
సాక్షి, హైదరాబాద్: జిల్లాకో ప్రధాన పంటను పరిగణనలోకి తీసుకుని గ్రామం యూనిట్‌గా బీమా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం 23 జిల్లాల్లో వరికి గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలు చేస్తారు. రెండు జిల్లాల్లో సోయాబీన్, 5 జిల్లాల్లో మొక్కజొన్న పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా అమలుచేస్తారు. ఆయా జిల్లాల్లో మిగిలిన పంటలకు మండలం యూనిట్‌గా బీమా అమలు చేస్తారు.
వచ్చే ఖరీఫ్‌కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్), యూనిఫైడ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీం(యూపీఐఎస్)ల అమలు మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రైతులు 2 శాతం, పసుపు రైతులు 5శాతం ప్రీమియం చెల్లించాలి. పంటల నష్టాన్ని పది రోజుల్లోగా అంచనా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరికి ప్రీమియం చెల్లించే గడువును ఆగస్టు 31గా నిర్ధారించారు. జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్, పసుపు పంటలకు జూలై 31 గడువుగా ప్రకటించారు.
మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లో పత్తికి బీమా
వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. ఎండు మిర్చిని 15 జిల్లాల్లో అమలుచేస్తారు.
ప్రమాద మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం..
యూనిఫైడ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ స్కీంలో వ్యక్తిగత ప్రమాద బీమా, జీవిత బీమా, విద్యార్థి భద్రత బీమా, గృహ బీమా, వ్యవసాయ పంపుసెట్ల బీమా, ట్రాక్టర్ బీమాలను అమలుచేస్తారు. వీటిలో ఏ రెండింటినైనా రైతులు ఎంపిక చేసుకోవాలి. వీటికి రైతు రూ.12 బీమా ప్రీమియం చెల్లించాలి. ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment