విత్తన విధానంపై జర్మనీతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విత్తన విధానం తయారు కోసం ప్రభుత్వం నడుంబిగించింది. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఒక నిర్ధిష్ట విధానం తప్పనిసరని భావించింది. దీనికోసం జర్మనీ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జర్మనీ, తెలంగాణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. హైదరాబాద్‌లో ఆదివారం ముగిసిన సేంద్రీయయ వ్యవసాయం జాతీయ సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారధి, ఇండో–జర్మన్ కోఆపరేటివ్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్‌మెంట్ టీమ్ లీడర్ ఎక్కెహర్డ్ ష్రాడర్‌లు సంతకాలు చేశారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలంటే ఇక్కడున్న అవకాశాలు, బలాలు, బలహీనతలు వాటన్నింటిపైనా జర్మన్ బృందం అధ్యయనం చేస్తుందని పార్థసారధి వివరించారు.
అనంతరం వారు నివేదిక ఇస్తారని, ఆ ప్రకారం విత్తన విధానాన్ని, కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తామన్నారు. ఇప్పటికే జర్మన్ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తున్నారన్నారు. అలాగే ఈ రెండ్రోజుల సదస్సులో జర్మనీలో సేంద్రీయ వ్యవసాయం, తనిఖీ, ధ్రువీకరణ , సేంద్రియ ఉత్పత్తుల సరఫరా, చైన్ యాజమాన్యం, జర్మనీలో సాంకేతిక ప్రమాణాలు, సేంద్రియ వ్యవసాయంలో పరాన్నజీవుల పాత్ర, జర్మనీలో సేంద్రీయ విత్తన ఉత్పత్తి, సహకార వ్యవస్థలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సేంద్రియ వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లు ఇలా అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
13 రాష్ట్రాలకు చెందిన విత్తన ధ్రువీకరణ సంస్థలు, శాస్త్రవేత్తలు, ఐదు రాష్ట్రాల వ్యవసాయ విద్యాలయాల ప్రతినిధులు, ఐకార్ శాస్త్రవేత్తలు ఐదుగురు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు, రైతులు, సీడ్ మన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా రెండ్రోజులపాటు పీపుల్స్‌ప్లాజాలో సేంద్రియ ఉత్పత్తుల మేళా జరిగింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చివరి రోజు సదస్సులో పార్థసారధి మాట్లాడుతూ వ్యవసాయరంగం సేంద్రియ వ్యవసాయం వైపు నడవాలన్నారు. గత పదిహేనేళ్లలో కేన్సర్ విపరీతమయిపోయిందన్నారు. జర్మనీలో ఎంతో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు.