అద్దంకి : ఏ పంటయినా సరే విత్తన శుద్ధి చేస్తే కొన్ని రకాల తెగుళ్లను మొదట్లోనే నివారించవచ్చు. విత్తనాలను శుద్ధి చేయకుంటే పంట ఎదుగుదల, దిగుబడి తగ్గి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పంట దిగుబడి పెంచుకోవడానికి విత్తన శుద్ధి కూడా చక్కని మార్గం. విత్తనం ద్వారా సోకే రసం పీల్చే పురుగులను.. శుద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అదుపు చేసుకోవచ్చని అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు కుప్పయ్య(88866 12945) తెలిపారు. విత్తనాలను శుద్ధి చేసే విధానంపై ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న : ఏఏ విత్తనాలను శుద్ధి చేసుకోవచ్చు ?
జవాబు : అన్ని రకాల విత్తనాలను శుద్ధి చేయవచ్చు.
ప్ర : వరిలో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి?
జ : వరి విత్తనాలను రెండు పద్ధతుల్లో శుద్ధి చేసుకోవచ్చు.
పొడి విత్తన శుద్ధి : వరి విత్తనాలను అంటుకుని ఉన్న శిలీంద్రాల నివారణ కోసం 2.గ్రా కార్బండిజమ్ మందును ఒక కిలో విత్తనానికి కలిపి 24 గంటల తర్వాత చల్లుకోవాలి.
తడి విత్తన శుద్ధి : ఒక గ్రాము కార్బండిజమ్ మందును లీటరు నీటిలో కలిపి అందులో కిలో వరి విత్తనాలను 12-24 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మడిలో చల్లుకోవాలి.
ప్ర : అపరాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా?
జ : కంది, మినుము, పెసర పంటలను రసం పీల్చే పురుగులు తొలి దశలోనే నష్టం చేస్తాయి. వీటిని నివారించాలంటే కిలో అపరాల విత్తనాలకు 30 మి.లీ కార్బోసల్ఫాన్ మందును లేదా 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును విత్తనానికి పట్టించిన తర్వాత, 2.5-3గ్రా. కాప్టాన్‌ను కలిపి శుద్ధి చేయాలి.
పొలంలో విత్తే ముందు 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను విత్తానానికి పట్టిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. కిలో కంది విత్తనాలకు 8 గ్రా. ట్రైకోడెర్మావిరిడీని కలిపి శుద్ది చేసుకోవాలి.
విత్తన శుద్ధితో తెగుళ్ల నివారణ
Published Tue, Sep 9 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM
Advertisement
Advertisement