753 ఏఈవో కొలువులు..
టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలకు సర్కారు అనుమతి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవలే 1,350 వ్యవసాయాధికారుల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. సోమవారం మరో 753 గ్రేడ్–2 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చింది. అందులో 526 ఏఈవో పోస్టులను కొత్తగా మంజూరు చేయగా.. మిగిలినవి ఖాళీగా ఉన్న పోస్టులు. వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ప్రతిపాదనల మేరకు ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. గ్రేడ్–2 ఏఈవోల పేస్కేల్ రూ.22,460 నుంచి రూ.66,330 వరకు నిర్ధారించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ పోస్టులను మంజూరు చేశారు.
వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే వ్యవసాయశాఖలో తగినంత సిబ్బంది కావాలి. అలాగే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తంగా ప్రభుత్వం ఈ ఏడాది 1,526 ఏఈవో పోస్టులను సృష్టించిందని పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. తాజాగా ఆమోదించిన పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.
వేగంగా పదోన్నతులు
వ్యవసాయ శాఖలో ఉన్నతస్థాయిలో ఏడీఏ, డీడీఏ, జేడీఏ, అడిషనల్ డైరెక్టర్ వంటి కేడర్‌లో కొత్తగా 150 పోస్టులను మంజూరు చేయాలని, ఆ మేరకు కసరత్తు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట వ్యవసాయశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ పోస్టులను కొత్తగా సృష్టించి పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. దీంతో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు చాలామంది ఉద్యోగులకు వేగంగా పదోన్నతులు లభిస్తాయి. వ్యవసాయశాఖలో కొత్తగా ఉద్యోగాలు మంజూరు చేయడంపై తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కె.రాములు ఒక ప్రకటనలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనా రంగంలోనూ కొన్ని పోస్టులను మంజూరు చేయాలని వ్యవసాయ కమిషనరేట్ ఉద్యోగుల సంఘం నేత నాగిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన పార్థసారథికి వినతిపత్రం సమర్పించారు.
పోచారం కృతజ్ఞతలు
వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో) నియామకానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 753 పోస్టుల్లో కొత్తగా 526 ఏఈవో కొలువులు మంజూరు చేయ డం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖలో 244 పోస్టుల భర్తీ
బీసీ సంక్షేమ శాఖలో వివిధ కేటగిరీల్లో 244 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్–4, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్–9, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్–229, జూనియర్ అసిస్టెంట్–2 పోస్టుల భర్తీకి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 229 హాస్ట ల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల్లో 166 ప్రీ మెట్రి క్, 63 పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించినవిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టులను కూడా టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.