తొలగించాలి. నారు ను నాటేందుకు పది రోజుల ముందు నీటిని క్రమేపీ తగ్గిస్తే మొక్కలు గట్టిపడతాయి. ఈ ప్రక్రియ మొత్తానికి 45 రోజుల సమయం పడుతుంది.