బాల్కొండ : సాధారణంగా రబీలో నవంబర్ మూడోవారం వరకే మినుములు సాగు చేస్తారు. మాగాణుల్లో అయితే డిసెంబర్ 15 వరకు ఈ పంట సాగు చేయవచ్చు. ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలసాగు ఆలస్యమైంది. దాని ప్రభావం రబీపైనా పడింది. దీంతో ప్రస్తుతం పలువురు రైతులు మినుముల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
విత్తన శుద్ధి
పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశముంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్, 2.5 గ్రాముల థైరమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొదటిసారి ఈ పంట సాగు చేసే భూముల్లో.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్‌బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది.
విత్తనం
ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు విత్తనం అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందిస్తోంది.
నేల తయారీ, విత్తేవిధానం
తేమను నిలుపుకోగలిగే భూములు పంట సాగుకు అనుకూలం. ముందుగా భూమిని బాగా దుక్కిదున్ని, విత్తడానికి ముందు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రుకొట్టాలి. వరి మాగాణుల్లో అయితే ఎరువుల అవసరం ఉండదు.
వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెంటీ మీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. మాగాణుల్లో విత్తనాలను వెదజల్లినా సరిపోతుంది.
నీటి తడులు
ఒకటి రెండు నీటి తడులతో పంట చేతికి వస్తుంది. విత్తనాలు మొలిచిన తర్వాత 30 రోజుల దశలో మొదటిసారి, 55 రోజుల తర్వాత రెండోసారి నీరు అందించాలి. రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది.
కలుపుంటే..
పంటను మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. ఇందు కోసం 20 నుంచి 30 రోజుల దశలో గొర్రు లేదా దంతి ద్వారా అంతర కృషి చేయాలి. ఇలా చేయడం వల్ల కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలు పు బెడద ఎక్కువగా ఉంటే విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరాకు 1.25 నుంచి 1.50 లీటర్ల పెండి మిథాలిన్ లేదా అలాక్లోర్ కలుపు మందు ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
చీడపీడల నివారణకు..
రెండాకుల దశ నుంచే పురుగులు ఆశించే అవకా శం ఉంటుంది. పచ్చ రబ్బరు పురుగు రెండాకుల దశ నుంచి ఆశిస్తుంది. ఆకుల మధ్యలో ఇది గూ డు అల్లుకుంటుంది. గూడులో ఉండి తొడిమెల దగ్గర నుంచి పత్రహరితాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎండి, రాలి పోతాయి. లద్దె పురుగులు రాత్రి వేళల్లో ఆకులను తినడం వల్ల మోడుల్లా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరలను వాడాలి. 5 కిలోల తవుడు, కిలో బెల్లంలో లీటరు మోనోక్రొటోపాస్ లేదా కిలో కార్బారిల్ లేదా 250 గ్రాముల థయోడికార్ట్ నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలం అంతటా సమానంగా వేయాలి. ఇంకా ఇతర చీడపీడలు సోకితే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
‘మినుము’తో రైతుకు బలము
Published Fri, Nov 21 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement